స్తోత్రాలకు తెలుగులో అర్థం » మూక పంచశతి స్తుతి శతకం 41-50 శ్లోకాలు
మూక పంచశతి స్తుతి శతకం 41-50 శ్లోకాలు | Kamakshi Devi Stotram Telugu

మూక పంచశతి స్తుతి శతకం 41-50 శ్లోకాలు

మూక పంచశతి స్తుతిశతకం అనేది కామాక్షీ అమ్మవారిని స్తుతిస్తూ రచించిన అత్యంత పవిత్రమైన స్తోత్రాలలో ఒకటి. దీనిని మహా భక్తుడు మూక కవి రచించారు. ఆయనకు కామాక్షీ దేవి కటాక్షంతో వాక్చాతుర్యం లభించి ఈ దివ్యమైన శ్లోకాలను రచించినట్లు పురాణ కథనం చెబుతుంది. మూక పంచశతి మొత్తం 500 శ్లోకాలతో ఉండి ఐదు శతకాలుగా విభజించబడింది. అందులో స్తుతిశతకం దేవిని స్తుతించే భాగంగా ఎంతో ప్రసిద్ధి పొందింది.

ఈ స్తుతిశతకం పఠించడం వల్ల విద్య, వాక్పటిమ, ఐశ్వర్యం, మనశ్శాంతి మరియు దేవి అనుగ్రహం లభిస్తాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా కామాక్షి దేవి కృప పొందేందుకు ఈ స్తోత్రాన్ని భక్తితో పఠిస్తారు. ప్రతిరోజూ ఈ శ్లోకాలను పఠించడం వల్ల భక్తి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగుతాయని విశ్వాసం.

నమః స్తాన్నమ్రేభ్యః స్తనగరిమగర్వేణ గురుణా
దధానేభ్యః చూడాభరణమమృతస్యంది శిశిరమ్ ।
సదా వాస్తవ్యేభ్యః సువిధభువి కంపాఖ్యసరితే
యశోవ్యాపారేభ్యః సుకృతవిభవేభ్యో రతిపతేః ॥41॥

అత్యంత గొప్పవై, సకల జీవులను పోషించే, పోషణాస్థానముల బరువుతో వంగిన నడుము కలదై, అమృతము వంటి శీతల ధారలను కురిపించే శశాంకుని సిగలో ధరించి, కంపానదీ తీరములో విహరిస్తూ, ఈశ్వరుని తపఃఫలమైన కామాక్షీ దేవికి ప్రణమిల్లుతున్నాను.

అసూయంతీ కాచిన్మరకతరుచో నాకిముకుటీ-
కదంబం చుంబంతీ చరణనఖచంద్రాంశుపటలైః ।
తమోముద్రాం విద్రావయతు మమ కాంచీర్నిలయనా
హరోత్సంగశ్రీమన్మణిగృహమహాదీపకలికా ॥42॥

అమ్మ శరీర కాంతులు మరకతమణి కాంతులను త్రోసిరాజంటున్నవి. ఆమె పాద నఖముల కాంతి- సకల దేవతల యొక్క కిరీటములను స్పృశించుచున్నది. ఈశ్వరుని ఒడి అనే మణిద్వీపములోనూ, కాంచీపురములోను కొలువైన కామాక్షీ దేవి నాకు జ్ఞానమును ప్రసాదించుగాక!

అనాద్యంతా కాచిత్సుజననయనానందజననీ
నిరుంధానా కాంతిం నిజరుచివిలాసైః జలముచామ్ ।
స్మరారేస్తారల్యం మనసి జనయంతీ స్వయమహో
గలత్కంపా శంపా పరిలసతి కంపాపరిసరే ॥43॥

జగన్మాతకు ఆది, అంతములు లేవు. సత్పురుషులకు ఆమె నేత్రానందము. నల్లని తన శరీర వర్ణముతో, వర్షపు నీటితో నిండి ఉన్న మేఘముల కాంతిని జయించునది, మన్మధుని బూడిద చేసిన ఈశ్వరుని మనసునే కలవరపరచినది, ఎల్లప్పుడు కరుణను ప్రసరించేది అయిన అమ్మ కంపా తీరములో ప్రభవిల్లుతున్నది.

సుధాడిండీరశ్రీః స్మితరుచిషు తుండీరవిషయం
పరిష్కుర్వాణాసౌ పరిహసితనీలోత్పలరుచిః ।
స్తనాభ్యామానమ్రా స్తబకయతు మే కాంక్షితతరుం
దృశామైశానీనాం సుకృతఫలపాండిత్యగరిమా ॥44॥

అమ్మ మందహాసము పాల సముద్రములోని తెల్లని నురగ కాంతి కలది. శరీరపు వర్ణము నల్లకలువల కాంతి తిరస్కరించునది. ఈశ్వరుని ప్రేమపూరిత దృక్కులకు పాత్రమైనది. తుండీర దేశములోని కాంచీపురములో వెలుగుతున్న కామాక్షీ దేవి, నా ఈ శరీర వృక్షమును పుష్పింపచేయుగాక!

కృపాధారాద్రోణీ కృపణధిషణానాం ప్రణమతాం
నిహంత్రీ సంతాపం నిగమముకుటోత్తంసకలికా ।
పరా కాంచీలీలాపరిచయవతీ పర్వతసుతా
గిరాం నీవీ దేవీ గిరిశపరతంత్రా విజయతే ॥45॥

కామాక్షీదేవి, దయను భక్తులకు పుష్కలముగా ప్రసాదించునది. వేదములకు మణి వంటిది. భక్తులు ఏ స్థితిలో తనను ప్రార్థించినా వారి బాధలను పోగొట్టునది, పర్వతరాజ పుత్రి, కాంచీ పుర విహారిణి, ఈశ్వరునికి ప్రేమపాత్రురాలైన కామాక్షీ దేవికి జయము జయము.

కవిత్వశ్రీకందః సుకృతపరిపాటీ హిమగిరేః
విధాత్రీ విశ్వేషాం విషమశరవీరధ్వజపటీ ।
సఖీ కంపానద్యాః పదహసితపాథోజయుగలీ
పురాణీ పాయాన్నః పురమథనసామ్రాజ్యపదవీ ॥46॥

కామాక్షీ దేవి, కవిత్వ సంపదకు పుట్టినిల్లు. హిమవంతుని పుణ్యాల పంట. సకల జగత్తులకు సృష్టికర్త. మన్మధునికి ఉపాసనా దైవము. కంపానదికి ఇష్ట సఖి. పద్మముల కాంతిని తిరస్కరించు పాదములు కలది.  ఈశ్వరుని హృదయాధీశ్వరి,  సనాతనమైనది అయిన మాత నన్ను కాపాడుగాక.

దరిద్రాణా మధ్యే దరదలితతాపింఛసుషమాః
స్తనాభోగక్కాంతాః తరుణహరిణాంకాంకితకచాః ।
హరాధీనా నానావిబుధముకుటీచుంబితపదాః
కదా కంపాతీరే కథయ విహరామో గిరిసుతే ॥47॥

ఓ పర్వతరాజపుత్రీ, అతి సన్నని కటి భాగముతో, వికసించి పుష్పించిన తమాన వృక్షపు శోభతో, చంద్రఖండమును దాల్చిన శిరసుతో, ఈశ్వరుని ప్రేమను పొంది, దేవతా కిరీటములను తాకే పాదములతో, కంపా తీరములో నీతో కలసి ఎప్పుడు నేను విహరించగలను?

వరీవర్తు స్థేమా త్వయి మమ గిరాం దేవి మన
నరీనర్తు ప్రౌఢా వదనకమలే వాక్యలహరీ ।
చరీచర్తు ప్రజ్ఞాజనని జడిమానః పరజనే
సరీసర్తు స్వైరం జనని మయి కామాక్షి కరుణా ॥48॥

జగన్మాతా! నా మనసు, బుద్ధి ఎల్లప్పుడు నీ స్మరణములోనే నిలచి ఉండుగాక. వాక్ప్రదాయినీ! స్వచ్ఛమైన, గంభీరమైన వాక్కులు నా ముఖమునుండి వెలువడుగాక. నా శతృవులందరిలోనూ మందత్వము, జడత్వము నిండుగాక. నీ దయ నాపై ఎల్లప్పుడు ప్రసరించుగాక.

క్షణాత్తే కామాక్షి భ్రమరసుషమాశిక్షణగురుః
కటాక్షవ్యాక్షేపో మమ భవతు మోక్షాయ విపదామ్ ।
నరీనర్తు స్వైరం వచనలహరీ నిర్జరపురీ-
సరిద్వీచీనీచీకరణపటురాస్యే మమ సదా ॥49॥

అమ్మా! తుమ్మెదల గుంపు ఇతరులను ఆకర్షించే విధమును నీనుంచే నేర్చుకున్నాయి. కేవలము నీ క్రీగంటి చూపు నన్ను అన్ని ఆపదలనుండి కాపాడుతుంది. నిన్ను స్తుతించడానికి వాక్ప్రవాహము నా ముఖమునుండి గంగాఝరివలే ప్రవహించుగాక.

పురస్తాన్మే భూయఃప్రశమనపరః స్తాన్మమ రుజాం
ప్రచారస్తే కంపాతటవిహృతిసంపాదిని దృశోః ।
ఇమాం యాచ్ఞామూరీకురు సపది దూరీకురు తమః-
పరీపాకం మత్కం సపది బుధలోకం చ నయ మామ్ ॥50॥

అమ్మా! కంపాతీర విహారిణీ! నీ కరుణారస దృక్కులు నాలోని సర్వ వ్యాధులను నివారించుగాక. నా ప్రార్థనను స్వీకరించి, నాలోని పామరత్వమును తొలగించి, నన్ను పండితులలో ఒకరిగా చేయుము తల్లీ!

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top