మూక పంచశతి స్తుతి శతకం 21-30 శ్లోకాలు
మూక పంచశతి స్తుతిశతకం అనేది కామాక్షీ అమ్మవారిని స్తుతిస్తూ రచించిన అత్యంత పవిత్రమైన స్తోత్రాలలో ఒకటి. దీనిని మహా భక్తుడు మూక కవి రచించారు. ఆయనకు కామాక్షీ దేవి కటాక్షంతో వాక్చాతుర్యం లభించి ఈ దివ్యమైన శ్లోకాలను రచించినట్లు పురాణ కథనం చెబుతుంది. మూక పంచశతి మొత్తం 500 శ్లోకాలతో ఉండి ఐదు శతకాలుగా విభజించబడింది. అందులో స్తుతిశతకం దేవిని స్తుతించే భాగంగా ఎంతో ప్రసిద్ధి పొందింది.
ఈ స్తుతిశతకం పఠించడం వల్ల విద్య, వాక్పటిమ, ఐశ్వర్యం, మనశ్శాంతి మరియు దేవి అనుగ్రహం లభిస్తాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా కామాక్షి దేవి కృప పొందేందుకు ఈ స్తోత్రాన్ని భక్తితో పఠిస్తారు. ప్రతిరోజూ ఈ శ్లోకాలను పఠించడం వల్ల భక్తి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగుతాయని విశ్వాసం.
సరసవచసాం వీచీ నీచీభవన్మధుమాధురీ
భరితభువనా కీర్తిర్మూర్తిర్మనోభవజిత్వరీ ।
జనని మనసో యోగ్యం భోగ్యం నృణాం తవ జాయతే
కథమివ వినా కాంచీభూషే కటాక్షతరంగితమ్ ॥21॥
కాంచీపురమునకు ఆభరణమైన ఓ కామాక్షీ! నీ పలుకులు మధురమైన తియ్యదనములు కలిగి, నీ కీర్తి దిగంతముల వరకు వ్యాపించి, నీ సౌందర్యం మన్మధుని త్రోసిరాజని, నీ క్రీగంటి చూపులు మాకు సకల వాంఛలను తీర్చేవిగా ఉన్నాయి.
భ్రమరితసరిత్కూలో నీలోత్పలప్రభయాఽఽభయా
నతజనతమఃఖండీ తుండీరసీమ్ని విజృంభతే ।
అచలతపసామేకః పాకః ప్రసూనశరాసన-
ప్రతిభటమనోహారీ నారీకులైకశిఖామణిః ॥22॥
తన శరీర వర్ణము, భ్రమరములను సైతము ఆకర్షించే నల్లని ప్రకాశము కలిగి, అ నలుపు వర్ణము మాలోని అజ్ఞానమును తొలగిస్తూ, పర్వతరాజు తపఃఫలముగా జన్మించి, మన్మధుని మించిన సౌందర్యము కలదై, స్త్రీకుల భూషణమైన ఒక యువతి తుందీర దేశమనే కాంచీపురములో ప్రకాశించుచున్నది.
మధురవచసో మందస్మేరా మతంగజగామినః
తరుణిమజుషస్తాపిచ్ఛాభాస్తమఃపరిపంథినః ।
కుచభరనతాః కుర్యుర్భద్రం కురంగవిలోచనాః
కలితకరుణాః కాంచీభాజః కపాలిమహోత్సవాః ॥23॥
అమ్మా! తీయని మాటలు, మందహాసము, మెల్లని నడకలు, చీకటిని మించిన నల్లని కాంతులు, కుచముల బరువుతో వంగిన కటి ప్రదేశము, లేడి కన్నులను తిరస్కరించే నేత్రములతో, ఈశ్వరునికి ఆనందము కలిగిస్తూ, కాంచీపురములో ప్రకాశించు మాత మమ్ములను కరుణించుగాక.
కమలసుషమాక్ష్యారోహే విచక్షణవీక్షణాః
కుముదసుకృతక్రీడాచూడాలకుంతలబంధురాః ।
రుచిరరుచిభిస్తాపిచ్ఛశ్రీప్రపంచనచుంచవః
పురవిజయినః కంపాతీరే స్ఫురంతి మనోరథాః ॥24॥
అమ్మా! నీ నేత్రములు కమలముల శోభను త్రోసిరాజన్నవి. కలువలు అమితముగా అభిమానించే చంద్రుడు, నీ సిగలో ఆభరణమైనాడు. ఈశ్వరుని ఆలోచనల ప్రతిరూపమైన నీవు కంపా తీరములో విహరిస్తున్నావు.
కలితరతయః కాంచీలీలావిధౌ కవిమండలీ-
వచనలహరీవాసంతీనాం వసంతవిభూతయః ।
కుశలవిధయే భూయాసుర్మే కురంగవిలోచనాః
కుసుమవిశిఖారాతేరక్ష్ణాం కుతూహలవిభ్రమాః ॥25॥
అమ్మా! కాంచీ పురమన్నా, కంపాతీర విహారమన్నా నీకు ఎంత ప్రీతి. లేడి కనులను మించిన నేత్రములు, ఈశ్వరుని మురిపించే నడకల సొబగులు, మొత్తం కలగలిసి, కవుల వర్ణనల వసంత ఋతుశోభలు, మమ్ములను కరుణించుగాక.
కబలితతమస్కాండాస్తుండీరమండలమండనాః
సరసిజవనీసంతానానామరుంతుదశేఖరాః ।
నయనసరణేర్నేదీయంసః కదా ను భవంతి మే
తరుణజలదశ్యామాః శంభోస్తపఃఫలవిభ్రమాః ॥26॥
అమ్మా! చీకటిని మించిన నలుపు వర్ణము కలవి, పద్మములు ముడుచుకునే, చంద్రఖండమును సిగలో అలంకరించుకున్నవి, జలముతో నిండిన నల్లని మేఘముల వంటివి, శివునకు తపః ఫలమైన నీ విలాసములు నీ ఈ పుత్రునికి ఎప్పుడు దృష్టిగోచరమౌతాయి మాతా!
అచరమమిషుం దీనం మీనధ్వజస్య ముఖశ్రియా
సరసిజభువో యానం మ్లానం గతేన చ మంజునా ।
త్రిదశసదసామన్నం ఖిన్నం గిరా చ వితన్వతీ
తిలకయతి సా కంపాతీరం త్రిలోచనసుందరీ ॥27॥
అమ్మా! నీ వదన కాంతిని చూసి, పద్మములు వెలవెలపోతున్నాయి. సృష్టికర్తయైన బ్రహ్మ వాహనమైన హంస, నీ నడకలచే ఓడింపబడినది. నీ పలుకులు దేవతలు స్వీకరించిన అమృతముకంటే ఎంతో మధురముగా ఉన్నాయి. ఇట్టి లక్షణములు కలిగిన ఈశ్వరుని దేవేరి కంపా తీరమును ప్రకాశింపచేయుచున్నది.
జనని భువనే చంక్రమ్యేఽహం కియంతమనేహసం
కుపురుషకరభ్రష్టైర్దుష్టైర్ధనైరుదరంభరిః ।
తరుణకరుణే తంద్రాశూన్యే తరంగయ లోచనే
నమతి మయి తే కించిత్కాంచీపురీమణిదీపికే ॥28॥
అమ్మా! కేవలము నా క్షుద్బాధ తీర్చుకోవడం కోసం, నీచులు అధర్మ మార్గములో ఆర్జించిన ధనమును పొందటం కోసం, నేను ఇంకా ఎంతకాలము వారి చుట్టూ పరిభ్రమించాలి? నా ఈ దీనస్థితి నీకు తెలియదా? ఓ కరుణామార్తి, నీ చల్లని చూపులు నాపై ప్రసరింపచేసి, నన్ను గట్టెక్కించవమ్మా!
మునిజనమనః పేటీరత్నం స్ఫురత్కరుణానటీ-
విహరణకలాగేహం కాంచీపురీమణిభూషణమ్ ।
జగతి మహతో మోహవ్యాధేర్నృణాం పరమౌషధం
పురహరదృశాం సాఫల్యం మే పురః పరిజృంభతామ్ ॥29॥
మునీశ్వరుల హృదయమనే పేటికలోని రత్నమా! నా హృదయమనే నర్తనశాలలో నర్తించే ఓ నర్తకీ, కాంచీపురములో వెలసిన ఆభరణమా, మా మనోవ్యాధులను తొలగించే దివ్యౌషధమా, ఈశ్వరుని నేత్రానందమా, ఇంకా ఎందుకు నన్ను కరుణించడానికి ఆలస్యం చేస్తున్నావు?
మునిజనమోధామ్నే ధామ్నే వచోమయజాహ్నవీ-
హిమగిరితటప్రాగ్భారాయాక్షరాయ పరాత్మనే ।
విహరణజుషే కాంచీదేశే మహేశ్వరలోచన-
త్రితయసరసక్రీడాసౌధాంగణాయ నమో నమః ॥30॥
అమ్మా! నీవు మునీశ్వరుల హృదయములోను, గంగాఝరివంటి కవిత్వ పటిమకు హిమాలయ పర్వతమువలే ఉన్నతమై నిలిచావు. పరంజ్యోతి స్వరూపమై, ఈశ్వరుని తన కేళీవిలాసములతో సమ్మోహపరిచే కామాక్షీ! నీకివే నా ప్రణతులు.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




