రామాయణంభారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. ఈ వీడియొలో వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయంమ్ గురించి వివరంగా తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
శ్రీమద్రామాయణము.
బాలకాండ
ఒకసారి వాల్మీకి మహర్షి- దేవర్షి నారదుణ్ణి ఇలా అడిగాడు. “ఓ నారద మహర్షీ! ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు, పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు, చేసిన మేలు మరువని వాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు, గట్టి సంకల్పము కలవాడు, అన్ని విద్యలు నేర్చినవాడు, ఎల్లప్పుడూ ఆనందంతో తొణికిసలాడేవాడు, మొక్కవోని ధైర్యము కలవాడు, కోపము అంటే ఎరుగని వాడు, యుధ్ధరంగంలో దిగితే దేవతలకు కూడా భయపడని వాడు, ఇటువంటి సద్గుణములు కల మానవుడి గురించి వినాలని నాకు చాలా కుతూహలముగా ఉంది. దయచేసి అటువంటి లోకోత్తర పురుషుడిని గురించి నాకు తెలియజేయండి” అని వాల్మీకి మహర్షి నారదుణ్ణి అడిగాడు.
అప్పుడు నారదుడు వాల్మీకి మహర్షితో ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! నీవు చెప్పిన గుణములు సామాన్య మానవులలో సాధారణంగా కనిపించవు. కాని అటువంటి గుణములు కలిగిన ఒక మహాపురుషుడు ఉన్నాడు. ఆయన గురించి చెబుతాను. విను. ఈ భూమండలంలో ఇక్ష్వాకు వంశములో రాముడు అనే పేరు గల ఒక మహా పురుషుడు జన్మించాడు. ఆ రాముడు మహావీరుడు. బుద్ధిమంతుడు” అని రామాయణం మొత్తాన్ని సంక్షిప్త రామాయణంగా వాల్మీకి మహర్షికి వినిపించాడు.
తరువాత నారదుడు దేవలోకము వెళ్లిపోయాడు. వాల్మీకి మహర్షి తమసానది తీరానికి వెళ్ళి స్నానం చేయడానికి సంకల్పించాడు. అప్పుడు కొంచెం దూరంలో ఒక చెట్టు మీద విహరిస్తున్న క్రౌంచ పక్షుల జంటను చూచాడు. అంతలో ఒక బోయవాడు ఆ క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని తన బాణముతో నిర్దయగా కొట్టగా, అది రక్తం కారుతూ కింద పడిపోయింది. కింద పడిపోయిన మగపక్షిని చూచి ఆడపక్షి ఎంతో దుఃఖిస్తూ, దాని చుట్టూ తిరుగుతూ, దీనంగా ఏడుస్తూ ఉంది. ఏడుస్తున్న ఆ ఆడ పక్షిని చూశారు వాల్మీకి మహర్షి. ఆయన మనస్సు ద్రవించిపోయింది. వాల్మీకి మహర్షి ఆ బోయవానిని చూచి “ఓయీ బోయవాడా! నీవు మన్మధావస్థలో ఉన్న పక్షుల జంటలో ఒకదానిని చంపావు. కాబట్టి నీవు కూడా అల్పాయుష్కుడవు అవుదువుకాక! అన్నాడు.
తరువాత వాల్మీకి మహర్షి స్నానం చేసి, ఆశ్రమానికి వెళ్ళి ధ్యానంలో కూర్చున్నాడు. ఆ ధ్యానములో ఆయనకు ఇతర వాక్యాలు, కథలు స్ఫురించాయి. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. బ్రహ్మగారిని చూచి వాల్మీకి మహర్షి సంభ్రమంతో చేతులు జోడించి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశాడు.
బ్రహ్మ “ఓ వాల్మీకి మహర్షి! నీవు- పుణ్యప్రదము, మనస్సులను రమింపచేయునది అయిన రాముని చరితాన్ని శ్లోకరూపంలో కావ్యంగా రచించు. రాముడు ధర్మాత్ముడు. బుద్ధిమంతుడు. నారదుడు నీకు చెప్పిన రామ కథను సవిస్తరంగా రచించు. రాముడు, సీత, లక్ష్మణుడు, రాక్షసులు మొదలైన వారి గురించి నీకు తెలిసిన విషయాలూ, తెలియని విషయాలూ అన్నీ ఇప్పుడు నీకు స్పష్టంగా గోచరమవుతాయి. ఈ రామాయణ కావ్యంలో నీవు రాసిన ఏ ఒక్కమాట కూడా అసత్యము కాదు. ఈ చరాచర జగత్తు ఉన్నంత వరకూ, రామ చరిత ఈ లోకంలో నిలిచి ఉంటుంది. నీచే రచింపబడిన రామాయణ కావ్యం ఎంతకాలం ప్రచారంలో ఉంటుందో, అంతకాలమూ నేను సృష్టించిన సమస్త లోకాలలో నీవు నివసిస్తావు” అని పలికాడు బ్రహ్మదేవుడు. వాల్మీకి మహర్షి రామ చరితాన్ని ఉదారమైన పదాలతో, మనోహరములైన అక్షరాలతో కూర్చిన వందలాది శ్లోకాలలో రచించారు.
వాల్మీకి మహర్షి ఆచమనం చేసి తూర్పుదిక్కుగా ముఖం పెట్టి, దర్బాసనం మీద కూర్చుని, శ్రీరాముడిని మనసులో ధ్యానించాడు. తన తపోబలంతో ఆలోచించి- దశరథుడు, శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఏమేమి చేసారో, ఏమేమి మనసులో అనుకున్నారో, ఆలోచించారో, రాముడు, సీత ఏకాంతంగా ఉన్నప్పుడు ఏమేమి మాట్లాడుకున్నారో, ఎలా నవ్వుకున్నారో, రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురూ అడవులలో ఎక్కడెక్కడ తిరిగారో, ఎక్కడెక్కడ నివసించారో, ఆ విషయాలన్నింటినీ ఆమూలాగ్రంగా, యధాతథంగా తన యోగదృష్టితో చూశాడు వాల్మీకిమహర్షి.
మహాతపస్వి అయిన వాల్మీకికి రామ చరిత్ర అంతా స్పష్టంగా కనపడింది. రామచరిత్రను దర్శించిన తరువాత, తాను చూచినది చూసినట్టు, నాలుగు వురుషార్థములు అయిన ధర్మార్థకామమోక్షములలో, ధర్మము ఎక్కువ ప్రకాశించేటట్టు, నారదుడు చెప్పిన విషయాలు అన్నీ పొందుపరిచి, అందరికీ వినడానికి మనోహరంగా ఉండేటట్టు, రఘువంశ చరిత్ర అయిన రామాయణ మహాకావ్యాన్ని 24000 శ్లోకములలో, 500 సర్గలలో, ఆరు కాండలలో, రామ పట్టాభిషేకము, అశ్వమేధ యాగము వరకు రచించారు. తరువాత ఘట్టములను ఉత్తర కాండలో రచించారు. రామాయణ కథను చక్కగా పఠించగలవారు ఎవరా అని ఆలోచిస్తున్న వాల్మీకిమహర్షికి మునివేషధారులైన ఇద్దరు గాయకులు కనిపించారు. వారిపేర్లు కుశలవులు. వాల్మీకి మహర్షి తాను రచించిన రామాయణాన్ని ఆ కుశలవులకు ఉపదేశించారు. వాల్మీకి రచించిన రామ కథను, రామాయణము అనీ, సీతాచరితము అనీ, పౌలస్త్యవధ అనీ పిలుస్తారు. వాల్మీకిమహర్షి ఉపదేశించిన రామాయణాన్ని కుశలవులు శ్రావ్యమైన కంఠంతో, శృతిలయలు తప్పకుండా మృదుమధురంగా ఋషుల సమక్షంలో, బ్రాహ్మణుల సమక్షంలో, సభలలో గానం చేస్తున్నారు.
ఈ విషయము ఆ నోటా ఆనోటా శ్రీరాముని చెవికి చేరింది. శ్రీరాముడు కుశలవులను తన రాజభవనానికి పిలిపించి- తాను, తన సోదరులు, మంత్రులు ఉన్న సభలో రామాయణ గానం చెయ్యమని కుశలవులను కోరాడు. శ్రీరాముని కోరిక మేరకు కుశలవులు రామకథను శ్రావ్యంగా మృదుమధురంగా గానం చేసారు. వారిని చూసి శ్రీరాముడు “వీరు మునికుమారుల వేషంలో ఉన్నాకూడా వీరి మొహంలో రాచకళ ఉట్టిపడుతూ ఉంది. వారు గానం చేసిన నా కథ నా మనసుకు ఎంతో ఊరట కలిగించింది” అన్నాడు.
వాల్మీకి మహర్షి ఉపదేశించగా, కుశలవులు రాముని ఎదుట గానం చేసిన రామాయణ కథ ఈ విధంగా ఉంది. ఇక్కడి నుండి రామాయణ కథా ప్రారంభము. పూర్వం ఈ భూమిని ఎందరో మహారాజులు, చక్రవర్తులు పరిపాలించారు. ఇక్ష్వాకు వంశములోని సగరుడు అనే మహారాజు సాగరాన్ని త్రవ్వించాడు. సగరుడు తవ్వించాడు కాబట్టి దానికి సాగరము అని పేరు వచ్చింది అని చెప్తారు. ఆ సగరునికి 60,000 మంది కుమారులు ఉండేవారు. సరయూ నది తీరంలో కోసల దేశం ఉండేది. ఆ దేశం ఎప్పుడూ ధనధాన్యాలతో నిండి సంతుష్టులైన ప్రజలతో అలరారుతూ ఉండేది. ఆ నగరంలో ఎన్నో ఉద్యానవనములుఉండేవి. ఆ నగరము చుట్టు శత్రువులు రాకుండా ఎత్తైన ప్రాకారములు ఉండేవి.
ఆ ప్రాకారము వెలుపల లోతైన అగడ్త ఉండేది. ఆ నగరంలో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలు సమృద్ధిగా ఉండేవి. ఆ నగరము ఎప్పుడూ వర్తకులతోనూ, కప్పం కట్టడానికి వచ్చిన సామంతరాజులతోనూ కిటకిటలాడుతూ ఉండేది. ఆ నగరంలో రాజగృహాలు, ఎత్తైన మేడలు, క్రీడాశాలలు సమృద్ధిగా ఉండేవి. సంగీత వాద్య కచేరీలు ఎప్పుడూ జరుగుతూ ఉండేవి. ఎంతో మంది యోధులు ఉండేవారు. వారు విలువిద్యలో సిద్ధహస్తులు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అందరూ పరమనిష్టాగరిష్టులు. ప్రతిరోజూ అగ్నిహోత్రం చేసేవారు. వారందరూ వేదవేదాంగములు చదివిన వారు. మంచి గుణములతో అలరారేవారు. నిత్యం అతిథులకు అన్నదానం చేసేవారు. ఎప్పుడూ సత్యమునే పలికేవారు. అయోధ్యలోని స్త్రీలు ధర్మపరులు. మంచి శీలము, ఇంద్రియ నిగ్రహము కలవారు. నిర్మలమైన మనస్సు కలవారు. అయోధ్యలో ప్రజలు అందరూ సుఖసంతోషాలతో తులతూగుతూ ఉండేవారు.
అయోధ్యానగరాన్ని పరిపాలించే దశరథుడు వేదాలను అధ్యయనం చేశాడు. పండితులను పూజించాడు. అమితమైన పరాక్రమవంతుడు. దశరథుడు అంటే అయోధ్య ప్రజలకు ఎంతో ఇష్టం. ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలించేవాడు. ఎన్నో యజ్ఞయాగాలను చేశాడు. దశరథుని మంచితనం మూడులోకాలలో చెప్పుకొనేవారు. దశరథుడు తన శత్రువులకు భయంకరుడు. తన శత్రువులను కూడా మిత్రులుగా చేసుకొనే నేర్పు కలవాడు. ఎప్పుడూ సత్యమునే పలికేవాడు. అయోధ్య చుట్టూ రెండు యోజనాల దూరంలో శత్రువు అనే ఉండేవాడు కాదు. ఆ విధంగా అయోధ్యను పరిపాలిస్తున్న దశరథ మహారాజునకు సమర్ధులైన మంత్రులు ఉండేవారు. వారు ఎంతో గుణవంతులు. మంచి లోకజ్ఞానము, నేర్పు కలవారు. ఎప్పుడూ రాజుక్షేమము కోరుతూ రాజుకు హితమైన పనులు చేసేవారు. నీతిమంతులు. అటువంటి మంత్రులు దశరథునికి ఎనిమిదిమంది ఉండేవారు. వారి పేర్లు ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంతుడు. వీరుకాక వసిష్ఠుడు, వామదేవుడు అనే పురోహితులు ఉండేవారు. వారందరూ అన్ని విద్యలలో నేర్పరులు. బుద్ధిమంతులు. మంత్రుల వ్యవహారశైలిని పర్యవేక్షిస్తూ, తగిన సూచనలు ఇస్తూ ఉండేవాడు దశరథుడు.
దశరథుని పాలనలో న్యాయాధికారులు స్వపర బేధము లేకుండా నేరానికి తగిన దండన విధించేవారు. ఇటువంటి సకలసద్గుణ సంపన్నులైన మంత్రులతో, సామంతరాజులతో దశరథుడు రాజ్యపాలన చేయసాగాడు. కానీ దశరథ మహారాజుకు చాలాకాలం వరకూ పుత్రసంతానం కలగలేదు. పుత్రులు కలగడానికి అశ్వమేథ యాగం చేయడానికి నిశ్చయించాడు.
వెంటనే మంత్రులను, పురోహితులైన వశిష్టవామదేవులను, సుయజ్ఞుడు, జాబాలి, కశ్యపుడు, ఇంకా ఇతర బ్రాహ్మణులను పిలిపించి, వారినందరినీ సాదరంగా ఆహ్వానించి “మహాత్ములారా! సంతానం లేని బాధ నన్ను నిరంతరం బాధిస్తున్నది. కనుక పుత్రసంతానం కోసం నేను అశ్వమేధయాగం చేయదలచుకొన్నాను. ఆ యాగం ఎలా చేయాలో మీరు చెప్పండి” అని అడిగాడు. దశరథుని నిర్ణయం విని వశిష్టవామదేవులు “ఓ దశరథమహారాజా! మీకు పుత్రులు కావాలి అనే కోరిక సమంజసమైనదే. మీకు తప్పక పుత్రసంతానం కలుగుతుంది. మీరు వెంటనే ఒక ఉత్తమ అశ్వాన్ని విడిచిపెట్టండి” అని పలికారు. ఆ మాటలు విని దశరథుడు వెంటనే ఒక ఉత్తమాశ్వాన్ని, దాని వెంట అశ్వరక్షణకు తగు పరివారాన్ని పంపమని ఆదేశాలు ఇచ్చాడు. పురోహితులతో “సరయూ నదీతీరంలో ఒక యజ్ఞశాలను నిర్మించి, యజ్ఞాన్ని జాగ్రత్తగా, ఏ అవరోధమూ లేకుండా జరిపించండి” అని పలికాడు. తన మంత్రులను చూసి “మీరందరూ పురోహితులకు సహకరించండి. యాగం నిర్విఘ్నంగా జరిగేట్టు చూడండి” అని ఆజ్ఞాపించాడు. తరువాత దశరథుడు తన భార్యలతో “నేను పుత్రసంతానము కోసం అశ్వమేధ యాగం చేస్తున్నాను. నాతో పాటు మీరూ యాగదీక్ష వహించండి” అని చెప్పాడు. ఆ మాటలు విని దశరథుని భార్యలు తమకు పుత్రసంతానం కలగబోతోందని ఎంతగానో ఆనందపడ్డారు. భర్త చెప్పిన ప్రకారం యాగదీక్ష స్వీకరించారు.
ఇదంతా గమనిన్తున్న సుమంతుడు ఏకాంతంగా దశరథునితో ఇలా అన్నాడు.“మహారాజా! బుత్విక్కులు చెప్పిన మాటలు నేను విన్నాను. తమరికి సంతానము కలిగే విషయం గురించి పూర్వము సనత్కుమారుడు ఇతర ఋషులతో చెప్పగా నేను విన్నాను. అదేమిటంటే…కశ్యపునకు విభాండకుడు అనే కుమారుడు ఉన్నాడు. విభాండకుని కుమారుడు ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడికి తన తండ్రి, తాను ఉన్న అరణ్యం తప్ప వేరే ప్రపంచం తెలియదు. అతను లోక ప్రసిద్ధములైన రెండు రకముల బ్రహ్మచర్యములను అవలంబించినవాడు. ఆ సమయంలో అంగదేశాన్ని రోమపాదుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు అమితమైన బలపరాక్రమములు కలవాడు. ఎప్పుడూ ధర్మము తప్పి నడుస్తూ ఉంటాడు. ఆ రాజు అధర్మవర్తన ఫలితంగా, ఆయన దేశంలో తీవ్రమైన కరువొచ్చింది. రోమపాదుడు తన రాజ్యంలో వచ్చిన కరువుకు ఎంతో బాధపడి, వెంటనే తన రాజ్యంలో ఉన్న వృద్ధులైన బ్రాహ్మణులను పిలిపించాడు.
“ఓ బ్రాహ్మణులారా! ఈ అనావృష్టి పోవడానికి, నా అధర్మ ప్రవర్తన వలన కలిగిన పాపము తొలగిపోవడానికి మంచి ఉపాయము చెప్పండి” అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణులు “ఓ మహారాజా! నీ పాపం పోవడానికి, ఈ కరువు నివారణకు ఒకటే ఉపాయము ఉంది. విభాండకుని కుమారుడు, ఋష్యశృంగుడు అనే మునికుమారుడు ఉన్నాడు. ఆయనను పిలిచి నీ కుమార్తె శాంతను ఆయనకు ఇచ్చి వివాహం జరిపించు. ఈ అనావృష్టి తొలగిపోతుంది. కాని ఆ బుప్యశ్యంగుడు ఇక్కడకు రావడమే చాలా కష్టం” అని అన్నారు.
ఋష్యశృంగుని తన రాజ్యానికి రప్పించడానికి తగిన ఉపాయము ఆలోచించాడు రోమపాదుడు. తన మంత్రులను పిలిచి “మీరు వెంటనే వెళ్ళి ఋష్యశృంగుని తీసుకొనిరండి” అని ఆజ్ఞాపించాడు. వారు విభాండకునికి భయపడ్డారు. కానీ ఒక ఉపాయం చెప్పారు. అదేంటంటే- కొంతమంది వేశ్యలను పంపి స్త్రీ సాంగత్యము గురించి తెలియని ఋష్యశృంగునికి స్త్రీ సంగమం రుచి చూపించి, తీసుకొనిరావచ్చు అనీ, అప్పుడు శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం చేసి, అతణ్ని మన దగ్గరే ఉంచుకోవచ్చు అనీ, ఋష్యశృంగుడు ఉన్నచోట సుభిక్షంగా ఉంటుందని తెలియచేశారు.
వారు ఆ ప్రకారంగా ఋష్యశృంగుడిని అంగదేశానికి తీసుకువచ్చారు. ఋష్యశృంగుడు అంగదేశంలో ప్రవేశించగానే విస్తారంగా వానలు కురిసాయి. పంటలు పండాయి. కరువుకాటకాలు తీరిపోయాయి. రోమపాదుడు ఋష్యశృంగుని సాదరంగా రాజభవనానికి ఆహ్వానించాడు. “మహాత్మా! తమరి రాకవల్ల మా అంగరాజ్యం పావనం అయింది. మా కరువుకాటకాలు తొలగిపోయాయి. తమరి తండ్రిగారు నా మీద కోపించకుండా నన్ను అనుగ్రహించండి. నా కుమార్తె శాంతను వివాహమాడండి” అని ప్రార్ధించాడు. ఋష్యశృంగుడు “అలాగే” అన్నాడు. రోమపాదుడు తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వైభవంగా వివాహం జరిపించాడు. తరువాత ఋష్యశృంగుడు భార్య శాంతతో కలిసి కొంత కాలం పాటు అంగరాజ్యంలోనే ఉన్నాడు.
ఓ దశరథ మహారాజా! తమరు కూడా ఋష్యశృంగుని తీసుకొని వచ్చి యజ్ఞం జరిపిస్తే తమకు పుత్రసంతానం కలుగుతుంది అని చెప్పుకుంటుంటే నేను విన్నాను. కాబట్టి మీరు వెంటనే అంగదేశానికి స్వయంగా వెళ్ళి ఋష్యశృంగుని తీసుకొని వచ్చి యాగం జరిపించండి” అని సుమంతుడు చెప్పాడు. ఆ మాటలకు దశరథుడు ఎంతో సంతోషించి, పురోహితుడైన వశిష్టుని అనుమతి తీసుకున్నాడు. తన మంత్రులతో సహా అంగదేశానికి వెళ్ళి అంగరాజుతో “నేను ఒక యజ్ఞం చేయాలని సంకల్పించాను. దానికి నీ కుమార్తె శాంతను, అల్లుడు ఋష్యశృంగుని పంపమని ప్రార్థించాడు. దానికి అంగరాజు అంగీకరించగా ఋష్యశృంగుడు సతీసమేతంగా అయోధ్యకు ప్రయాణమయ్యాడు.
శాంతాఋష్యశృంగులకు అయోధ్యలో ఘనస్వాగతం పలికారు. దశరథుడు ఋష్యశృంగుని దగ్గరికి వెళ్ళి తనకు పుత్రసంతానము కలిగేటట్టు, ప్రధాన ఋత్విక్కుగా ఉండి, యజ్ఞము చేయించవలసిందిగా ప్రార్థించాడు. దానికి ఋష్యశృంగుడు అంగీకరించి “ఓ దశరథ మహారాజా! నేను మీ చేత అశ్వమేధ యాగం చేయిస్తాను. తరువాత పుత్ర సంతానం కోసం మరొక యాగం చేయిస్తాను. ముందు అశ్వమేధయాగానికి కావలసిన సంభారాలు సేకరించి, ఒక ఉత్తమ ఆశ్వాన్ని యజ్ఞాశ్వముగా విడువుము” అని చెప్పాడు.
దశరథుడు వెంటనే వసిష్టుని, బ్రాహ్మణులను, ఋత్విక్కులను, సుమంతుని, పిలిపించి, “మనం అశ్వమేధయాగం చేయబోతున్నాము. దానికి ఋష్యశృంగుడు ప్రధాన ఋత్విక్కుగా ఉండటానికి అంగీకరించాడు. మీరందరూ ఆ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా జరిపించాలి” అని వారిని ప్రార్ధించాడు. దానికి వారందరూ “రాజా! నీవు ధర్మసమ్మతంగా యాగం చేస్తున్నావు. నీకు నలుగురు పుత్రులు జన్మిస్తారు” అని దశరథుని ఆశీర్వదించారు. వశిష్టుడు అన్ని రంగాలలోని నిష్ణాతులను పిలిపించి వారితో యాగానికి, యాగానికి వచ్చే అతిథి సత్కారాలకు సంబంధించిన ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు. తరువాత మంత్రి సుమంతుని పిలిపించి “సుమంతా! నీవు ఈ యాగానికి భూమండలములోని రాజులందరికీ ఆహ్వానములు పంపించు. మిథిలాధిపతి జనకుడిని, కాశీరాజును, మహారాజుగారి మామగారు కేకయ రాజును, అంగదేశాధీశుడు రోమపాదుని స్వయంగా నీవే వెళ్ళి ఆహ్వానించు” అని చెప్పాడు.
సుమంతుడు వారందరినీ సకుటుంబ, సపరివారసమేతముగా యజ్ఞమునకు రమ్మని స్వయంగా ఆహ్వానించాడు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆహ్వానం అందుకున్న రాజులందరూ వారికి తోచిన రత్నాలు, మణులు మొదలైన కానుకలతో అయోధ్యా నగరానికి వచ్చారు. వసిష్టుడు వారందరికీ అతిథి సత్కారాలు చేయడానికి తగిన ఏర్పాట్లు చేసాడు. ఋష్యశృంగుడు, దశరథమహారాజు దగ్గరికి వెళ్ళి “దశరథమహారాజా! మనం ఆహ్వానించిన రాజులందరూ అయోధ్యకు వచ్చారు. యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. మీరు యజ్ఞశాలకు రావాలి” అని పలికాడు. ఒక శుభముహూర్తంలో దశరథమహారాజు, తన ముగ్గురుభార్యలతో సహా యజ్ఞశాలకు వచ్చాడు. ఋష్యశృంగుని ఆధ్వర్యంలో, వసిష్టుని పౌరోహిత్యంలో సరయూనదీ తీరంలో ఉత్తర భాగంలో అశ్వమేధయాగం ప్రారంభమయ్యింది.
వదిలి పెట్టిన అశ్వం తిరిగి వచ్చింది. అశ్వమేధ యాగాన్ని బ్రాహ్మణులు వేదోక్తంగా నిర్వహించారు. ఇంద్రునికి హవిర్భాగములు అర్పించారు. వేదములలో చెప్పిన ప్రకారం యజ్ఞ కుండములను ఏర్పాటుచేసారు. దశరథుడు, ఆయన భార్యలు కూర్చోడానికి వీలుగా గరుడుని ఆకారములో ఒక వేదికను నిర్మించారు. మూడు వందల పశువులను, యజ్ఞాశ్వాన్ని ఊపస్తంభములకు కట్టారు. దశరధుని పట్టమహిషి కౌసల్య అక్కడకొచ్చి, ఆశ్వాన్ని కట్టిన ఊపస్తంభానికి మూడుమార్లు ప్రదక్షిణం చేసి, ఆ యజ్ఞాశ్వాన్ని మూడు కత్తులతో చంపింది. శాస్త్రంలో చెప్పిన ప్రకారం, ఆ రోజు రాత్రి అంతా కౌసల్య ఆ గుర్రము పక్కన నివసించింది. యాగంలో భాగంగా యాగఫలం పొందడానికి దశరథుడు తన రాజ్యాన్ని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. కాని ఆ బ్రాహ్మణులు దాన్ని తిరిగి దశరథునికి ఇచ్చి, ప్రతిఫలముగా పదిలక్షల గోవులు, వందకోట్ల బంగారు నాణేలు ,నాలుగు వందల కోట్ల వెండి నాణేలు తీసుకున్నారు. ఆ బ్రాహ్మణులు ఆ ధనాన్ని వశిష్టునికి, ఋష్యశృంగునికి ఇచ్చారు. వారు ఆ ధనాన్ని అందరికి న్యాయప్రకారంగా పంచిపెట్టారు. అందరూ సంతృప్తి చెందారు. యాగానికి వచ్చిన బ్రాహ్మణులందరికీ భక్తితో నమస్కరించి, వారి ఆశీర్వాదములు తీసుకొని, అశ్వమేధ యాగాన్ని పూర్తి చేసాడు దశరథుడు. యాగం జరిగినన్ని రోజులు బ్రాహ్మణులు, రాజులు, వారి వెంట వచ్చిన ఉద్యోగులు, భటులు, సన్యాసులు, తాపసులు అందరికీ సమ్మద్ధిగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. వారికి వస్త్రాలు, కానుకలు ఇచ్చి సత్కరించారు. తరువాత ఋష్యశృంగుని ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం ప్రారంభం అయింది. రుత్విక్కులు వేద మంత్రాలు చదువుతూ హోమం చేస్తున్నారు.
మరోపక్క ఆ సమయంలో దేవతలందరూ బ్రహ్మదేవుని కలిసి ఆయనతో ఇలా అన్నారు.“ ఓ బ్రహ్మదేవా! భూలోకంలో రావణుడు అనే రాక్షసుడు మీరు ఇచ్చిన వరాల ప్రభావంతో గర్వించి, దేవతలను, మునులను, సజ్జనులను ముల్లోకాలను బాధిస్తున్నాడు. ఇంద్రుని, దిక్పాలకులను లెక్కచెయ్యడం లేదు. బ్రాహ్మణులను ఇబ్బంది పెట్టి, వారిని యజ్ఞయాగాలు చేసుకోనివ్వడం లేదు. వాడి మాటలకు ఎదురుచెప్పే సాహసం ఎవరికీలేదు. సూర్యుడు అతని దగ్గర చల్లగా ఉంటాడు. వాయువు అతని దగ్గర మెల్లగా వస్తాడు. సముద్రుడు కూడా అతణ్ణి చూడగానే అలలను వెనక్కు లాక్కుంటాడు. ఆ రావణుని వలన భయపడని వాడు లేదు. అందుకని అతణ్ణి సంహరించి, ముల్లోకాలను రక్షించే ఉపాయం ఆలోచించండి” అని ప్రార్ధించారు.
అప్పుడు బ్రహ్మదేవుడు “నేను ఇచ్చిన వర ప్రభావంతో వాడు మనుషుల చేతిలో తప్ప ఇంక ఎవరి చేతిలోనూ చావడు” అని చెప్పాడు. ఇంతలో విమ్ణమూర్తి అక్కడకు రాగా, వారందరూ విష్ణువుకు నమస్కరించి ఆయనతో “దేవదేవా! అయోధ్యకు రాజు అయిన దశరథుడు పుత్రసంతానం కోసం యాగం చేస్తున్నాడు. ఆయనకు ముగ్గురు భార్యలు. మీరు నలుగురుగా విడిపోయి, ఆయన ముగ్గురు భార్యలకు పుత్రులుగా జన్మించండి. బ్రహ్మదేవుని వరగర్వంతో మితి మీరుతున్న ఆ రావణుని సంహరించి, లోకాలను కాపాడండి. నరుడు మాత్రమే ఆ రాక్షసుణ్ణి సంహరించగలడు. కాబట్టి మీరు మానవుడిగా జన్మించి, ఆ రాక్షసుని సంహరించి ముల్లోకాలనూ కాపాడండి” అని వేడుకున్నారు.
విష్ణుమూర్తి వారితో “దేవతలారా! మీరు భయపడకండి. మీకు త్వరలో రావణుని బారి నుండి విముక్తి లభిస్తుంది. మీరు కోరినట్టు నేను భూమిమీద అవతరిస్తాను. ఆ రావణుని సంహరిస్తాను. పదకొండు వేల సంవత్సరాలు ఈ భూమిని పాలిస్తాను. ధర్మసంరక్షణ చేస్తాను” అని పలికాడు. దేవతలు, అప్సరసలు మునులు అందరూ విష్ణుదేవుని స్తుతించారు. ఆ విధంగా విష్ణువు దశరథునికి పుత్రుడుగా జన్మించాలి అని నిర్ణయించుకొన్న తరువాత బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిచి వారితో ఇలా అన్నాడు. “శ్రీ మహావిష్ణువు రావణాసురుని సంహరించడానికి మానవరూపంలో జన్మించబోతున్నాడు. మీరంతా ఆయనకు సాయంగా వెళ్లాలి. మీ అంశలతో కామరూవులు, అత్యధిక బలవంతులు, సర్వ అస్త్రసంపన్నులు అయిన వానర పుత్రులను- అప్సరసల యందు, గంధర్వ స్త్రీలయందు సృష్టించండి.
జాంబవంతుడు (ఎలుగుబంటి) నేను ఆవలించినపుడు నా ముఖము నుండి పుట్టాడు. వీరందరూ ఆ జాంబవంతునికి తోడుగా ఉంటారు.” అని పలికాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారము దేవతలు అందరూ తమ తమ అంశలతో వానరులను సృష్టించారు. దేవేంద్రుని అంశతో వాలి, సూర్యుని అంశతో సుగ్రీవుడు, బృహస్పతి అంశతో తారుడు, కుబేరుని అంశతో గంధమాధనుడు, అగ్ని అంశతో నీలుడు, అశ్వినీ దేవతల అంశలతో మైందుడు, ద్వివిదుడు, వరుణుని అంశతో సుషేణుడు, వాయుదేవుని అంశతో హనుమంతుడు, ఇంకా అనేకానేక దేవతల అంశలతో లక్షల కొద్దీ కామరూపులు, బలశాలురు అయిన వానరులు సృష్టించబడ్డారు. శిలలు, వృక్షాలు, గోళ్లు, దంతాలు వారి ఆయుధాలు. వారందరూ తమ నాయకులైన వాలి, సుగ్రీవుడు, నలుడు, నీలుడు, హనుమంతుడు మొదలైన వారితో కలిసి నివసిస్తున్నారు.
ఇక్కడ అయోధ్యలో దశరథుడు పుత్రుల కోసం యాగం చేస్తున్నాడు. ఆ హోమగుండం నుండి తేజోవంతుడైన, మహావీరుడు, నల్లని, ఎర్రని వస్త్రాలను ధరించిన వాడు, రక్తవర్ణముకల ముఖము కలవాడు, సింహము వంటి కేశములు కలవాడు, దివ్యమైన ఆభరణాలు ధరించిన వాడు, పర్వతశిఖరం లాగా ధృఢమైన శరీరం కలవాడు, సూర్యునివంటి తేజస్సుకలవాడు, భగభగమండే అగ్ని శిఖల లాగా వెలుగుతున్నవాడు, చేతిలో ఒక బంగారు కలశముతో, దానిమీద ఒక వెండిమూతతో, ఆ బంగారు పాత్ర నిండా పాయసముతో ఒక ఆకారం ఆవిర్భవించింది. దశరథుని చూసి “ఓ దశరథమహారాజా! నన్ను ప్రజాపతి పంపాడు. ఈ పాయసపాత్రను మీకు ఇమ్మన్నాడు. ఇది దేవతలచేత తయారుచేయబడిన పాయసం. ఈ పాయసం సంతానాన్ని, ఆయుష్షును, ఆరోగ్యాన్ని, సంపదలను ప్రసాదిస్తుంది. నీవు పుత్రులను కోరి యాగం చేస్తున్నావు. ఈ పాయస పాత్రను నీ భార్యలకు ఇవ్వు. నీకు పుత్ర సంతానము కలుగుతుంది” అని పలికి ఆ దివ్యమైన పాయసపాత్రను దశరథుడికి ఇచ్చాడు. దశరధుడు అతనికి నమస్కరించి, భక్తి శ్రద్ధలతో ఆ పాయస పాత్రను అందుకున్నాడు.
దశరథుడు సంతోషంతో ఆ పాయసంలో సగభాగం కౌసల్యకు ఇచ్చాడు. మిగిలిన పాయసంలో సగభాగం అంటే నాల్గవభాగం సుమిత్రకు ఇచ్చాడు. మిగిలిన పాయసంలో సగం అంటే ఎనిమిదవ భాగం కైకకు ఇచ్చాడు. మిగిలిన పాయసం మరలా సుమిత్రకు ఇచ్చాడు. దశరథుడు తలపెట్టిన అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి యాగం పూర్తయి, అందరూ తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. యజ్ఞం పూర్తి అయి ఒక సంవత్సరము గడిచింది. వసంత బుతువులో, చైత్రమాసంలో, పునర్వసు నక్షత్రము, నవమితిథి, కర్కాటకలగ్నంలో, కౌసల్యాదేవి గర్భంలో, విష్ణువు ప్రథమ అంశ, ఇక్ష్వాకు వంశవర్ధనుడు అయిన రాముడు జన్మించాడు. పుష్పా నక్షత్రంలో, మీన లగ్నంలో, కైకేయీ గర్భంలో- సత్యవంతుడు, పరాక్రమవంతుడు, సకల సద్గుణ సంపన్నుడు అయిన భరతుడు జన్మించాడు.
ఆశ్లేషా నక్షత్రంలో, కర్కాటక లగ్నంలో సుమిత్రా గర్భంలో- సర్వఅస్త్ర సంపన్నులు అయిన లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. ఆ ప్రకారంగా దశరథునికి ముగ్గురు భార్యలకు నలుగురు కుమారులు జన్మించారు. ఆ సమయంలో గంధర్వులు గానం చేసారు. దేవ దుందుభులు మోగాయి. అయోధ్యలో సంబరాలు మిన్నుముట్టాయి. దశరథుడు ఎంతో సంతోషించి, ఎన్నో దాన ధర్మాలు చేసాడు. పదకొండవ రోజున నామకరణ మహోత్సవము జరిగింది. కౌసల్యా నందనుడికి రాముడు అనీ, తరువాత పుట్టిన కైకేయి సుతునికి భరతుడు అనీ, సుమిత్రా నందనులకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనీ కుల గురువు, పురోహితుడు అయిన వసిష్టుడు నామకరణం చేసాడు. రాకుమారులందరూ అన్నివిద్యలు అవలీలగా నేర్చుకుంటున్నారు. రాముడు ఏనుగులు, గుర్రాలు, రథాల మీద ఎక్కి యుద్ధం చేయడంలో నేర్పు సంపాదించాడు. ధనుర్వేదంలో ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. తండ్రి అంటే ఎనలేని భక్తిశ్రద్ధలు చూపేవాడు. లక్ష్మణుడికి అన్న రాముడు అంటే ఎనలేని ప్రేమ. రాముని విడిచిపెట్టి క్షణం కూడా ఉండేవాడు కాదు. చూసేవాళ్లకు ఇద్దరి శరీరాలు వేరు కానీ, ప్రాణం ఒకటే అన్నట్టు ఉండేవాళ్లు. అలాగే రాముడు కూడా ఆహార, నిద్ర, విహారాలలో లక్ష్మణుని విడిచి ఉండేవాడుకాదు.
. భరత శత్రుఘ్నులు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. ఒకరి మీద ఒకరికి అమితమైన ప్రేమానురాగాలు కలిగిన, నలుగురు కొడుకులను చూసుకొని దశరథుడు పొంగిపోయేవాడు. నా కన్నా అదృష్టవంతుడు ముల్లోకాలలో లేడని సంబరపడిపోయేవాడు. ఒక రోజు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చి, ఆతిథ్యం అందుకొని, దశరథుడి క్షేమ సమాచారాలు అడిగాడు. దశరథుడు విశ్వామిత్రుడితో “మహర్షీ! మీ రాకతో మా మందిరం పావనమైంది. తమరు బ్రహ్మర్షులు, మాకు అత్యంత పూజనీయులు. తమరి రాకకు కారణమేంటి? సెలవివ్వండి. అది ఎంతటి కష్టమైన కార్యం అయినా నెరవేరుస్తాను” అని వినయంగా అడిగాడు దశరథుడు.
దశరథుడు మాటలు విన్న విశ్శామిత్రుడు సంతోషించి “దశరథ మహారాజా! నేను ఒక యజ్ఞం చేయడానికి సంకల్పించాను. దానికి మారీచుడు, సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు అవరోధం కలిగిస్తున్నారు. వ్రతం పూర్తయ్యే సమయంలో ఆ రాక్షసులు యజ్ఞవేదికమీద రక్తం, మాంసం పడేసి అపవిత్రం చేస్తున్నారు. కనుక, నీ కుమారుడు, మహావీరుడు అయిన రాముని నాతో పంపితే, రాముడు ఆ రాక్షసులను సంహరించి, ముల్లోకాలలో కీర్తివంతుడౌతాడు. ఆ మారీచసుబాహులను రాముడు తప్ప వేరెవ్వరూ చంపలేరు. నీవు ధర్మాత్ముడవైతే, నీ రాముని కీర్తి ముల్లోకాలకు తెలియాలంటే రాముని నా వెంట పంపు” అని పలికాడు విశ్వామిత్రుడు.
విశ్వామితుని మాటలు దశరథునికి పిడుగుపాటులాగా తగిలాయి. సింహాసనం మీద కూర్చోలేకపోయాడు. దశరథుడు విశ్వామిత్రునితో దుఃఖముతో కూడిన స్వరంతో “ఓ మునీశ్వరా! నా రాముడు పదహారు సంవత్సరాలు కూడా నిండని బాలుడు. ఇంకా యుద్ధ విద్యలు పూర్తిగా నేర్వనివాడు. రాముడు నాకు ప్రాణంతో సమానం. నా దగ్గర ఒక అక్షౌహిణి సైన్యం ఉంది. నేను నా సైన్యంతో వెళ్లి ఆ రాక్షసులను హతమారుస్తాను. ధనుర్ధారినై నా శరీరంలో ప్రాణాలు ఉన్నంతవరకూ యాగ సంరక్షణ చేస్తాను. రాముడు నాకు చాలాకాలం తరువాత కలిగిన పుత్ర సంతానం. రాముని నేను పంపలేను. ఇంతకూ ఆ రాక్షసులు ఎవరు? వారి పరాక్రమమేంటి?” అని వినయంగా అడిగాడు దశరథుడు. దానికి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు. “ఓ దశరథమహారాజా! పౌలస్త్య వంశంలో పుట్టినవాడు, విశ్రవసుని కుమారుడు, కుబేరుని సోదరుడు అయిన రావణుడు అనే రాక్షసాంశ కలవాడు ఉన్నాడు. వాడు మహా బలవంతుడు. వీర్యవంతుడు. బ్రహ్మ చేత వరాలు పొందినవాడు. లెక్కలేనంత రాక్షససైన్యం కలవాడు. బ్రహ్మ ఇచ్చిన వరాలతో గర్వించి, ముల్లోకాలలోని వారిని బాధిస్తున్నాడు. మారీచుడు, సుబాహుడు అనే వారు రావణుని సహచరులు. వారే ఇప్పుడు నేను చేసే యాగానికి విఘ్నం కలిగిస్తున్నారు” అని చెప్పాడు విశ్వామిత్రుడు.
ఆ మాటలు విన్న దశరథుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! తమరు చెప్పినట్టు దేవదానవ గంధర్వులే రావణునికి ఎదురు నిలువలేనపుడు మానవులం మేమెంత? కాబట్టి నేను గానీ, నా కుమారులు గానీ ఆ రాక్షసులతో యుద్ధం చేయలేము. నా రాముణ్ణి తమరి వెంట, రాక్షసులతో యుద్ధానికి పంపలేను. ఈసారికి మమ్మల్ని మన్నించి వదిలివేయండి” అని ప్రార్ధించాడు. ఎప్పుడైతే దశరథుడు రాముని యాగ సంరక్షణార్థం విశ్వామిత్రుని వెంట పంపను అన్నాడో, అప్పుడు విశ్వామిత్రుని కోపం తారాస్థాయికి చేరుకుంది.
“దశరథా! ఇక్ష్వాకుల వంశంలో జన్మించిన నీకు ఆడిన మాట తప్పడం ఉచితం కాదు. నేను వచ్చిన దారినే వెళ్లిపోతాను. ఇచ్చిన మాటను తప్పిన నీవు నీ భార్యాబిడ్డలతో సుఖంగా ఉండు” అన్నాడు విశ్వామిత్రుడు కోపంగా. కులగురువు వసిష్టుడు వెంటనే లేచి దశరథునితో “ఓ దశరథ మహారాజా! నీవు ఇక్ష్వాకు వంశంలో పుట్టావు. ధర్మసంస్థాపనకు కంకణం కట్టుకున్నావు. అటువంటి నీవు పుత్ర వ్యామోహంతో ఆడినమాట తప్పడం తగదు. కాబట్టి నీవు ఇచ్చిన మాట ప్రకారం రాముని విశ్వామిత్రుని వెంట పంపు. ఆయనకు తెలిసిన అస్త్ర శస్త్రాలు దేవతలకు, రాక్షసులకు, గంధర్వులకు కూడా తెలియవు. అటువంటి మహాపురుషుని వెంట రాముని పంపడానికి ఎందుకు సందేహిస్తావు? ఆ రాక్షసులను చంపడానికి విశ్వామిత్రునికి ఒక క్షణం కూడా పట్టదు. కానీ నీకు, నీ కుమారులకు పేరు ప్రతిష్టలు తీసుకురావడానికే, నీ దగ్గరకు వచ్చి, నీ కుమారుని పంపమని అర్థిస్తున్నాడు. కనుక రాముని విశ్వామితుని వెంట పంపు” అని పలికాడు.
ఆ మాటలకు ప్రనన్నుడయ్యాడు దశరథుడు. రాముని, లక్ష్మణుని సభా భవనానికి తీసుకొచ్చి, వారిని విశ్వామిత్రుని వెంట వెళ్లమన్నాడు. రాముడు, లక్ష్మణుడు వెంట నడువగా, విశ్వామిత్రుడు సభాభవనం నుండి బయలుదేరాడు. విశ్వామిత్రుడు- రామలక్ష్మణులతో కలిసి ఒకటిన్నర యోజనాలు నడిచాడు. విశ్వామిత్రుడు రాముడికి బ్రహ్మదేవుడు సృష్టించిన బల, అతిబల అనే విద్యలను ఉపదేశించాడు. వాటి వల్ల ఆకలిదప్పులు, శ్రమ ఉండవు. ఎలాంటి రాక్షసులూ ఏమీ చేయలేరు. ఆ రోజు రాత్రి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులతో కలిసి సరయూ తీరంలో విశ్రమించాడు. తరువాతి రోజు కొంతదూరం ప్రయాణించి, సరయూ నది- గంగా నదిలో కలిసే సంగమస్థానం చేరుకున్నారు. అక్కడ ఉన్న ఆశ్రమాలను చూసి రాముడు “ఇవి ఎవరివి? ఇక్కడ ఎవరు ఉంటారు? అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు “రామా! పూర్వం శివుడు ఈ ప్రదేశంలో తపస్సు చేసుకునేవాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఋషులు అందరూ పూర్వం పరమశివునికి శిష్యులుగా ఉండేవారు. మనం ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయం మన ప్రయాణం కొనసాగిద్దాం” అన్నాడు.
మరునాడు ప్రయాణం చేసి గంగానది దాటి ఆవల ఒడ్డుకు చేరుకున్నారు. మార్గ మధ్యంలో వారికి ఒక మానవ సంచారము లేని అడవి కనపడింది. ఆ అడవి చాలా భయంకరంగా ఉంది. ఆ అడవి గురించి చెప్పమని రామలక్ష్మణులు అడిగారు. ఇక్కడ మరదము, కరూశము అనే రెండు రాజ్యాలు ధనధాన్యాలతో కళకళలాడుతూ ఉండేవి. కొంతకాలం తరువాత తాటక అనే రాక్షసి ఈ రెండు రాజ్యాలనూ నాశనం చేసింది. అగస్త్య మహర్షి శాపం వల్ల ఆమె వికృత రూపంతో, భయంకరంగా మారి, మనుష్యులను చంపి తింటూ ఉంది. ఆమె కుమారుడే మారీచుడు. ఇప్పుడు నువ్వు ఆ తాటక అనే రాక్షసిని సంహరించాలి. ఆమె దుర్మార్గురాలు. మునులను, బ్రాహ్మణులను రక్షించడానికి ఆమెను సంహరించు. ఈమెకు ఉన్న వరాలు, శాపాల వల్ల ఈమెను నీవు తప్ప వేరెవ్వరూ సంహరించలేరు. లోకము యొక్క హితము కోరి రాజు- స్త్రీ పురుష బేధములేకుండా ఎవరినైనా సంహరించవచ్చు. కాబట్టి నీవు కూడా స్త్రీ అని సంకోచించక తాటకను సంహరించు” అన్నాడు విశ్వామిత్రుడు.
విశ్వామిత్ర మహర్షి మాటలను విన్న రాముడు వినయంతో “మహర్షి! మా తండ్రి- గోవులు, బ్రాహ్మణుల హితం కోసం, లోక క్షేమం కోసం మీరు ఎలా చెబితే అలా చెయ్యమన్నారు. వారి మాట నేను జవదాటలేను” అని పలికి, వెంటనే తన ధనుస్సు చేతిలోకి తీసుకున్నాడు. వింటినారిని గట్టిగా లాగి వదిలాడు. ఆ శబ్దం విన్న తాటక పరుగుపరుగున అక్కడికి వచ్చింది. వికారంగా ఉన్న తాటకిని చూసి- రాముడు లక్ష్మణునితో “లక్ష్మణా! ఆ భయంకరాకారముతో ఉన్న యక్షిణి మాయావి. ఈమె స్త్రీ కనుక ఈమెను చంపకుండా, ఈమె పరాక్రమమును నశింపచేస్తాను” అని అన్నాడు.
తాటకి మాయాశక్తి చేత వారి మీద రాళ్ల వర్షం కురిపించింది. రాముడికి కోపం వచ్చింది. వెంటనే తాటకి మీద శరవర్షము కురిపించి ఆ రాళ్ళవర్షాన్ని ఆపు చేసాడు. లక్ష్మణుడు ఒక కత్తి తీసుకొని, తాటకి ముక్కు చెవులుకోసి ఆమెను విరూపిని చేసాడు. అయినా తాటకి ఊరుకోలేదు. తన మాయాశక్తితో వివిధ ఆకారాలను ధరించి, మరలా రామలక్ష్మణుల మీద రాళ్ళవర్షం కురిపించింది. అప్పుడు విశ్వామిత్రుడు రామునితో “రామా! దుర్మార్గురాలు, పాపాత్మురాలు అయిన ఆమె మీద జాలి చూపకు. రాత్రి సమీపిస్తుంది. ఈ లోపలే ఈమెను చంపి వెయ్యి. సంధ్యాకాలంలో రాక్షసుల బలం పెరుగుతుంది” అని అన్నాడు. విశ్వామిత్రుని మాటలు విన్న రాముడు వెంటనే శబ్దవేధి బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఆ బాణం సూటిగా తాకగా, తాటకి కిందపడి మరణించింది. తాటకి మరణించడం చూసి దేవతలు అంతా సంతోషించారు. తాటకిని చంపిన రాముని చూసి విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు.
విశ్వామిత్రుడు రామునికి దేవతలను, అసురులను, గంధర్వులను సైతం జయించగల దండచక్రము, కాలచక్రము, విష్ణుచక్రము, ఇంద్రాస్త్రము, వజ్రాస్త్రము, శివుని త్రిశూలంతో సమానమైన శూలాస్త్రము, బహ్మశిరోనామకాస్త్రము, అన్నిటి కంటే ఉత్తమం, శ్రేష్టం అయిన బహ్మాస్త్రము, ఇవేకాక అనేక అస్త్రశస్త్రాలను రామునికి ప్రయోగ ఉపసంహారాలతో ఉపదేశించాడు. రాముడు వాటిని భక్తిశ్రద్ధలతో గ్రహించాడు. తరువాత రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట ప్రయాణం చేసి ఒక ఆశ్రమానికి చేరుకున్నారు. రాముడు ఆ ఆశ్రమం గురించి, తాను రక్షించవలసిన యజ్ఞం గురించి వివరాలు అడిగాడు.
అప్పుడు విశ్వామిత్రుడు ఇలా బదులు చెప్పాడు. “రామా! వామనావతారానికి ముందు శ్రీ మహావిష్ణువు ఇక్కడే నివసించేవాడు. కశ్యపుడు ఇక్కడ తపస్సుచేసి సిద్ధి పొందినందువల్ల, దీనిని సిద్ధాశ్రమం అంటారు. నేను ఇదే ఆశ్రమంలో నివసిస్తున్నాను. ఇక్కడే యజ్ఞం చేస్తున్నాను. రాక్షసులు ఇక్కడకు వచ్చి నా యజ్ఞమును పాడు చేస్తున్నారు. నీవు వారిని సంహరించాలి” అన్నాడు. రామ లక్ష్మణులు విశ్వామిత్రుని ఆశ్రమములో ప్రవేశించారు. రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో “తమరు ఈ రోజునుండే యాగం ప్రారంభించండి. మేము యాగరక్షణ చేస్తాము” అన్నారు. విశ్వామిత్రుడు ఎంతో సంతోషించి, యాగదీక్షను స్వీకరించాడు. నిరంతరం ధనస్సును పట్టుకొని, రామ లక్ష్మణులు ఆరు పగళ్లు, ఆరు రాత్రులు యాగాన్ని రక్షించారు. ఆరవ రోజు ఋషులు యజ్ఞం చేస్తున్నారు. ఇంతలో ఆకాశము నుండి ఒక భయంకరమైన శబ్దము వినిపించింది. మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు మేఘాల రూపంలో, ఆకాశము అంతా కమ్ముకుని, రక్తాన్ని వర్షం లాగా కురిపించారు. రాముడు కోపంతో మానవాస్త్రాన్ని ఆ రాక్షసుల మీద ప్రయోగించాడు. రాముడు ప్రయోగించిన మానవాస్త్రము మారీచుని వక్షస్థలము మీద సూటిగా తగిలింది. ఆ అస్త్రము దెబ్బకు మారీచుడు నూరు యోజనాల దూరంలో ఉన్న సముద్రంలో పడ్డాడు. ఆ అస్త్రం ప్రాణాలు తీయదు.
కేవలం మూర్ఛపోయేలా చేస్తుంది. రాముడు ఆగ్నేయాస్త్రాన్ని సుబాహుని మీద సంధించాడు. ఆ అస్త్రము తగిలి సుబాహుడు గిలాగిలా కొట్టుకొని మరణించాడు. రాముడు మిగిలిన రాక్షసులను వాయవ్యాస్త్రము ప్రయోగించి నాశనం చేసాడు. ఆ ప్రకారంగా రాముడు విశ్వామిత్రుని యజ్ఞానికి భంగం కలిగించే రాక్షసులనందరినీ తన దివ్యాస్త్రములతో సమూలంగా చంపాడు. విశ్వామిత్రుడు దీక్షనుండి లేచి “రామా! నేను సంకల్పించిన యాగం నిర్విఘ్నంగా పూర్తి అయింది. నీవు నీ తండ్రి ఆజ్ఞప్రకారము యాగమును రక్షించావు. ఈ సిద్ధాశ్రమం పేరు సార్థకం చేసావు” అని అన్నాడు. యాగం పూర్తి అయిన మరుసటి రోజు మహర్షులు రామునితో “ఓ రామా! మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఒక యజ్ఞం చేస్తున్నాడు. మేము అందరమూ అక్కడికి వెళ్తున్నాము. మీరు కూడా మా వెంట మిథిలకు వస్తే, అక్కడ ఉన్న ఒక మహాధనుస్సును చూడొచ్చు. ఆ ధనుస్సు సామాన్యమైనదికాదు. ఆ ధనుస్సును పూర్వము యజ్ఞములో దేవతలు జనకునికి ఇచ్చారు. దానిని దేవతలు, గంధర్వులు, అసురులు, రాక్షసులు ఎవరూ కూడా ఎత్తలేరు. ఎక్కుపెట్టలేరు. ప్రస్తుతం ఆ మహత్తర ధనుస్సు జనకమహారాజు పూజా మందిరంలో ఉంది” అని పలికారు. తరువాత విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో, ఇతర ఋషులతో కలిసి మిథిలకు ప్రయాణయ్యాడు.
కొంతదూరం ప్రయాణించి వారు గంగానదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ విశ్వామిత్రునితో రాముడు “ఓ మహర్షీ! గంగానది మూడు పాయలుగా ప్రవహిస్తున్నది కదా. ఈ గంగానది ఎక్కడ సముద్రంలో కలుస్తుంది. వివరించండి” అని అడిగాడు. అప్పుడు విశ్వామితుడు గంగానది గురించి, దాని పుట్టుక గురించి ఇలా చెప్పసాగాడు. “రామా! పూర్వం హిమవత్పర్వతం మీద హిమవంతుడు అనే రాజు ఉండేవాడు. హిమవంతుని భార్య పేరు మనోరమ. వారికి ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. వారి పేర్లు గంగ, ఉమ. దేవతలందరూ హిమవంతుని దగ్గరికి వెళ్ళి, గంగను తమకు ఇమ్మని అడిగారు. లోకాల మేలు కోరిన హిమవంతుడు, తన పెద్ద కుమార్తె గంగను దేవతలకు ఇచ్చాడు. గంగ నదీ రూపంలో దేవతల నదిగా దేవలోకంలో ప్రవహిస్తూ ఉంది. హిమవంతుడు తన రెండవ కుమార్తె ఉమను మహాశివునికి ఇచ్చి వివాహం చేశాడు.
తరువాత విశ్వామిత్రుడు రామునికి ఉమాదేవి గురించి, కుమారస్వామి జననం, గంగాదేవి చరితం వివరిస్తాడు. తరువాత సగరుడి కథను ఇలా వివరిస్తాడు. పూర్వం అయోధ్యా నగరాన్ని సగరుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. సగరునికి వైదర్భి, శైబ్య అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. శైబ్యకు అంశుమంతుడను కుమారుడు, వైదర్భికి 60వేల మంది కుమారులు కలిగారు. సగరుని అశ్వమేధ యాగాన్ని భంగం చేయడానికి, ఇంద్రుడు యాగధేనువును పాతాళంలో దాచాడు. ఆ అశ్వాన్ని వెతకడానికి వెళ్ళిన సగరుని 60వేల మంది పుత్రులకు, ఈశాన్యదిక్కుగా గడ్డిమేస్తున్న యజ్ఞాశ్వం కనిపించింది. దానికి కొంత దూరంలో మహావిష్ణు అవతారమైన కపిలమహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించాడు.
ఆ కపిలుడే తమ అశ్వాన్ని దొంగిలించాడు అనుకొని తమ దగ్గర ఉన్న ఆయుధాలతో కపిలుని మీదికి దూకారు. “మేము సగర చక్రవర్తి కుమారులం. నీవేనా మా యజ్ఞాశ్వమును దొంగిలించింది?” అంటూ కపిలుని చుట్టుముట్టారు. కపిలుడు కళ్లు తెరిచి వారిని చూసి, ఒక్కసారిగా కోపంతో హుంకరించాడు. ఆ కపిలుని హుంకారం లోనుండి పుట్టిన అగ్నిలో, సగరుని కుమారులు 60,000 మంది భస్మం అయిపోయారు.
వారికి ఉత్తమగతులు లభించాలంటే ఆకాశ గంగను పాతాళానికి తేవలసిఉంది. సగరుడు, అతని కొడుకు అసమంజసుడూ తపస్సు చేసినా ప్రయోజనం లేకపోయింది. అసమంజసుని కొడుకు అంశుమంతుడు. ఆంశుమంతుని కొడుకు దిలీపుడు. దిలీపుని కొడుకు భగీరధుడు. భగీరధుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగకోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై “నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను. కాని నా దూకుడు భరించగల నాథుడెవ్వరు?” అని అడిగింది. భగీరధుడు శివునికోసం తపస్సు చేశాడు. అనుగ్రహించిన శివుడు, గంగను భువికి రాగానే తన తలపైమోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదలాడు. భగీరథుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నుముని ఆశ్రమాన్ని ముంచెత్తి, “జాహ్నవి” అయ్యింది. ఆపై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రుల భస్మరాశుల మీదుగా ప్రవహించింది. పవిత్రమైన గంగా జలములలో మునిగి సగర పుత్రులు అందరూ వారి వారి పాపాలు నశించి స్వర్గలోకం చేరుకున్నారు.
విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, వారితో వచ్చిన మునులు అందరూ గంగానదిని దాటారు. విశాల అనే నగరాన్ని చేరుకున్నారు. విశ్వామిత్రుడు వారికి ఆ విశాల నగరము గురించి, క్షీరసాగర మథనం గురించి, దితికశ్యపుల గురించి వివరించాడు. తాము వచ్చిన సంగతి విశాల నగరం రాజు అయిన సుమతికి వర్తమానం పంపారు. రాజు వచ్చి వారిని సాదరంగా ఆహ్వానించాడు. వారు అక్కడ ఆతిథ్యం స్వీకరించి, మరునాడు మిథిలకు ప్రయాణం అయ్యారు.
మిథిలా నగరం సమీపంలో వారికి నిర్మానుష్యంగా ఉన్న ఒక ఆశ్రమం కనపడింది. రాముడు ఆ ఆశ్రమం గురించి అడుగగా, విశ్వామిత్రుడు “రామా! ఇది గౌతమ ముని ఆశ్రమం. ఆయన భార్య పేరు అహల్య. గౌతముడు ఈ ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అహల్య భర్తయైన గౌతముడు ఉదయాన్నే నదీ స్నానానికి వెళ్ళగా, ఆమె మీద కోరికతో దేవేంద్రుడు ఆమె భర్త రూపంలో వచ్చి, కోరిక తీర్చమని అడుగుతాడు. ఇంద్రుడి మోసం తెలిసీ అహల్య అందుకు అంగీకరిస్తుంది. అదే సమయానికి గౌతముడు తిరిగివచ్చి ఆమెని శపిస్తాడు. “అనేక సంవత్సరాలు నీవు గాలిని భక్షిస్తూ, ఆహారము లేక, అదృశ్య రూపంలో ఇక్కడే తపస్సు చేసుకో. త్రేతా యుగంలో మహావిష్ణువు రాముని అవతారమెత్తినప్పుడు , ఆయన రాక వలన, దర్శనము వలన ఆమెకు శాపవిమోచనం అవుతుందని చెప్తాడు. అలాగే ఇంద్రుణ్ణి తన శరీరమంతా స్త్రీ జననేంద్రియాలతో నిండిపోయేలాగా శపిస్తాడు. వృషణాలు నేలరాలిపోయేటట్లు చేస్తాడు. కానీ ఇంద్రుడు ఇతర దేవతల సాయంతో ఒక జీవాన్ని బలి ఇచ్చి, దాని వృషణాలను అతికించేటట్లు చేస్తాడు. అమ్మవారిని గురించి తపస్సు చేసి, తన శరీరంపై ఉన్న స్త్రీ జననేంద్రియాలను కన్నులులాగా కనిపించేటట్లు వరం పొందుతాడు. అందుకనే ఆయన్ను సహస్రాక్షుడు అని కూడా వ్యవహరిస్తారు.
తరువాత విశ్వామిత్రుడు, రామలక్ష్మణులతో కలిసి అహల్య ఉన్న ఆశ్రమంలోకి ప్రవేశించాడు. రాముడు అహల్యను చూచాడు. రాముని దర్శనంతో ఆమె శాపవిమోచనం కలిగింది. రామలక్ష్మణులు అహల్య పాదాలకు నమస్కరించారు. అహల్యకు గౌతముని మాటలు గుర్తుకు వచ్చాయి. అహల్య రామ లక్ష్యణులకు అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించింది. ఆ సమయంలో గౌతముడు కూడా అక్కడకు వచ్చాడు. శ్రీరామదర్శనంతో పునీతమైన అహల్యను భార్యగా స్వీకరించాడు. అహల్యగౌతములు రాముని పూజించారు. రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, మునులు అందరూ మిథిలా నగరం చేరుకున్నారు. జనకుడు చేస్తున్న యాగానికి వచ్చిన ఆహూతులతో మిథిలా నగరం కిక్కిరిసిపోయింది. జనకునికి విశ్వామిత్రుడు యాగమునకు వచ్చాడు అన్న విషయం తెలిసి, జనక మహారాజు తన పురోహితుడు అయిన శతానందుని, ఋత్విక్కులను వెంట బెట్టుకొని విశ్వామిత్రుని దగ్గరికి వచ్చాడు. జనక మహారాజు విశ్వామిత్రునికి నమస్కరించి ఆయనకు ఉచితాసనము సమర్పించాడు. జనక మహారాజు విశ్వామిత్రునితో “ఓ మహర్షీ! మహాత్ములు, పుణ్యాత్ములు అయిన మీరు ఈ యజ్ఞానికి వచ్చి, నన్ను ధన్ముడిని చేసారు. యజ్ఞం పూర్తవడానికి ఇంకా పన్నెండు రోజులు మిగిలి ఉంది” అని అన్నాడు. తరువాత రామలక్ష్మణులను చూసి ఈ రాకుమారులు ఎవరు? మహా పరాక్రమవంతుల లాగా కనపడుతున్నారు. వీరిని చూస్తుంటే సూర్యచంద్రులు ఒకేసారి ప్రకాశిస్తున్నట్టు ఉంది.
వీరు ఏ దేశానికి చెందిన రాకుమారులు? మా దేశానికి ఏ పనిమీద వచ్చారు?” అని అడిగాడు.
అప్పుడు విశ్వామిత్రుడు జనకునితో “జనకమహారాజా! వీరు అయోథ్యానగరానికి అధిపతి అయిన ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరథమహారాజు పుత్రులు. రాక్షసులను సంహరించి నేను సిద్ధాశ్రమంలో తలపెట్టిన యజ్ఞాన్ని సంరక్షించారు. అహల్యాగౌతమమునులను కలుసుకొని, మిథిలకు వచ్చారు. నీ వద్ద ఉన్న ధనుస్సును చూడటానికి కుతూహలపడుతున్నారు” అన్నాడు.
జనకుని పక్కన ఉన్న శతానందుడు విశ్వామిత్రుని మాటలు విని, పరమానందభరితుడు అయ్యాడు. విశ్వామిత్రుని చూసి సంతోషంగా తన తల్లిదండ్రులైన అహల్య గౌతముల గురించి అడిగాడు. తండ్రి గౌతముడు తన తల్లిని తిరిగి స్వీకరించిన విషయం తెలుసుకొని ఎంతో సంతోషించాడు. శతానందుడు రాముడితో “రామా! సకల మహిమాన్వితుడైన విశ్వామిత్రుని వెంట మా మిథిలకు వచ్చిన నీకు మా స్వాగతము. ఈ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి. వీరి సాంగత్యం వలన నీవు ధన్యుడవయ్యావు. ఆ మహానుభావుని గురించి నేను చెబుతాను విను అని ఇలా చెప్పాడు.
ఈ విశ్వామిత్రుడు జన్మతో క్షత్రియుడు. చక్రవర్తి. ధర్మవేత్త. సకల విద్యలను అభ్యసించాడు. శత్రువులను నిర్మూలించి ధర్మంగా రాజ్యపాలన చేసాడు. ఈ విశ్వామిత్రుడు వేల సంవత్సరములు రాజ్యపాలన చేసాడు. బక అక్షైహిణీ సైన్సముతో ఈ భూమి అంతా వైత్రయాత్ర చేసాడు. అందరు రాజులను ఓడించాడు. ఒకరోజు ఆయన వేటలో అలసిపోయి వశిష్ట మహర్షి దగ్గరకు వెళ్లి అక్కడ ఆయన ఆతిథ్యం స్వీకరించాడు. తరువాత వశిష్ఠుడి దగ్గర ఉన్న శబల అనే ఆవును చూసి దాని మీద మొహం పెంచుకుని దాన్ని అడిగాడు. వశిష్ఠుడు దాన్ని ఇవ్వడానికి నిరాకర్ఞ్చడు. అప్పుడు విశ్వామిత్రుడిలో మొదలైన అహంకారం శబల కోసం యుద్ధం చేశాడు. వశిష్ఠుని చేతిలో ఓడిపోయేసరికి, తపస్సు చేసి ఇంద్రుడి నుండి ఎన్నో అస్త్రాలు పొందాడు, త్రిశంకుడిని శరీరంతో సహా స్వర్గానికి పంపుదామనుకున్నాడు. దేవతలు వారించేసరికి, త్రిశంకు కోసం ఒక నక్షత్ర మండలాన్ని సృష్టించి, త్రిశంకును అక్కడ సశరీరంగా ఉండేట్టు చేశాడు. కానీ విశ్వామిత్రుడు వశిష్ట మహర్షి అంత గొప్పవాడు కాలేకపోయాడు.
మళ్లీ మళ్లీ తపస్సులు చేసినా మేనక వల్ల ఆ తరువాత రంభ వల్ల తపస్సు భంగం అయ్యింది. తూర్పు దిక్కుకి వెళ్ళి వెయ్యి సంవత్సరములు కుంభకంలో ఉండి తపస్సు చేసేసరికి ఆయన శరీరం ఒక పుల్లంత సన్నగా అయ్యింది. తన శరీరాన్ని నిలబెట్టుకోడానికి కొంత తిందామని అనుకుంటుండగా ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి, అయ్యా! నాకు బాగా ఆకలిగా ఉంది, మీ దగ్గరున్నది నాకు కొంచెం పెడతారా అన్నాడు. వచ్చిన వాడు ఇంద్రుడని విశ్వామిత్రుడికి అర్ధమయ్యింది, కాని ఈ సారి ఆయన ఇంద్రియాలకి లొంగలేదు, ఇంద్రుడు తింటే ఏంటి నేను తింటే ఏంటి అనుకొని ఇంద్రుడికి ఆ కబళాన్ని ఇచ్చి మళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. అలా విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా ఆయన బ్రహ్మస్థానం నుండి ఆయన తపఃశక్తి పొగగా బయలుదేరింది. ఆయన తపోధూమం సమస్త లోకాలని కప్పేసింది. సముద్రాలు కదలడం ఆగిపోయాయి, సమస్త ప్రాణులు క్షోభించాయి. ఇక ఈ స్థితిలో విశ్వామిత్రుడిని ఎవరూ కదపలేరు, ఆయనకి శత్రువు లేడు మిత్రుడు లేడు, ఆయనకి అంతటా ఆ పరబ్రహ్మమే కనిపిస్తుంది. అప్పుడు దేవతలతో కలిసి బ్రహ్మగారు వచ్చి “ఓ కౌశికా! నీ తపస్సుకి సంతోషించాను, నువ్వు బ్రహ్మర్షివయ్యావు. దేవతలందరితో కలిసి నేను నిన్ను బ్రహ్మర్షి అని పిలుస్తున్నాను, నీకున్న సమస్త కోరికలు తీరుతాయి. నువ్వు దీర్ఘాయిష్మంతుడవై జీవిస్తావు అన్నారు.
అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మగారితో, నేను బ్రహ్మర్షిని అయిన మాట నిజమైతే నాకు ఓంకారము, వషట్కారము వాటంతట అవి భాసించాలి అన్నాడు (ఓంకారము, షట్కారము భాసిస్తే తాను ఒకరికి వేదం చెప్పడానికి అర్హత పొందుతాడు. అలాగే తాను కూర్చుని యజ్ఞము చేయించడానికి అర్హత పొందుతాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు పుట్టుక చేత క్షత్రియుడు కనుక). అలాగే, ఎవరిమీద కోపంతో నేను బ్రహ్మర్షిని అవ్వాలన్న పట్టుదలతో ఇన్ని సంవత్సరములు తపస్సు చేశానో, ఆ వశిష్ఠుడితో బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉందన్నాడు.
బ్రహ్మగారు సరే అన్నారు. అప్పుడు దేవతలు వశిష్ఠుడిని తీసుకురాగా, ఆయన విశ్వామిత్రుడిని చూసి బ్రహ్మర్షి విశ్వామిత్రా అని పిలిచారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుడి పాదములు కడిగి పూజ చేశాడు. ఏ వశిష్ఠుడి మీద కోపంతో ప్రారంభించాడో, ఆ వశిష్ఠుడి పాదములు కడగడంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు.
ఈ విధంగా విశ్వామిత్రుని గురించి తెలుసుకొని జనకుడు, రామలక్ష్మణులు ఎంతో సంతోషించారు. జనకమహారాజు విశ్వామిత్రుని, రామలక్ష్మణులు, వారితో వచ్చిన మునులను సాదరంగా తన భవనానికి తీసుకొని వెళ్ళి, సత్కరించి “తమరికి ఏమి కావాలో నన్ను ఆజ్ఞాపించండి. తక్షణమే నెరవేరుస్తాను.” అని పలికాడు. అప్పుడు విశ్వామిత్రుడు “జనకమహారాజా! వీరికి నీ దగ్గర ఉన్న శ్రేష్టమైన ధనుస్సును చూపించు” అన్నాడు. అప్పుడు జనకుడు వారితో ఆ ధనుస్సు గురించి ఇలా వివరిస్తాడు. పూర్వము దక్షయజ్ఞసమయంలో రుద్రుడు తనకు యజ్ఞములో హవిర్భాగము ఇవ్వనందుకు ఈ శివధనుస్సును ధరించి, దేవతలందరి శిరస్సులను ఖండించడానికి పూనుకున్నాడు. దేవతలు అందరూ ఈశ్వరుని ప్రార్థించగా, దేవతలను క్షమించాడు. తాను ఎత్తిన శివధనుస్సును నిమి చక్రవర్తి వంశంలో ఆరవ వాడైన దేవరాతుని దగ్గర ఉంచాడు. ఆ దేవరాతుడు మా పూర్వీకుడు. ఆ శివధనుస్సు మా పూజా మందిరంలో వంశపారంపర్యంగా పూజలందుకుంటూ ఉంది.
తరువాత ఒకసారి నేను యజ్ఞం చేయ సంకల్పించి, యజ్ఞశాల నిర్మించడానికి భూమిని దున్నుతున్నాను. అప్పుడు నాగేటిచాలులో నాకు ఒక కన్య దొరికింది. ఆమె పేరు సీత. అయోనిజ. సీతకు యుక్తవయసుకు వచ్చింది. ఆమెను వివాహమాడటానికి ఎందరో రాజకుమారులు ప్రయత్నించారు. కాని సీతను వివాహమాడేవాడు అత్యంత పరాక్రమవంతుడు అయి ఉండాలని, సీతను వీర్యశుల్కగా ప్రకటించాను. సీతను వివాహమాడటానికి మిథిలకు వచ్చిన రాకుమారులకు, నేను ఈ ధనుస్సును చూపించి దానిని ఎక్కుపెట్టమన్నాను. వారందరిలో ఏ ఒక్కరు కూడా ఈ ధనుస్సును కనీసం కదల్చలేకపోయారు. రాజులే కాదు, దేవతలు, గంధర్వులు, అసురులు కూడా దీనిని ఎక్కుపెట్టలేకపోయారు. వారికి అలవికాని పరీక్ష పెట్టి, సీతను ఇచ్చి వివాహము చేయలేదని, రాజకుమారులందరూ నా మీద కోపగించారు. నా మీదకు యుద్ధానికి వచ్చి మిథిలను ముట్టడించారు. నేను దేవతలు సమకూర్చిన సైన్యంతో ఆ రాజులను ఓడించి పారద్రోలాను. నేను శివధనుస్సును రామలక్ష్మణులకు చూపిస్తాను. రాముడు ఆ ధనుస్సును ఎక్కుపెట్టగలిగితే, అన్న మాట ప్రకారం, నేను నా కుమార్తె సీతను రామునికి ఇచ్చి వివాహం జరిపిస్తాను” అని పూజా మందిరములో ఉన్న ధనుస్సును తీసుకొని రమ్మని సామంతులను ఆజ్ఞాపించాడు. 5,000 మంది ధృడకాయులు ఎనిమిది చక్రాలు గల ఒక వాహనం మీద అమర్చి ఉన్న ఆ శివధనుస్సును తీసుకొచ్చారు.
విశ్వామిత్రుడు రాముని ఆ ధనుస్సును చూడమన్నాడు. విశ్వామిత్రుని మాటలను విన్న రాముడు నమస్కరించి, ఆ ధనుస్సు దగ్గరికి వెళ్ళి దాన్ని అవలీలగా ఏ మాత్రం శ్రమపడకుండా ఎక్కుపెట్టాడు. ఆ ధనుస్సుకు ఉన్న నారిని పట్టుకొని తన చెవి దాకా లాగాడు. ఆ ధనుస్సు ఒంగిపోయి ఫెడేల్మని మధ్యకు విరిగిపోయి రెండు ముక్కలు అయింది. ఆ ధనుస్సు విరిగినపుడు పిడుగు పడ్డట్టు భయంకరమైన శబ్దం వచ్చింది. భూమి కంపించినట్టయింది. ఆ శబ్దానికి అక్కడ ఉన్నవారంతా కిందపడి మూర్ఛపోయారు. ఇదంతా తనకు ముందే తెలుసు అన్నట్టు విశ్వామిత్రుడు చూస్తున్నాడు. జనకుడు విశ్వామిత్రునితో “ఓ మహర్షీ! శ్రీరాముని వీరత్వమును, బలపరాక్రమాలను ప్రత్యక్షంగా చూచాను. మనసంతా ఆశ్చర్యంతో నిండిపోయింది. ఇది అత్యద్భుతం, ఊహాతీతం. అనుకున్న ప్రకారం నా ప్రాణసమానమైన నా కుమార్తె సీతను రామునికి మనస్ఫూర్తిగా సమర్పిస్తాను. మీరు ఆజ్ఞాపిస్తే వెంటనే మా మంత్రులను అయోధ్యకు పంపి, ఇక్కడి విషయాలన్నింటి గురించి దశరథమహారాజుకు వివరంగా చెప్పి, వారిని బంధుమిత్ర సపరివార సమేతంగా మిథిలకు రమ్మని ఆహ్వానిస్తాను” అన్నాడు. విశ్వామిత్రుడు దానికి అంగీకరించగా, జనక మహారాజు తన మంత్రులతో అయోధ్యకు వెళ్లి దశరథ మహారాజుకు జరిగిన విషయాలు అన్నీ చెప్పి, వారిని సగౌరవంగా మిథిలకు తీసుకొని రమ్మని ఆదేశించాడు.
మూడు రోజులు ప్రయాణించి అయోధ్యకు చేరిన జనక మహారాజు దూతలు దశరథ మహారాజుకు నమస్కరించి, క్షేమసమాచారాలు అడిగి “విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు మిథిలలో జనక మహారాజు అతిధి సత్కారాలు అందుకుంటున్నారు” అని చెప్పి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు మిథిలా నగరం చేరుకోవడం, శివధనుర్భంగం, సీతను శ్రీరామునికి ఇచ్చి వివాహం చేయాలనే జనక మహారాజు కోరికను విన్నవించారు. “దశరథ మహారాజును బంధువులు, మిత్రులు, పురోహితులు సహితంగా మిథిలకు విచ్చేయవలసినదిగా జనకమహారాజు కోరుతున్నారు” అని చెప్పారు.
తన కుమారునికి వివాహము అని తెలిసి దశరథుడు ఎంతో సంతోషించాడు. వసిష్టునితో, పురోహితులతో “మన రాముని బల పరాక్రమాలు చూసి విదేహ మహారాజు జనకుడు తన కుమార్తె సీతను, మన రామునికి ఇచ్చి వివాహం చేయ సంకల్పించాడట. జనకునితో సంబంధం మీ అందరికీ ఇష్టం అయితే, మనం విదేహపురానికి బయలుదేరి వెళుదాము” అన్నాడు. దశరథుని ఆస్థానంలో ఉన్న పురోహితులు, ఋషులు అందరూ ఏక కంఠంతో “జనకునితో సంబంధము తమకు ఇష్టమే” అని చెప్పారు. ఆ మాటలకు దశరథుడు ఎం తో సంతోషించాడు.
మరునాడు దశరథుడు ధనరాశులు, రత్నాలు, ఆభరణాలు తీసుకొని, చతురంగ బలాలు, వసిష్టుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, మార్కండేయుడు, కాత్యాయనుడు మొదలైన పరివారంతో కలిసి మిథిలకు చేరుకున్నారు. జనకుడు వారిని తగు మర్యాదలతో ఆహ్వానించి, అతిధి సత్కారాలు, విడిది ఏర్పాట్లు చేసి “దశరథ మహారాజా! తమరి రాకతో మా మిథిలానగరం పావనమయ్యింది. రామలక్ష్మణులు ఎంతో పరాక్రమం కలవారు. రఘువంశ రాజులతో వియ్యమందడం మా అదృష్టం. మా కులం పావనమయింది. రేపు నేను తలపెట్టిన యజ్ఞము పూర్తి అయిన తరువాత వివాహం జరిపించడానికి అనుమతి ఇవ్వండి” అని అన్నాడు జనకుడు.
అప్పుడు దశరథుడు “జనకమహారాజా! తమరు కన్యాదాతలు. కాబట్టి కన్యాదాన ముహూర్త నిర్ణయం మీది. మీరు ఎలా చెప్తారో అలాగే చేద్దాం” అన్నాడు. ఆ మాటలకు జనకుడు ఎంతో సంతోషించాడు. దశరథుడు విశ్వామిత్రుని దగ్గర ఉన్న రామలక్ష్మణులను చూచి ఎంతో సంతోషించాడు.
మరునాడు జనకమహారాజు అగ్ని కార్యం, యజ్ఞం పూర్తయింది. తన పురోహితుడు అయిన శతానందుని పంపి తమ్ముడు కుశధ్వజుని, ఆయన కుటుంబాన్ని వివాహానికి రమ్మని ఆహ్మానించాడు. వెంటనే కుశధ్వజుడు అన్నగారి ఆజ్ఞమేరకు బంధుమిత్రపరివారములతో మిథిలకు వచ్చాడు. జనకమహారాజు మంత్రి- సుదాముని ద్వారా ఆహ్వానం అందుకున్న దశరథుడు తన పురోహితులు, బుషులు వెంట రాగా, జనకుని వద్దకు వెళ్లాడు. అక్కడ దశరథుని సూచన విన్న వసిష్టుడు ఇక్ష్వాకువంశం గురించి ఇలా వివరించాడు. “బ్రహ్మ దేవుడు శాశ్వతుడు, నిత్యుడు. ఆ బహ్మ కుమారుడు మరీచి. మరీచి కుమారుడు కశ్యపుడు. కశ్యపుని కుమారుడు సూర్యుడు. సూర్యునికి మనువు పుట్టాడు. ఆ మనువు ప్రజాపతి అయ్యాడు. ఆ మనువు కుమారుడే ఇక్ష్వాకువు. ఆ ఇక్షాకువు అయోధ్యను మొట్టమొదటిసారిగా పరిపాలించాడు. ఆయన పేరుతోనే ఇక్ష్వాకు వంశం ఆవిర్భవించింది. ఆ ఇక్ష్వాకు వంశవృక్షంలోని నాభాగుని కుమారుడు అజుడు. అజుని కుమారుడే అయోధ్యానగరాధిపతి దశరథమహారాజు. ఈ దశరథ మహారాజు పుత్రులే రామలక్ష్మణులు. వీరు పరమధార్మికులు, వీరులు, సత్యసంధులు. ఇటువంటి సర్వలక్షణ సమన్వితులకు, నీ కుమార్తెలను ఇచ్చి వివాహం చేయడం శుభప్రదం” అన్నాడు.
ఇలా వసిష్టుడు దశరథుని వంశం గురించి చెప్పిన తరువాత, జనకుడు తమ వంశ చరిత్రను గురించి ఇలా వివరించాడు. “మాది మిథిలా నగరం. ఈ మిథిలా నగరాన్ని నిర్మించినవాడు మిథి అనే చక్రవర్తి. మిథి, నిమి చక్రవర్తి కుమారుడు. ఆయనే మా వంశానికి మూలపురుషుడు. ఆ వంశంలోని స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు. ఆ హ్రస్వరోమునికి ఇద్దరు కుమారులు- నేను, నా తమ్ముడు కుశధ్వజుడు. మా తండ్రిగారు నన్ను ఈ మిథిలానగరానికి రాజుగా చేసాడు. నేను ఒక యుద్ధంలో గెలిచిన సాంకాశపురానికి నా తమ్ముడు కుశధ్వజుని రాజుగా పట్టాభిషిక్తుని చేసాను. నాకుమార్తె పేరు సీత. నా తమ్ముడు కుశధ్వజుని కుమార్తె పేరు ఊర్మిళ. నా కుమార్తెలైన సీత, ఊర్మిళ లను దశరథమహారాజు కుమారులైన రామునికి లక్ష్మణునికి ఇచ్చి వివాహం జరిపించడానికి ఎంతో ఆనందిస్తున్నాను” అన్నాడు.
జనకుని మాటలు విన్న వసిష్టుడు, విశ్వామిత్రుడు- జనకునితో “జనకమహారాజా! ఎంతో విశిష్టమైన ఇక్ష్వాకు వంశం విదేహవంశం రెండూ కలవడం అత్యంత శుభదాయకం. నీ తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలను దశరథుని కుమారులైన భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహము జరిపించండి. రెండు వంశములు ధన్యమవుతాయి. ఈ వివాహములతో మీ ఇద్దరి రాజ్యాలు ధృడమైన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాయి” అని పలికారు.
దానికి జనకమహారాజూ మనస్ఫూర్తిగా అంగీకరించాడు. దశరథ మహారాజు తన కుమారుల చేత వేదోక్తంగా శ్రాద్ధకర్మలను, స్నాతక వ్రతాన్ని జరిపించాడు. ఒక్కొక్క కుమారునిచేత బంగారుతొడుపులు వేసిన కొమ్ములు కలవి, లేగ దూడలతో పాలు ఇచ్చే నాలుగులక్షల పాడిఆవులను, ఇంకా ఇతర ద్రవ్యాలను గోదానంగా బ్రాహ్మణులకు ఇప్పించాడు. భరతుని మేనమామ యుధాజిత్తు భరతుని వివాహ వార్త తెలుసుకొని అక్కడకు వచ్చాడు. దశరథుడు ఎంతో సంతోషంగా యుధాజిత్తుకు అతిథిసత్కారాలు చేసాడు.
వివాహం రోజు దశరథుడు, తన కుమారులతో సహా పురోహితులు ముందు నడువగా వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. జనకుడు వారినందరినీ వివాహ వేదిక వద్దకు సాదరంగా ఆహ్వానించాడు. జనకుడు వశిష్టుని చూచి “ఓ వసిష్ట మహర్షీ! మీరు పౌరోహిత్యం వహించి, నా కుమార్తెల వివాహాలను దశరథపుత్రులతో వేదోక్తంగా జరిపించమని ప్రార్థిస్తున్నాను” అన్నాడు. ఆ మాటలకు వసిష్టుడు తన అంగీకారము తెలిపాడు. వసిష్టుడు విశ్వామిత్రుని, శతానందుని చెరొక పక్క ఉంచుకొని వివాహ కార్యక్రమం నిర్వర్తించడానికి ఉపక్రమించాడు.
వివాహ మండపం మధ్యలో ఉన్న అగ్ని కుండంలో అగ్నిహోత్రమును ఉంచాడు. హోమ కుండం చుట్టూ గంధం, పుష్పాలు, సువర్ణ కలశాలలో పాలికలు, అంకురార్పణ చేసిన కుంభములు, మూకుళ్లు, ధూప పాత్రలు, శంఖ పాత్రలు, హోమము చేసే సాధనాలు, నేతితో నిండిన పాత్రలు, లాజలతో నిండిన పాత్రలు, అక్షతలు అన్నీ సిద్ధంగా ఉంచుకున్నాడు. వేద మంత్రాలను పఠిస్తూ హోమ కార్యక్రమాన్ని నిర్వర్తించాడు. జనక మహారాజు సర్వాలంకార భూషిత అయిన తన కుమార్తె సీతను తీసుకొని వచ్చి, అగ్ని హోత్రము వద్ద నిలబడి ఉన్న రాముని ఎదురుగా నిలబెట్టి, రాముని చూసి “ఓ రామా! ఈమె నా కుమార్తె సీత. ఈమెను నీ సహధర్మచారిణిగా స్వీకరించు. నీ హస్తముతో నా కుమార్తె సీత హస్తమును గ్రహింపుము. పాణిగ్రహణం చేయుము. ఈమె పతివ్రతయై నిన్ను ఎప్పుడూ నీడవలె వెన్నంటి ఉండగలదు” అని పలుకుతూ జనకమహారాజు, సీత చేతిని రామునికి అందించి జలమును వదిలి, కన్యాదానం చేసాడు.
ఆ సమయంలో ఆకాశం నుండి దేవతలు దుందుభులు మోగించారు. పూలవర్షం కురిపించారు. ఆ ప్రకారంగా సీతారాములకల్యాణము వైభవంగా జరిపించాడు జనకుడు. తరువాత జనకుడు లక్ష్మణునికి, భరతునికి, శత్రుఘ్నునికి తన తమ్ముని కుమార్తెలైన ఊర్మిళ, మాండవి, శ్రుతకీర్తులను ఇచ్చి కన్యాదానం చేశాడు. రాముడు సీత చేతిని, లక్ష్మణుడు ఊర్మిళ చేతిని, భరతుడు మాండవి చేతిని, శత్రుఘ్నుడు శ్రుతకీర్తి చేతిని పట్టుకొన్నారు. పాణిగ్రహణ మహోత్సవం జరిగిపోయింది. దశరథుని కుమారులు నలుగురు తమ తమ భార్యల చేతులను పట్టుకొని అగ్నికి నమస్కారం చేసారు. తరువాత మామగారు జనకునికి నమస్కారం చేసారు. తరువాత పురోహితులు వసిష్టమహర్షికి నమస్కారం చేసారు. వసిష్టుడు దశరథకుమారుల వివాహ కార్యక్రమాన్ని వైభవోపేతంగా జరిపించాడు. ఆ ప్రకారంగా సీతారాములు, ఊర్మిళా లక్ష్మణులు, మాండవీభరతులు, శ్రుతకీర్తి శత్రుఘ్నులు దంపతులు అయ్యారు.
మరునాడు ఉదయం విశ్వామిత్రుడు, నూతన వధూవరులందరినీ ఆశీర్వదించి, జనకుని వద్ద, దశరథుని వద్ద సెలవు తీసుకొని హిమవత్పర్వతమునకు వెళ్లిపోయాడు. జనక మహారాజు వద్ద అనుమతి తీసుకొని దశరథుడు కూడా అయోధ్యకు బయలుదేరాడు. జనక మహారాజు తన కుమార్తెలకు అంతులేని ధనము, ఆభరణాలు కానుకగా ఇచ్చాడు. లక్ష ఆవులను, ఏనుగులు, రథాలను అరణంగా ఇచ్చాడు. దాసులను దాసీజనమును తన కుమార్తెల వెంట అయోధ్యకు పంపాడు. దారిలో రక్షణగా చతురంగ బలాలను పంపాడు. వారితోపాటు మిథిలా నగరం బయట దాకా వచ్చి వీడ్కోలు పలికాడు. తరువాత వెనుతిరిగి మిథిలకు వచ్చాడు.
దశరథుడు కుమారులు కోడళ్లతో ప్రయాణమై వెళుతున్నాడు. దారిలో వారికి కొన్ని దుశ్శకునాలు కనపడ్డాయి. వెంటనే దశరథుడు వసిష్టుని పిలిచి ఆ దుశ్శకునాలకు అర్థం చెప్పమని అడిగాడు. అప్పుడు వసిష్టుడు “దశరథమహారాజా! మనకు ఏదో ఒక ఆపద వచ్చిపడుతుంది అని ఈ దుశ్శకునాలు సూచిస్తూ ఉన్నాయి. కాని ఆ ఆపద సులభంగానే తొలగిపోతుంది అని కొన్ని శుభశకునాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి మీరు ఏమీ కంగారు పడనవసరం లేదు” అని వివరించాడు. ఇంతలో తీవ్రంగా పెను గాలులు వీచాయి. భూమి కంపించింది. సూర్యుని కాంతి వెలవెల బోయింది. చీకట్లు కమ్మాయి. ఈ ఉత్పాతాలకు దశరథుడు భయభ్రాంతుడు అయ్యాడు. అప్పుడు యావత్తు క్షత్రియ కులమును సర్వనాశనం చేసిన పరశురాముడు అక్కడికి వచ్చాడు.
దశరథుడు పరశురామునికి నమస్కరించాడు. పరశురాముడు రాముని చూచి “ఓ రామా! నీ పరాక్రమము గురించి విన్నాను. నీవు శివుని విల్లు విరవడం నాకుఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే మరొక మహత్తరమైన విల్లు తీసుకొనివచ్చాను. ఈ విల్లు నాకు మా తండ్రి జమదగ్ని ఇచ్చాడు. ఈ విష్ణు ధనుస్సు కూడా శివధనుస్సుతో సమానమైనది ఈ విల్లును కూడా నీవు ఎక్కుపెట్టి నీ పరాక్రమాన్ని ప్రదర్శించు. అప్పుడు నేను నీవు పరాక్రమవంతుడవనీ, వీర్యవంతుడవనీ ఒప్పుకుంటాను. రా! ఈ విల్లు తీసుకో!” అని రాముని పిలిచాడు పరశురాముడు.
అప్పటి వరకూ ఎంతో శాంతంగా ఉన్న శ్రీరాముడు “పరశురామా! మీ గురించి విన్నాను. మీ తండ్రి ఋణం తీర్చుకోడానికి యావత్తు క్షత్రియ లోకాన్ని మట్టుబెట్టిన సంగతి నాకు తెలుసు. ఇప్పుడే నా పరాక్రమాన్ని మీకు ప్రదర్శిస్తాను” అని పలికి పరశురాముని చేతిలోని ఆ దివ్యమైన ధనుస్సు, బాణం తీసుకుని ఎక్కుపెట్టాడు. పరశురామునితో “మీరు నాకు పూజ్యులు. కాబట్టి ఈ బాణమును మీమీద ప్రయోగింపలేను. సంధించిన బాణము వృథా కారాదు. ఈ బాణమును దేని మీద ప్రయోగింపవలెనో చెప్పండి. మీ పాదములకు ఎక్కడికైనా పోగల శక్తి ఉంది. ఆ శక్తి మీద ప్రయోగించనా లేక మీరు ఇప్పటిదాకా తపస్సు చేసి సంపాదించుకున్న ఉత్తమలోకాల మీద సంధించనా” అన్నాడు.
ఆ మాటలకు పరశురాముని బలపరాక్రమాలు నశించి, శరీరం నిర్వీర్యం అయింది. విష్ణుబాణం సంధించిన రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి మాదిరి కనిపించాడు. పరశురాముడు ఆశ్చర్యపోయి, చేతులుజోడించి నమస్కరించాడు. “ఓరామా! నీవు సామాన్యుడవు కావు. విష్ణు ధనుస్సును ధరించిన విమ్ణమూర్తివి. యుద్ధంలో నిన్ను జయించడం ఎవరి తరమూ కాదు. నీ చేతిలో నేను ఓడిపోయాను. నన్ను క్షమించు. నేను క్షత్రియ సంహారం చేసి ఈ భూమినంతా కశ్యపునకు ఇచ్చాను. అప్పుడు కశ్యపుడు నన్ను ఈ దేశంలో నివసించవద్దు అని ఆజ్ఞాపించాడు. అందుకని నేను మహేంద్రపర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాను. నువ్వు నా గమనశక్తిని, నీ బాణంతో హరిస్తే నేను మహేంద్రగిరికి పోలేను. కాబట్టి నా గమన శక్తిని కొట్టవద్దు. దానికి బదులు నేను తపస్సు చేసి సంపాదించిన నా పుణ్యలోకాల మీద నీ బాణమును సంధించు. తరువాత నేను మహేంద్రగిరికి పోతాను” అని అన్నాడు.
పరశురాముని మాటలను మన్నించి రాముడు విష్ణుబాణం ప్రయోగించాడు. పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న పుణ్యలోకాలు అన్నీ ధ్వంసమయ్యాయి. తరువాత పరశురాముడు రామునికి ప్రదక్షిణము చేసి నమస్కరించి, తన దివ్యమైన గమనశక్తితో మహేంద్రపర్వతానికి వెళ్లిపోయాడు. ఇదంతా ఆశ్చర్యంతో చూశాడు దశరథుడు. పరశురాముడు మహేంద్రగిరికి వెళ్లిన తరువాత రాముడు తన దగ్గర ఉన్న విష్ణుధనుస్సును, బాణమును, వరుణ దేవునికి ఇచ్చాడు. అప్పటి దాకా ఆశ్చర్యంతో చూస్తున్న దశరథుడు ఒక్కసారి తెలివిలోకి వచ్చాడు. రాముని గట్టిగా కౌగలించుకున్నాడు. శిరస్సును ముద్దుపెట్టుకున్నాడు. తరువాత అందరూ ప్రయాణం చేసి అయోధ్య చేరుకున్నారు. ముందే వీరి రాక తెలిసిన అయోథ్యాపురవాసులు వారికి ఘనస్వాగతం పలికారు. నగరమంతా మామిడి తోరణములతోనూ,అరటి స్తంభాలతోనూ, రకరకాల పూలతోనూ అలంకరించారు. మంగళ వాద్యాలతో రామునికి ఎదురేగి స్వాగతం పలికారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎదురుగా వచ్చి కొత్త కోడళ్లను ఆహ్వానించి లోపలికి తీసుకొని వెళ్లారు. నూతన వధూవరుల గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. గృహదేవతలను పూజించారు.
జనకుని పుత్రికలు అత్తగార్లకు, పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. బ్రాహ్మణులకు గోదానం, సువర్ణదానం చేసి వారిని తృప్తిపరిచారు. రామ లక్ష్మణ భరతశత్రుఘ్నులు తండ్రి దశరథునికి సేవ చేసుకుంటూ ఉన్నారు. కొన్ని రోజులు గడచిన తరువాత భరతుడు పెద్దల ఆశీర్వాదం తీసుకొని, శత్రుఘ్నుడు వెంట రాగా తన తాతగారి ఇంటికి ప్రయాణమయ్యాడు. తండ్రి అనుమతితో రాముడు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పనులను చేసాడు. రాముని ప్రవర్తనకు, గుణగణాలకు అయోధ్యా ప్రజలు ఎంతో సంతోషించారు. రాముని వంటి ప్రభువు తమకు కావాలని కోరుకున్నారు. పూర్తిగా నియమాలను పాటిస్తూ తండ్రికి రాజ్యపాలనలో సాయంచేస్తున్నాడు. సీతను ఎంతో ప్రేమానురాగాలతో చూసుకొనేవాడు. సీత కూడా రాముని పట్ల ఎంతో ప్రేమతో ప్రవర్తించేది. రాముని విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. రాముడు సీత మధ్య ఉన్న ప్రేమ దినదినాభివృద్ధి చెందుతూ ఉండేది. ఒకరి హృదయం తెలిసి మరొకరు నడుచుకొనేవారు. వారి అన్యోన్యానురాగాలతో కూడిన దాంపత్యం చూసి కౌసల్య ఎంతో మురిసిపోయేది. ఆ ప్రకారంగా రాముడు సీత – శ్రీమహా విష్ణువు, లక్ష్మిదేవిలాగా ప్రకాశిస్తున్నారు.