స్తోత్రాలకు తెలుగులో అర్థం » మూక పంచశతి స్తుతి శతకం 31-40 శ్లోకాలు
మూక పంచశతి స్తుతి శతకం 31-40 శ్లోకాలు | Kamakshi Devi Stotram Telugu

మూక పంచశతి స్తుతి శతకం 31-40 శ్లోకాలు

మూక పంచశతి స్తుతిశతకం అనేది కామాక్షీ అమ్మవారిని స్తుతిస్తూ రచించిన అత్యంత పవిత్రమైన స్తోత్రాలలో ఒకటి. దీనిని మహా భక్తుడు మూక కవి రచించారు. ఆయనకు కామాక్షీ దేవి కటాక్షంతో వాక్చాతుర్యం లభించి ఈ దివ్యమైన శ్లోకాలను రచించినట్లు పురాణ కథనం చెబుతుంది. మూక పంచశతి మొత్తం 500 శ్లోకాలతో ఉండి ఐదు శతకాలుగా విభజించబడింది. అందులో స్తుతిశతకం దేవిని స్తుతించే భాగంగా ఎంతో ప్రసిద్ధి పొందింది.

ఈ స్తుతిశతకం పఠించడం వల్ల విద్య, వాక్పటిమ, ఐశ్వర్యం, మనశ్శాంతి మరియు దేవి అనుగ్రహం లభిస్తాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా కామాక్షి దేవి కృప పొందేందుకు ఈ స్తోత్రాన్ని భక్తితో పఠిస్తారు. ప్రతిరోజూ ఈ శ్లోకాలను పఠించడం వల్ల భక్తి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగుతాయని విశ్వాసం.

మరకతరుచాం ప్రత్యాదేశం మహేశ్వరచక్షుషాం
అమృతలహరీపూరం పారం భవాఖ్యపయోనిధేః ।
సుచరితఫలం కాంచీభాజో జనస్య పచేలిమం
హిమశిఖరిణో వంశస్యైకం వతంసముపాస్మహే ॥31॥

మరకతముల ప్రకాశమును తిరస్కరించేది, ఈశ్వరుని నేత్రములకు ఆనందమును కలిగించేది, సంసారమనే సాగరమునకు తీరమైనది, కాంచీపురములో వెలసిన పుణ్యము, హిమవంతుని వంశమునకు శ్రేష్టత ఆపాదించినది అయిన కామాక్షీ దేవిని ధ్యానిస్తున్నాను.

ప్రణమనదినారంభే కంపానదీసఖి తావకే
సరసకవితోన్మేషః పూషా సతాం సముదంచితః ।
ప్రతిభటమహాప్రౌఢప్రోద్యత్కవిత్వకుముద్వతీం
నయతి తరసా నిద్రాముద్రాం నగేశ్వరకన్యకే ॥32॥

కంపానదితో చెలిమి చేస్తూ, నిన్ను స్మరించిన భక్తులలో కవిత్వ రసధారలను ఉదయింపచేస్తూ, ఎదుటివారి ప్రతిభను వెనక్కి నెట్టి, వారి కవిత్వమనే తీగను నిద్రావస్థలోనికి జార్చివేస్తావు.

శమితజడిమారంభా కంపాతటీనికటేచరీ
నిహతదురితస్తోమా సోమార్ధముద్రితకుంతలా ।
ఫలితసుమనోవాంఛా పాంచాయుధీ పరదేవతా
సఫలయతు మే నేత్రే గోత్రేశ్వరప్రియనందినీ ॥33॥

కంపాతీర విహారిణి, జీవులలోవ్యాప్తి చెందే జడత్వమును నివారించునది, సిగలో చంద్రఖండమును ధరించినది, పెరిగిపోయిన పాపరాశిని దగ్ధము చేసేది, దేవతల వాంఛలను ఈడేర్చేది, కామదేవుడైన మన్మధునికి ఉపాసనా దైవము, హిమవత్పర్వతపుత్రి అయిన తల్లి నాకు ప్రసన్నమగుగాక!

మమ తు ధిషణా పీడ్యా జాడ్యాతిరేక కథం త్వయా
కుముదసుషమామైత్రీపాత్రీవతంసితకుంతలామ్ ।
జగతి శమితస్తంభాం కంపానదీనిలయామసౌ
శ్రియతి హి గలత్తంద్రా చంద్రావతంససధర్మిణీమ్ ॥34॥

కలువల రేడైన చంద్రుని సిగలో ధరించి, జగదీశ్వరుని దేవేరియై, జగములోని అలసత్వమును పారద్రోలి, కంపాతీరములో విహరించే కామాక్షీ దేవిని శరణు వేడిన నన్ను ఈ జడత్వము పీడించగలదా! అసంభవం.

పరిమలపరీపాకోద్రేకం పయోముచి కాంచనే
శిఖరిణి పునర్ద్బైధీభావం శశిన్యరుణాతపమ్ ।
అపి చ జనయన్ కమ్బోర్లక్ష్మీమ్ అనంబుని కోఽప్యసౌ
కుసుమధనుషః కాంచీదేశే చకాస్తి పరాక్రమః ॥35॥

నల్లని మేఘమువంటి అమ్మ శిరోజములకు సుగంధమును, బంగారు పర్వతమును పోలు రెండు మాతృస్థానములను, సంధ్యాకాలపు చంద్రబింబములోని ఎర్రదనమును పోలిన పెదవులను, నీటితో నిండిన శంఖము వంటి కంఠమును కలిగి, పూలబాణములను ధరించిన మాత కాంచీపురములో ప్రకాశిస్తున్నది.

పురదమయితుర్వామోత్సంగస్థలేన రసజ్ఞయా
సరసకవితాభాజా కాంచీపురోదరసీమయా ।
తటపరిసరైః నీహారాద్రేః వచోభిరకృత్రిమైః
కిమివ న తులామస్మచ్చేతో మహేశ్వరి గాహతే ॥36॥

త్రిపురహరుడైన ఈశ్వరుని వామ భాగమును అధిష్టించినది, కవులలో రసస్వరూపమైనది, కాంచీపురములో స్థితురాలైనది, హిమాలయ సానువులలో సంచరించునది, వేదసారమైనది అయిన అమ్మలో నా మనసు ఎందుకు ఏకాగ్రతను పొందటంలేదో అర్థము కాకున్నది.

నయనయుగలీమాస్మాకీనాం కదా ను ఫలేగ్రహీం
విదధతి గతౌ వ్యాకుర్వాణా గజేంద్రచమత్క్రియామ్ ।
మరతకరుచో మాహేశానా ఘనస్తననమ్రితాః
సుకృతవిభవాః ప్రాంచః కాంచీవతంసధురంధరాః ॥37॥

మందమైన తన చలనముతో గజములకు నడక నేర్పునదీ, మరకతమణుల కాంతులతో ప్రకాశించునది, వంగిన కటి ప్రదేశము కలది, ఈశ్వరుని తపఃఫలము, పూర్వజ అయిన కామాక్షీదేవి నాకు ఎపుడు దర్శనభాగ్యమును ప్రసాదిస్తుందో కదా!

మనసిజయశఃపారంపర్యం మరందఝరీసువాం
కవికులగిరాం కందం కంపానదీతట మండనమ్ ।
మధురలలితం మత్కం చక్షుర్మనీషిమనోహరం
పురవిజయినః సర్వస్వం తత్పురస్కురుతే కదా ॥38॥

మన్మధుని యశస్సుకు మూలమైనది, తేనెలూరు కవితా సంపదకు ఆద్యము, కంపానదికి అలంకారమైనది, జ్ఞానుల మనసును ఆకర్షించునది, మధురము, ఈశ్వరునికి అన్నీ తానైన కామాక్షీ దేవి- నాకు ఎప్పుడు తన దర్శన భాగ్యమును కలుగచేస్తుందో కదా!

శిథిలితతమోలీలాం నీలారవిందవిలోచనాం
దహనవిలసత్ఫాలాం శ్రీకామకోటిముపాస్మహే ।
కరధృతలసచ్ఛూలాం కాలారిచిత్తహరాం పరాం
మనసిజకృపాలీలాం లోలాలకామలికేక్షణామ్ ॥39॥

జీవులలో తమోగుణము అనే అజ్ఞానమును తరిమివేయునది, నల్ల కలువలను పోలిన నేత్రములు కలది, కామకోటిపీఠములో వసించునది, ఫాలభాగమున అగ్ని నేత్రము కలది, యముని సంహరించి పునర్జీవితుని చేసిన హరుని మనసు గెలుచుకున్నది, మన్మధుని కనికరించినది అయిన కామాక్షీ మాతను ప్రార్ధిస్తాను.

కలాలీలాశాలా కవికులవచఃకైరవవనీ-
శరజ్జ్యోత్స్నాధారా శశధరశిశుశ్లాఘ్యముకుటీ ।
పునీతే నః కంపాపులినతటసౌహార్దతరలా
కదా చక్షుర్మార్గం కనకగిరిధానుష్కమహిషీ ॥40॥

కళాస్వరూపములకు క్రీడాస్థలము, కవిత్వ ధారలనే కలువ తోటలకు చంద్ర కిరణముల కాంతి, చంద్రుని సిగలో ధరించినది, కంపానదీ తీరమునకు మిత్రురాలు, మేరు పర్వతమును ధనుస్సుగా ధరించిన త్రిపురహరుని దేవేరి అయిన జగన్మాత నా నేత్రములకు ఎప్పుడు ధన్యత్వమును ప్రసాదిస్తుందో కదా!

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top