Women celebrating Bathukamma festival with colorful flower arrangements and traditional attire.

బతుకమ్మ కథ

బతుకమ్మ కథ

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు, జీవన విధానానికి ప్రతీకగా నిలిచేది బతుకమ్మ. తెలంగాణ ఆడపడుచులంతా సంబరంగా జరుపుకునే వేడుక ఇది. అనుబంధాలను గుర్తుచేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ.

తొమ్మిది రోజుల పాటు ఆడిపాడి గౌరీదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం ఇది. వ్యాధులు, ప్రకృతి విపత్తుల నుంచి కాపాడాలని వేడుకుంటూ, ప్రకృతిని గౌరీదేవిగా తలచి ఆటపాటలతో పూజించే వేడుక బతుకమ్మ.బతుకమ్మ పండుగ ఎలా, ఎప్పుడు జరుపుకుంటారు? పండుగ వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? పూలను దేవతలుగా ఎందుకు భావిస్తారు? వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందు రోజు వచ్చే పితృ అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమయ్యే సంబరాలు, తొమ్మిది రోజుల పాటు సాగి దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మగా గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తాయి.చరిత్రను పరిశీలిస్తే అనేక ఆధారాలు కనిపిస్తాయి. కొందరు గొల్లరాజుల కాలంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయని చెబుతారు. మరికొందరు మాంధాత కాలంలో ఈ పండుగ జరిగిందని అంటారు. అందుకు ప్రతీకగా సిద్దిపేట, హుస్నాబాద్ సమీపంలోని మాందాపురంలో పురాతన శిల్పాలు కనిపిస్తాయి. వీటిలో పూల బతుకమ్మ శిల్పాలు ఉండడం విశేషం.

సంబరాలకు సంబంధించి పురాణ కథలు కూడా ఉన్నాయి. దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళదేశరాజు ధర్మాంగుడు, అతని సతీమణి సత్యవతి సంతానం కోసం ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేశారు. లక్ష్మీదేవి తమకు కూతురుగా జన్మించాలని ప్రార్థించారు. లక్ష్మీదేవి ఆ దంపతులకు కూతురుగా జన్మించింది. అప్పుడు రాజ్యంలో వేదపండితులు ఆ బిడ్డను “కలకాలం బతుకమ్మ” అని ఆశీర్వదించారు. అప్పటినుంచి బతుకు ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలుస్తారని చెబుతారు.

తెలంగాణలో ఒక పల్లెను వరదబారి నుంచి కాపాడిన త్యాగమూర్తి బతుకమ్మ అని కొందరు అంటారు. మహిషాసురుని సంహరించిన తర్వాత అలసిపోయిన అమ్మవారికి మహిళలు పాటలతో స్పృహ తెప్పించేందుకు చేసిన వేడుకే బతుకమ్మ అని మరికొందరు చెబుతారు. రైతుదంపతులకు పుట్టిన పిల్లలు చనిపోతుండగా ఎనిమిదవ బిడ్డకు బతుకమ్మ అని పేరు పెట్టడంతో ఆమె బతికిందనే కథ కూడా ఉంది.

మరో కథనం ప్రకారం గంగా-గౌరీ సంభాషణలో భాగంగా శివుడు తన తలపై గంగమ్మను ధరించడం వల్ల అందరూ గంగను పూజిస్తున్నారని పార్వతీదేవి తన తల్లితో చెబుతుంది. అప్పుడు ఆమె తల్లి పార్వతిని ఓదార్చి, నిన్ను పూలతో బతుకమ్మగా పూజిస్తారని చెప్పిందట. అలా బతుకమ్మ పండుగ ప్రాచుర్యంలోకి వచ్చిందని చెబుతారు.

కాకతీయుల కాలంలో కరువు కాటకాలతో తీవ్ర దుర్భిక్షం నెలకొన్నప్పుడు తొమ్మిది రోజుల పాటు పూలతో అమ్మవారిని బతుకమ్మగా పూజిస్తే కరువు తొలగిపోతుందని నమ్మకం ఏర్పడిందని కూడా చెబుతారు. ఇంకా కొన్ని జానపద కథలు ప్రచారంలో ఉన్నాయి.

ఒక బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుందని, అప్పుడు ఆ ఊరి ప్రజలు ఆమెను “కలకాలం బతుకమ్మ” అని దీవించారని ఒక కథ చెబుతుంది. ఆ బాలికను స్మరిస్తూ, గౌరమ్మను పూజిస్తూ స్త్రీలకు సంబంధించిన పండుగగా బతుకమ్మ ప్రాచుర్యం పొందింది.

సంబరాలలో భాగంగా మహిళలు చక్కగా ముస్తాబై, అత్యంత భక్తిశ్రద్ధలతో తయారు చేసిన బతుకమ్మలను ఆలయాలలో, వీధుల్లో గుంపులుగా చేరి ఆడిపాడుతూ సంబరాలు జరుపుకుంటారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వేడుకలో పాల్గొంటారు. తెలంగాణ గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబించే జానపద గీతాలు పాడుతూ ఈ పండుగను జరుపుకుంటారు.

బతుకమ్మ పండుగలో ఉపయోగించే పూలకు ప్రత్యేకత ఉంది. ఔషధ గుణాలు ఉన్న పువ్వులతోనే బతుకమ్మలను తయారు చేస్తారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి, కట్ల, సంపెంగ, ముళ్లసీత, జడలపూలు, రుద్రాక్షపువ్వు, పొకబంతి, మందారం, మరువం, పారిజాతం, కమలం, తామర, పట్టుకుచ్చుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి సంబరాలు జరుపుకుంటారు.

వర్షాకాలంలో చెరువుల్లో పెరిగే క్రిములను నిర్మూలించేందుకు ఔషధ గుణాలు గల ఈ పూలతో చేసిన బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు.

తెలంగాణలో బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజులు, తొమ్మిది రకాలుగా జరుగుతాయి. ప్రతి రోజుకూ ప్రత్యేకత ఉంటుంది. తొమ్మిది రోజుల పాటు రోజుకొక నైవేద్యం తయారు చేస్తారు.

మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ. మహాలయ అమావాస్య రోజు బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ రోజును పెద్దమాసం అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

పండుగకు ముందు ఆయా పుష్పాలన్నీ వివిధ కీటకాల పరాగసంపర్కం కారణంగా ఎంగిలి పడ్డాయని భావించి మొదటి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మగా వ్యవహరిస్తారు అంటే ఈరోజుకంటే ఒక రోజు ముందుగానే బతుకమ్మ అలంకరించడానికి పూలు కోస్తారు అవి మరుసటి రోజుకు వాడుకోకుండా నీళ్లలో వేసి తర్వాత రోజు బతుకమ్మగా పేరుస్తారు రెండవ రోజు అటుకుల బతుకమ్మ నాడు పప్పు బెల్లం అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

 మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ నానేసిన బియ్యం పాలు బెల్లం కలిపి గౌరీదేవికి నైవేద్యం తయారుచేస్తారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ అట్లు వేసి నైవేద్యంగా సమర్పిస్తారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఈరోజు అమ్మవారికి అలకగా చెప్పుకుంటారు ఉపవాసం పాటిస్తారు .

ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ బియ్యం పిండిని బాగా వేయించి వేపపండ్లు లాగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి వెన్నముద్దల నైవేద్యం తయారుచేస్తారు తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఈరోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు ఈ తొమ్మిదవ రోజు పెరుగన్నం చింతపండు పులిహోర నిమ్మకాయ అన్నం కొబ్బరి అన్నం నువ్వుల అన్నం అని ఐదు రకాల నైవేద్యాలు తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు.

 సద్దుల బతుకమ్మ రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టే వాటిలో రకరకాల తృణధాన్యాలను కూడా ఉపయోగిస్తారు బతుకమ్మను పేర్చడం ఒక కళ ఉత్తర దిశకు అభిముఖంగా కూర్చుని బతుకమ్మను అమరుస్తారు రాగి పళ్లెల్లో గుమ్మడి లేదా తంగేడు ఆకులను పరిచి ఆకులపై పసుపు కుంకుమ అక్షతలు చల్లి వలయంగా తంగేడు పూలను ముందుగా అమరుస్తారు రంగుల పూలను ఒక వరుస మీద మరొక వరుసగా పెడుతూ గోపురంలా పేరుస్తారు ముఖ్యంగా బతుకమ్మను తీర్చడానికి తంగేడు గునుగు కట్ల పూలను ఎక్కువగా ఉపయోగిస్తారు పువ్వులతో చక్కగా బతుకమ్మను వలయాకారంగా పేర్చి దానిపై పసుపుతో గౌరమ్మను తయారు చేసి పెడతారు.

 ఇలా తయారుచేసిన బతుకమ్మను దైవంగా పూజిస్తారు పక్కనే చిన్న బతుకమ్మను రూపొందిస్తారు దానిపై తమలపాకులో గాని చిక్కుడు ఆకులో గాని పసుపు ముద్ద గౌరమ్మను పెట్టి మధ్యలో రెండు శిఖరాలుగా తయారుచేస్తారు ఇవి శివపార్వతుల అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకలు వాటికి వస్త్రాలుగా పత్తితో అలంకరించి పూజామందిరం దగ్గర పెట్టి ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు తమ కుటుంబాలు సుఖసంతోషాలతో సంపదతో వర్ధిల్లేలా అనుగ్రహించాలని ప్రార్థిస్తారు.

 సాయంత్రం సమయంలో ఆడపడుచులు అందరూ చక్కగా తయారై కొత్త బట్టలు ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు చుట్టుపక్కల ఉన్న వారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు ఆనందంతో మానవహారంలా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు ఒకరు ముందుగా పాట మొదలుపెడితే మిగిలినవారు వారితో గొంతు కలుపుతూ పాడుతారు.

 ఈ జానపద గీతాలు తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరిస్తాయి చీకటి పడే వేళకు ఆడపడుచులు అందరూ బతుకమ్మలను తలపై పెట్టుకొని దగ్గరలోని చెరువు దగ్గరికి ఊరేగింపుగా వెళ్తారు అందంగా అలంకరించుకున్న స్త్రీలు బతుకమ్మలతో వెళ్లడం కన్నుల పండుగగా ఉంటుంది జలాశయానికి చేరుకున్న మహిళలు బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ ఆ తర్వాత బతుకమ్మలను చెరువులో గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేసి గౌరమ్మను మంగళసూత్రాలకు పూసుకొని వారి కుటుంబాలను చల్లగా చూడమని వేడుకుంటారు.

తర్వాత ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం మొక్కజొన్నలు లేదా వేరుశెనగ పెసర విత్తనాలను దోరగా వేయించి పిండి చేసి బెల్లం లేదా పంచదార కలిపిన సత్తు పిండి ఇంకా చక్కెర రొట్టెలతో కలిసి పంచుకుంటారు పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఒక చోట చేరి ఆడి పాడి సంతోషంగా గడుపుతారు ఆచారాలు సంప్రదాయాలు పద్ధతులు తెలిపేలా బతుకమ్మ పాటలను పాడుతారు పాటలలో పురాణ ఇతిహాస కథలు మొదలుకొని తెలంగాణ వీరుల కథలు జానపద గీతాలు కూడా ఉంటాయి.

 ముఖ్యంగా బతుకమ్మ పాటల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబిస్తుంది బతుకమ్మ సంబరాలను తెలంగాణలో మాత్రమే కాదు ఇతర దేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటారు అక్కడ స్థిరపడిన తెలంగాణవాసులంతా అక్కడే బతుకమ్మ సంబరాలు నిర్వహించడం విశేషం ముఖ్యంగా అమెరికా లండన్ దేశాల్లో ఈ బతుకమ్మ సంబరాలకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇంత చక్కని అందరూ సమిష్టిగా జరుపుకునే అందమైన అద్భుతమైన పండుగ ప్రపంచంలోనే బతుకమ్మ ఒక్కటే అని చెప్పడం తెలంగాణకే గర్వకారణం.

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top