స్తోత్రాలకు తెలుగులో అర్థం » శివానందలహరి 31-40 శ్లోకాలు

శివానందలహరి 31-40 శ్లోకాలు

శివానందలహరి అనేది ఆది శంకరాచార్యులు రచించిన భక్తి ప్రధాన స్తోత్రం, ఇందులో పరమశివుడుపై ఉన్న ఆత్మీయ భక్తి, తత్త్వజ్ఞానం అద్భుతంగా ప్రతిఫలిస్తుంది. ఈ స్తోత్రం 100 శ్లోకాలతో కూడి, భక్తుడు మరియు శివుని మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని వివరంగా తెలియజేస్తుంది. శైవ సంప్రదాయంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన గ్రంథంగా భావించబడుతుంది.

శివానందలహరి పఠించడం వల్ల మనస్సుకు శాంతి, ఆత్మశుద్ధి, ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతాయి. భక్తితో జపించడం ద్వారా పాపాలు తొలగి, శివుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇది భక్తి మార్గంలో నడిపిస్తూ జీవితం సార్థకం చేయడంలో సహాయపడుతుంది.

సంస్కృత శ్లోకము – 31

నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే
పశ్యన్ కుక్షిగతాంశ్చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుమ్ ।
సర్వామర్త్య పలాయనౌషధ మతిజ్వాలాకరం భీకరం
నిక్షిప్తం గరళం గళే న గళితం నోద్గీర్ణమేవ త్వయా ॥ 31 ॥

తాత్పర్యము

నిఖిలలోక భయంకరమై, సంతాపకరమైన కాలకూటవిషమును చూచి, భయపడి పారిపోవు దేవతలను ఊరడించుటకుగాను, నీ కంఠమందే ఉంచుకొని ఉమియక, మింగక కడుపులోని వారికి, వెలుపలి వారికి, బాధ కలుగకుండా మహోపకారమొనర్చితివి. దేవా! నీ మహిమ తెలియుటకు ఈ దృష్టాంతమొక్కటి చాలదా?

సంస్కృత శ్లోకము – 32

జ్వాలోగ్రః సకలామరాతిభయదః క్ష్వేళః కథం వా త్వయా
దృష్టః కిం చ కరే ధృతః కరతలే కిం పక్వజంబూ ఫలమ్ ।
జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికా వా కంఠదేశే భృతః
కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వద ॥ 32 ॥

తాత్పర్యము

తీవ్రజ్వాలలు కమ్ముచూ, సకల దేవతలకు భయంకరమైన ఈ కాలకూటవిషమును, కన్నులతో చూచుటయేకాక, చేతితో ఎత్తి అరచేతిలో ఉంచుకొంటివి. అది నేరేడు పండాయేమి? ఇదికాక నాలుకమీద వేసికొంటివి. అది సకలసిద్ధికారి అగు ఔషధమా ఏమి? కంఠమందు ఉంచుకొంటివి అది ఇంద్రనీలమణియా ఏమి? చెప్పుము.

సంస్కృత శ్లోకము – 33

నాలం వా సకృదేవ దేవ భవతః సేవా నతిర్వా నుతిః
పూజా వా స్మరణం కథా శ్రవణమప్యాలోకనం మాదృశామ్ ।
స్వామిన్నస్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే
కా వా ముక్తిరితః కుతో భవతి చేత్కిం ప్రార్థనీయం తదా ॥ 33 ॥

తాత్పర్యము

ఓ స్వామీ! నమస్కారము. స్తోత్రము, స్మరణము మొదలగు నీ సేవలయందు ఒక్కొక్కటి మోక్షమునకు గొప్ప సాధనములు. ఈ ఉపాయములను వీడి వేరుగా మోక్షము లేదు. అస్థిరులైన ఇతర దేవతలను అనుసరించి ఏమి లాభము? వారిని కోరదగినది ఏమి ఉన్నది?

సంస్కృత శ్లోకము – 34

కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవద్
ధైర్యం చేదృశమాత్మనః స్థితిరియం చాన్యైః కథం లభ్యతే ।
భ్రశ్యద్దేవగణం త్రసన్ మునిగణం నశ్యత్ప్రపంచం లయం
పశ్యన్నిర్భయ ఏక ఏవ విహరత్యానంద సాంద్రో భవాన్ ॥ 34 ॥

తాత్పర్యము

భూతనాథా! ఏమి నీ సాహసము? ఏమి నీ ధైర్యము? మరెవ్వరైనా ఇట్లు నిలిచి ఉండగలరా? నిరాశతో దేవతలందరూ అటూ ఇటూ పారిపోతూ ఉండగా, మునులందరూ భయకంపితులగుచుండగా, తుదకు ప్రపంచమంతా నశించిపోవుచుండగా – నీవొక్కడవే కదా నిర్భయుడవై మహాప్రళయమందు భీతిలేక విలసిల్లుచుంటివి.

సంస్కృత శ్లోకము – 35

యోగక్షేమ ధురంధరస్య సకల శ్రేయఃప్రదోద్యోగినో
దృష్టా దృష్టమతోపదేశకృతినో బాహ్యాంతరవ్యాపినః ।
సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా
శంభో త్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహమ్ ॥ 35 ॥

తాత్పర్యము

శివా! ప్రజల యోగక్షేమభారము వహించుట, సకలశ్రేయస్సులొసంగుట, వివిధ సాధనోపాయములను ఉపదేశించుట, అందరినీ దయతో చూచుట, సర్వజ్ఞత్వము అన్ని చోట్లా నిండి ఉండుట నీ గుణములు గదా! నీవే నాకు పరమ ఆప్తుడవని ఎల్లవేళలా తలచెదను. అదే నాకు శ్రేయస్కరమగుగాక!

సంస్కృత శ్లోకము – 36

భక్తో భక్తిగుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః
కుంభే సాంబ తవాంఘ్రిపల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలమ్ ।
సత్వం మంత్రముదీరయన్ నిజశరీరాగార శుద్ధిం వహన్
పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్ ॥ 36 ॥

తాత్పర్యము

సాంబశివా! నా శరీరమను గృహమును శుభ్రపరచుకొని, మనస్సునకు ఇంపైన కల్యాణము చేయబూని, భక్తి అను దారములను చుట్టి, సంతోషమను నీటితో నింపిన నా మనస్సను కలశమున నీ చరణపల్లవములను, జ్ఞానమను కొబ్బరి బొండమును చేర్చి, కలశస్థాపనచేసి, మంత్రపూర్వక పుణ్యాహవచనము- భక్తితో ఆచరింతును.

సంస్కృత శ్లోకము – 37

ఆమ్నాయాంబుధిం  ఆమాదరేణ సుమనఃసంఘాః సముద్యన్మనో
మంథానం దృఢభక్తి రజ్జుసహితం కృత్వా మథిత్వా తతః ।
సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం
నిత్యానందసుధాం నిరంతర రమా సౌభాగ్యమాతన్వతే ॥ 37 ॥

తాత్పర్యము

దేవతలు మందర పర్వతమును కవ్వముగా చేసి, సముద్రమును మధించి- కల్పవృక్షము, కామధేనువు, చింతామణి, అమృతము, చంద్రుడు మొదలైన వాటిని సంపాదించినట్లు, విద్వాంసులు తమ మనస్సును కవ్వముగా చేసి, భక్తి అను తాడు కట్టి, వేదములనే మహాసముద్రమును మధించి, దాని నుండి కల్పతరువు, కామధేనువు, చింతామణుల వంటి వాడూ, నిత్యానంద స్వరూపుడూ, మోక్షలక్ష్మీ స్వరూపుడు అగు సోమేశ్వరుని సాధించుచున్నారు.

సంస్కృత శ్లోకము – 38

ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తిః ప్రసన్నః శివః
సోమః సద్గుణసేవితో మృగధరః పూర్ణస్తమో మోచకః ।
చేతః పుష్కరలక్షితో భవతి చేదానంద పాథోనిధిః
ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే ॥ 38 ॥

తాత్పర్యము

పూర్వపుణ్యమనే పర్వతము యొక్క మార్గమున, తూర్పుదిక్కున గల పుణ్యోదయ పర్వతము మీదుగా చూపబడినట్టి అమృతమయమైన ఆకృతి కలవాడు, నిర్మలుడు, సజ్జనులచే సేవింపబడువాడు, లేడినిదాల్చినవాడు, పూర్ణుడు, చీకటిని పారద్రోలు వాడు అగు శివుడు అనే చంద్రుడు, హృదయము అనే ఆకాశమున చూడబడినచో, ఆనందము అనే సముద్రము ఉప్పొంగును. అప్పుడు సజ్జనుల చిత్తము రంజిల్లును.

సంస్కృత శ్లోకము – 39

ధర్మో మే చతురంఘ్రికః సుచరితః పాపం వినాశం గతం
కామక్రోధ మదాదయో విగళితాః కాలాః సుఖావిష్కృతాః ।
జ్ఞానానందమహౌషధిః సుఫలితా కైవల్యనాథే సదా
మాన్యే మానసపుండరీకనగరే రాజావతంసే స్థితే ॥ 39 ॥

తాత్పర్యము

ధార్మికుడైన రాజు స్వతంత్రుడై నగరమందుండి పరిపాలించుచుండగా, దోషములు పోయి భూమి ఫలవంతమై సర్వసమృద్ది కలిగినట్లు, నా హృదయ కమలమందు పరమేశ్వరుడు మోక్షాధినాథుడై నివసించియుండగా, నాకు కామ, క్రోధ, మోహ, మదమాత్సర్యములు తొలగిపోయి, జ్ఞాన సాధనములనే ఓషధులు ఫలించి, సదా సుఖము కలిగినది.

సంస్కృత శ్లోకము – 40

ధీయంత్రేణ వచోఘటేన కవితా కుల్యోపకుల్యాక్రమైః
ఆనీతైశ్చ సదాశివస్య చరితాంభో రాశి దివ్యామృతైః ।
హృత్కేదార యుతాశ్చ భక్తికలమాః సాఫల్యమాతన్వతే
దుర్భిక్షాన్మమ సేవకస్య భగవన్విశ్వేశ భీతిః కుతః ॥ 40 ॥

తాత్పర్యము

శివా! నీ చరిత్రయను మహాసముద్రములోని దివ్యామృతము, కవిత్వమను కాలువలు, పిల్లకాలువలు మొదలగు వాని గుండా వాక్కు అనే బొక్కెనతో, నా బుద్ధియను మోట వలన, హృదయమను పొలము లోనికి ప్రవహించి, భక్తి అను పైరును ఫలవంతముగా చేయుచున్నది. ఇంక ఎంత కరవు వచ్చినా నాకేమి భయము?

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top