మూక పంచశతి పాదారవిందశతకం 11-20 శ్లోకాలు

 మూక పంచశతి పాదారవిందశతకం 11-20 శ్లోకాలు

మూక పంచశతి పాదారవింద శతకం శ్లోకాలు అనేది మూక కవి రచించిన ప్రసిద్ధ భక్తి స్తోత్రంలో ఒక పవిత్ర భాగం. ఇందులో కామాక్షి దేవి పాదారవిందాల మహిమను అద్భుతంగా వర్ణించారు. ఈ శతకం భక్తి, సమర్పణ భావాన్ని పెంచుతూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తుంది.

ఈ శతకాన్ని భక్తితో పఠించడం ద్వారా మనసుకు ప్రశాంతత, జ్ఞానం, ఐశ్వర్యం మరియు దైవ అనుగ్రహం లభిస్తాయని విశ్వాసం. మూక కవి దైవ కృపతో మౌనస్థితి నుండి కవిత్వాన్ని పొందిన నేపథ్యం ఈ స్తోత్రానికి ప్రత్యేకతను ఇస్తుంది. పాదారవింద ధ్యానం ద్వారా భక్తుడు సంపూర్ణ సమర్పణ భావాన్ని పొందుతూ మోక్ష మార్గంలో ముందుకు సాగుతాడు.

జటాలా మంజీరస్ఫురదరుణరత్నాంశునికరైః
నిషిదంతీ మధ్యే నఖరుచిఝరీ గాంగపయసామ్ ।
జగత్త్రాణం కర్తుం జనని మమ కామాక్షి నియతం
తపశ్చర్యాం ధత్తే తవ చరణపాథోజయుగళీ ॥11॥

జగన్మాతా! నీ కాలి అందియలలో కూర్చబడిన ఎర్రటి రత్నములు నీ పాదములకు కేశములవలె అమరి ఉన్నాయి.  నీ పాద నఖములనుండి వెలువడుతున్న వెన్నెల కాంతులు గంగా నదీ ప్రవాహమువలే దృశ్యమై, జటలతో కూడి నదీమధ్యమున స్థితమైన నీ పాదములు, సకల జగత్తును రక్షిస్తున్న తాపసివలె కనిపిస్తున్నాయి.

తులాకోటిద్వంద్వక్కణితభణితా భీతివచసోః
వినమ్రం కామాక్షీ విసృమరమహః పాటలితయోః ।
క్షణం విన్యాసేన క్షపితతమసోర్మే లలితయోః
పునీయాన్మూర్ధానం పురహరపురంధ్రీ చరణయోః ॥12॥

అమ్మా! నీ పాదములు నా శిరసుపై అమృత జలమును చల్లి, నా శిరసుపై నిలచి నాకు అభయ ప్రదానము చేయుగాక. నీ పాదములకు ఉన్న అందెల మధుర ధ్వనులు నాకు ధైర్యప్రదాయకములు. నీ పాద జలములు నా మనసులోని మలినములను తొలగించే మధుర రసములు.

భవాని ద్రుహ్యేతాం భవనిబిడితేభ్యో మమ ముహుః
తమోవ్యామోహేభ్యస్తవ జనని కామాక్షి చరణౌ ।
యయోర్లాక్షాబిందుస్ఫురణధరణాద్ధూర్జటిజటా-
కుటీరా శోణాంకం వహతి వపురేణాంకకలికా ॥13॥

అమ్మా భవానీ! ఈశ్వరుని జటాజూటములో నీవు ఒక మొగ్గవై ఉన్నావు. ప్రణయ సమయములో నీ పాదములను తాకిన శివుని ముఖముపై అలముకున్న నీ పాదముల లత్తుక ఎర్రని తిలకమువలె భాసిస్తున్నది. అటువంటి నీ పాదములు నా తమో గుణమును నశింపచేయుగాక.

పవిత్రీకుర్యుర్నః  పదతలభువః పాటలరుచః
పరాగాస్తే పాపప్రశమనధురీణాః పరశివే ।
కణం లబ్ధుం యేషాం నిజశిరసి కామాక్షి వివశా
వలంతో వ్యాతన్వంత్యహమహమికాం మాధవముఖాః ॥14॥

జగన్మాతా! నీ పాదములపై ఉన్న ధూళి కణములను తమ శిరసుపై ధరించాలని, బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతలంతా, ఒకరినొకరు తోసుకుంటూ ప్రయత్నిస్తున్నారు. నీ అరుణ పాదముల ధూళి కణములు నా శిరసుపై పడి నన్ను పవిత్రుని చేయుగాక.

బలాకామాలాభిః నఖరుచిమయీభిః పరివృతే
వినమ్రస్వర్నారీవికచకచకాలాంబుదకులే ।
స్ఫురంతః కామాక్షి స్ఫుటదలితబంధూకసుహృదః
తటిల్లేఖాయంతే తవ చరణపాథోజకిరణాః ॥15॥

జగన్మాతా! దేవలోకములోని స్త్రీలు, నీకు పాదనమస్కారము చేసే సమయంలో వారి నల్లని కేశపాశములు మేఘములవలె, నీ పాదముల నఖముల తెల్లని కాంతి ఆ మేఘములలో విహరించే కొంగల గుంపువలె, తెల్లని మెరుపులవలే గోచరించుచున్నది.

సరాగః సద్వేషః ప్రసృమరసరోజే ప్రతిదినం
నిసర్గాదాక్రామన్విబుధజనమూర్ధానమధికమ్ ।
కథంకారం మాతః కథయ పదపద్మస్తవ సతాం
నతానాం కామాక్షి ప్రకటయతి కైవల్యసరణిమ్ ॥16॥

ఓ కామాక్షీ! నీ పాదపద్మములు, పద్మముల కాంతిని తిరస్కరించాయి. నీ పాదపద్మముల కాంతిని సకల దేవతలు, విజ్ఞులు శిరసున దాల్చారు. అలాంటి నీ పాదములు, నీ శరణు కోరినవారికి ముక్తిని ప్రసాదించడం మా భాగ్యము కాక మరేమిటి.

జపాలక్ష్మీశోణో జనితపరమజ్ఞాననలినీ-
వికాసవ్యాసంగో విఫలితజగజ్జాడ్యగరిమా ।
మనఃపూర్వాద్రిం మే తిలకయతు కామాక్షి తరసా
తమస్కాండద్రోహీ తవ చరణపాథోజరమణః ॥17॥

కామాక్షీ! నా మనసు అనే తూర్పువైపు కొండలలోనుండి నీ పాదములనే సూర్యబింబము ఉదయిస్తుంది. సూర్యుడు, ఈ ప్రపంచము యొక్క అంధకారమును తొలగిస్తే, నీ పాదములనే సూర్యుడు, నా మనసులోని అజ్ఞానపు చీకట్లను పారద్రోలుతాడు.

నమస్కుర్మః ప్రేంఖన్మణికటకనీలోత్పలమహః-
పయోధౌ రింఖద్భిర్నఖకిరణ ఫేనైర్ధవలితే ।
స్ఫుటం కుర్వాణాయ ప్రబలచలదౌర్వానలశిఖా-
వితర్కం కామాక్ష్యాః సతతమరుణిమ్నే చరణయోః ॥18॥

తల్లీ! నీ నూపురములోని నీలపు వర్ణ మణిమాణిక్యముల ప్రకాశము సాగరమైతే, నీ పాదనఖముల ప్రకాశము ఆ సముద్రముపై తేలియాడే నురగలు. నీ పాదములనుండి వెలువడే అరుణవర్ణపు కాంతి ఆ సాగరములో ఉద్భవించే బడబాగ్ని. అమ్మా! నీ పాదములకు నా ప్రణతులు.

శివే పాశాయేతాం అలఘుని తమఃకూపకుహరే
దినాధీశాయేతాం మమ హృదయపాథోజవిపినే ।
నభోమాసాయేతాం సరసకవితారీతిసరితి
త్వదీయౌ కామాక్షి ప్రసృతకిరణౌ దేవి చరణౌ ॥19॥

అమ్మా శివా! నేను అజ్ఞానమనే ఒక గుహలో చిక్కుకుని ఉన్నాను. నీ చరణముల యొక్క ప్రకాశము ఆ చీకటి గుహనుండి ఒక త్రాడువలే నన్ను బయటకు లాగుగాక. అమ్మా! నీ పాదములు నా మనసనే కమలమును వికసింపజేయుగాక. కవితా ధారలు నా నుండి వర్షపు ధారలై వెలువడుగాక.

నిషక్తం శ్రుత్యంతే నయనమివ సద్వృత్తరుచిరైః
సమైర్జుష్టం శుద్ధైరధరమివ రమ్యైర్ద్విజగణైః ।
శివే వక్షోజన్మద్వితయమివ ముక్తాశ్రితముమే
త్వదీయం కామాక్షి ప్రణతశరణం నౌమి చరణమ్ ॥20॥

అమ్మా! నీ నేత్రములు కర్ణములవరకు విస్తరించాయి. నీ పాదములు వేదముల అంచులను స్పృశిస్తున్నాయి. సుందరమైన నీ ఓష్టములు అందమైన పలువరుసతో స్నేహం చేస్తున్నాయి. నీ పాదములు సత్ర్రవర్తనులై, జ్ఞానులైన వారితో చెలిమి చేసేవారికి ముక్తిని ప్రసాదిస్తున్నాయి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top