స్తోత్రాలకు తెలుగులో అర్థం » మూక పంచశతి స్తుతి శతకం 51-60 శ్లోకాలు
మూక పంచశతి స్తుతి శతకం 51-60 శ్లోకాలు | Kamakshi Devi

మూక పంచశతి స్తుతి శతకం 51-60 శ్లోకాలు

మూక పంచశతి స్తుతిశతకం అనేది కామాక్షీ అమ్మవారిని స్తుతిస్తూ రచించిన అత్యంత పవిత్రమైన స్తోత్రాలలో ఒకటి. దీనిని మహా భక్తుడు మూక కవి రచించారు. ఆయనకు కామాక్షీ దేవి కటాక్షంతో వాక్చాతుర్యం లభించి ఈ దివ్యమైన శ్లోకాలను రచించినట్లు పురాణ కథనం చెబుతుంది. మూక పంచశతి మొత్తం 500 శ్లోకాలతో ఉండి ఐదు శతకాలుగా విభజించబడింది. అందులో స్తుతిశతకం దేవిని స్తుతించే భాగంగా ఎంతో ప్రసిద్ధి పొందింది.

ఈ స్తుతిశతకం పఠించడం వల్ల విద్య, వాక్పటిమ, ఐశ్వర్యం, మనశ్శాంతి మరియు దేవి అనుగ్రహం లభిస్తాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా కామాక్షి దేవి కృప పొందేందుకు ఈ స్తోత్రాన్ని భక్తితో పఠిస్తారు. ప్రతిరోజూ ఈ శ్లోకాలను పఠించడం వల్ల భక్తి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగుతాయని విశ్వాసం.

ఉదంచంతీ కాంచీనగరనిలయే త్వత్కరుణయా
సమృద్ధా వాగ్ధాటీ పరిహసితమాధ్వీ కవయతామ్ ।
ఉపాదత్తే మారప్రతిభటజటాజూటముకుటీ-
కుటీరోల్లాసిన్యాః శతమఖతటిన్యా జయపటీమ్ ॥51॥

కాంచీపురములో విహరించే ఓ కామాక్షీ! నీ దయ కనుక ప్రసరించినట్లయితే, తేనెయొక్క తియ్యదనమును మించిన కవితాధార ఎంతో వేగముగా ప్రవహిస్తుంది. ఆ ధార పైకి ఎగసి, శివుని జటాజూటములో పరవళ్ళు త్రొక్కుతున్న గంగానది అంచులను తాకుతుంది.

శ్రియం విద్యాం దద్యాజ్జనని నమతాం కీర్తిమమితాం
సుపుత్రాన్ ప్రాదత్తే తవ ఝటితి కామాక్షి కరుణా ।
త్రిలోక్యామాధిక్యం త్రిపురపరిపంథిప్రణయిని
ప్రణామస్త్వత్పాదే శమితదురితే కిం న కురుతే ॥52॥

శివుని దేవేరివైన ఓ కామాక్షీ! నీ పాదాలను ఎవరు శరణు వేడుతారో, వారి పాపములన్నిటినీ నీవు తక్షణమే హరించి, వారికి ఐశ్వర్యమును, విద్యను, చిరయశస్సును ప్రసాదిస్తావు. నీ పాదనమస్కారము మూడు లోకములలోనూ పూజ్యతను ప్రసాదిస్తుందంటే ఇంక అంతకు మించి ఏమున్నాయి మాతా!

మనఃస్తంభం స్తంభం గమయదుపకంపం ప్రణమతాం
సదా లోలం నీలం చికురజితలోలంబనికరమ్ ।
గిరాం దూరం స్మేరం ధృతశశికిశోరం పశుపతేః
దృశాం యోగ్యం భోగ్యం తుహినగిరిభాగ్యం విజయతే ॥53॥

కంపానదీ తీరములో, సజ్జన శుభంకరి, నీలవర్ణ ప్రకాశము కలది, తన కురుల శోభతో భ్రమరములను ఆకర్షించునది, ముఖమున మందహాసముతో, చంద్రఖండమును శిరసున దాల్చి, శివునకు నేత్రానందకరియై వెలసిన మాత తన భక్తుల మనసనే స్తంభమును ధృఢముగా నిలుపుతుంది.

ఘనశ్యామాన్కామాంతకమహిషి కామాక్షి మధురాన్
దృశాం పాతానేతానమృతజలశీతాననుపమాన్ ।
భవోత్పాతే భీతే మయి వితర నాథే దృఢభవ-
న్మనశ్శోకే మూకే హిమగిరిపతాకే కరుణయా ॥54॥

జగన్మాతా, మన్మధుని జయించిన ఈశ్వరుని దేవేరీ, హిమవత్పుత్రీ, ఈ సంసారమనే చక్రభ్రమణములో చిక్కి విలవిలలాడుతూ, మాటలు రాని నాపైన, అమృతమువంటి నీ చూపులనే వర్షపు ధారను కురిపించి అనుగ్రహించు తల్లీ,

నతానాం మందానాం భవనిగలబంధాకులధియాం
మహాంధ్యాం రుంధానామభిలషితసంతానలతికామ్ ।
చరంతీం కంపాయాస్తటభువి సవిత్రీం త్రిజగతాం
స్మరామస్తాం నిత్యం స్మరమథనజీవాతుకలికామ్ ॥55॥

అమ్మా! నీ చరణములను శరణన్నవారు- అజ్ఞానపు బంధనములలో చిక్కుకున్న మందబుద్ధులైనా, వారి కోరికలను కల్పవృక్షమువలే తీరుస్తావు. ఈశ్వరుని ప్రాణము నీవే, మూడులోకములు నీలోనుండే ఉద్భవిస్తాయి. కంపాతీర విహారిణీ, నీకు నమస్కారము.

పరా విద్యా హృద్యాశ్రితమదనవిద్యా మరకత-
ప్రభానీలా లీలాపరవశితశూలాయుధమనాః ।
తమఃపూరం దూరం చరణనతపౌరందరపురీ-
మృగాక్షీ కామాక్షీ కమలతరలాక్షీ నయతు మే ॥56॥

జగన్మాత, కామాక్షి, పరవిద్యా స్వరూపిణి, మరకతమణుల నీలకాంతులతో మనోహరముగా ప్రకాశించునది, తన లీలా విలాసములచే ఈశ్వరుని సైతము మరపింపచేయునది, చంచలమైన నేత్రములు కలిగిన మాత నా అజ్ఞానమును తొలగించుగాక.

అహంతాఖ్యా మత్కం కబలయతి యా హంత హరిణీ
హఠాత్సంవిద్రూపం హరమహిషి సస్యాంకురమసౌ ।
కటాక్షవ్యాక్షేపప్రకటహరిపాషాణపటలైః
ఇమాముచ్చైరుచ్చాటయ ఝటితి కామాక్షి కృపయా ॥57॥

అమ్మా! జ్ఞానము అనే నా మనసుయొక్క పంటపొలములో అహంకారము అను ఒక జింక ప్రవేశించి, ఏపుగా పెరిగిన పంటను తిని, త్రొక్కి పాడుచేస్తున్నది. ఆ జింకను నీ చూపులనే రాళ్ళతో కొట్టి దూరముగా తరిమివేయవమ్మా!

బుధే వా మూకే వా తవ పతతి యస్మిన్ క్షణమసౌ
కటాక్షః కామాక్షి ప్రకటజడిమక్షోదపటిమా ।
కథంకారం నాస్మై కరముకులచూడాలముకుటా
నమోవాకం బ్రూయుర్నముచిపరిపంథిప్రభృతయః ॥58॥

అమ్మా! అజ్ఞానమును, జడత్వమును తొలగించే నీ దృష్టి ఎవరిపై కొద్దిసేపైనా పడుతుందో, అతడు పండితుడైనా, పామరుడైనా, బధిరుడైనా ఇంద్రాది దేవతలు వానికి తమ శిరసులు వంచి నమస్కారం చేస్తారు.

ప్రతీచీం పశ్యామః ప్రకటరుచినీవారకమణి-
ప్రభాసధ్రీచీనాం ప్రదలితషడాధారకమలామ్ ।
చరంతీం సౌషుమ్నే పథి పరపదేందుప్రవిగల-
త్సుధార్ద్రాం కామాక్షీం పరిణతపరంజ్యోతిరుదయామ్ ॥59॥

ధాన్యపు కంకివంటి ఎర్రని కాంతితో సమానముగా ప్రకాశించు తల్లి, సుషుమ్నా నాడి ద్వారా మూలాధారమునుండి మొదలై సహస్రారమునకు చేరి, అక్కడ ఈశ్వరుని అమృతధారలలో తడిసిపోయిన పరంజ్యోతి, మాకు దర్శనమిచ్చి ధన్యులను చేయుగాక!

జంభారాతిప్రభృతిముకుటీః పాదయోః పీఠయంతీ
గుంఫాన్వాచాం కవిజనకృతాన్ స్త్వైరమారామయంతీ ।
శంపాలక్ష్మీం మణిగణరుచాపాటలైః ప్రాపయంతీ
కంపాతీరే కవిపరిషదాం జృంభతే భాగ్యసీమా ॥60॥

అమ్మను అద్భుతముగా వర్ణించే కవీంద్రుల సొత్తు కంపాతీరములో వసించి, సకల దేవతల కిరీటములను తన పాద పీఠముగా చేసుకొన్నది. కవుల మధుర కవిత్వమే ఆమె విహారమైనది. ఆ విహార స్థలములో ఆ తల్లి తీగలుగా అల్లుకొనుచున్నది.

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top