స్తుతిశతకం 1-10 శ్లోకాలు
మూక పంచశతి స్తుతిశతకం అనేది కామాక్షీ అమ్మవారిని స్తుతిస్తూ రచించిన అత్యంత పవిత్రమైన స్తోత్రాలలో ఒకటి. దీనిని మహా భక్తుడు మూక కవి రచించారు. ఆయనకు కామాక్షీ దేవి కటాక్షంతో వాక్చాతుర్యం లభించి ఈ దివ్యమైన శ్లోకాలను రచించినట్లు పురాణ కథనం చెబుతుంది. మూక పంచశతి మొత్తం 500 శ్లోకాలతో ఉండి ఐదు శతకాలుగా విభజించబడింది. అందులో స్తుతిశతకం దేవిని స్తుతించే భాగంగా ఎంతో ప్రసిద్ధి పొందింది.
ఈ స్తుతిశతకం పఠించడం వల్ల విద్య, వాక్పటిమ, ఐశ్వర్యం, మనశ్శాంతి మరియు దేవి అనుగ్రహం లభిస్తాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా కామాక్షి దేవి కృప పొందేందుకు ఈ స్తోత్రాన్ని భక్తితో పఠిస్తారు. ప్రతిరోజూ ఈ శ్లోకాలను పఠించడం వల్ల భక్తి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగుతాయని విశ్వాసం.
పాండిత్యం పరమేశ్వరి స్తుతివిధౌ నైవాశ్రయంతే గిరాం
వైరించాన్యపి గుంఫనాని విగలద్గర్వాణి శర్వాణి తే ।
స్తోతుం త్వాం పరిఫుల్లనీలనలినశ్యామాక్షి కామాక్షి మాం
వాచాలీకురుతే తథాపి నితరాం త్వత్పాదసేవాదరః ॥1॥
అమ్మా! జగదీశ్వరీ! కామాక్షీ! ఎంతో చల్లదనమును ప్రసాదించే నల్ల కలువలవంటి నేత్రములు కలిగిన నిన్ను బ్రహ్మాదులు సైతం స్తుతించలేక
పోతే, నీ పాద దర్శనం నిరంతరం చేయాలనీ, నిన్ను స్తుతించాలనే కోరిక నాతో ఈ పలుకులను పలికేలా చేస్తున్నది.
తాపింఛస్తబకత్విషే తనుభృతాం దారిద్ర్యముద్రాద్విషే
సంసారాఖ్యతమోముషే పురరిపోర్వామాంకసీమాజుషే ।
కంపాతీరముపేయుషే కవయతాం జిహ్వాకుటీం జగ్ముషే
విశ్వత్రాణపుషే నమోఽస్తు సతతం తస్మై పరంజ్యోతిషే ॥2॥
జగన్మాతా! రక్త వర్ణపు కాంతితో, మా దారిద్ర్యమును తొలగించి, అజ్ఞానమనే తిమిరాంధకారమును రూపుమాపి, ఈశ్వరుని వామ భాగమున వసించి, కవుల నాలుకపై సంచరిస్తూ, కంపానదీ తీరమున సంచరించే దివ్యజ్యోతికి నమస్కరిస్తున్నాను.
యే సంధ్యారుణయంతి శంకరజటాకాంతారచన్రార్భకం
సిందూరంతి చ యే పురందరవధూసీమంతసీమాంతరే ।
పుణ్యం యే పరిపక్వయంతి భజతాం కాంచీపురే మామమీ
పాయాసుః పరమేశ్వరప్రణయినీపాదోద్భవాః పాంసవః ॥3॥
అమ్మా! నీవు ఈశ్వరుని ప్రేమకు పాత్రురాలైనదానవు. ఈశ్వరుని సిగలో కొలువైన చంద్రునికి, నీ ఎర్రని పాదములు ఎర్రటి సంధ్యాకాంతులను, శచీదేవి పాపిటలో సింధూరపు కాంతులను ఆపాదిస్తున్నాయి. కాంచీపురములో స్థితురాలై, మమ్ములను కరుణిస్తున్న నీ పాదధూళి కణములు మమ్ములను రక్షించుగాక.
కామాడంబరపూరయా శశిరుచా కమ్రస్మితానాం త్విషా
కామారేరనురాగసింధుమధికం కల్లోలితం తన్వతీ ।
కామాక్షీతి సమస్తసజ్జననుతా కల్యాణదాత్రీ నృణాం
కారుణ్యాకులమానసా భగవతీ కంపాతటే జృంభతే ॥4॥
కంపానదీ తీరమున వసించిన నిన్ను జ్ఞానులు కామాక్షీ అని స్తుతిస్తున్నారు. చంద్రకాంతివంటి వెన్నెల కాంతులు కలది నీ నవ్వు. ఆ చిరునవ్వే, ఈశ్వరుని అనురాగమనే సముద్రపు అలలను ఉప్పొంగేలా చేస్తున్నది. అదే నవ్వు మాకందరికీ శుభములను కలిగిస్తున్నది.
కామాక్షీణపరాక్రమప్రకటనం సంభావయంతీ దృశా
శ్యామా క్షీరసహోదరస్మితరుచిప్రక్షాలితాశాంతరా ।
కామాక్షీజనమౌలిభూషణ మణిర్వాచాం పరా దేవతా
కామాక్షీతి విభాతి కాపి కరుణా కంపాతటిన్యాస్తటే ॥5॥
శివునిచే నశింపచేయబడిన కామదేవుని తిరిగి ప్రకటించినది, క్షీరమువలే నిర్మలమైన మందహాసముతో దిక్కులన్నిటినీ ప్రసన్నము చేయగలది, సుందరమైన నేత్రములు కలది, భక్తులు శిరసునదాల్చు పాదములు కలది, కరుణారూపిణి, పరదేవత అయిన కామాక్షీ దేవి కంపానది తీరమున వెలుగుచున్నది.
శ్యామా కాచన చంద్రికా త్రిభువనే పుణ్యాత్మనామాననే
సీమాశూన్యకవిత్వవర్షజననీ యా కాపి కాదంబినీ ।
మారారాతిమనోవిమోహనవిధౌ కాచిత్తమఃకందలీ
కామాక్ష్యాః కరుణాకటాక్షలహరీ కామాయ మే కల్పతామ్ ॥6॥
అమ్మా! నీవు అన్ని జగములలోనూ వ్యాపించిన వెన్నెలవు. జ్ఞానులు, సర్వసంగులు అయినవారినుండి వెలువడే కవిత్వ ధారలు నీవే.
మన్మధుడంతవాణ్ణి జయించిన ఈశ్వరుని మనసునే నీవు మోహింపచేసావు. అటువంటి నీ క్రీగంటి చూపులు నాపై ప్రసరించుగాక.
ప్రౌఢధ్వాంతకదంబకే కుముదినీపుణ్యాంకురం దర్శయన్
జ్యోత్స్నా సంగమనేఽపి కోకమిథునం మిశ్రం సముద్భావయన్ ।
కాలిందీలహరీదశాం ప్రకటయన్కమ్రాం నభస్యద్భుతాం
కశ్చిన్నేత్రమహోత్సవో విజయతే కాంచీపురే శూలినః ॥7॥
నల్లని కురులతో చంద్రరేఖ తెల్లగా దర్శనమిస్తూ, చక్రవాకపు జంటవలే ఉన్న మాతృస్థానములతో, ఉదరముపై యమునా నది వలె నల్లని నూగారుతో, ఈశ్వరునికి కనుల పండుగగా ఒక మహాశక్తి కాంచీపురములో ప్రకాశించుచున్నది.
తంద్రాహీన తమాలనీల సుషమైస్తారుణ్యలీలాగృహైః
తారానాథ కిశోరలాంఛితకచైః తామ్రారవిందేక్షణైః ।
మాతః సంశ్రయతాం మనో మనసిజప్రాగల్భ్యనాడింధమైః
కంపాతీరచరైర్ఘనస్తనభరైః పుణ్యాంకురైః శాంకరైః ॥8॥
నల్లనికాంతి గల శరీర వర్ణముతో, సిగలో చంద్రవంకను ధరించి, ఎర్ర కలువలను పోలిన నేత్రములతో, కామదేవుని అనుగ్రహించి, కంపాతీరములో విహరిస్తున్న ఈశ్వరుని తపః ఫలమైన నీవు నా మనసును సంస్కరించు తల్లీ.
నిత్యం నిశ్చలతాముపేత్య మరుతాం రక్షావిధిం పుష్ణతీ
తేజస్సంచయపాటవేన కిరణానుష్ణద్యుతేర్ముష్ణతీ ।
కాంచీమధ్యగతాపి దీప్తిజననీ విశ్వాంతరే జృంభతే
కాచిచ్చిత్రమహో స్మృతాపి తమసాం నిర్వాపికా దీపికా ॥9॥
అమ్మా! కామాక్షీ! నీవు నిశ్చలమైన దానివైనా, నిరంతరం చలించే దేవతలకు రక్షణ కల్పిస్తావు. నీ తేజోమయమైన కాంతి కిరణములు సూర్యకాంతిని తిరస్కరిస్తాయి. కాంచీపురములో కొలువైన నీవు అక్కడినుండే సమస్త విశ్వమునకు వెలుగును ప్రసాదిస్తూ, అంధకారమును నశింపచేస్తావు.
కాంతైః కేశరుచాం చయైర్భ్రమరితం మందస్మితైః పుష్పితం
కాంత్యా పల్లవితం పదాంబురుహయోర్నేత్రత్విషా పత్రితమ్ ।
కంపాతీరవనాంతరం విదధతీ కల్యాణజన్మస్థలీ
కాంచీమధ్యమహామణిర్విజయతే కాచిత్కృపాకందలీ ॥10॥
అమ్మా! నీ కేశముల కాంతులకు తుమ్మెదలు ఆకర్షింపబడుతున్నాయి. కంపానదీ తీరములో దయామూర్తియైన వృక్షమునకు, నీ పాదములు కొమ్మలుగాను, నయన కాంతులు ఆకులుగాను, చిరునవ్వులు పుష్పములుగానూ అమరి ఉన్నవి.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




