స్తోత్రాలకు తెలుగులో అర్థం » మూక పంచశతి స్తుతి శతకం 71-80 శ్లోకాలు
మూక పంచశతి స్తుతి శతకం 71-80 శ్లోకాలు

మూక పంచశతి స్తుతి శతకం 71-80 శ్లోకాలు

మూక పంచశతి స్తుతిశతకం అనేది కామాక్షీ అమ్మవారిని స్తుతిస్తూ రచించిన అత్యంత పవిత్రమైన స్తోత్రాలలో ఒకటి. దీనిని మహా భక్తుడు మూక కవి రచించారు. ఆయనకు కామాక్షీ దేవి కటాక్షంతో వాక్చాతుర్యం లభించి ఈ దివ్యమైన శ్లోకాలను రచించినట్లు పురాణ కథనం చెబుతుంది. మూక పంచశతి మొత్తం 500 శ్లోకాలతో ఉండి ఐదు శతకాలుగా విభజించబడింది. అందులో స్తుతిశతకం దేవిని స్తుతించే భాగంగా ఎంతో ప్రసిద్ధి పొందింది.

ఈ స్తుతిశతకం పఠించడం వల్ల విద్య, వాక్పటిమ, ఐశ్వర్యం, మనశ్శాంతి మరియు దేవి అనుగ్రహం లభిస్తాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా కామాక్షి దేవి కృప పొందేందుకు ఈ స్తోత్రాన్ని భక్తితో పఠిస్తారు. ప్రతిరోజూ ఈ శ్లోకాలను పఠించడం వల్ల భక్తి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగుతాయని విశ్వాసం.

ఆర్ద్రీభూతైరవిరలకృపైరాత్తలీలావిలాసైః
ఆస్థాపూర్ణైరధికచపలైః అంచితాంభోజశిల్పైః ।
కాంతైర్లక్ష్మీలలితభవనైః కాంతికైవల్యసారైః
కాశ్మల్యం నః కబలయతు సా కామకోటీ కటాక్షైః ॥71॥

అమ్మా! కామాక్షి! నీ చూపులు దయతోనూ, కరుణారసముతోనూ నిండి ఉన్నవి. అత్యంతవిలాసమై చంచలమైనవి. మా కోర్కెలన్నిటినీ నెరవేర్చేవి. సకల సంపదలకు నిలయములు నీ నేత్రములు. ప్రకాశవంతమైన నీ దృష్టి మాలోని మాలిన్యమును తొలగించుగాక.

ఆధున్వంత్యై తరలనయనైరాంగజీం వైజయంతీం
ఆనందిన్యై నిజపదజుషామాత్తకాంచీపురాయై ।
అస్మాకీనం హృదయమఖిలైరాగమానాం ప్రపంచైః
ఆరాధ్యాయై స్పృహయతితరామాదిమాయై జనన్యై ॥72॥

అమ్మా! నీ చూపులలో మన్మధ పతాకము రెపరెపలాడుతోంది. నిన్ను ఆశ్రయించిన వారికి సకలైశ్వర్యములను ప్రసాదిస్తావు. వేదములచేత స్తుతింపబడేదానవు నీవు. అమ్మలకు అమ్మవైన ఓ కామాక్షీ! నా మనసు నీలో ఎంతో ఆనందముగా సంచరిస్తున్నదమ్మా.

దూరం వాచాం త్రిదశసదసాం దుఃఖసింధోస్తరిత్రం
మోహక్ష్వేలక్షితిరుహవనే క్రూరధారం కుఠారమ్ । [తీక్ష్ణధారం]
కంపాతీరే ప్రణయకవిభిర్వర్ణితోద్యచ్చరిత్రం
శాంత్యై సేవే సకలవిపదాం శాంకరం తత్కలత్రమ్ ॥73॥

అమ్మా! నీ వాక్కు దేవతల వాక్కులకన్నా ఎంతో గొప్పది. ఈ భవసాగరమును దాటించే నౌకవు నీవు. సంసారమనే అరణ్యములో ఉన్న మోహము అనే మహా వృక్షములను ఖండించే గొడ్డలివి నీవు. కవులకు వర్ణనాతీతమైనది నీ చరితము. మాతా! కంపా తీర విహారిణీ! ఈశ్వరుని దేవేరీ! మమ్ములను అన్ని ఆపదలనుండి కాపాడుము.

ఖండీకృత్య ప్రకృతికుటిలం కల్మషం ప్రాతిభశ్రీ-
శుండీరత్వం నిజపదజుషాం శూన్యతంద్రం దిశంతీ ।
తుండీరాఖ్యే మహతి విషయే స్వర్ణవృష్టిప్రదాత్రీ
చండీ దేవీ కలయతి రతిం చంద్రచూడాలచూలీ ॥74॥

జగన్మాతా! ఈ ప్రకృతిలో నిండి ఉన్న మలినమును తొలగిస్తూ, సచ్చిదానంద స్వరూపిణిగా భక్తులను కరుణిస్తూ, జ్ఞానమును ప్రసాదిస్తూ, చంద్ర రేఖను సిగలో ధరించిన ఓ చండీమాతా! భక్తులకు కొంగుబంగారమై, నీవు కాంచీపురములో వెలసిఉన్నావు.

యేన ఖ్యాతో భవతి స గృహీ పూరుషో మేరుధన్వా
యద్దృక్కోణే మదననిగమప్రాభవం బోభవీతి ।
యత్ప్రీత్యైవ త్రిజగదధిపో జృంభతే కింపచానః
కంపాతీరే స జయతి మహాన్ కశ్చిదోజోవిశేషః ॥75॥

అమ్మా! విరక్తుడైన ఈశ్వరుని నీవు గృహస్థుగా మార్చావు. నీ క్రీగంటి కొనలనుండి ఈశ్వరుడు, మన్మధ వేదాన్ని పఠిస్తున్నాడు. నీ దయవలనే ఆదిభిక్షువు మూడులోకములకు అధిపతి అయ్యాడు. అంత మహిమ గల తల్లి కాంచీపురములోని కంపాతీరములో విహరించుచున్నది.

ధన్యాధన్యా గతిరిహ గిరాం దేవి కామాక్షి యన్మే
నింద్యాం భింద్యాత్సపది జడతాం కల్మషాదున్మిషంతీమ్ ।
సాధ్వీ మాధ్వీరసమధురతాభంజినీ మంజురీతిః
వాణీవేణీ ఝటితి వృణుతాత్ స్వర్ధునీస్పర్ధినీ మామ్ ॥76॥

అమ్మా! కామాక్షీ! నాలో ఉన్న పాపమునుండి, అజ్ఞానము ప్రబలుచున్నది. దానిని నరికివేయుము. తేనెవలే తీయనిది, పవిత్రమైనది, గంగానదివంటి కవితావాక్రవాహ ధారను నాలో జనింపచేయుము. ఆ వాక్కులతో నన్ను ధన్యుని చేయుము.

యస్యా వాటీ హృదయకమలం కౌసుమీ యోగభాజాం
యస్యాః పీఠీ సతతశిశిరా శీకరైర్మాకరందైః ।
యస్యాః పేటీ శ్రుతిపరిచలన్మౌలిరత్నస్య కాంచీ
సా మే సోమాభరణమహిషీ సాధయేత్కాంక్షితాని ॥77॥

అమ్మా! యోగుల, జ్ఞానుల హృదయము నీకు నిరంతర విహార స్థలము. ఎల్లప్పుడూ, మకరందముతో నిండి ఉండే పద్మము నీకు పాద పీఠము. వేదముల శిరోరత్నమే నీవు వెలసిన కాంచీపురము. అమ్మా! శివానీ! దయచేసి నీ కరుణను మాపై కురిపించు. 

ఏకా మాతా సకలజగతామేయుషీ ధ్యానముద్రాం
ఏకామ్రాధీశ్వరచరణయోరేకతానా సమింధే ।
తాటంకోద్యన్మణిగణరుచా తామ్రకర్ణప్రదేశా
తారుణ్యశ్రీస్తబకితరుచా తాపసీ కాపి బాలా ॥78॥

కాంచీపురములో, ఏకాంబరేశ్వరుని పాదములలో ధ్యానముద్రాధారిణియై, కర్ణాభరణముల బరువుకు ఎర్రబడిన చెవులు కలది, యౌవనవతియై తాపసియైన ఒక బాలికామణి ప్రకాశించుచున్నది.

దంతాదంతిప్రకటనకరీ దంతిభిర్మందయానైః
మందారాణాం మదపరిణతిం మథ్నతీ మందహాసైః ।
అంకూరాభ్యాం మనసిజతరోరంకితోరాః కుచాభ్యా-
మంతఃకాంచి స్ఫురతి జగతామాదిమా కాపి మాతా ॥79॥

తన మందగమనముతో గజములతో పోటీపడుతూ, తన చల్లని చిరునవ్వులతో మందార పుష్పములకు గర్వభంగము చేస్తూ, మన్మధ వృక్షమునకు చక్కగా అమరిన వక్షస్థలముతో, అమ్మలను కన్న అమ్మ కాంచీపురములో స్థితురాలై ఉన్నది.

త్రియంబకకుటుంబినీం త్రిపురసుందరీమిందిరాం
పులిందపతిసుందరీం త్రిపురభైరవీం భారతీమ్ ।
మతంగకులనాయికాం మహిషమర్దనీం మాతృకాం
భణంతి విబుధోత్తమా విహృతిమేవ కామాక్షి తే ॥80॥

అమ్మా! కామాక్షీ! నీవు త్రిలోచన కుటుంబినివి. త్రిపుర సుందరివి. పండితులచే ఇందిర, పులిందిని, త్రిపుర భైరవి, భారతి, మాతంగి, మహిషమర్దినీ, మాతృక అని కీర్తింపబడే మాత మమ్ములను కరుణించుగాక.

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top