నీళా తుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతిశతశిరః సిద్ధమధ్యాపయంతీ |
స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః ||
అన్న వయల్ పుదువై యాణ్డాళ్ అరంగర్కు
పన్ను తిరుప్పావై ప్పల్ పదియమ్, ఇన్నిశైయాల్
పాడిక్కొడుత్తాళ్ నఱ్పామాలై,
పూమాలై శూడిక్కొడుత్తాళై చ్చొల్లు,
శూడిక్కొడుత్త శుడర్కొడియే తొల్పావై,
పాడియరుళవల్ల పల్వళైయాయ్, నాడి నీ
వేంగడవఱ్కెన్నై విది యెన్ఱ ఇమ్మాట్రమ్,
నాన్ కడవా వణ్ణమే నల్‍కు.
పాశురం – 1
మార్గళి’త్ తింగళ్ మదినిఱైన్ద నన్నాళాల్ ,
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళై’యీర్ ,
శీర్ మల్‍గుమాయ్‍పాడి శెల్వచ్చిఱుమీర్గాళ్ ,
కూర్ వేల్ కొడున్దొళి’లన్ నన్దగోపన్ కుమరన్ ,
ఏరార్‍న్ద కణ్ణి యశోదై యిళం శిఙ్గం ,
కార్‍మేని చ్చెంగణ్ కదిర్ మతియమ్బోల్ ముగత్తాన్,
నారాయణనే నమక్కే పఱై తరువాన్ ,
పారోర్ పుగళ’ ప్పడిన్దేలోరెమ్బావాయ్ || 1 ||
భావం: ఆండాళ్ గొల్ల భామలను, కాలాన్ని ప్రశంసిస్తూ, భగవాన్ మాత్రమే మన అంతిమ లక్ష్యమని మరియు సాధనమని ప్రశంసిస్తూ, కృష్ణానుభవం పొందాలనే సంకల్పముతో మార్గళి నోముని పాటించాలని నిశ్చయించుకుంది. ఓహో ! ఇది మార్గశీర్ష మాసము.వెన్నెల నిండిన మంచిరోజు. ఓ అందమైన ఆభరణములు గల పడుచులారా! ఇశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలో సంపదలతో తులతూగుచున్న ఓ బాలికలారా! ఈ మార్గశీర్ష స్నానము చేయవలెనని సంకల్పమున్నచో రండు.ముందు నడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి ఏ విధమగు ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీ నందగోపుల కుమారుడును, అందమగు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాల సింహమును, నీలమేఘశ్యముడును, ఎఱ్ఱ తామరలపోలిన కన్నులు కలవాడును, సూర్యునివలె ప్రకాశమును, చంద్రునివలె ఆహ్లాదమును ఈయజాలిన దివ్యముఖమండలము కలవాడును అయిన నారాయణుడే. ఆతనినే తప్ప వేరొకరిని అర్దించని మనకే , మనమపేక్షించు వ్రత సాదనమగు ‘పర’ అను వాద్యమును ఈయనున్నాడు.మనమీ వ్రతము చేయుటను చూచి లోకులందరూ సంతోషించునట్లు మీరు అందరు వచ్చి ఈ వ్రతములో చేరుడు.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 1 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 2
వైయత్తు వాళ్’వీర్‍గాళ్ నాముం నం పావైక్కు,
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్
పైయ త్తుయిన్ఱ పరమ నడిపాడి,
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి,
మైయిట్టెళు’తోం మలరిట్టు నాం ముడియోమ్,
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చెన్ఱోదోమ్,
ఐయముం పిచ్చైయుమాన్దనైయుం కైకాట్టి,
ఉయ్యుమాఱెణ్ణి ఉగన్దేలోరెమ్బావాయ్ || 2 ||
భావం: రెండవ పాశురంలో వ్రతములో పాల్గొనేటప్పుడు చేయవలసిన పనులు, చేయకూడని పనులను గోదాదేవి వివరిస్తుంది. శ్రీ కృష్ణునికి అంకితంకావటమే ముఖ్యమైన నియమం. భక్తిలేనిదే వ్రతం చేసినా ఫలం దక్కదు. “భగవంతుడికి శరణాగతి చేసిన మనకు, పూర్వాచార్యులే మార్గదర్శకులు” అని ఆమె వివరించింది. భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులారా! మేము మా వ్రతము చేయు విధానము వినండి. పాల సముద్రములో ధ్వని కాకుండా మెల్లగా పడుకొనియున్న ఆ పరమపురుషుని పాదములకు మంగళము పాడెదము. ఈ సమయమలో ఇతరములైన ఎట్టి భోగ్య విషయాలను తలచము. ఈ వ్రత సమయములో నేతిని గాని, పాలనుగాని మేమారగింపము. తెల్లవారు జామునే లేచి స్నానము చేసెదము. కంటికి కాటుక పెట్టుకొనము, కొప్పులో పూవులు ముడువము. మా పెద్దలు ఆచరింపని పనులను ఆచరింపము. శాస్త్ర విరుద్దములైన ఎట్టి పనులను చేయము. ఒకరిపై చాడీలను చెప్పము. ఇతరులకు బాధ కలిగించు మాటలను, అసత్య వాక్యములను ఎప్పుడూ, ఎక్కడా పలుకము. జ్ఞానాధికులను అధిక ధన, ధాన్యాదులతో సత్కరించెదము. బ్రహ్మచారులకు, సన్యాసులకు భిక్ష నొసంగెదము. ఇంకా భగవంతుని చేరు మార్గములేవైన ఉన్నచో, వాటినెరిగి సంతోషముతో ఆచరింతుము. ఇలా ఈ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము. ఇదియే మన వ్రతము.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 2 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 3
ఓంగి యులగళన్ద ఉత్తమన్ పేర్ పాడి,
నాంగళ్ నం పావైక్కుచ్చాట్రి నీరాడినాల్,
తీంగిన్ఱి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్‍దు,
ఓంగు పెరుం శెన్నెలూడు కయలుగళ,
పూంగువళైప్పోదిల్ ప్పొఱివణ్డు కణ్పడుప్ప,
తేంగాదే పుక్కిరున్దు శీర్త ములైపట్రి వాంగ,
క్కుడం నిఱైక్కుం వళ్ళల్ పెరుం పశుక్కళ్,
నీంగాద శెల్వం నిఱైన్దేలోరెమ్బావాయ్ || 3 ||
భావం:
ధనుర్మాస వ్రతమెంతో శుభప్రదమైనది. ఈ వ్రతము వలన వ్రతాన్నాచరించిన వారికే కాక లోకమంతటికీ ప్రయోజనం చేకూరుతుంది. ఇది ఇహపరసాధక వ్రతము. పిలిస్తే పలికేవాడు కృష్ణపరమాత్మ. విశేషంగా ఆరాధించిన వారికే కాక లోకానికంతటికీ కల్యాణాన్ని కల్గించి, శుభాలను చేకూర్చేవాడని వ్రతఫలాలను వివరిస్తోంది గోదాదేవి. ఆమెకు అనుమతి ఇచ్చిన బృందావనములోని ప్రతి ఒక్కరూ కృష్ణానుభవం పొందాలి, ఆ యొక్క ప్రయోజనములు అనుభవించాలి అని ఆండాళ్ ప్రార్థిస్తుంది. సర్వవ్యాపాకుడైన త్రివిక్రముని వ్యాపకత్వాన్ని తెలుసుకొని ఆ పురుషోత్తముని కొలిచిన కలిగే ఫలితాలను గురించి ఈ 4వ పాశురంలో గోదాదేవి వెల్లడించింది. ఆ పరమాత్ముని భక్తితో పూజించే శక్తియుక్తులు కావాలంటే ముందు శారీరక శుద్ధి, ఆపై అంతర్ శుద్ధి అవసరం. అందుకే బాహ్య శుద్ధి కొరకు గోదాదేవి వర్షదేవుడైన వర్జన్యుణ్ణి ప్రార్థించి వ్రతములో భాగమైన స్నానానికై వర్షించమని కోరుతున్నదీ పాశురంలో.
బలిచక్రవర్తి నుండి మూడడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంతానందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి మూడు లోకాలను కొలిచాడు. ఆ పరమానంద మూర్తి దివ్యచరణాలను, అతని దివ్య నామాలను పాడి, యీ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళిస్నానాన్నాచరిస్తే – దుర్భిక్షమసలు కలుగనే కలుగదు. నెలకు మూడు వర్గాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంత ఎత్తుకెదిగి ఫలిస్తాయి. పంటచేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్లిపడుతూ ఆనంద సమృద్దిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్దికి సంకేతాలే! ఇక పాలు పితకడానికి గోవుల పొదుగులను తాకగానే- కలశాలు నిండునట్లు క్షీరధారలు నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహదైశ్వర్యంతో, లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సఖులందరినీ పిలుస్తోంది గోదాదేవి.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 3 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 4
ఆళి’మళై’ క్కణ్ణా ఒన్ఱు నీ కైకరవేల్,
ఆళి’యుళ్ పుక్కు ముగన్దు కొడార్తేఱి,
ఊళి’ ముదల్వనురువమ్బోల్ మెయ్ కఱుత్తు,
పాళి’యన్దోళుడై ప్పఱ్బనాబన్ కైయిల్,
ఆళి’పోల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱతిర్‍న్దు,
తాళా’దే శార్‍ఙ్గముదైత్త శరమళై’ పోల్,
వాళ’ వులకినిల్ పెయ్‍దిడాయ్, నాంగళుం
మార్కళి’ నీరాడ మగిళ్’న్దేలోరెమ్బావాయ్ || 4 ||
భావం:
ఆండాళ్ ఒక నెలలో మూడు సార్లు అంటే బ్రహ్మణుల కొరకు ఒకసారి, రాజు కొరకు ఒకసారి, పవిత్రమైన స్త్రీల కొరకు మరొకసారి వర్షించాలని పర్జన్య దేవుడిని అంటే వరుణ దేవుడిని ఆదేశిస్తుంది, తద్వారా బృందావనములో ప్రజలు సంపన్నముగా జీవిస్తూ, కృష్ణానుభవమును పొందవచ్చు అని ఆమె ఉద్దేశ్యం. పెద్ద పెద్ద వర్షాలని కురిపి౦చగలిగిన ఓ వరుణుడా! నీ గొప్పతనాన్ని ఏమాత్రము తగ్గనీయకు. నీవు సముద్రములోని నీటినంతటినీ కడుపు నిండుగ త్రాగుము. తరువాత నీవు పైకెగసి, సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ శరీరమునకు కూడా ఆ నలుపురంగు నద్దుకొనుము. నీ ను౦చి వచ్చే మెరుపులు ఆ భగవ౦తుని కుడి చేతియ౦దు౦డు చక్రములాగా మెరవాలి. నీ ఉరుములు ఆయన ఎడమ చేతియ౦దు ఉన్న పాంచజన్య శ౦ఖములాగా గర్జి౦చునట్లు ఉ౦డాలి. నువ్వు కురిపి౦చే వర్షధారలు ఆయన చేతియ౦దు ఉన్న శారంగం అనే విల్లు ను౦చి కురిసిన బాణములవలె ఉ౦డాలి. నువ్వు కురిపి౦చిన వర్షము వలన లోకములో అ౦దరూ సుఖముగా ఉ౦డాలి. “మేమ౦దరము స౦తోషముగా స్నానము చేయటానికి సరిపడునట్లు మ౦చి వర్షాన్ని కురిపి౦చు” అని గోదాదేవి, గోపికలు కలసి వరుణుడిని కోరుతున్నారు.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 4 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 5
మాయనై మన్ను వడమదురై మైన్దనై,
తూయ పెరునీర్ యమునై త్తుఱైవనై,
ఆయర్ కులత్తినిల్ తోన్ఱుం అణి విళక్కై,
తాయై క్కుడల్ విళక్కం శెయ్‍ద దామోదరనై,
తూయోమాయ్ వన్దు నాం తూమలర్ తూవిత్తొళు’దు,
వాయినాల్ పాడి మనత్తినాల్ శిన్దిక్క,
పోయ పిళై’యుం పుగుదరువా నిన్ఱనవుమ్,
తీయినిల్ తూశాగుం శెప్పేలోరెమ్బావాయ్ || 5 ||
భావం: గోదాదేవి అనుగ్రహించిన ఐదవ పాశురంలో పరమాత్మను కీర్తించడం వల్ల కలిగేటటువంటి ఫలితాన్ని చెప్తున్నది. ఆ పరమాత్మయైన కృష్ణుడియొక్క వైభవాన్ని చిన్న చిన్న మాటలతో, లోతైన భావాలతో గోదాదేవి అభివర్ణిస్తున్నది.
మనమీ వ్రతము నాచరించి ఫలమందుటకు మన పాపములడ్డువచ్చునని భయపడవలదు. వాటిని తొలగించేవాడు మన వ్రతమునకు నాయకుడైన శ్రీకృష్ణుడే. ఆతడు ఆశ్చర్యకరములగు గుణములు, చేష్టలు కలవాడు. నిత్యము భగవత్సంబంధముగల ఉత్తరదేశమునందలి మధురానగరికి నిర్వాహకుడు, నిర్మలమై, గంభీరమైన జలము గల యమునానది యొక్క తీరవాసియై మనకై గొల్లకులమందు అవతరించి ఈ కులమును ప్రకాశింప జేసిన మంగళదీపము. తన పుట్టుకచే తల్లి యశోద గర్భమును ప్రకాశింపచేయునటులు త్రాడుచే కట్టబడి- దామోదరుడైన వాడునునగు కృష్ణ భగవానునికి, సందేహములనే మలినములు లేక అతనిని చేరి, చేతులారా నిర్మల హృదయపుష్పాన్ని సమర్పించాలి. నోరారా పాడాలి. మనసారా ధ్యానము చేయాలి. స్వామి యొక్క దివ్య నామాలను నిరంతరం పఠించడంతో మన అన్ని పాప పుణ్య కర్మలూ మటుమాయమవుతాయి. ఆ వెంటనే మన పూర్వ కర్మలు నిప్పులో వేసిన దూది వలె కాలిపోతాయి, భవిష్యత్తులో చేసే కర్మలు తామరాకుపై నీరువలె అంటకుండా పోయి, మన వ్రతమునకు అడ్డు తొలగుతాయి. కనుక “రండి. భగవన్నామ స్మరణ చేద్దాము. మన పాపాలు తొలిగేందుకు శ్రీకృష్ణుడికి అర్పించాల్సిన 8 పుష్పాలు: 1 అహింస 2 ఇంద్రియ నిగ్రహం ౩ సర్వభూతదయ 4 క్షమ 5 జ్ఞానం 6 తపస్సు 7 సత్యం 8 ధ్యానం. ఇవి విష్ణువుకు ప్రీతికరమైన పుష్పాలు. వీటితో పూజించి, మంచి పాటలతో కీర్తిస్తే భగవంతుని కృప పొందవచ్చు అని భావము.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 5 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 6
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిలిల్,
వెళ్ళై విళిశఙ్గిన్ పేరరవం కేట్టిలైయో ?
పిళ్ళాయ్ ఎళు’న్దిరాయ్ పేయ్ ములై నంజుండు,
కళ్ళచ్చగడం కలక్కళి’య క్కాలోచ్చి,
వెళ్ళత్తరవిల్ తుయిలమర్‍న్ద విత్తినై,
ఉళ్ళత్తుక్కొండు మునివర్‍గళుం యోగిగళుమ్,
మెళ్ళవెళు’న్దు అరియెన్ఱ పేరరవమ్,
ఉళ్ళం పుగున్దు కుళిర్‍న్దేలోరెమ్బావాయ్ || 6 ||
భావం:
ఈ 30 పాశురాల్లో ఆరవ పాశురం నుంచి పది పాశురాల వరకూ గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ, పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. నేటి నుంచి ఒక్కొక్క రోజు ప్రకృతి వర్ణనతో ఒకొక్క చెలిని నిద్ర లేపుతుంది గోదాదేవి. పక్షుల కిలకిలారావాలు, రంగురంగుల పూలు, వెన్నను చిలికినప్పుడు వచ్చే సంగీత ధ్వనులు, ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం, మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను తట్టి లేపుతూ, వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది. ఈరోజు గోదాదేవి రచించిన పాశురాల్లోని 6 వ పాశురం భావం తెలుసుకుందాం. “ఓ చిన్నదానా! పక్షులు అరుస్తున్నాయి. గరుడుడు వాహన౦గా ఉన్న ఆ సర్వేశ్వరుని కోవెలలో, తెల్లని శ౦ఖములు ఊదుతున్నారు. ఆ ధ్వని వినిపించలేదా? పూతన పాలను తాగి ఆమెను స౦హరి౦చినవాడు, బ౦డి రూప౦లో వచ్చిన రాక్షసుణ్ణి కాలితో తన్ని స౦హరి౦చినవాడు, సముద్రంలో శేషశయ్యపై యోగనిద్రలో ఉన్నవాడు, జగత్తులన్ని౦టికి కారణమైన సర్వేశ్వరుని మనస్సులో ధ్యానిస్తూ- యోగులూ, మునులు నిద్ర లేచి “హరీ హరీ” అ౦టూ మెల్లగా ప్రార్థిస్తున్నారు. ఆ గొప్ప ధ్వని మా మనస్సులలో ప్రవేశి౦చి మమ్మల్ని నిద్రలేపి౦ది. కావున నీవు కూడా నిద్రలేచి రావమ్మా!” అని గోదాదేవి తన చెలులను నిద్ర లేపుతోంది.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 6 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 7
కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్,
కలన్దు పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే,
కాశుం పిఱప్పుం కలకలప్ప కైపేర్తు,
వాశ నఱుంకుళ’లాయిచ్చియర్, మత్తినాల్
ఓశై ప్పడుత్త త్తయిరరవం కేట్టిలైయో,
నాయగ ప్పెణ్పిళ్ళాయ్ నారాయణన్ మూర్తి,
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో,
దేశముడైయాయ్ తిఱవేలోరెమ్బావాయ్ || 7 ||
భావం:
ఈ 30 పాశురాల్లో ఆరవ పాశురం నుంచి పది పాశురాల వరకూ గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ, పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. నేటి నుంచి ఒక్కొక్క రోజు ప్రకృతి వర్ణనతో ఒకొక్క చెలిని నిద్ర లేపుతుంది గోదాదేవి. పక్షుల కిలకిలారావాలు, రంగురంగుల పూలు, వెన్నను చిలికినప్పుడు వచ్చే సంగీత ధ్వనులు, ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం, మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను తట్టి లేపుతూ, వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది. ఇందులో, కృష్ణానుభవములో ప్రావీణ్యం ఉన్న ఒక గోపికను ఆండాళ్ మేల్కొలుపుతుంది. అయితే, ఈ గోపిక అండాళ్ మరియు ఆమె స్నేహితుల మధురమైన స్వరాన్ని వినడానికి తన ఇంటి లోపలే ఉంది.
ఓయీ! పిచ్చిపిల్లా! భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ చేస్తున్న కలకలములు వినపడలేదా ? అదిగో! సువాసనలు వెదజల్లుతున్న కురులుగల ఆ గోప కాంతలు తాము ధరించిన ఆభరణాలన్నీ ధ్వనించేట్టుగా చేతులను తిప్పుతూ కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులేవీ వినబడలేదా? భగవద్విషయానుభవము నెరిగినదానవు. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే ఇపుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యంకొద్దీ అవతరించాడు. మనకొరకే ‘కేశి‘ మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా అతనికి కృతజ్ఞులమై అతని గుణగానం చేస్తున్నాము. ఐనా… వానిని వింటూనే ఇంకా పడుకొనే ఉన్నవేంటి? మేము పాడే యీ పాటల ఆనందముతో నీవు మురిసిపోతున్నావులే! ఇకనైనా లేచి రామ్మా! వ్రతం ఆచరించటానికి ఇంకా అలస్యం దేనికి?” అని ఒక గోపకన్యను నిద్ర లేపుతోంది ఆండాళ్ తల్లి.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 7 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 8
కీళ్’వానం వెళ్ళెన్ఱు ఎరుమై శిఱువీడు,
మేయ్‍వాన్ పరన్దన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్,
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు,
ఉన్నైక్కూవువాన్ వన్దు నిన్ఱోమ్, కోదుగలముడైయ
పావాయ్ ఎళు’న్దిరాయ్ పాడిప్పఱై కొండు,
మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ,
దేవాదిదేవనై శెన్ఱు నాం శేవిత్తాల్,
ఆవావెన్ఱారాయ్‍న్దరుళేలోరెమ్బావాయ్ || 8 ||
భావం:
ఈ పాశురాల్లో ఆరవ పాశురం నుంచి పది పాశురాల వరకూ గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ, పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. పక్షుల కిలకిలారావాలు, రంగురంగుల పూలు, వెన్నను చిలికినప్పుడు వచ్చే సంగీత ధ్వనులు, ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం, మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్ణనతో తన చెలులను తట్టి లేపుతూ, వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది. మంచు బిందువులు కురిసిన గడ్డిని తినేసిన ఆలమందలు నెమరువేసుకుంటూ, ఉరకలు వేస్తూ ఊరు దాటి వెళుతున్నాయి.
ఇందులో ఆమె శ్రీకృష్ణుడికి చాలా నచ్చిన గోపికను నిద్రలో నుండి మేల్కొలుపుతుంది. ఆ కారణంగా ఆ గోపిక చాలా గర్వంతో ఉండేది. శ్రీకృష్ణుడికి ప్రియమైన ఓ గోపికా! తూర్పు దిక్కున తెల్లవారుతున్నది. చీకట్లు తొలగి ఉదయభానుడు వచ్చేలోగానే యమునలో మూడు మునకలు వేసి మనం పూజకు సిద్ధం కావాలి. ఈలోగా ఆ చిన్ని కన్నయ్యని కూడా లేపాలి. తూర్పు దిక్కున ఆకాశము తెల్లవారింది. గేదెలు మేతకై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు రావడానికి కంటే ముందుగానే అతని వద్దకు చేరాలని కోరుకుంటున్నారు. అందరం కలిసి ఇష్టంగా కృష్ణుడి వద్దకు వెళ్లడం కోసం బయలుదేరాము. వారందరినీ అక్కడ నిలిపి, నీ కోసం నేను వచ్చాను. నీకు కూడా కృష్ణుడిని చేరుకోవాలని కుతూహలముగానే ఉంది కదా.. మరింక ఆలస్యమెందుకు? లే.. కేశి అనే రాక్షసుడి చీల్చి వధించిన, చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి, నిత్యాసురులకు నాయకుడైన కృష్ణుడిని మనం ఆరాధిస్తే, అతను మన లోపాలను విశ్లేషించి త్వరగా మనల్ని అనుగ్రహించి కటాక్షించును. కృష్ణుడు కంటే ముందుగానే మనం అతని వద్దకు వెళ్ళితే.. సంతోషంగా మన కోరిక నెరవేరుస్తాడు. రా” అంటూ మరో గోపికను గోదా దేవి నిద్ర లేపింది.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 8 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 9
తూమణిమాడత్తు చ్చుట్రుం విళక్కెరియ,
తూపం కమళ’ త్తుయిలణై మేల్ కణ్వళరుమ్,
మామాన్ మగళే మణిక్కదవం తాళ్ తిఱవాయ్,
మామీర్ అవళై ఎళుప్పీరో, ఉన్ మగళ్ తాన్
ఊమైయో ? అన్ఱి చ్చెవిడో, అనన్దలో ?,
ఏమ ప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో ?,
మామాయన్ మాదవన్ వైకున్దన్ ఎన్ఱెన్ఱు,
నామం పలవుం నవిన్ఱేలోరెమ్బావాయ్ || 9 ||
భావం:
ధనుర్మాసంలో గోదాదేవి పాడిన పాశురాలలో ఈ రోజు తిరుప్పావై తొమ్మిదవ పాశురం. ఈ పాశురాల్లో ఆరవ పాశురం నుంచి పది పాశురాల వరకూ గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ, పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్ణనతో గోపికలను నిద్రలేపుతూ ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను తట్టి లేపుతూ, వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది.
నిర్దోషములైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టూ దీపాలు వెలుగుతుండగా, అగరు ధూపములు పరిమళాలను వెదజల్లుచుండగా, అతిమెత్తనైన హంసతూలికా తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా! మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా! ఏమమ్మా! మేనత్తా! నీవైనా ఆమెను లేపుమమ్మా! నీ పుత్రిక మూగదా? చెవిటిదా? లేక బద్దకస్తురాలా? లేక ఆమెకు ఎవరినైనా కావలి వుంచినారా? లేక యింత మైమరచి నిద్రించుటకేమైన మంత్రించి వుంచినారా? ఆమెకేమైనది నిద్ర లేచుటలేదు? మహా మాయావీ ! మాధవా ! వైకుంఠ వాసా! అని అనేకమైన తిరునామాలను వినిపిస్తున్నా కూడా ఆమెకు వినబడుటలేదేమి? ఇంకను లేవదేమి? అని సంపదలతో తులతూగుతున్న తన చెలిని గోదాదేవి నిద్ర లేపుతున్నది.
Video రూపంలో చూడండి ↓
పాశురం –9 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 10
నోట్రు చ్చువర్‍క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్,
మాట్రముం తారారో వాశల్ తిఱవాదార్,
నాట్ర త్తుళా’య్ ముడి నారాయణన్, నమ్మాల్
పోట్ర ప్పఱై తరుం పుణ్ణియనాల్,
పణ్డొరునాళ్ కూట్రత్తిన్ వాయ్ వీళ్’న్ద కుంబకరణనుమ్,
తోట్రుమునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో ?,
ఆట్ర వనన్దలుడైయాయ్ అరుంగలమే,
తేట్రమాయ్ వన్దు తిఱవేలోరెమ్బావాయ్ || 10 ||
భావం:
గోదాదేవి ధనుర్మాసంలో రంగనాధుడిని భర్తగా పొందడానికి వ్రతమాచరిస్తూ పాడిన పాశురాలలో, ఈ రోజు తిరుప్పావై పదవ పాశురం. ఈ పదవ పాశురం వరకూ గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ, పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను తట్టి లేపుతూ, వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది. ఈరోజు మరో గోపికను నిద్ర లేపుతూ.. నీవు మంచినోము నోచి, స్వర్గఫలాన్ని అందుకున్నావు. గొల్లభామలందు గొప్పదానివి. నువ్వు త్వరగాలే. మాతో వచ్చి ఆ చిన్ని కన్నయ్య ని కూడా లేపాలి అంటూ గోదాదేవి, మిగిలిన గోపికలతో కలిసి నిద్ర లేపుతుంది.
ఇంకొక గోపిక ముందుగానే నోమునోచినది. సుఖానుభవం పొందుతుంది. తలుపులు తెరవకపోయినా మాతో మాట్లాడవచ్చు కదా. కుంభకర్ణుడు తన సొత్తు అయిన గాఢనిద్రను నీకు కప్పంగా ఇచ్చాడా? గాఢ నిద్ర మత్తు వదులు, మైకము వీడు అని గోపికను మందిలిస్తుంది గోదా. పరిమళముతో నిండిన తులసి మాలలు ధరించి కిరీటముగల నారాయణుడు, పుణ్యస్వరూపుడు అయిన కృష్ణుణ్ణి మంగళాశాసనములు పాడిన ‘పరయను వాయిద్యమును మనకిచ్చును. మా అందరికి మణిరత్నం లాంటి దానివి అంటూ గోపికను పొగుడుతూ.. మైకము వదిలి వచ్చి త్వరగా తలుపు తెరువమ్మా” అంటూ గోదాదేవి, మిగిలిన గోపికలు లోపల నిద్రలో ఉన్న గోపికను కోరుతున్నారు. ఈ పాశురం విన్నంతనే అన్ని కష్టాలు తీరతాయని పెద్దల విశ్వాసం.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 10 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 11
కట్రుక్కఱవై క్కణంగళ్ పలకఱన్దు,
శెట్రార్ తిఱలళి’య చ్చెన్ఱు శెరుచ్చెయ్యుమ్,
కుట్రమొన్ఱిల్లాద కోవలర్ తం పొఱ్కొడియే,
పుట్రరవల్‍గుల్ పునమయిలే పోదరాయ్,
శుట్రత్తు తోళి’మారెల్లారుం వన్దు, నిన్
ముట్రం పుగున్దు ముగిల్ వణ్ణన్ పేర్ పాడ,
శిట్రాదే పేశాదే శెల్వ ప్పెండాట్టి,
నీ ఎట్రుక్కుఱంగుం పొరుళేలోరెమ్బావాయ్ || 11 ||
భావం:
ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్ణనతో గోపికలను నిద్రలేపుతూ ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను తట్టి లేపుతూ, వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది. ఈరోజు పదకొండవ పాశురము అర్ధం తెలుసుకుందాం. ఇందులో, బృందావనంలో శ్రీకృష్ణుడి వలె అందరిచే చాలా ఇష్టపడే ఒక గోపికను నిద్ర లేపుతుంది. ఈ పాశురములో, వర్ణాశ్రమ ధర్మ అనుసరణ యొక్క ప్రాముఖ్యత చూపబడింది. ఈరోజు గోదా దేవి కులవతి, గుణవతి, గుణ సతి అయిన గోపికను నిద్ర లేపుతుంది. ఓ గోపాలకుల తిలకమా! ఓ చిన్నదానా! లేత వయస్సు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది. ఆ సమూహాల పాలు పిదుకతగినవారును, శత్రువులు నశించునట్లు యుద్ధం చేయగలవారును, ఒక్క దోషమైనను లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగవంటి అందమైనదానా! పుట్టలోని పాము పడగలా, అడవిలోని నెమలి వలే అందమైన జుత్తుగలదానా లేచి బయటకు రావా.. చుట్టాలు, చెలికత్తెలు, అందరూ వచ్చేశారు.. లేచిరా.. అందరూ వచ్చి .. నీ ముంగిట్లో చేరారు.. కృష్ణుడి నామాలు కీర్తిస్తున్నారు నీకు వినిపించడంలేదా.. అయినా ఉలకకుండా పలకకుండా ఎలా ఉన్నావు. తల్లీ ఓ సంపన్నురాలా.. నీ నిద్రకు అర్ధము ఏమిటో చెప్పవమ్మా అంటూ గోదాదేవి ఒక గోపికను నిద్రలేపుతోంది.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 11 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 12
కనైత్తిళం కట్రెరుమై కన్ఱుక్కిఱంగి,
నినైత్తు ములై వళి’యే నిన్ఱు పాల్ శోర,
ననైత్తిల్లం శేఱాక్కుం నఱ్చెల్వన్ తంగాయ్,
పనిత్తలై వీళ’ నిన్ వాశఱ్ కడై పట్రి,
శినత్తినాల్ తెన్నిలంగై క్కోమానై చ్చెట్ర,
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్,
ఇనిత్తానెళు’న్దిరాయ్ ఈదెన్న పేరుఱక్కమ్,
అనైత్తిల్లత్తారు మఱిన్దేలోరెమ్బావాయ్ || 12 ||
భావం: ఇందులో, ఆమె శ్రీకృష్ణుడి సఖుని యొక్క సోదరి అయిన ఒక గోపికను మేల్కోలుపుతుంది. లేగ దూడలను తలుచుకొని, గేదెలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ వున్నాయి. ఆ పాల ధారలతో నీ ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదమయమైపోయింది. ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లిలివైతివి. ఓయమ్మా! మేమందరము నీవాకిటకు వచ్చి పైన మంచు కురుస్తున్నా సహించి, నీ గడపనానుకొని నిలిచియున్నాము. పైన మంచు కురియుచున్నది, క్రింద పాలధారలు బురద చేయుచున్నవి. మేమంతా మనస్సులో మాధవునే నింపుకొని వున్నాము. పైన మంచు కురియటమనే శ్రీసూక్తి ధారల ప్రవాహం సాగిపోతూంది. కాళ్ళ క్రింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతోంది. మనస్సులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తి ధారలు విచ్చిన్నంగా పొంగి పొరలుతున్నా ఈ ముప్పేట ధారలతో తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకొనుటకై నీ వాకిట గుమ్మాన్ని పట్టుకొని నిలబడి వున్నాము. ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధముతో, ఆ స్వర్ణలంకాధిపతియైన పది తలల రావణుని మట్టుబెట్టిన, పరమాత్ముడైన శ్రీరాముని గుణగణాలను స్తుతిస్తున్నాము. కీర్తిస్తున్నాము. పాడుతున్నాము. మేమింత చేయుచున్నా నీవు నోరైన మెదుపుట లేదేమి తల్లీ! ఇది యేమి మొద్దు నిద్దరమ్మా ! నీ గొప్పతనాన్ని మేమెరిగితిమిలేవమ్మా. నీ మొద్దు నిద్దుర విషయమంతా ఊరూ వాడ తెలిసిపోయిందిలే! ఇక నీ మొద్దునిద్దర చాలించి, నీ ధ్యాన స్థితి నుంచి మేలుకో. మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తిచేయటానికి సహాయపడు” అంటూ ఏడవ గోపికను లేపుచున్నారు.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 12 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 13
పుళ్ళిన్ వాయ్ కీణ్డానై ప్పొల్లా వరక్కనై
క్కిళ్ళి క్కళైన్దానై క్కీర్తిమై పాడిప్పోయ్,
పిళ్ళైగళెల్లారుం పావైక్కళంబుక్కార్,
వెళ్ళి యెళు’న్దు వియాళ’ముఱంగిట్రు,
పుళ్ళుం శిలమ్బిన కాణ్! పోదరిక్కణ్ణినాయ్,
కుళ్ళక్కుళిర క్కుడైన్దు నీరాడాదే,
పళ్ళిక్కిడత్తియో పావాయ్! నీ నన్నాళాల్,
కళ్ళం తవిర్‍న్దు కలన్దేలోరెమ్బావాయ్ || 13 ||
భావం: ఇందులో ఒక గోపిక కళ్ళ అందాన్ని మెచ్చుకుంటూ మేల్కొలుపుతుంది. పక్షి శరీరమును ఆవహించిన బకాసురుడి నోరు చీల్చిన శ్రీ కృష్ణుని, దుష్ట రాక్షసుడగు రావణుని వధించిన శ్రీరాముని గానము చేస్తూ, మన తోడి పిల్లలందరూ వ్రత ప్రదేశానికి చేరారు. తామరపూలను పోలిన కన్నులు గలదానా! లేడి వంటి చూపులుగలదానా! గురుడు అస్తమించి శుక్రుడు ఉదయిస్తున్నాడు. పక్షులన్నీ తమ ఆహారాన్వేషణ నిమిత్తం, అరచుకొంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి” అని గోపికలు చెప్పగా, నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరిచి చూసింది. వికసించిన తామరపూవులందు వ్రాలిన తుమ్మెద వంటి కన్నులు గలదానా! ఇకనైనను లేచి రావమ్మా! నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణస్వామి తానే నీవద్దకు వచ్చునని భ్రమించకు. శ్రీ కృష్ణ విరహతాపమును తీర్చుకొనుటకు యీ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా! ఇంక పరుండరాదు. మనము నోచే యీ వ్రతమునకు ఇది శుభ సమయము. ఓ సుందరీ! నీ కపటమును వీడి మాతో కలిసి మహిమాన్వితమగు యీ వ్రతాన్ని సాంగోపాంగముగ పూర్తి చేయుటకు సహకరించుము. అంతా శుభములే కలుగుతాయి” అని గోదాదేవి, ఇతర చెలులతో కలిసి ఎనిమిదవ గోపికను మేల్కొలుపుతున్నారు.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 13 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 14
ఉంగళ్ పుళై’క్కడై త్తోట్టత్తు వావియుళ్,
శెంగళు’ నీర్ వాయ్ నెగిళ్’న్దు అమ్బల్ వాయ్ కూమ్బిన కాణ్,
శెంగల్ పొడి క్కూఱై వెణ్బల్ తవత్తవర్,
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్,
ఎంగళై మున్నం ఎళు’ప్పువాన్ వాయ్ పేశుమ్,
నంగాయ్ ఎళు’న్దిరాయ్ నాణాదాయ్ నావుడైయాయ్,
శంగొడు శక్కరమేన్దుం తడక్కైయన్,
పంగయక్కణ్ణానై ప్పాడేలోరెమ్బావాయ్ || 14 ||
భావం:
ఈ పాశురములో “తానే అందరికంటే ముందుగా మేల్కొని, మిగిలిన వారిని కూడా లేపెదనని” చెప్పిన ఒక గోపికను నిద్ర లేపుతున్నది గోదాదేవి. తెల్లవారిపోయినది. చూడు. నీ పెరటి తోటలో దిగుడు బావిలోని ఎర్ర తామరలు వికసించినవి. నల్ల కలువలు ముడుచుకొని పోవుచున్నవి. ఎఱ్ఱని కాషాయ వస్త్రములు ధరించి తెల్లని పలువరుస కలిగి, వైరాగ్యముతో కూడిన సన్యాసులు దేవాలయాలలో భగవదారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి తాళపు చెవులను తీసికొని వెళ్ళుచున్నారు. ఇవన్నీ ప్రాతః కాలమునకు సూచనలేకదా! లెమ్ము. నీవే వచ్చి మమ్మల్ని నిద్ర లేపుతానని మాట ఇచ్చితివి. మరచితివా! శంఖ చక్రమును ధరించిన వాడును, ఆజానుభాహువు, పుండరీకాక్షుని గానము చేయుటకు లేచిరమ్ము. మేము నీతో కలిసి పాడెదము. ఇలా గోష్టిగా సంకీర్తనము చేసిన- మన వ్రతము ఫలించగలదు. కావున వెంటనే మేలుకొనుమమ్మా” అని గోదాదేవి యీ పాశురంలో తొమ్మిదవ గోపికను లేపుచున్నది.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 14 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 15
ఎల్లే! ఇళంకిళియే ఇన్నముఱంగుదియో,
శిల్లెన్ఱళై’యేన్మిన్ నంగైమీర్ పోదరుగిన్ఱేన్,
వల్లై ఉన్ కట్టురైగళ్ పండే యున్ వాయఱిదుమ్,
వల్లీర్‍గళ్ నీంగళే నానేదానాయిడుగ,
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై,
ఎల్లారుం పోన్దారో? పోన్దార్ పోన్దెణ్ణిక్కొళ్,
వల్లానై కొన్ఱానై మాట్రారై మాట్రళి’క్క
వల్లానై, మాయానై పాడేలోరెమ్బావాయ్ || 15 ||
భావం:
ఈ పాశురములో, తన భవనము వద్దకు వస్తున్న ఆండాళ్ని, ఆమె స్నేహితులను చూడటానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఒక గోపికని పిలుస్తున్నారు. ఈ పాశురము- లోన ఉన్న గోపికకు బయటి గోపికకు సంభాషణ రూపంలో వున్నది. బయటి గోపికలు “ఓ లేత చిలుక వంటి కంఠ మాధుర్యము కలదానా ! ఇంకనూ నిద్రించుచున్నావా ! అయ్యో ఇది ఏమి? అని పలుకగా లోపలి గోపిక- “పూర్ణులగు గోపికలరా ! గొల్లుమని ఉలికిపడునట్లు గొంతెత్తి చెవులు చిల్లులు పడునట్లు పిలువకండి. నేను ఇప్పుడే వస్తున్నాను” అన్నది. అప్పుడు బయటి గోపికలు “నీవు చాలా నేర్పుగల దానివి. నీ మాటలలోని నైపుణ్యమును, కాఠిన్యమును మేము ఇంతకు ముందే ఎరుగుదుము” అని అనగా లోపలి గోపిక “మీరే నేర్పుగలవారు, పోనీలే, నేనే కఠినురాలను” అన్నది. బయటి గోపికలు “నీకీ ప్రత్యేకత ఏమి? అలా ఏకాంతముగా ఉంటావేమి? వేగముగా వెలికి రమ్మనగా, లోని గోపిక “అందరు గోపికలును వచ్చిరా? అని అడిగినది. అప్పుడు బయటి గోపికలు “అందరూ వచ్చిరి. నీవు వచ్చి లెక్కించుకొనుము” అన్నారు. సరే ! నేను వచ్చి ఏమి చేయవలెను? అన్నది లోపలి గోపిక. బయటి గోపికలు “కువలయాపీడమనే కంసుని గజమును, కంసాది శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీ కృష్ణుని కల్యాణ గుణములను కీర్తింపగా రమ్ము. ఇట్లు చేసినగాని మనము చేయు వ్రతము శుభప్రదముగ పూర్తికాదు అని బయటినుంచి సమాధానము చెప్పి ఆమెను కూడ తమ గోష్టిలోనకి చేర్చుకొన్నారు గోపికలు.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 15 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 16
నాయగనాయ్ నిన్ఱ నన్దగోపనుడైయ
కోయిల్ కాప్పానే, కొడిత్తోన్ఱుం తోరణ
వాయిల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్,
ఆయర్ శిఱుమియరోముక్కు, అఱైపఱై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్ నేర్‍న్దాన్,
తూయోమాయ్ వన్దోం తుయిలెళ’ప్పాడువాన్,
వాయాల్ మున్నమున్నం మాట్రాదే అమ్మా, నీ
నేయ నిలైక్కదవం నీక్కేలోరెమ్బావాయ్ || 16 ||
భావం:
16 వ పాశురంలో నందగోపుని విశాల భవనం యొక్క ద్వారపాలకులతో మరియు వారి గది యొక్క భటులతో సంభాషిస్తోంది. అందరికీ నాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భవనపాలకా! మమ్ము లోనికి పోనిమ్ము.. జెండాతో ఒప్పుచున్న తోరణములతో, శోభించుచున్న ద్వారమును కాపాడు ద్వారపాలకా! మేము వ్రేపల్లెలో నుండు గొల్లపిల్లలము. స్వామిని దర్శింపవచ్చాము. పరిశుద్ధులమయి వచ్చాము. మణులతో కూడిన గడియను తెరువుము. మేము స్వామికి శరణాగతి చేసినవారము. అజ్ఞానులమైననూ స్వామి యండు అత్యదిక ప్రేమానురాగములు కలవారము. స్వామికి సుప్రభాతము పాడి మేలుకొలుప వచ్చినాము. గోప బాలికలైన మాకు మాయావియు, మణివర్ణుడును అగు శ్రీకృష్ణ పరమాత్మ ధ్వని చేయు ‘పఱ’ యను వాద్యమును ఇచ్చెదనని నిన్ననే మాటయిచ్చెను. మేము వేరొక ప్రయోజనమును కాంక్షించి వచ్చిన వారము కాదు. పరిశుద్ధ భావముతో శ్రీకృష్ణుడిని మేల్కొలుపుటకు వచ్చితిమి. ఇప్పుడనన్య ప్రయోజనులమై స్వామి నిద్రలేచునట్లుగ సుప్రభాతమును పాడగా వచ్చాము. స్వామీ! నీవు ముందుగానే కాదనకుము. తలుపులు తెరచి మమ్మల్ని లోనికి పోనీయవలెను అని గోపికలు భవన పాలకుని, ద్వారపాలకుని అర్థించిరి.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 16 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 17
అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుమ్,
ఎమ్బెరుమాన్ నన్దగోపాలా ఎళు’న్దిరాయ్,
కొమ్బనార్‍క్కెల్లాం కొళున్దే కుల విళక్కే,
ఎమ్బెరుమాట్టి యశోదాయ్ అఱివుఱాయ్,
అమ్బరమూడఱుత్తు ఓంగి ఉలగళన్ద,
ఉమ్బర్ కోమానే! ఉఱంగాదెళు’న్దిరాయ్,
శెం పొఱ్కళ’లడి చ్చెల్వా బలదేవా,
ఉమ్బియుం నీయుముఱంగేలోరెమ్బావాయ్ || 17 ||
భావం:
ఇందులో గోదాదేవి శ్రీకృష్ణున్ని, యశోదను, బలరాముడిని మేల్కొలుపుచున్నది. ద్వారపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించారు. అప్పుడు వారు “వస్త్రములు, అన్నము, నీళ్ళను ధర్మము చేయు నందగోపాలా! మా స్వామీ! మేల్కొనుము. ఓ సుకుమారమైన శరీరములు గల గోపికలకు నాయకురాలా! మా వంశమునకు మంగళదీపము వంటిదానా! యశోదామాతా! మేల్కొనుము. ఆకాశ మధ్య భాగమును చీల్చుకొని పెరిగి, లోకములనన్నిటిని కొలిచిన త్రివిక్రమా! నీవు నిద్రనుండి మేలుకో. స్వఛ్చమైన ఎఱ్ఱని బంగారముతో చేయబడిన కడియము- కాలికి దాల్చిన బలరామా! నీవునూ, నీ తమ్ముడును ఇద్దరూ మీ దివ్య నిద్ర నుండి మెల్కోవలెను. మీరు ఇంకా నిదురించుట తగదు. కావున శీఘ్రమే లేచి రండి!‘ అని అందరినీ మేల్కొలుపుచున్నారు. వారి కృపను వేడుచున్నారు.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 17 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 18
ఉన్దు మద గళిట్రనోడాద తోళ్వలియన్,
నన్దగోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!,
గన్దం కమళు’ం కుళ’లీ కడైతిఱవాయ్,
వన్దు ఎంగుం కోళి’ యళై’త్తన కాణ్, మాదవి
పన్దల్ మేల్ పల్‍కాల్ కుయిలినంగళ్ కూవిన కాణ్,
పన్దార్ విరలి ఉన్ మైత్తునన్ పేర్ పాడ,
శెన్దామరై క్కైయాల్ శీరార్ వళైయొళిప్ప,
వన్దు తిఱవాయ్ మగిళ్’న్దేలోరెమ్బావాయ్ || 18 ||
భావం: 18 నుండి 20 వ పాశురములలో కృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన నప్పిన్నై పిరాట్టి అంటే నీళా దేవిని, శ్రీకృష్ణ పరమాత్మతో తనకున్న అనుబంధాన్ని, దివ్య రూపాన్ని, నిత్య యవ్వనాన్ని కీర్తించింది. కేవలము పరమాత్మను కోరుకొని, నీళాదేవిని మరచిపోవుటను మన పూర్వాచార్యులు శూర్పణఖ స్వభావంతో పోల్చారు. అలాగే పరమాత్మను మరచి కేవలము పిరాట్టిని ఆశించడాన్ని రావణుని స్వభావంతో పోల్చారు. నంద గోపులు మొదలుకొని బలరాముని వరకు మేల్కొలిపి, తలుపులు తీయమని ప్రార్ధించినా, శ్రీ కృష్ణుడు మేలుకోకపోయేటప్పటికి, ఆండాళ్ నీళాదేవి యొక్క సిఫార్సుతో వారిని మేల్కొలిపే ప్రయత్నము చేస్తుంది. “ఏనుగులతో పోరాడగలిగిన వాడు, మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడు, యుద్దములో శత్రువులను చూచి, వెనుకకు జంకని భుజ బలము గలవాడు అయిన నందగోపుని కోడలా! సుగంధము వెదజల్లుచున్న కేశ పాశముగల ఓ నీళాదేవి! తలుపు గడియ తెరవుము. పెరట్లోని కోళ్లు, జాజి పందిళ్లమీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి, మాటిమాటికి కూయుచున్నవి. పూబంతిని చేతిలో పట్టుకొనినదానా! నీవు, నీ భర్తయును సరసనల్లాపములాడు సందర్భములలో, నీకు ఓటమి గలిగినచో మేము నీ పక్షమునే యుందుము. కావున అందమైన నీ చేతులకున్న భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడచి వచ్చి, ఎర్ర తామరలవంటి నీ సుకుమారమైన చేతులతో తలుపులను తెరువుమమ్మా!‘ అని గోపాంగనలు నీళాదేవిని ఈ పాశురంలో మేల్కొల్పుచున్నారు.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 18 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 19
కుత్తు విళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్,
మెత్తెన్ఱ పంచశయనత్తిన్ మేలేఱి,
కొత్తలర్ పూంగుళ’ల్ నప్పిన్నై కొంగైమేల్,
వైత్తు క్కిడన్ద మలర్ మార్ పా వాయ్ తిఱవాయ్,
మైత్తడం కణ్ణినాయ్ నీయున్ మణాళనై,
ఎత్తనై పోదుం తుయిలెళ’వొట్టాయ్ కాణ్,
ఎత్తనైయేలుం పిరివాట్ర గిల్లైయాల్,
తత్తువమన్ఱు తగవేలోరెమ్బావాయ్ || 19 ||
భావం: ఈ పాశురంలో గోదాదేవి శ్రీకృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన నీళాదేవిని మేల్కొలుపుతుంది. గుత్తి దీపములు చుట్టూ వెలుగుతుండగా, ఏనుగు దంతములతో చేయబడిన కోళ్ళుగల మంచముపై- చల్లగా, మెత్తగా, సరైన ఎత్తు, వెడల్పు కలిగి తెల్లని హంస తూలికా తల్పముపై నెక్కి, గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు, తలలో ముడుచుకొన్న కేశపాశము గల నీలాదేవి దగ్గర ఉన్న శ్రీ కృష్ణా! నోరు తెరచి మాట్లాడుము. కాటుక పెట్టుకొన్న విశాలమైన కన్నులు గల ఓ నీలాదేవి! నీవు నీ ప్రియుని ఇంకా లేవనివ్వడం లేదేంటి? ఇంత మాత్రము ఎడబాటు కూడ ఒర్చుకోలేకపోవడం నీ స్వరూపానికి, స్వభావమునకు తగదు. నీవలె మేము కూడా అతనికి భక్తులమే. కనుక కరుణించి కొంచెమవకాశమీయము తల్లీ! ఆ అవకాశము నీవు ఇచ్చినట్లయితే మేము చేసే యీ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము సమాప్తి చెందును. ఇందు ఏ మాత్రమూ సంశయము లేదు” అని గోదాదేవి నీళాశ్రీకృష్ణులను వేడుకొంటున్నది.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 19 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 20
ముప్పత్తు మూవరమరర్కు మున్ శెన్ఱు,
కప్పం తవిర్కుం కలియే తుయిలెళా’య్,
శెప్పముడైయాయ్ తిఱలుడైయాయ్, శెట్రార్కు
వెప్పం కొడుక్కుం విమలా తుయిలెళా’య్,
శెప్పన్న మెన్ములై శెవ్వాయి శిఱుమరుంగుల్,
నప్పిన్నై నంగాయ్ తిరువే తుయిలెళా’య్,
ఉక్కముం తట్టొళియుం తన్దున్ మణాళనై,
ఇప్పోదే యెమ్మై నీరాట్టేలోరెమ్బావాయ్ || 20 ||
భావం:
ఈ పాశురములో ఆండాళ్ తమకు శ్రీకృష్ణుని దర్శన భాగ్యం కలిగించమని చెబుతూ నీళాదేవిని, శ్రీకృష్ణుడిని మేల్కొలుపుతుంది. 33 కోట్ల దేవతలకు, ఏ విధమైన ఆపదలు వచ్చినా, ముందే అక్కడికి వెళ్లి, వారిని రక్షించు సమర్ధతగల ఓ స్వామీ! నిద్రలేచిరమ్ము. ఆశ్రితులను రక్షించుటకై వారి విరోధులను దునుమాడు బలశాలీ! ఆశ్రిత రక్షకా! ఆశ్రితుల శత్రువులను నీ శత్రువులుగా భావించి, వారికి భయజ్వరమును కల్గించువాడా! నిద్ర నుండి మేల్కొను స్వామీ!’ అని స్తుతిస్తూ మేల్కొలిపారు. అయినా స్వామి మేలుకోకపోవడం చూసి, జగన్నాటక సూత్రధారియైన ఆ జగన్నాధుని మేల్కొలుపుమని నీళాదేవిని ప్రార్ధిస్తున్నారు గోపికలు. దొండపండు వంటి అధరములు, సన్నని నడుము కలిగి, అతిలోక సుందరముగ విరాజిల్లుచున్న ఓ నీళాదేవీ! నీవు శ్రీమహాలక్ష్మీ దేవికి సమానురాలవు! కరుణించి నీవైన మేల్కొనవమ్మా! ‘నేను లేచి మీకేమి చేయవలెనందువేమో!’ వినుము – మన స్వామియైన శ్రీకృష్ణునకు, శరీరముపై చిరుచెమట పట్టినపుడు దానిని ఉపశమింపచేయగా వీవన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన విసనకర్రనిమ్ము. ప్రబోధ సమయాన స్వామి ముఖ మండలము జూచుకొనుటకు ఒక దివ్యమణులతో కూడిన అద్దమునిమ్ము. వీటన్నింటిని మాకనుగ్రహించి, స్వామిని మేల్కొలిపి, మమ్ము అతనితో కూర్చి మంగళస్నానము చేయింపుము తల్లీ! నీ యనుగ్రహమున్ననే కద, మా యీ వ్రతము మంగళముగ పూర్తికాగలదు?’ అని గోదాదేవి, ఇతర గోపికలు నీళాదేవిని వేడుకొంటున్నారు యీ పాశురంలో.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 20 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 21
ఏట్ర కలంగళ్ ఎదిర్‍పొంగి మీదళిప్ప,
మాట్రాదే పాల్ శొరియుం వళ్ళల్ పెరుం పశుక్కళ్,
ఆట్రప్పడైత్తాన్ మగనే అఱివుఱాయ్,
ఊట్రముడైయాయ్ పెరియాయ్, ఉలగినిల్
తోట్రమాయ్ నిన్ఱ శుడరే తుయిలెళా’య్,
మాట్రారునక్కు వలితొలైన్దు ఉన్ వాశఱ్కణ్,
ఆట్రాదు వన్దు ఉన్నడి పణియుమాపోలే,
పోట్రియాం వన్దోం పుగళ్’న్దేలోరెమ్బావాయ్ || 21 ||
భావం:
ఈ పాశురంలో గోదాదేవి నందగోపుని వంశంలో శ్రీకృష్ణుని పుట్టుకను, అతని ఆధిపత్యమును, వేదముల ద్వారా స్తుతించబడిన అతని గుణాలను స్తుతిస్తుంది. పొదుగు క్రిందనుంచిన కడవలు చరచరనిండి పొంగిపొరలునట్లు, క్షీరధారలను వర్షించే గోసంపద గల్గిన నందగోపుని కుమారుడా! మేల్కొనుము. ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతి స్వరూపా! నిద్ర నుండి లెమ్ము. శత్రువులు నీ పరాక్రమమునకు లొంగి నీకు భయపడి, ఓడిపోయి, నీవాకిట నిల్చి, నన్ను శరణుజొచ్చిన రీతిని, మేము కూడ నిన్ను వీడి ఉండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశాసనము చేయుటకై నీ విశాలమైన భవన ముఖ ద్వారము వద్దకు వచ్చితిమి. నిన్నాశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేలుకొనుస్వామీ! లేచి రావయ్యా! అని వేడుకొంటున్నారు.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 21 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 22
అంగణ్ మా ఞాలత్తరశర్, అభిమాన
బంగమాయ్ వన్దు నిన్ పళ్ళిక్కట్టిఱ్కీళే’,
శంగమిరుప్పార్ పోల్ వన్దు తలైప్పెయ్‍దోమ్,
కింకిణి వాయ్‍చ్చెయ్‍ద తామరై ప్పూప్పోలే,
శెంగణ్ శిఱుచ్చిఱిదే యెమ్మేల్ విళి’యావో,
తింగళుమాదిత్తియను మెళు’న్దాఱ్పోల్,
అంగణిరణ్డుంకొణ్డు ఎంగళ్ మేల్ నోక్కుదియేల్,
ఎంగళ్ మేల్ శాపమిళి’న్దేలోరెమ్బావాయ్ || 22 ||
భావం:
తనకూ తన స్నేహితులకు వేరే ఆశ్రయం లేదని, శ్రీ రామునికి శరణాగతి చేయడానికి విభీషణుడు వచ్చినట్లే, వారూ అతని వద్దకు వచ్చారని ఆండాళ్ శ్రీకృష్ణుడికి విన్నవించుకుంటుంది. అన్ని కోరికలు వదులుకొని, కేవలము వారి అనుగ్రహమే ఆశించి వచ్చామని తెలియజేస్తుంది. చిరుమువ్వలు నోళ్ళు తెరచినట్లుగా, సగము విరిసిన తామరపూవువలె మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాలను మెల్లమెల్లగా విచ్చి, మాపై ప్రసరింపజేయుము. సూర్యచంద్రులిరువురు ఒక్కసారి ఆకాశమున ఉదయించునట్లుండే నీ రెండు నేత్రములతో నీ దివ్య అనుగ్రహము మావైపు కటాక్షించినచో, మా కర్మ బంధములన్నీ తొలగిపోవును. మా కర్మబంధములు తొలగగానే మేము నిన్ను చేరుకుంటాము. మా వ్రతమునకు పొందవలసిన ఫలము కూడా ఇదే. కర్మ బంధం తొలగితే ముక్తి లభిస్తుందని” గోదాదేవి తెలియజేస్తోంది.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 22 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 23
మారిమలై ముళై’ఞ్జిల్ మన్ని క్కిడన్దుఱంగుమ్,
శీరియ శింగమఱివుట్రు త్తీవిళి’త్తు,
వేరి మయిర్‍ప్పొంగ వెప్పాడుం పేర్‍న్దుఉదఱి,
మూరి నిమిర్‍న్దు ముళ’ంగి ప్పుఱప్పట్టు,
పోదరుమా పోలే నీ పూవైప్పూవణ్ణా, ఉన్
కోయిల్ నిన్ఱు ఇంగనే పోన్దరుళి, కోప్పుడైయ
శీరియ శింగాశనత్తిరున్దు, యాం వన్ద
కారియమారాయ్‍న్దరుళేలోరెమ్బావాయ్ || 23 ||
భావం:
ఈ పాశురంలో చాలా కాలము ఆండాళ్ని వేచి ఉంచిన తరువాత, శ్రీ కృష్ణ పరమాత్మ తన కోరిక ఏమిటో అడుగుతారు. దానికి బదులుగా గోపికలతో కూడిన గోదాదేవి తమ మనోభీష్టాన్ని ఇలా తెలియజేస్తోంది. వర్షా కాలములో చలనము లేకుండా పర్వత గుహలో ముడుచుకొని పరుండి నిద్రించుచున్న సింహము మేల్కొని, తీక్షణమైన తన చూపులతో నలుదిశలా పరికించి చూసినట్టు, పరిమళముగల తన జూలు నిక్కబొడుచునట్లు అటుఇటు దొర్లి, లేచి తన శరీరమును బాగుగ సాగదీసి, ఒళ్లు విరుచుకొని ఒక్క పెట్టున గర్జించి, గుహనుంచి రాజఠీవితో బయటకు వచ్చిన విధంగా- ఓ స్వామీ! నీవు నీ భవనము నుండి ఆ సింహరాజములాగా వచ్చి, మనోహరంగా అలంకరింపబడిన యీ దివ్య సింహాసనమును అలంకరించవలె! అటుపై మేము వచ్చిన కార్యము ఎరుగవలె! ఎరిగి మా అభీష్టాన్ని అనుగ్రహించవలె!’ అని స్వామిని గోపికలతో కూడిన ఆండాళ్ తల్లి తమ మనోభీష్టాన్ని తెలియజేసింది.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 23 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 24
అన్ఱు ఇవ్వులగమళన్దాయ్ అడిపోట్రి,
శెన్ఱంగుత్ తెన్నిలంగై శెట్రాయ్ తిఱల్ పోట్రి,
పొన్ఱ చ్చగడముదైత్తాయ్ పుగళ్’ పోట్రి,
కన్ఱు కుణిలా వెఱిన్దాయ్ కళ’ల్ పోట్రి,
కున్ఱు కుడైయాయ్ ఎడుత్తాయ్ గుణం పోట్రి,
వెన్ఱు పగై కెడుక్కుం నిన్‍కైయిల్ వేల్ పోట్రి,
ఎన్ఱెన్ఱున్ శేవగమే యేత్తి ప్పఱై కొళ్వాన్,
ఇన్ఱు యాం వన్దోం ఇరన్దేలోరెమ్బావాయ్ || 24 ||
భావం:
శ్రీకృష్ణుడు వచ్చి ఆసీనుడైన తరువాత, గోదాదేవి మంగళాశాసనము చేయటం ప్రారంభిస్తుంది. పరమాత్మకు మంగళాసాసనము చేయడమే పెరియాళ్వార్ యొక్క ముద్దు బిడ్డ అయిన ఆండాళ్ యొక్క లక్ష్యము. అలనాడు బలివలన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు రక్షించుటకు త్రివిక్రముడవై మూడు లోకాలను కొలిచిన వామనుడా! నీ రెండు పాదములకును మంగళము! సీతమ్మనపహరించిన దుష్టడగు రావణుని లంకను గెల్చిన ఓ శ్రీరామా! నీ ధీరతకు మంగళము! బండి రూపంలో శకటాసురుడనే రాక్షసుడు నిన్ను చంపప్రయత్నింపగా, వాని కీళ్ళూడునట్లు తన్నిన నీ కీర్తి ప్రభలకు మంగళము! దూడ రూపమున నిన్ను చంపవచ్చిన వత్సాసురుడనే రాక్షసుని, వెలగ చెట్టుగా దారికి ప్రక్కన నిల్చిన- కపితాసురుడనే రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన నీ పాదమునకు మంగళము! దేవేంద్రుడు రాళ్ళ వర్షమును కురిపించగా గోవర్ధనగిరిని గొడుగుగా ఎత్తి, గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకును మంగళము. శత్రువులను చీల్చి చెండాడునట్టి నీ చేతిలోని చక్రమునకు మంగళము. ఇలా నీ వీర గాధలెన్నింటినో నోరార సుత్తిస్తూ, నీ నుండి మా నోముకు కావాల్సిన పరికరములను పొందుటకై, మేము నేడు ఇక్కడికి వచ్చాము. కావున మా యందు దయచేసి వానిని కృపతో ప్రసాదింపుము” అని గోపికల్లెలరు స్వామిని వేడుకొన్నారు.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 24 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 25
ఒరుత్తి మగనాయ్ ప్పిఱన్దు, ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర,
తరిక్కిలానాగిత్తాన్ తీంగు నినైన్ద,
కరుత్తై ప్పిళై’ప్పిత్తు క్కంజన్ వయిట్రిల్,
నెరుప్పెన్న నిన్ఱ నెడుమాలే, ఉన్నై
అరుత్తిత్తు వన్దోం పఱై తరుదియాగిల్,
తిరుత్తక్క శెల్వముం శేవగముం యాంపాడి,
వరుత్తముం తీర్‍న్దు మగిళ్’న్దేలోరెమ్బావాయ్ || 25 ||
భావం:
నిన్ను చంపవలెనని తలంచిన వానిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహము గలవాడా! నిన్నే కోరి వచ్చినవారము. సాక్షాత్తు లక్ష్మియే పొందాలని కోరుకోనే నీ ఐశ్వర్యమును, నీ వీరచరితమును కీర్తించి, శ్రమను వీడి ఆనందించుచున్నాము. ఓ కృష్ణా ! పరమ భాగ్యవతియగు శ్రీ దేవకీదేవికి ముద్దుల పట్టిగ అవతరించి, అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దుబిడ్డవై, రహస్యముగా శుక్లపక్ష చంద్రునివలె పెరుగుచుండగా, గూఢచారులవలన యీ విషయము తెలుసుకున్న కంసుడు నిన్ను మట్టుబెట్టుటకు అలోచించుచుండగా, అతని యత్నములన్నిటిని వ్యర్ధముచేసి వాని కడుపులో చిచ్చువై నిన్ను చంపవలెనని తలంచిన వానిని, నీవే చంపిన ఆశ్రిత వ్యామోహము గలవాడా! నిన్ను భక్తి పురస్సరముగా ప్రార్ధించి నీ సన్నిధికి చేరినాము. మాకు ఇష్టమైన పఱ అను వాద్యమును అనుగ్రహింపుము. ఇట్లు మమ్మనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి యాశపడదగిన సంపదను, దానిని సార్దిక పరచు నీ శౌర్యమును కొనియాడి, నీ విశ్లేషములవలన కలిగిన సంకటమును నివారణ చేసుకొని, మేము సుఖింతుము. నీ విట్లు కృపచేయుటవలన మా యీ అద్వితీయమైన వ్రతము శుభంగా సంపూర్ణమగును.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 25 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 26
మాలే ! మణివణ్ణా ! మార్గళి’ నీరాడువాన్,
మేలైయార్ శెయ్‍వనగళ్ వేండువన కేట్టియేల్,
ఞాలత్తైయెల్లాం నడుంగ మురల్వన,
పాలన్న వణ్ణత్తు ఉన్ పాంచజన్నియమే,
పోల్వన శంగంగళ్ పోయ్‍ప్పాడుడైయనవే,
శాలప్పెరుం పఱైయే పల్లాండిశైప్పారే,
కోల విళక్కే కొడియే వితానమే,
ఆలినిలైయాయ్ అరుళేలోరెమ్బావాయ్ || 26 ||
Video రూపంలో చూడండి ↓
పాశురం – 26 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
భావం:
ఈ పాశురంలో గోదాదేవి నోముకి అవసరమైన ఉపకరణాలు గురించి వివరిస్తుంది. ఇంతకు ముందు ఏమీ అవసరం లేదని ఆమె చెప్పినప్పటికీ, ఆమె ఇప్పుడు మంగళాశాసనము చేయడానికి పాంచజన్యమును, అతని శ్రీముఖాన్ని స్పష్టంగా చూడటానికి దీపము, దివ్య పతాకము, పందిరి మొదలైన ఉపకరణాలను కోరుతుంది. తన కృష్ణానుభవ సంపూర్ణతకై ఆండాళ్ వీటిని కోరుతున్నట్లు మన పుర్వచార్యులు వివరిస్తున్నారు. “ఆశ్రిత వ్యామోహం కలవాడా! ఇంద్రనీలమణిని పోలిన కాంతి, స్వభావం కలవాడా! అఘటితఘటనా సామర్ధ్యంచే చిన్న మర్రి ఆకులపై ఆదమరిచి నిదురించేవాడా. మేము మార్గశిర మాస వ్రతం చేయాలనుకుంటున్నాము. అందుకే కావాల్సిన వాటికోసం నీ వద్దకు వచ్చాము. ఈ స్నాన వ్రతాన్ని మా పూర్వులు శిష్యులు ఆచరించారు. నీవు విన్నచో దానికి కావాలిన పరికరములు తెలియజేస్తాం. ఈ భూమండలం వణుకునట్టు శబ్దం చేయు, పాలవలె తెల్లనైన నీ పాంచజన్యమనే శంఖమును పోలిన శంఖములు కావలెను, విశాలమైన చాలా పెద్ద ‘పర’మను వాయిద్యం కావలెను.. మంగళ వాయిద్యాలు , మంగళ గానం చేయు భాగవతులు, మంగళ దీపాలు, ధ్వజం, మేలు కట్లు కావలెను. నీ కృప చూపుము. లోకలన్నింటినీ నీ చిరుబొజ్జులో దాచుకుని, ఒక లేత మట్టి యాకుమీద పరుండిన నీకు చేతకానిదేమున్నది స్వామీ! కరుణించి మా వ్రతము సాంగోపాంగముగ పూర్తియగునట్లు మంగళాశాసనము చేసి వీనిని ప్రసాదింపుము” అని గోపికలు శ్రీకృష్ణుడిని ఈ 26వ పాశురంలో ప్రార్ధించారు.
పాశురం – 27
కూడారై వెల్లుం శీర్ గోవిందా, ఉన్ తన్నై
పాడి పఱై కొణ్డు యాం పెఱు శమ్మానమ్,
నాడు పుగళుం పరిశినాల్ నన్ఱాగ,
శూడగమే తోళ్ వళైయే తోడే శెవిప్పూవే,
పాడగమే ఎన్ఱనైయ పల్‍గలనుం యామణివోమ్,
ఆడై యుడుప్పోం అదన్ పిన్నే పాఱ్‍శోఱు,
మూడ నెయ్ పెయ్‍దు ముళ’ంగై వళి’వార,
కూడియిరున్దు కుళిర్‍న్దేలోరెమ్బావాయ్ || 27 ||
భావం:
“శత్రువులను జయించే కళ్యాణ గుణ సంపన్న గోవిందా! నిన్ను కీర్తించి వ్రత సాధనమగు పర అను వాద్యమును పొంది, పొందదలచిన ఘన సన్మానం లోకులందరూ పొగిడే రీతిలో ఉండవలెను. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు, బాహువులకు దండకడియములు, చెవి భాగమున దాల్చేడి దుద్దులు, పై భాగమున పెట్టుకొనెడి కర్ణ పూవులు, కాలి అందియలు, గజ్జెలు మొదలగు అనేక ఆభరణాలు మేము ధరించవలెను. తర్వాత మంచి వస్త్రాలు ధరించవలెను. అన్నము, పాలు కలిపి చేసే క్షీరాన్నము మునుగునట్లు పోసిన నేయి మోచేయి వెంబడి కారునట్లు, నీతో కలిసి కుర్చుని, చల్లగా హాయిగా భుజించాలి. ఇదీ మా కోరిక. ఇలా జరిగితే మా వ్రతము మంగళప్రదమైనట్లే!” అని గోదాదేవి.. రంగనాధుడితో తమ వ్రతఫలమును విన్నవించింది.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 27 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 28
కఱవైగళ్ పిన్ శెన్ఱు కానం శేర్‍న్దుణ్బోమ్,
అఱివొన్ఱు మిల్లాద వాయ్‍క్కులత్తు, ఉన్తన్నై
పిఱవి పెరున్దనై ప్పుణ్ణియుం యాముడైయోమ్,
కుఱై ఒన్ఱుమిల్లాద గోవిందా, ఉన్ తన్నోడు
ఉఱవేల్ నమక్కు ఇంగొళి’క్క ఒళి’యాదు,
అఱియాద పిళ్ళైగళోం అన్బినాల్, ఉన్ తన్నై
శిఱుపేరళై’త్తనవుం శీఱి యరుళాదే,
ఇఱైవా! నీ తారాయ్ పఱై యేలోరెమ్బావాయ్ || 28 ||
భావం:
ఓ కృష్ణా ! మేము అవివేక శిఖామణులం. తెల్లవారగానే చద్ది తిని పశువుల వెంట అడవికిపోయి, పశువులను మేపి సాయంకాలము తిరిగి చేరతాము. వివేకం లేని వారం, అజ్ఞానులం. గొల్లపడుచులం. నీవు మా గొల్లకులంలో జన్మించటయే మాకు మహాభాగ్యం. నీతోడి సహవాసమే మాకదృష్టం. ఈ బంధమెన్నటికినీ తెగనిది. త్రెంచిలేనిది. అందుకే మా గోపికాకులం ధన్యమైంది. పరిపూర్ణ కళ్యాణగుణగుణాలతో ప్రకాశించే నీవు గోవిందుడవు. మాకు లోక మర్యాద ఏ మాత్రం తెలియక నిన్ను.. చిన్నచిన్న పేర్లతో కృష్ణా, గోవిందా అంటూ పిలిచాము. కృష్ణా అలా నిన్ని పిలిచినందుకు కోపగించుకోకు. జ్ఞానులు పొందవలసిన ఆ పర వాద్యమును యీ కారణమున మాకు ఇవ్వననకు. నీతో మెలిగిన సఖులమని భావించి మాపై కృప చూపించు” అని గోపికలందరూ స్వామికి శరణాగతిని కోరారు. తమను అనుగ్రహించి వ్రతమును పూర్తిచేసే విధంగా ఆశీర్వదించుమని.. తమ తప్పులను భరించి.. తమను క్షమించమని గోదాదేవి గోపికలతో పాటు శ్రీ కృష్ణుడిని కోరారు.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 28 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 29
శిట్రం శిఱు కాలే వందున్నై శేవిత్తు, ఉన్
పోట్రామరై అడియే పోట్రుం పొరుళ్ కేళాయ్,
పెట్రం మేయ్‍త్తుణ్ణుం కులత్తిల్ పిఱన్దు, నీ
కుట్రేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు,
ఇట్రై పఱై కొళ్వానన్ఱు కాణ్ గోవిందా,
ఎట్రైక్కుం ఏళ్’ ఏళ్’ పిఱవిక్కుమ్, ఉన్ తన్నోడు
ఉట్రోమే యావోం ఉనక్కే నాం ఆట్చెయ్‍వోమ్,
మట్రై నం కామంగళ్ మాట్రేలోరెమ్బావాయ్ || 29 ||
భావం:
ఓ స్వామీ! శ్రీకృష్ణా! బాగుగా తెల్లవారకమునుపే నీవున్నచోటికి మేము వచ్చి నిన్ను సేవించి, బంగారు తామరపూవుల వలె సుందరములు, స్పర్శనీయములు అయిన నీ చరణములకు మంగళము పాడుటకు కారణము, దాని వలన మాకు కలుగు ప్రయోజనమును వినుము. పశువులను మేపి మా జీవనం నడుపుకొను అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండా వుండరాదు. ఎందుకంటే నీవు మా గొల్లకులములో జన్మించి మా కులమును, మమ్ములను ధన్యులను చేసినవాడవు, ఓ గోవిందా ! పుండరీకాక్షా! మేము నీ వద్దకు ‘పఱ‘ అను వాద్యమును పొందుటకు రాలేదు. అది ఒక సాకు మాత్రమే. ఏనాటికీ, ఏడేడు జన్మలకు నీతో విడరాని బంధుత్వమే కావలెను. నీకు సేవలు చేయువారము కావలెను. మాకు ఇతరములైన కోరికలేమీ లేకుండా చేయుము అని వ్రత ఫలమును గోదా దేవి వివరించింది.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 29 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
పాశురం – 30
వంగక్కడల్ కడైన్ద మాదవనై కేశవనై,
తింగళ్ తిరుముగత్తు చ్చెయిళై’యార్ శెన్ఱిఱైంజి,
అంగప్పఱై కొండవాట్రై, అణిపుదువై
పైంగమలత్ తణ్‍తెరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న,
శంగ త్తమిళ్’ మాలై ముప్పదుం తప్పామే,
ఇంగు ఇప్పరిశుఱైప్పార్ ఈరిరండు మాల్వరైత్తోళ్,
శెంగన్ తిరుముగత్తు చ్చెల్వ త్తిరుమాలాల్,
ఎంగుం తిరువరుళ్ పెట్రు ఇన్బుఱువరెమ్బావాయ్ || 30 ||
ఆండాళ్ తిరువడిగళే శరణమ్ ||
భావం:
ఈరోజు ధనుర్మాసంలో ౩౦వ రోజు. ఆండాళ్ సాక్షాత్తు శ్రీ రంగనాధుడిని తన భర్తగా పొందడానికి ఈ మాసంలో వ్రతమాచరించిన చిట్ట చివరి రోజు. ఈ నెల రోజులూ శ్రీకృష్ణుడిని పూజిస్తూ.. ముఫై పాశురాలను రచించింది. ఈ రోజు తిరుప్పావై లోని చివరి 30 వ పాశురం. నేటి పాశురంలో శ్రీకృష్ణుడిని శరణాగతి కోరుతూ.. గోదాదేవి, తాను విష్ణుచిత్తుని కుమార్తెననీ, ఈ ముప్ఫై పాశురాలు తాను రచించి పాడాననీ, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందనీ చెప్పింది. శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికి ఆనాడు గోపికలు ఆచరించిన వ్రతాన్ని తాను కూడా ఆచరించి రంగనాధుడిని భర్తగా పొందింది గోదాదేవి. ఓడలతో నిండియున్న క్షీరసముద్రాన్ని మథించి లక్ష్మీదేవిని పొందిన శ్రీ మహావిష్ణువు… బ్రహ్మరుద్రులకు కూడ నిర్వాహకుడైనవానిని, ఆనాడు రేపల్లెలో చంద్రముఖులగువారు, విలక్షణ ఆభరణములను దాల్చినవారు అయిన గోపికలు చేరి, మంగళము పాడి, ‘పర’ యను వాద్యము లోకుల కోసం, భవద్దాస్యాన్ని తమకోసం పొందారు. ఆ ప్రకారం, లోకమునకు ఆభరణమైయున్న శ్రీ విల్లి పుత్తూరులో అవతరించి, సర్వదా తామరపూసలమాలను మెడలో ధరించియుండు శ్రీ భట్టనాథుల పుత్రిక యగు గోదాదేవి ద్రావిడభాషలో ముప్పది పాశురములలో మాలికగా కూర్చింది. ఎవరైతే ఈ 30 పాశురములను క్రమము తప్పక చదువుతారో, వారు ఆనాడు గోపికలా శ్రీకృష్ణునినుండి పొందినఫలమును, గోదాదేవి వ్రతము నాచరించి పొందిన ఫలము పొందుతారు. కేవలము అధ్యయనము చేయుటచేతనే, పుండరీకాక్షుడను, పర్వతశిఖరముల వంటి బాహుశిరస్సులు గలవాడును, శ్రీ వల్లభుడును, చతుర్భుజుడును అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్ర సర్వదా ఆనందమును ప్రసాదించును.
Video రూపంలో చూడండి ↓
పాశురం – 30 తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం | Thiruppavai meaning in telugu
Leave a Reply