google.com, pub-2532166691306495, DIRECT, f08c47fec0942fa0

Janaka Maharaju performing a yajna as baby Sita emerges from the earth.

అద్భుతమైన అయోధ్యా నగర వర్ణన

అద్భుతమైన అయోధ్యా నగర వర్ణన

  • బాలరాముడి పాలబుగ్గలు ముద్దాడిన సౌభాగ్యనగరి అయోధ్య.
    • కౌసల్యాతనయుడి కౌశలాన్ని తొలితొలిగా చూసి పొంగిపోయింది అయోధ్య.
    • చందమామను అద్దంలో చూపిస్తూ, పాలబువ్వ తింటున్న రామచంద్రుడిని కళ్లప్పగించి చూసింది అయోధ్య.
    • అంతేనా, బుడిబుడి అడుగుల రాముడి పాదముద్రలు మోసి పరవశించింది; వడివడి పరుగుల రాముడి వాయువేగానికి ఊగిపోయింది.
    • మర్యాదకు మన్నననిచ్చే దశరథరాముణ్ని చూసి గర్వించింది.
    • సీతమ్మ తోడుగా వచ్చిన కల్యాణరాముడికి దిష్టి తీసింది.
    • తండ్రి మాటకై కాననాలకు ఏగిన రాఘవుణ్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది.
    • లోకకంటకుడైన దశకంఠుడిని మట్టుపెట్టి వచ్చిన కోదండపాణికి హారతి పట్టింది.

ఆ పట్టాభిరాముణ్ణి శతవిధాలా కీర్తించే భాగ్యం దక్కించుకుంది అయోధ్య. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్య. నారాయణుడు నరుడిగా అవతరించి, తాను ఇక్కడే పుడతానని, రావణుడిని సంహరిస్తానని, ఈ ధరణిని పదకొండువేల సంవత్సరాలు పాలిస్తానని విష్ణుమూర్తి స్వయంగా ప్రకటించాడని పురాణాలు చెబుతున్నాయి.

మరి ఆ అయోధ్య ఎలా ఉండేది? అక్కడి ప్రజలు, మంత్రులు ఎలా ఉండేవారు? కోసల సామ్రాజ్య వైభవం ఎలా ఉండేది? మొదలైన ఆసక్తికరమైన విశేషాలు.

వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో అయోధ్యను మహోన్నతంగా వర్ణించాడు. “అయోధ్య” అంటే శత్రువులకు జయించలేనిది అనే అర్థం. అధర్వణవేదం అయోధ్య దేవనిర్మితమై స్వర్గసమానమని పేర్కొంది.

స్కాందపురాణం ప్రకారం —
“అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా
పురీ ద్వారవతీ చైవ సప్తైతాః మోక్షదాయికాః”

అంటే దేశంలోని ఏడు మోక్షపురాలలో అయోధ్య ఒకటి. ఈ నగరం చేప ఆకారంలో ఉంటుందని కూడా ఈ పురాణం చెబుతుంది. అగ్నిపురాణం, బ్రహ్మపురాణాలు అయోధ్యను పాపనాశినిగా కీర్తించాయి. తులసీదాసు తన రామచరితమానస్‌లో అయోధ్య వైభవాన్ని ప్రత్యేకంగా వర్ణించారు. భాగవతంలో శుకమహర్షి రఘువంశాన్ని ప్రస్తావిస్తూ అయోధ్య మహిమను వివరించాడు.

అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశరాజైన వైవస్వత మనువు కుమారుడైన ఇక్ష్వాకు మహారాజు సరయూ నది తీరంలోని కోసల దేశంలో నిర్మించి పాలించాడని పురాణకథనాలు చెబుతున్నాయి.

ధనధాన్య సమృద్ధితో తులతూగుతూ, నిత్యసంతుష్టులైన ప్రజలతో కళకళలాడే కోసల దేశంలోని రాజధాని అయోధ్య. విశాలమైన మార్గాలతో శోభాయమానమైన ఆ నగరం 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పు కలిగి ఉందని వర్ణించబడింది. ఇప్పటి లెక్కలో ఇది సుమారు 168 కి.మీ పొడవు, 42 కి.మీ వెడల్పు. వైశాల్యం సుమారు 7,056 చ.కి.మీ.

అయోధ్యను ప్రతిభావంతులైన శిల్పులు, వాస్తు నిపుణులు శాస్త్రప్రమాణాలతో నిర్మించారని వాల్మీకి పేర్కొన్నారు. నగరంలో విశాలమైన రాజమార్గాలు ఉండేవి. వాటిపై పూలు చల్లి, నిత్యం నీరు చల్లి శుభ్రంగా ఉంచేవారు. ఉద్యానవనాలు, మామిడితోటలు నగర శోభను పెంచేవి. నగరాన్ని చుట్టుముట్టిన లోతైన అగడ్తలు ఉండేవి.

ఎత్తైన కోటబురుజులు, ధ్వజపటాలు, వందలకొద్దీ శతఘ్నులు, ఆయుధాలు నగర రక్షణకు సిద్ధంగా ఉండేవి. మేలుజాతి గుర్రాలు, శిక్షణ పొందిన ఏనుగులు, వృషభాలు, ఒంటెలు రక్షణలో ఉండేవి. వేలాది సుశిక్షిత యోధులు నిరంతరం కాపలా కాస్తూ ఉండేవారు. శబ్దభేది విద్యలో ఆరితేరిన వీరు శత్రుదుర్భేద్యంగా అయోధ్యను కాపాడేవారు.

వాణిజ్యంలో అయోధ్యకు సాటి నగరం లేదు. దేశవిదేశాల వర్తకులతో వీధులు కిక్కిరిసేవి. సంగీత, సాహిత్య, నృత్య, నాటక కళారంగాల్లో నిష్ణాతులు అక్కడ నివసించేవారు. కాంభోజ, బాహ్లిక, సింధు దేశాల గుర్రాలు, వింధ్య ప్రాంత ఏనుగులు అక్కడ శిక్షణ పొందేవి. ఉత్తమజాతి పశుసంపదతో నగరం సంపన్నంగా ఉండేది.

రత్నాలతో అలంకరించిన రాజగృహాలు, ఏడంతస్తుల భవనాలు, క్రీడామైదానాలు నగరాన్ని అమరావతితో సమానంగా నిలిపాయి. వరిబియ్యం సమృద్ధిగా లభించేది. నీరు చెరకు రసంలా తియ్యగా ఉండేదని వర్ణించారు. మంగళ వాద్యాల నాదంతో నగరం మార్మోగేది.

దశరథ మహారాజు కొలువులోని మంత్రులు సమర్థులు, విజ్ఞానవంతులు, సమయస్పూర్తి కలవారు. ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనే ఎనిమిది మంది ప్రధాన మంత్రులు ఉండేవారు.

వసిష్ఠుడు, వామదేవుడు ప్రధాన పురోహితులు. శాస్త్రజ్ఞానం, ధర్మనిష్ఠ, పరాక్రమం కలిగిన వీరు రాజ్యాన్ని ధర్మబద్ధంగా నడిపించేవారు.

మంత్రులు న్యాయబద్ధంగా శిక్ష విధించేవారు. అపరాధి బలాబలాలను పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకునేవారు. సంధి, యుద్ధ విధానాల్లో నిపుణులు. రాజ్యరహస్యాలను కాపాడగలవారు. నీతిశాస్త్రజ్ఞులు.

ఇలాంటి సద్గుణ సంపన్నులైన మంత్రుల సహకారంతో దశరథ మహారాజు ఇంద్రుడు అమరావతిని పాలించినట్లుగా అయోధ్యను పాలించాడు. వేదవేత్త, పరాక్రమశాలి, దానశీలి, ఇంద్రియనిగ్రహి, యాగయజ్ఞకర్త అయిన దశరథుడు ధర్మ, అర్థ, కామ పురుషార్థాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చి రాజ్యాన్ని పరిపాలించాడు.

భూమిలో దానికంటే ఉత్తమమైన పట్టణం మరొకటి లేదు. అయోధ్యలో గృహాలు బారులుతీర్చి చక్కగా నిర్మించబడి ఉండేవి. ఉత్తములైన మనుష్యులు అక్కడ నివసించేవారు. ఆ నగరంలో వేలకొద్దీ మహారథులైన వీరులు ఉండేవారు. వారు బాణప్రయోగంలో హస్తలాఘవం గలవారు. ఎంతో వీరులైన వారు ఒంటరిగా ఉన్నవారిని గాని, తండ్రి గాని కుమారుడు గాని వెనుక ముందు ఎవరూ లేనివారిని గాని, పారిపోతున్న వారిని గాని ఎన్నడూ బాణాలతో కొట్టేవారు కాదు. మదించి వనాల్లో గర్జించే సింహాలు, పులులు, వరాహాది క్రూరమృగాలను ఆయుధాలతో గాని, కేవలం బాహుబలంతో గాని సంహరించేవారు.

ఆ నగరంలోని ప్రజలు ప్రతిరోజూ అభ్యంగ స్నానం చేసి, వివిధ రకాల ఆభరణాలు, పుష్పమాలలు ధరించి, శరీరానికి పరిమళద్రవ్యాలు పూసుకుని, సుగంధద్రవ్యాలు వినియోగిస్తూ ఉండేవారు. నుదుట తిలకం ధరించని మనిషి కనిపించడు. దీనుడు గాని, రోగపీడితుడు గాని, సౌందర్యవిహీనుడు గాని కనిపించేవారు కాదు.

ఆ అయోధ్యానగరంలోని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఎంతో సద్గుణవంతులు, వేదవేదాంగనిష్ఠాతులు, అనంతంగా దానధర్మాలు చేసేవారు. అయోధ్యాపురంలో నివసించే ప్రజలందరూ సంతోషంగా, ధర్మబద్ధంగా జీవిస్తూ, శాస్త్రాలు అధ్యయనం చేసి, తమకు ఉన్నదానితో తృప్తిగా జీవించేవారు. దురాశ, అత్యాశ లేకుండా ఎప్పుడూ సత్యమే పలికేవారు.

ఆ నగరంలో తక్కువ ధనం సంపాదించేవాడు గాని, ధర్మార్థకామ పురుషార్థాలను సాధించనివాడు గాని, గోసంపద, అశ్వసంపద, ధనధాన్యాలు లేనివాడు గాని ఒక్కడూ ఉండేవాడు కాదు. సంపద అంతా యజమానులు ధర్మబద్ధంగా సంపాదించి, ధర్మబద్ధంగానే వినియోగించేవారు. కాముకుడు, లోభి, క్రూరుడు, విద్యావిహీనుడు, నాస్తికుడు, ఆకలితో అలమటించే వ్యక్తి, దానం కోసం అర్రులు చాచే వ్యక్తి — అయోధ్యలో వెతికినా కనిపించరు.

ఆ నగరంలోని స్త్రీ, పురుషులు ధర్మశీలులు; మహర్షులతో సమానమైన ఇంద్రియనిగ్రహం, తేజస్సు కలిగి, రాజభక్తి గలవారు. మంచి స్వభావం, మంచి నడవడిక కలిగి మహర్షులవలె పవిత్రంగా జీవించేవారు.

అయోధ్యానగరంలో నాలుగు వర్ణాలకు చెందిన ప్రజలందరూ దైవభక్తి కలిగి, అతిథి సత్కారం చేస్తూ, దీర్ఘాయుష్షుతో, భార్యా పుత్ర పౌత్రాదులతో కలిసి ఆనందంగా జీవించేవారు. కుటుంబం అంటే శాస్త్రోక్త నిర్వచనానుసారం — ఇంటి యజమాని, తల్లి, తండ్రి, భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కోడళ్ళు, ఒక కుమార్తె, ఒక అతిథి — ఇలా పదిమందికి తక్కువగా ఉండే ఇల్లు అక్కడ కనిపించేది కాదు.

క్షత్రియులు బ్రాహ్మణులను, వైశ్యులు క్షత్రియులను అనుసరించేవారు. శూద్రులు మిగతా మూడు వర్ణాలకు ఉపచారాలు చేస్తూ స్వధర్మనిరతులై ఉండేవారు. అయోధ్యాపురంలోని బ్రాహ్మణులందరూ అవిచ్ఛిన్నంగా అగ్నిహోత్రం నిర్వహించి, నాలుగు వేదాలను నిరంతరం అధ్యయనం చేసేవారు. వేదోక్త కర్మలను ఆచరిస్తూ, అడిగిన వారికి శక్తికొలది దానధర్మాలు చేసేవారు. ఇంద్రియజయంతో, అహర్నిశలు భగవద్కథలను పారాయణం చేస్తూ, యజ్ఞయాగాలు నిర్వహిస్తూ నిర్మలబుద్ధితో జీవించేవారు. దేవర్షులు, మహర్షులతో సమానంగా భగవధ్యానంలో నిమగ్నమై ఉండేవారు.

ఇతర అయోధ్యావాసులందరూ కూడా సంతుష్టులు, ధర్మజ్ఞులు, శాస్త్రచింతన కలవారు. దేవుడిచ్చిన దానితో సంతోషించి, త్యాగబుద్ధితో, అవసరమైనంత మాత్రమె సంపాదించేవారు. అయోధ్యలో నివసించే అన్ని వర్ణాలవారు దైవపూజ చేయకుండా, అతిథిని ఆదరించకుండా భోజనం చేయని దీక్షాపరులు. అందరూ ధర్మశీలులు, ప్రేమస్వరూపులు.

అయోధ్య ఎంత విశాలమో, అయోధ్యవాసుల హృదయాలు అంతే విశాలం. రాముడు పుట్టిన నాటి నుంచీ ఇంటింటా రామనామం ప్రతిధ్వనించేది. రాముని దర్శనం కోసం పరివార సమేతంగా కోటకు వెళ్లేవారు. రాజదర్శనం కన్నా రామదర్శనమే మిన్నగా భావించేవారు. వంతులవారీగా వెళ్లి బాలరాముడిని చూసి మనసంతా రామతత్వంతో నింపుకొనేవారు. సాయంత్రం ఇంటికి చేరినా, వారి మనసు మాత్రం రాముడి చెంతనే నిలిచి ఉండేది.

అయోధ్యలోని ఆబాలగోపాలమంతా రాముణ్ని తమవాడిగా భావించేవారు. తన ప్రజలు రాముణ్ని అంతగా ఆరాధిస్తున్నారనే విషయం తెలిసి దశరథ మహారాజు సంతోషించేవాడు.

శ్రీరాముడిని యువరాజుగా పట్టాభిషేకం చేయాలని దశరథుడు సంకల్పించాడు. ఆ వార్త తెలిసిన అయోధ్యాపౌరులు గుంపులుగా వీధుల్లో గుమిగూడి కోలాహలం సృష్టించారు. అంతటా నీళ్లు చల్లి, అరటి స్థంభాలు కట్టి, ముగ్గులు వేసి, ఇళ్ల మేడలపై జనం చేరిన దృశ్యాన్ని వాల్మీకి అద్భుతంగా వర్ణించాడు. దేవాలయాల్లో, నాలుగు వీధులు కలిసే చోట్ల, వర్తకుల అంగళ్లలో జండాలు కట్టారు. నటులు, నర్తకులు, గాయకుల కళాప్రదర్శనలు చెవులకు పండుగగా మారాయి.

ప్రతి ఇంటిమీద ధ్వజపటాలు ఎగురవేసి, దేవాలయాలకు సున్నం పూసి తెల్లగా ప్రకాశింపజేశారు. మంగళవాద్యాల నాదంతో, బ్రాహ్మణ ఆశీర్వాదాలతో నగరం కళకళలాడింది. వసిష్ఠ మహర్షి సరయూ నదిలో స్నానం చేసి, దశరథుణ్ని కలవడానికి వస్తూ, అలంకరించబడిన అయోధ్యను చూసి అమరావతితో సమానమని భావించాడు.

అగరు, చందన సువాసనలు వెదజల్లుతూ, స్ఫటికాలు, ముత్యాలు అలంకరించిన రాజమార్గంలో శ్రీరామచంద్రుడు సంచరిస్తుంటే, ప్రజలు అక్షింతలతో దీవించారు.

నాటి అయోధ్య వైభవం నిజంగా అద్భుతం.

నమస్తే. జై శ్రీరాం.

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top