స్తోత్రాలకు తెలుగులో అర్థం » మూక పంచశతి స్తుతి శతకం 81-90 శ్లోకాలు
మూక పంచశతి స్తుతి శతకం 81-90 శ్లోకాలు | Kamakshi Devi Stotram Telugu

మూక పంచశతి స్తుతి శతకం 81-90 శ్లోకాలు

మూక పంచశతి స్తుతిశతకం అనేది కామాక్షీ అమ్మవారిని స్తుతిస్తూ రచించిన అత్యంత పవిత్రమైన స్తోత్రాలలో ఒకటి. దీనిని మహా భక్తుడు మూక కవి రచించారు. ఆయనకు కామాక్షీ దేవి కటాక్షంతో వాక్చాతుర్యం లభించి ఈ దివ్యమైన శ్లోకాలను రచించినట్లు పురాణ కథనం చెబుతుంది. మూక పంచశతి మొత్తం 500 శ్లోకాలతో ఉండి ఐదు శతకాలుగా విభజించబడింది. అందులో స్తుతిశతకం దేవిని స్తుతించే భాగంగా ఎంతో ప్రసిద్ధి పొందింది.

ఈ స్తుతిశతకం పఠించడం వల్ల విద్య, వాక్పటిమ, ఐశ్వర్యం, మనశ్శాంతి మరియు దేవి అనుగ్రహం లభిస్తాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా కామాక్షి దేవి కృప పొందేందుకు ఈ స్తోత్రాన్ని భక్తితో పఠిస్తారు. ప్రతిరోజూ ఈ శ్లోకాలను పఠించడం వల్ల భక్తి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగుతాయని విశ్వాసం.

మహామునిమనోనటీ మహితరమ్యకంపాతటీ-
కుటీరకవిహారిణీ కుటిలబోధసంహారిణీ ।
సదా భవతు కామినీ సకలదేహినాం స్వామినీ
కృపాతిశయకింకరీ మమ విభూతయే శాంకరీ ॥81॥

గొప్పవారైన మునుల హృదయములో నటించునది, కంపానదీ తీరమందున్న కుటీరములలో సంచరించునది, మోహమును పారద్రోలునదీ, ఈ సమస్త జగత్తును సృష్టించినది, అత్యంత దయతో శుభములు ప్రసాదించునదీ అయిన కామాక్షీ దేవి నాకు ఐశ్వర్యమును ప్రసాదించుగాక.

జడాః ప్రకృతినిర్ధనా జనవిలోచనారుంతుదా
నరా జనని వీక్షణం క్షణమవాప్య కామాక్షి తే ।
వచస్సు మధుమాధురీం ప్రకటయంతి పౌరందరీ-
విభూతిషు విడంబనాం వపుషి మాన్మథీం ప్రక్రియామ్ ॥82॥

అమ్మా! నీ కరుణారస చూపులు ప్రసరించినట్లయితే, మందబుద్ధి కలవారు జ్ఞానులుగాను, దరిద్రులు ఐశ్వర్యవంతులుగాను, కురూపులు మన్మధుని మించిన సుందరాకారులుగానూ మారుతారు. దీని అర్థం ఏమిటంటే అమ్మా! జ్ఞానము, ఐశ్వర్యము, రూపము అన్ని కూడా నీ కటాక్షమువలననే లభిస్తాయి.

ఘన్సతనతటస్ఫుటస్ఫురితకంచులీచంచలీ-
కృతత్రిపురశాసనా సుజనశీలితోపాసనా ।
దృశోః సరణిమశ్నుతే మమ కదా ను కాంచీపురే
పరా పరమయోగినాం మనసి చిత్కలా పుష్కలా ॥83॥

అమ్మా! నీ మాతృస్థానములను ప్రకాశపరిచే కంచుకమును ధరించి, ఈశ్వరుని చలింపజేసి, సజ్జనులచే ఆరాధింపబడుతూ, యోగి జనుల హృదయములలో వెలిగే చైతన్యమై, కాంచీపురములో ప్రకాశిస్తున్న నీవు నా నేత్రములకు ఎప్పుడు దర్శనమిస్తావో కదా.

కవీంద్రహృదయేచరీ పరిగృహీతకాంచీపురీ
నిరూఢకరుణాఝరీ నిఖిలలోకరక్షాకరీ ।
మనఃపథదవీయసీ మదనశాసనప్రేయసీ
మహాగుణగరీయసీ మమ దృశోఽస్తు నేదీయసీ ॥84॥

కవివరేణ్యుల హృదయములో ప్రవాహమువలే సంచరించునది, కాంచీపురమే తన గృహసీమయైనది, దయారస ప్రవాహమైనది, సకల లోక రక్షిణీ, వర్ణనాతీతమైనది, ఈశ్వరుని దేవేరి, ఉత్తమ గుణ సంపన్న అయిన మాత నాకు ప్రత్యక్షమగునుగాక.

ధనేన న రమామహే ఖలజనాన్న సేవామహే
న చాపలమయామహే భవభయాన్న దూయామహే ।
స్థిరాం తనుమహేతరాం మనసి కిం చ కాంచీరత-
స్మరాంతకకుటుంబినీ చరణపల్లవోపాసనామ్ ॥85॥

అమ్మా! నాకు ధనవాంఛ లేదు. చెడ్డవారిని నేను సేవించను, నాకు చాంచల్యము లేదు. సంసార మోహము అసలే లేదు. కాంచీపురములో వెలసిన లేత చిగురుటాకుల వంటి కామాక్షీదేవి పాదములను సేవించుటయందే నా మనసు ఏకాగ్రత కలిగి ఉన్నది.

సురాః పరిజనా వపుర్మనసిజాయ వైరాయతే
త్రివిష్టపనితంబినీకుచతటీ చ కేలీగిరిః ।
గిరః సురభయో వయస్తరుణిమా దరిద్రస్య చ
కటాక్షసరణౌ క్షణం నిపతితస్య కామాక్షి తే ॥86॥

జగన్మాతా! నీ క్రీగంటి చూపులు ఎవరిపై ప్రసరిస్తాయో, వారికి దేవతలుకూడా సేవకులౌతారు. అటువంటి వారు, మన్మధునికంటే ఎక్కువ శరీర సౌందర్యము, ఇహ లోకమునందు, పరలోకమునందు సౌఖ్యములు, శాశ్వతమైన కీర్తి పొందుతారు.

పవిత్రయ జగత్రయీవిబుధబోధజీవాతుభిః
పురత్రయవిమర్దినః పులకకంచులీదాయిభిః ।
భవక్షయవిచక్షణైః వ్యసనమోక్షణైర్వీక్షణైః
నిరక్షరశిరోమణిం కరుణయైవ కామాక్షి మామ్ ॥87॥

అమ్మా! కామాక్షీ! నీ చల్లని చూపులు మూడు లోకములలోని వారికి జ్ఞానమును ప్రసాదిస్తాయి. ఈశ్వరునకు ఆనంద దాయకములు. సంసార సాగరమును దాటగల వివేక జ్ఞానమును కలిగించునవి, దురలవాట్లను పారద్రోలునవి అయిన నీ కరుణారస దృష్టి, నన్ను పవిత్రుని చేయుగాక.

కదా కలితఖేలనాః కరుణయైవ కాంచీపురే
కలాయముకులత్విషః శుభకదంబపూర్ణాంకురాః ।
పయోధరభరాలసాః కవిజనేషు తే బంధురాః
పచేలిమకృపారసాః పరిపతంతి మార్గే దృశోః ॥88॥

మాతా! సమస్త లోకములను రక్షించే ఉద్దేశ్యముతో కాంచీపురములో నీవు అనేక విలాసములు చూపుతున్నావు. ఇరుగుడు పుష్పముల కాంతితో, నల్లనైన శరీర శోభతో, కవులలోని కవిత్వ కాంతితో, దయాపూర్ణమైన చూపులతో ఉన్న నీవు నాకెప్పుడు దర్శనమిస్తావు తల్లీ!

అశోధ్యమచలోద్భవం హృదయనందనం దేహినాం
అనర్ఘమధికాంచి తత్కిమపి రత్నముద్ద్యోతతే ।
అనేన సమలంకృతా జయతి శంకరాంకస్థలీ
కదాస్య మమ మానసం వ్రజతి పేటికావిభ్రమమ్ ॥89॥

పరిశుద్ధ స్వరూపిణి, ఆనందదాయిని, కాంచీపురములో వెలసిన ఒక అమూల్య రత్నము- ఈశ్వరుని వామ భాగములో నిలచి ఆ భాగమును కాంతివంతము చేయుచున్నది. అటువంటి మణి నా హృదయము అనే పెట్టెలో ఎప్పుడు భద్రమవుతుందో కదా.

పరామృతఝరీప్లుతా జయతి నిత్యమంతశ్చరీ
భువామపి బహిశ్చరీ పరమసంవిదేకాత్మికా ।
మహద్భిరపరోక్షితా సతతమేవ కాంచీపురే
మమాన్వహమహంమతిర్మనసి భాతు మాహేశ్వరీ ॥90॥

అమృత ధారలతో పూర్తిగా తడిసినది, సమస్త జగత్తుకు ఆవలా – ఈవలా కూడా వ్యాపించి ఉన్నది, జ్ఞాన స్వరూపిణీ, అందరిలో ఆత్మస్వరూపమై నిలచినది, కాంచీ నగరములో దర్శనమిచ్చునది, బ్రహ్మస్వరూపిణి అయిన మాత నాలో ఎల్లప్పుడు ప్రకాశించుగాక.

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top