శ్రీ నరసింహ కవచం
“శ్రీ నరసింహ కవచం” అనేది భగవాన్ నరసింహ స్వామిని స్తుతించే శక్తివంతమైన రక్షా స్తోత్రం. ఇది పురాణాలలో ప్రహ్లాదుడు పఠించిన దివ్య కవచంగా ప్రసిద్ధి చెందింది. ఈ స్తోత్రంలో నరసింహుడి ఉగ్ర రూపం, భక్తులను కాపాడే శక్తి, దుష్ట శక్తులను నాశనం చేసే మహిమ వర్ణించబడుతుంది.
ఈ కవచాన్ని భక్తితో పఠించడం వల్ల భయం తొలగి, శత్రు బాధలు తగ్గి, ఆధ్యాత్మిక రక్షణ లభిస్తుందని విశ్వాసం. నరసింహ కవచం మనస్సుకు ధైర్యం, శాంతి మరియు దైవ కృపను అందిస్తుంది.
నృసింహకవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా ।
సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనమ్ ॥ 1 ॥
పూర్వము ప్రహ్లాదునిచే స్తుతించబడి అతి పవిత్రమైన, అన్ని ఆటంకాలను తొలగించే, సమస్త రక్షణను ప్రసాదించే శ్రీ నృసింహ కవచాన్ని స్మరిస్తున్నాను.
సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకమ్ ।
ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితమ్ ॥ 2 ॥
ఇహలోకంలో అన్ని ఐశ్వర్యాలను ప్రసాదించి, పరంలో స్వర్గలోక ప్రాప్తిని ప్రసాదించే సమస్త విశ్వానికి నాధుడైన, స్వర్ణసింహాసనమును అధిరోహించిన శ్రీనృసింహ కవచాన్ని స్మరిస్తున్నాను.
వివృతాస్యం త్రినయనం శరదిందుసమప్రభమ్ ।
లక్ష్మ్యాలింగితవామాంగం విభూతిభిరుపాశ్రితమ్ ॥ 3 ॥
నోరు పూర్తిగా తెరువబడి, త్రినేత్రుడై, శరదృతువులోని చంద్రునివలె ప్రకాశవంతుడై, వామ హస్తంతో లక్ష్మీ దేవిని ఆలింగనం చేసుకుని, ప్రాపంచిక, ఆధ్యాత్మిక సంపదలకు నిలయ రూపమైన శ్రీ నృసింహ కవచాన్ని స్మరిస్తున్నాను.
చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండలశోభితమ్ ।
సరోజశోభితోరస్కం రత్నకేయూరముద్రితమ్ ॥ 4 ॥ [రత్నకేయూరశోభితం]
చతుర్భుజుడై, మృదువైన అంగములు కలవాడై, స్వర్ణ కర్ణాభరణాలను ధరించి, వజ్రములతో కూర్చబడిన హస్తాభరణములు ధరించిన స్వామి యొక్క నృసింహ కవచాన్ని స్మరిస్తున్నాను.
తప్తకాంచనసంకాశం పీతనిర్మలవాసనమ్ ।
ఇంద్రాదిసురమౌళిస్థస్ఫురన్మాణిక్యదీప్తిభిః ॥ 5 ॥
కరిగించిన బంగారముతో చేసినట్టున్న మచ్చలేని పీతాంబరములను ధరించి, నిజమైన అస్తిత్వము కలవాడై, ఈ ప్రాపంచిక గోళానికి ఆవల ఉండి, ఇంద్రాదులచే స్తుతించబడుతున్న స్వామి యొక్క నృసింహ కవచాన్ని స్మరిస్తున్నాను.
విరాజితపదద్వంద్వం శంఖచక్రాదిహేతిభిః ।
గరుత్మతా సవినయం స్తూయమానం ముదాన్వితమ్ ॥ 6 ॥
ఆకర్షణీయమైన పాద పద్మములు కలవాడై, హస్తములలో శంఖము, చక్రము, మొదలైన వివిధ ఆయుధములు ధరించి, అత్యంత భక్తితో గరుత్మంతుడు ప్రార్థించే స్వామి యొక్క నృసింహ కవచాన్ని స్మరిస్తున్నాను.
స్వహృత్కమలసంవాసం కృత్వా తు కవచం పఠేత్ ।
నృసింహో మే శిరః పాతు లోకరక్షాత్మసంభవః ॥ 7 ॥
మన హృదయ పీఠంపై ఆసీనుడైన శ్రీ నృసింహ దేవుని, “అన్ని గ్రహములను రక్షించే నారసింహుడు నా శిరస్సును రక్షించుగాక” అని ప్రార్ధించాలి.
సర్వగోఽపి స్తంభవాసః ఫాలం మే రక్షతు ధ్వనిమ్ ।
నృసింహో మే దృశౌ పాతు సోమసూర్యాగ్నిలోచనః ॥ 8 ॥
ఈ విశ్వమంతా వ్యాపించిన నృసింహుడు పూర్వం ఒక స్తంభంలో దాక్కున్నాడు. అటువంటి దేవుడు నా వాక్కును, నేను చేసే కార్యములయొక్క ఫలితములను నిర్దేశించుగాక. సూర్యచంద్రులు నేత్రములుగా కలిగిన స్వామి నా నేత్రములను రక్షించుగాక.
స్మృతిం మే పాతు నృహరిర్మునివర్యస్తుతిప్రియః ।
సాం మే సింహనాసస్తు ముఖం లక్ష్మీముఖప్రియః ॥ 9 ॥
మునుల స్తుతులచే సంతుష్టుడైన నృసింహుడు నా జ్ఞాపక శక్తిని రక్షించుగాక. సింహనాసికను కలిగినవాడు నా నాసికను, అదృష్ట దేవత ముఖంగా కలిగినవాడు నా నోటిని రక్షించుగాక.
సర్వవిద్యాధిపః పాతు నృసింహో రసనాం మమ ।
వక్త్రం పాత్విందువదనః సదా ప్రహ్లాదవందితః ॥ 10 ॥
అన్ని శాస్త్రములు తన స్వరూపుడైన నృసింహుడు నా రుచి యొక్క భావాన్ని, పూర్ణ చంద్రునివలె సుందరమైన ముఖము కలిగి, ప్రహ్లాదునిచే స్తుతించబడిన స్వామి నా ముఖమును రక్షించుగాక.
నృసింహః పాతు మే కంఠం స్కంధౌ భూభరణాంతకృత్ ।
దివ్యాస్త్రశోభితభుజో నృసింహః పాతు మే భుజౌ ॥ 11 ॥
నృసింహుడు నా గళమును రక్షించుగాక. సమస్త భూమండలాన్ని భరించి అనేక ఆయుధములను హస్తములందు ధరించి, అద్భుతమైన మహిమలను వ్యక్తపరిచే స్వామి నా భుజములను రక్షించుగాక.
కరౌ మే దేవవరదో నృసింహః పాతు సర్వతః ।
హృదయం యోగిసాధ్యశ్చ నివాసం పాతు మే హరిః ॥ 12 ॥
దేవతలకు ఆశీస్సులు అందించే నారసింహుడు నా హస్తములను, నన్ను అన్ని వైపుల నుండి రక్షించుగాక. యోగిపుంగవులు దర్శించగలిగిన స్వామి నా హృదయమును, శ్రీహరి నా నివాసమును రక్షించుగాక.
మధ్యం పాతు హిరణ్యాక్షవక్షఃకుక్షివిదారణః ।
నాభిం మే పాతు నృహరిః స్వనాభి బ్రహ్మసంస్తుతః ॥ 13 ॥
హిరణ్యాక్షుని హృదయ, ఉదర భాగములను చీల్చిన నారసింహుడు నా వక్ష భాగమును రక్షించుగాక. నాభి భాగమునుండి ఉద్భవించిన బ్రహ్మ కలిగిన నరహరి నా నాభి భాగమును రక్షించుగాక.
బ్రహ్మాండకోటయః కట్యాం యస్యాసౌ పాతు మే కటిమ్ ।
హ్యం మే పాతు గుహ్యానాం మంత్రాణాం గుహ్యరూపధృక్ ॥ 14 ॥
మంత్ర తంత్ర స్వరూపుడై సూక్ష్మ దృష్టికి కనిపించని వాడు ఎవరో, ఎవని తొడలపై ఈ సమస్త విశ్వం స్థిరమై ఉంటుందో ఆ స్వామి నా కటి భాగమును, నా గుహ్య భాగములను రక్షించుగాక.
ఊరూ మనోభవః పాతు జానునీ నరరూపధృక్ ।
జంఘే పాతు ధరాభారహర్తా యోఽసౌ నృకేసరీ ॥ 15 ॥
సహజ ప్రేమ స్వరూపుడైన స్వామి నా ఊరువులను, మానవ శరీరము కలిగిన వాడు నా జానువులను, నరమృగ స్వరూపుడై, భూభారమును తగ్గించే స్వామి నా కాళ్ళను రక్షించుగాక.
సురరాజ్యప్రదః పాతు పాదౌ మే నృహరీశ్వరః ।
సహస్రశీర్షా పురుషః పాతు మే సర్వశస్తనుమ్ ॥ 16 ॥
స్వర్గ ప్రాప్తిని ప్రసాదించే స్వామి నా పాదములను, నరమృగ శరీరంతో అనేక శిరస్సులతో జగన్నాథుడైన నృసింహుడు నా శరీరమును అన్ని విధములుగా, అన్ని వైపులనుండి రక్షించుగాక.
మహోగ్రః పూర్వతః పాతు మహావీరాగ్రజోఽగ్నితః ।
మహావిష్ణుర్దక్షిణే తు మహాజ్వాలస్తు నైరృతౌ ॥ 17 ॥
మహోగ్ర స్వరూపుడైన నృసింహుడు తూర్పు దిక్కు నుండి, దేవాధి దేవుడు ఆగ్నేయము నుండి, విష్ణు భగవానుడు దక్షిణ దిక్కు నుండి, మెరుపులా ప్రకాశించే స్వామి నైఋతి దిక్కు నుండి నన్ను రక్షించుగాక.
పశ్చిమే పాతు సర్వేశో దిశి మే సర్వతోముఖః ।
నృసింహః పాతు వాయవ్యాం సౌమ్యాం భూషణవిగ్రహః ॥ 18 ॥
సకల స్వరూపుడై అన్ని దిక్కులను దర్శించగలిగిన దేవుడు పశ్చిమ దిక్కు నుండి, నృసింహుడు వాయవ్య దిక్కునుండి, దివ్య జ్యోతి స్వరూపుడు ఉత్తర దిక్కు నుండి నన్ను రక్షించుగాక.
ఈశాన్యాం పాతు భద్రో మే సర్వమంగళదాయకః ।
సంసారభయదః పాతు మృత్యోర్మృత్యుర్నృకేసరీ ॥ 19 ॥
అత్యంత పవిత్రుడై పవిత్రతను ప్రసాదించే స్వామి సూర్యునకు నెలవైన ఈశాన్య దిక్కునుండి, మృత్యు స్వరూపుడైన నృసింహుడు నన్ను ఈ జనన మరణ చక్రమునుండి తప్పించుగాక.
ఇదం నృసింహకవచం ప్రహ్లాదముఖమండితమ్ ।
భక్తిమాన్యః పఠేన్నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే ॥ 20 ॥
ప్రహ్లాదునిచే స్తుతించబడిన ఈ నృసింహ కవచమును పఠించినవారు అన్ని పాపములనుండి విముక్తులవుతారు.
పుత్రవాన్ ధనవాన్ లోకే దీర్ఘాయురుపజాయతే ।
యం యం కామయతే కామం తం తం ప్రాప్నోత్యసంశయమ్ ॥ 21 ॥
ఐశ్వర్యము, సంతానం, సౌభాగ్యం, దీర్ఘాయుష్షు మొదలైన అన్ని కోరికలను నిస్సందేహంగా తీర్చే శక్తి ఈ స్తోత్రానికి ఉంది.
సర్వత్ర జయమాప్నోతి సర్వత్ర విజయీ భవేత్ ।
భూమ్యంతరిక్షదివ్యానాం గ్రహాణాం వినివారణమ్ ॥ 22 ॥
జయాన్ని కాంక్షించే వారు విజేతలవుతారు. భూ, గ్రహ, స్వర్గలోక ప్రభావములనుండి బయట పడతారు.
వృశ్చికోరగసంభూతవిషాపహరణం పరమ్ ।
హ్మరాక్షసయక్షాణాం దూరోత్సారణకారణమ్ ॥ 23 ॥
విషపూరిత సర్పాలు, తేళ్ళు, బ్రహ్మ రాక్షసులు, యక్షుల బారినుండి రక్షించబడతారు.
భూర్జే వా తాళపత్రే వా కవచం లిఖితం శుభమ్ ।
రమూలే ధృతం యేన సిధ్యేయుః కర్మసిద్ధయః ॥ 24 ॥
తన చేతులపైన లిఖించినా, తాళపత్రాలపైన ఈ స్తోత్రాన్ని లిఖించి దానిని చేతికి ధరించినా, వారికి కార్య సిద్ధి నిశ్చయంగా కలుగుతుంది.
దేవాసురమనుష్యేషు స్వం స్వమేవ జయం లభేత్ ।
ఏకసంధ్యం త్రిసంధ్యం వా యః పఠేన్నియతో నరః ॥ 25 ॥
ప్రతి రోజు ఒక సారి గాని, మూడు సార్లు గాని ఈ స్తోత్రాన్ని మనఃపూర్తిగా పఠించే వారు మనుషులతోను, దేవతలతోను, రాక్షసులతోను కూడా విజయులవుతారు.
సర్వమంగళమాంగళ్యం భుక్తిం ముక్తిం చ విందతి ।
ద్వాత్రింశతిసహస్రాణి పఠేచ్ఛుద్ధాత్మనాం నృణామ్ ॥ 26 ॥
పవిత్రమయిన మనసుతో 32,000 సార్లు ఈ స్తోత్రాన్ని పఠించిన వారు అతి పవిత్రతను పొంది ప్రాపంచిక సుఖ భోగాలను పొందటమే కాక తదనంతరం ముక్తిని నిశ్చయంగా పొందుతారు.
కవచస్యాస్య మంత్రస్య మంత్రసిద్ధిః ప్రజాయతే ।
అనేన మంత్రరాజేన కృత్వా భస్మాభిమంత్రణమ్ ॥ 27 ॥
ఈ కవచ మంత్రము, అన్ని మంత్రములకు రాజు. ఇతర మంత్రాలను స్మరించి భస్మాభిషేకాన్ని పొందిన వానితో అనగా శివునితో సమానుడౌతాడు.
తిలకం విన్యసేద్యస్తు తస్య గ్రహభయం హరేత్ ।
త్రివారం జపమానస్తు దత్తం వార్యభిమంత్ర్య చ ॥ 28 ॥
నుదుట తిలకాన్ని ధరించి, నీటితో ఆచమనం చేసి ఈ కవచ మంత్రాన్ని మూడు సార్లు పఠిస్తే వారు గ్రహ సంబంధమైన అన్ని పీడల నుండి విముక్తులవుతారు.
ప్రాశయేద్యో నరో మంత్రం నృసింహధ్యానమాచరేత్ ।
తస్య రోగాః ప్రణశ్యంతి యే చ స్యుః కుక్షిసంభవాః ॥ 29 ॥
నృసింహదేవునిపై మనసు నిల్పి ఈ కవచ మంత్రాన్ని పఠించినవారు అన్ని రోగ బాధలనుండి విముక్తులవుతారు.
కిమత్ర బహునోక్తేన నృసింహసదృశో భవేత్ ।
మనసా చింతితం యత్తు స తచ్చాప్నోత్యసంశయమ్ ॥ 30 ॥
మనసులో నారసింహ స్వామిని (దర్శిస్తూ) స్మరిస్తూ ఈ స్తోత్రాన్ని పఠించినవారు నిస్సందేహంగా నారసింహ స్వరూపాన్ని పొందుతారు.
గర్జంతం గర్జయంతం నిజభుజపటలం స్ఫోటయంతం హఠంతం
రూప్యంతం తాపయంతం దివి భువి దితిజం క్షేపయంతం క్షిపంతమ్ ।
క్రందంతం రోషయంతం దిశి దిశి సతతం సంహరంతం భరంతం
వీక్షంతం ఘూర్ణయంతం శరనికరశతైర్దివ్యసింహం నమామి ॥
దుష్ట శక్తులపై అమిత కోపంతో విరుచుకుపడే నారసింహుడు ఈ విశ్వంలోని సద్గుణ సంపన్నులందరినీ తన అనేక చేతులతో కాపాడుతాడు. అటువంటి నారసింహునికి మనస్ఫూర్తిగా ప్రణమిల్లుతున్నాను.
ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ప్రహ్లాదోక్తం శ్రీ నృసింహ కవచమ్ ।




