స్తోత్రాలకు తెలుగులో అర్థం » మూక పంచశతి స్తుతి శతకం 61-70 శ్లోకాలు
మూక పంచశతి స్తుతి శతకం 61-70 శ్లోకాలు | Kamakshi Devi

మూక పంచశతి స్తుతి శతకం 61-70 శ్లోకాలు

మూక పంచశతి స్తుతిశతకం అనేది కామాక్షీ అమ్మవారిని స్తుతిస్తూ రచించిన అత్యంత పవిత్రమైన స్తోత్రాలలో ఒకటి. దీనిని మహా భక్తుడు మూక కవి రచించారు. ఆయనకు కామాక్షీ దేవి కటాక్షంతో వాక్చాతుర్యం లభించి ఈ దివ్యమైన శ్లోకాలను రచించినట్లు పురాణ కథనం చెబుతుంది. మూక పంచశతి మొత్తం 500 శ్లోకాలతో ఉండి ఐదు శతకాలుగా విభజించబడింది. అందులో స్తుతిశతకం దేవిని స్తుతించే భాగంగా ఎంతో ప్రసిద్ధి పొందింది.

ఈ స్తుతిశతకం పఠించడం వల్ల విద్య, వాక్పటిమ, ఐశ్వర్యం, మనశ్శాంతి మరియు దేవి అనుగ్రహం లభిస్తాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా కామాక్షి దేవి కృప పొందేందుకు ఈ స్తోత్రాన్ని భక్తితో పఠిస్తారు. ప్రతిరోజూ ఈ శ్లోకాలను పఠించడం వల్ల భక్తి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగుతాయని విశ్వాసం.

చంద్రాపీడాం చతురవదనాం చంచలాపాంగలీలాం
కుందస్మేరాం కుచభరనతాం కుంతలోద్ధూతభృంగామ్ ।
మారారాతేర్మదనశిఖినం మాంసలం దీపయంతీం
కామాక్షీం తాం కవికులగిరాం కల్పవల్లీముపాసే ॥61॥

కామాక్షీ మాత- చంద్రుని కిరీటముగా ధరించి, తన మాటలతో సకల కార్యములను సాధించి, క్రీగంటి దయా చూపులను ప్రసరిస్తూ, మల్లెపూల కాంతిని తిరస్కరించే చల్లని చిరునవ్వుల తుమ్మెదలను జయించే కుంతలములతో, మన్మధుని- తన నేత్రాగ్నితో భస్మం చేసిన ఈశ్వరునిలోనే, కామాగ్నిని రగిల్చిన దేవికి నమస్కారము.

కాలాంభోదప్రకరసుషమాం కాంతిభిస్తర్జయంతీ
కల్యాణానాముదయసరణిః కల్పవల్లీ కవీనామ్ ।
కందర్పారేః ప్రియసహచరీ కల్మషాణాం నిహంత్రీ
కాంచీదేశం తిలకయతి సా కాపి కారుణ్యసీమా ॥62॥

అమ్మా! నీ నల్లని శరీర కాంతిని చూసి, అత్యంత నల్లని మేఘముల సమూహము వెలవెలపోతున్నది. శుభములను చేకూర్చే తల్లివి నీవు. కవులకు కల్పవృక్షము, శివునకు ప్రియమైన దేవేరివి, కాంచీపురమును ప్రకాశింపచేస్తున్న నీకు ఇవే నా ప్రణతులు.                

ఊరీకుర్వన్నురసిజతటే చాతురీం భూధరాణాం
పాథోజానాం నయనయుగలే పారిపంథ్యం వితన్వన్ ।
కంపాతీరే విహరతి రుచా మోఘయన్మేఘశైలీం
కోకద్వేషం శిరసి కలయన్కోఽపి విద్యావిశేషః ॥63॥

సకల జ్ఞానములకు మూల రూపమైన మాత కంపా తీరములో విహరించుచున్నది. జగత్పోషకములైన మాతృస్థానములతో అలరారే తల్లి, తన కనులకు పద్మములతో జగడమును కలిగి ఉన్నది. తన శరీరపు నల్లని కాంతితో నీలి మేఘపు కాంతిని త్రోసి రాజంటున్నది.

కాంచీలీలాపరిచయవతీ కాపి తాపింఛలక్ష్మీః
జాడ్యారణ్యే హుతవహశిఖా జన్మభూమిః కృపాయాః ।
మాకందశ్రీర్మధురకవితాచాతురీ కోకిలానాం
మార్గే భూయాన్మమ నయనయోర్మాన్మథీ కాపి విద్యా ॥64॥

కాంచీపురములో సంచరించే అమ్మ తమాల వృక్షపు మేని కాంతిని కలిగి ఉన్నది. జడత్వము అనే అరణ్యమును, కార్చిచ్చు లాగా దహించు తల్లి- దయయే స్వరూపముగా కలది. కవిత్వ సంపదకు పుట్టినిల్లు. కవికోకిలకు నెలవైన ఆమ్ర వృక్షము అయిన తల్లి నా కనుల ముందు ప్రత్యక్షమగునుగాక.

సేతుర్మాతర్మరతకమయో భక్తిభాజాం భవాబ్ధౌ
లీలాలోలా కువలయమయీ మాన్మథీ వైజయంతీ ।
కాంచీభూషా పశుపతిదృశాం కాపి కాలాంజనాలీ
మత్కం దుఃఖం శిథిలయతు తే మంజులాపాంగమాలా ॥65॥

జగన్మాతా! దయారసపూరితములైన నీ కరుణాదృష్టి నా బాధలను నశింపచేయుగాక. ఆ చల్లని చూపులు తన భక్తులను సంసార సాగరమును దాటించే మణులతో కట్టిన వారధి. కాంచీపురమునకు అలంకారమైన కామాక్షి- ఈశ్వరుని నేత్రములకు ఆనందమును కలిగించే అంజనము వంటిది.

వ్యావృణ్వానాః కువలయదలప్రక్రియావైరముద్రాం
వ్యాకుర్వాణా మనసిజమహారాజసామ్రాజ్యలక్ష్మీమ్ ।
కాంచీలీలావిహృతిరసికే కాంక్షితం నః క్రియాసుః
బంధచ్ఛేదే తవ నియమినాం బద్ధదీక్షాః కటాక్షాః ॥66॥

కాంచీపురంలో విహరించే మాతా! కలువ పూవులు నీ ముఖ సౌందర్యమును చూసి సిగ్గుపడుతున్నాయి. నీ కనులు కామదేవుని సామ్రాజ్యలక్ష్మిని వ్యాఖ్యానిస్తున్నాయి. నీ దీక్షాబద్ధులైన సంసారులను విరాగులుగా మార్చి, నీ కరుణారస దృష్టిని మాపై ప్రసరింపచేస్తున్నాయి.

కాలాంభోదే శశిరుచి దలం కైతకం దర్శయంతీ
మధ్యేసౌదామిని మధులిహాం మాలికాం రాజయంతీ ।
హంసారావం వికచకమలే మంజుముల్లాసయంతీ
కంపాతీరే విలసతి నవా కాపి కారుణ్యలక్ష్మీః ॥67॥

అమ్మా! నల్లని కారుమేఘములలో తెల్లని చంద్రకాంతి అనే మెరుపు తీగను సిగలో ధరించి, ఆ మెరుపు తీగకు నీ నవ్వులను పుష్పములుగా ప్రకాశింపచేసి, నీ నోటి ద్వారా మధుర ధ్వనులు పలికిస్తూ, దయాసముద్రురాలైన ఒక మాతృమూర్తి కంపా తీరములో విహరించుచున్నది.

చిత్రం చిత్రం నిజమృదుతయా భర్త్సయన్పల్లవాలీం
పుంసాం కామాన్భువి చ నియతం పూరయన్పుణ్యభాజామ్ ।
జాతః శైలాన్న తు జలనిధేః స్వైరసంచారశీలః
కాంచీభూషా కలయతు శివం కోఽపి చింతామణిర్మే ॥68॥

తన మేని మృదుత్వముతో చిగురుటాకుల మెత్తదనమును పరిహసిస్తూ, తన భక్తుల సకల కోరికలను నెరవేరుస్తూ, పర్వత పుత్రియై, కాంచీపురములో, కంపా తీరములో ఆనందముగా విహరిస్తున్న మాత మాకు సకల శుభములను ప్రసాదించుగాక.

తామ్రాంభోజం జలదనికటే తత్ర బంధూకపుష్పం
తస్మిన్మల్లీకుసుమసుషమాం తత్ర వీణానినాదమ్ ।
వ్యావృణ్వానాః సుకృతలహరీ కాపి కాంచినగర్యాం
ఐశానీ సా కలయతితరామైంద్రజాలం విలాసమ్ ॥69॥

కామాక్షీ! నల్లని కేశపాశములలో ఉన్న నీ ముఖారవిందము, మంకెన పుష్పములవంటి ఎర్రని పెదవులతో కూడి, ఆ పెదవులపై మల్లె పూవులవంటి తెల్లని చిరునవ్వుతో, వీణా స్వరమువంటి మధుర వాక్కులతో, ఈశ్వరుని లీలావిలాసములను వివరిస్తూ, కాంచీపురములో ఒక తల్లి తన విద్యలను ప్రదర్శిస్తున్నది.

ఆహారాంశం త్రిదశసదసామాశ్రయే చాతకానాం
ఆకాశోపర్యపి చ కలయన్నాలయం తుంగమేషామ్ ।
కంపాతీరే విహరతితరాం కామధేనుః కవీనాం
మందస్మేరో మదననిగమప్రక్రియాసంప్రదాయః ॥70॥

అమ్మా! కామాక్షీ! నీ సిగలో చంద్రుడు మబ్బులలో చాతక పక్షివలే ఉన్నాడు. నీ మాతృస్థానములు, ఆకాశమును తాకే భవనమువలే ఉన్నవి. నీ చిరునవ్వు కవులలో కవితాధారాలను ప్రసరింపచేయునది. ఈ లక్షణములుగల తల్లి కంపా తీరములో విహరిస్తున్నది.

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top