స్తుతిశతకం 11-20 శ్లోకాలు
మూక పంచశతి స్తుతిశతకం అనేది కామాక్షీ అమ్మవారిని స్తుతిస్తూ రచించిన అత్యంత పవిత్రమైన స్తోత్రాలలో ఒకటి. దీనిని మహా భక్తుడు మూక కవి రచించారు. ఆయనకు కామాక్షీ దేవి కటాక్షంతో వాక్చాతుర్యం లభించి ఈ దివ్యమైన శ్లోకాలను రచించినట్లు పురాణ కథనం చెబుతుంది. మూక పంచశతి మొత్తం 500 శ్లోకాలతో ఉండి ఐదు శతకాలుగా విభజించబడింది. అందులో స్తుతిశతకం దేవిని స్తుతించే భాగంగా ఎంతో ప్రసిద్ధి పొందింది.
ఈ స్తుతిశతకం పఠించడం వల్ల విద్య, వాక్పటిమ, ఐశ్వర్యం, మనశ్శాంతి మరియు దేవి అనుగ్రహం లభిస్తాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా కామాక్షి దేవి కృప పొందేందుకు ఈ స్తోత్రాన్ని భక్తితో పఠిస్తారు. ప్రతిరోజూ ఈ శ్లోకాలను పఠించడం వల్ల భక్తి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగుతాయని విశ్వాసం.
రాకాచంద్రసమానకాంతివదనా నాకాధిరాజస్తుతా
మూకానామపి కుర్వతీ సురధనీనీకాశవాగ్వైభవమ్ ।
శ్రీకాంచీనగరీవిహారరసికా శోకాపహంత్రీ సతాం
ఏకా పుణ్యపరంపరా పశుపతేరాకారిణీ రాజతే ॥11॥
పౌర్ణమి నాటి చంద్రబింబ కాంతిని పోలిన ముఖము కలది, ఇంద్రునికి స్తుతిపాత్రమైనది, పుట్టు మూగవారికి కూడా గంగాఝరివంటి వాక్ ప్రవాహమును కరుణించగలది, శివునికి తపఃఫలమైనది, సద్గుణుల దుఃఖములను హరించేది అయిన ఒక మాత కాంచీపురములో ప్రకాశిస్తున్నది.
జాతా శీతలశైలతః సుకృతినాం దృశ్యా పరం దేహినాం
లోకానాం క్షణమాత్రసంస్మరణతః సంతాపవిచ్ఛేదినీ ।
ఆశ్చర్యం బహు ఖేలనం వితనుతే నైశ్చల్యమాబిభ్రతీ
కంపాయాస్తటసీమ్ని కాపి తటినీ కారుణ్యపాథోమయీ ॥12॥
హిమాలయములలో ఉద్భవించినది, అభక్తులకు లభ్యము కానిది, పుణ్యాత్ములకు మాత్రమే దర్శనమిచ్చేది, జీవుల బాధలను తొలగించేది, తాను నిశ్చలయై కూడా, చలిస్తూ కరుణ అనే నదీప్రవాహముగా ఉన్న కామాక్షీదేవి కాంచీపురములో స్థితురాలై ఉన్నది.
ఐక్యం యేన విరచ్యతే హరతనౌ దంభావపుంభావుకే
రేఖా యత్కచసీమ్ని శేఖరదశాం నైశాకరీ గాహతే ।
ఔన్నత్యం ముహురేతి యేన స మహాన్మేనాసఖః సానుమాన్
కంపాతీరవిహారిణా సశరణాస్తేనైవ ధామ్నా వయమ్ ॥13॥
తన శరీరముచే, వర్ణముచే ఈశ్వరుని శరీరమును పూర్తిగా కప్పివేస్తూ, సిగలో బాలచంద్రుని ఆభరణముగా ధరించి, మేనాదేవి భర్త హిమవంతుని ఇంటికి గౌరవమాపాదించి, కంపా తీరమున సంచరిస్తున్న తల్లిని శరణు వేడుతున్నాను.
అక్ష్ణోశ్చ స్తనయోః శ్రియా శ్రవణయోర్బాహ్వోశ్చ మూలం స్పృశన్
ఉత్తంసేన ముఖేన చ ప్రతిదినం ద్రుహ్యన్పయోజన్మనే ।
మాధుర్యేణ గిరాం గతేన మృదునా హంసాంగనాం హ్రేపయన్
కాంచీసీమ్ని చకాస్తి కోఽపి కవితాసంతానబీజాంకురః ॥14॥
కర్ణములవరకు విస్తరించి ఉన్న విశాల నేత్రములు, భుజమూలములను తాకే మాతృస్థానములు, కమలముల కాంతిని దోచుకునే ముఖమండలము, పలుకులలోని మాధుర్యము, మందమైన నడకలు కలిగిన ఒక మాతృమూర్తి కాంచీపురములో స్థితురాలై ఉన్నది.
ఖండం చాంద్రమసం వతంసమనిశం కాంచీపురే ఖేలనం
కాలాయశ్ఛవితస్కరీం తనురుచిం కర్ణజపే లోచనే ।
తారుణ్యోష్మనఖంపచం స్తనభరం జంఘాస్పృశం కుంతలం
భాగ్యం దేశికసంచితం మమ కదా సంపాదయేదంబికే ॥15॥
నల్లని శరీర వర్ణముతో, బాలచంద్రుని ఆభరణముగా ధరించి, దీర్ఘ నయనములు కలిగి, యౌవనవంతురాలై, పిరుదులవరకు ఉన్న జడతో ఉన్న ఒక మాతృ రూపమును నా గురుదేవులు నాకు దర్శింపచేశారు.
తన్వానం నిజకేలిసౌధసరణిం నైసర్గికీణాం గిరాం
కేదారం కవిమల్లసూక్తిలహరీసస్యశ్రియాం శాశ్వతమ్ ।
అంహోవంచనచుంచు కించన భజే కాంచీపురీమండనం
పర్యాయచ్ఛవి పాకశాసనమణేః పౌష్పేషవం పౌరుషమ్ ॥16॥
స్వయంజనితములైన వేదములను తన సంచార ప్రదేశముగా చేసుకున్నది, కవులు పారించే కవిత్వ ధారలు ప్రవహించే పంట పొలమైనది, జీవుల పాపములను హరించునది, ఇంద్రనీల మణుల కాంతి ప్రవాహము కలది, కాంచీపురములో స్థితురాలైన ఒక శక్తి నాకు ప్రేరణగా నిలచినది.
ఆలోకే ముఖపంకజే చ దధతీ సౌధాకరీం చాతురీం
చూడాలంక్రియమాణపంకజవనీవైరాగమప్రక్రియా ।
ముగ్ధస్మేరముఖీ ఘన్సతనతటీమూర్చ్ఛాలమధ్యాంచితా
కాంచీసీమని కామినీ విజయతే కాచిజ్జగన్మోహినీ ॥17॥
అమ్మ ముఖము అమృతమును చిందిస్తుంది. ఆమె చూపులు కరుణారస పూరితములు. ఎల్లప్పుడూ చిరునవ్వు కలిగిన మోము, అత్యంత సన్నని కటి ప్రదేశము, సకల జగత్తులను తన వశము చేసుకొనగల ఒక స్త్రీ కాంచీపురములో ప్రకాశించుచున్నది.
యస్మిన్నంబ భవత్కటాక్షరజనీ మందేఽపి మందస్మిత-
జ్యోత్స్నాసంస్నపితా భవత్యభిముఖీ తం ప్రత్యహో దేహినమ్ ।
ద్రక్షామాక్షికమాధురీమదభరవ్రీడాకరీ వైఖరీ
కామాక్షి స్వయమాతనోత్యభిసృతిం వామేక్షణేవ క్షణమ్ ॥18॥
అమ్మా! నీ మందహాసము, నీ కరుణారస దృష్టి ఎవరిపై ప్రసరిస్తుందో, అతడు మందమతియైనా, కవితా కన్యక స్వయముగా అతనిని వరించి రావటము చాలా ఆశ్చర్యకరమైన విషయము.
కాలిందీజలకాంతయః స్మితరుచిస్వర్వాహినీపాథసి
ప్రౌఢధ్వాంతరుచః స్ఫుటాధరమహోలౌహిత్యసంధ్యోదయే ।
మణిక్యోపలకుండలాంశుశిఖిని వ్యామిశ్రధూమశ్రియః
కల్యాణైకభువః కటాక్షసుషమాః కామాక్షి రాజంతి తే ॥19॥
అమ్మా! నీ క్రీగంటి చూపుల కాంతులు, తెల్లని ఆకాశగంగలో, నల్లని యమునానది నీటివలే, సాయం సంధ్యపు ఎర్రని కాంతులలో నల్లని చీకటివలె, అత్యంత శుభప్రదమైనవిగా గోచరిస్తున్నాయి.
కలకలరణత్కాంచీ కాంచీవిభూషణమాలికా
కచభరలసచ్చంద్రా చంద్రావతంససధర్మిణీ ।
కవికులగిరః శ్రావంశ్రావం మిలత్పులకాంకురా
విరచితశిరఃకంపా కంపాతటే పరిశోభతే ॥20॥
అమ్మా! కాంచీపురమునకు ఆభరణమైన వడ్డాణమును అలంకరించుకుని, జగదీశ్వరుని దేవేరివై, సిగలో పుష్పమువలే చంద్రుని ధరించి, ఎంతో ఆనందముగా కవుల ప్రశంసలను వింటూ, పరవశముగా శిరసును అటూ ఇటూ ఊపుతూ పులకరిస్తున్న తల్లి కంపా తీరములో ఉన్నది.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




