ఖడ్గమాలా స్తోత్రం - తెలుగులో అర్థం
ఖడ్గమాలా స్తోత్రం
ఖడ్గమాలా స్తోత్రం – శ్రీచక్రంలోని 9 ఆవరణలలో ఉన్న దేవతలందరినీ, వారి వారి స్థానాలలో స్తుతిస్తూ చేసే స్తోత్రం. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా, ఈ 9 ఆవరణలలో ఏ ఏ దేవతలు ఎక్కడుంటారో, ఆ నామాల అర్థాలను ఈ వీడియొలో తెలుసుకుందాం.
సృష్టి మొదట్లో శ్రీమహాకామేశ్వరుడు మానవుల వివిధములయిన కోర్కెలను తీర్చుకొనడానికి 64 యంత్రాలను సృష్టించి ఇచ్చాడు. కానీ ఇందులో ఇహాన్ని ఇచ్చేవి పరాన్ని ఇవ్వలేవు. పరాన్ని ఇచ్చేవి ఇహాన్ని ఇవ్వలేవు. అందుకే ఆ కరుణామూర్తి శ్రీ మహాకామేశ్వరి- స్వామి వారిని ఇహ, పరాలను రెండింటిని ఇవ్వగలిగిన మహాయంత్రాన్ని సృష్టించవలసినదిగా కోరింది. తల్లి కోరికమేరకు శ్రీచక్రాన్ని సృష్టించాడు శ్రీ మహాకామేశ్వరుడు.. శ్రీ చక్రములో 4 ఊర్థ్వముఖ త్రికోణాలు, 5 అథోముఖ త్రికోణాలు ఉన్నాయి. వీటి కలయికమూలంగా 43 త్రికోణాలు ఏర్పడతాయి. ఇవిగాక, కేంద్రములో బిందువు,అష్టదళ పద్మ చక్రము, శోడశదళ పద్మ చక్రము, మూడు వృత్తములు, మూడు చతురస్రములు, నాలుగు ద్వారములు ఉన్నాయి.
ఆదిశక్తి రూపాలైన త్రిపురాత్రయంలో శ్రీలలితా త్రిపురసుందరి రెండో స్వరూపం. ఆమె శ్రీచక్రానికి అధిష్ఠాన దేవత. శ్రీ విద్యలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రధానమైనది. శ్రీ చక్రంలో కొలువు తీరిన దేవతలను ఈ స్తోత్రం స్తుతిస్తుంది. ఖడ్గము అంటే కత్తి అని అర్థము. మాలా అంటే ఒక పద్ధతిలో వరుసగా కూర్చబడినదని. కత్తి తన సమీప ప్రత్యర్థిని నిగ్రహించడానికో లేక చంపడానికో ఉయోగపడే ఆయుధం. మనలో అశాంతికి మూల కారణము కోరికలు. ఇవి తీరక పోవడమో, లేక తీరడమో వలన కలిగే అరిషడ్వర్గాల ప్రతి స్పందనే మన అంత: శత్రువులు. వాటిని తునుమాడే మంత్రాలే ఈ ఖడ్గాలు. ఒకొక్క ఖడ్గం ఒక్కో శక్తి రూపం. వీటి అండతో మన:శాంతిని పొందడమేకాక ఆ తల్లిని చేరి, ఆమెలో ఐక్యమై జనన, మరణ చక్రము నుండి ముక్తి పొందవచ్చునని నమ్మకము. ఖడ్గమాల పారాయణము శ్రీచక్రార్చనతో సమాన ఫలితమునిస్తుందని చెప్తారు.
ఈ స్తోత్రములో శ్రీచక్రంలోని నవావరణ దేవతలందరూ వారి వారి నిర్దేశ స్థానములలో ఉంటారు. మానసికంగా ఆయా దేవతల స్థానాలను గుర్తిస్తూ ఈ స్తోత్రం చేస్తే, శ్రీ చక్రార్చన చేసిన ఫలితం వస్తుంది అని చెప్తారు. ఒక్కొక్క ఆవరణకు ఆ ఆవరణ చక్రం పేరు, యోగిని పేరు చెప్పి, ఆవరణ దేవతలను, చివరికి చక్రేశ్వరిని చెప్పాలి. అందరికీ అర్థమయ్యే విధంగా ఈ 9 ఆవరణలలో ఏ ఏ దేవతలు ఎక్కడుంటారు? ఆ నామాల అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీ చక్రంలో 9 ఆవరణలు ఉంటాయి. వీటిని నావావరణలు అంటారు. అవి
- బిందువు
- త్రికోణము
- అష్టకోణ చక్రము
- అంతర్దశారము
- బహిర్దశారము
- చతుర్దశారము
- అష్ట దళ పద్మము
- షోడశ దళ పద్మము
- భూపుర త్రయము. ఇది 3 చతురస్రాలు, 4 దిక్కులా ద్వారాలతో ఉంటుంది.
శ్రీచక్రంలోని 9 ఆవరణలకు ప్రత్యేకమైన వర్ణము, అధిష్టాన దేవత, బీజము, ప్రత్యేక పరివారము, యోగినీ దేవత ఉంటారు.
న్యాసాంగదేవతాః (6)
బిందువు చుట్టూ ఒక చతురస్రం ఉన్నట్టు భావించాలి. దానిలో షడంగదేవతల స్థానాలు ఉంటాయి.
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమస్త్రిపురసుందరీ
1. హృదయదేవీ -హృదయధిస్టాన దేవత
2. శిరోదేవీ – శ్రీచక్రరాజమందు శిరోపరి భాగములో బిందుస్థానములో తేజరిల్లు దేవి
3. శిఖాదేవీ -భక్త జనులకు శిరస్సున పెట్టుకొనదగినదై చూడామణివలె తేజరిల్లు దేవి
4. కవచదేవీ – శ్రీవిద్యను ఉపాశించునట్టి భక్తజనులను రక్షించుటకు కవచ స్వరూపాన్ని ధరించిన పరమేశ్వరి
5. నేత్రదేవీ – కరుణాకటాక్ష వీక్షణాలతో నేత్రాధిష్టాత్రియై భక్తులను కాపాడునట్టి మహేశ్వరి
6. అస్త్రదేవీ – సర్వాస్త్రధారిణియైనట్టి, అస్త్రస్వరూపిణియైనట్టి జగన్మాత
తిథినిత్యాదేవతాః (16)
బిందు త్రికోణముల మధ్యలో స్వాభిముఖ ఊహా త్రిభుజమున్నది. అది నిత్యా మండలము. 3 భుజములలో వామావర్తముగా (అంటే కుడి నుండి ఎడమకు) మూడు అయిదులుగా నిత్యల స్థానము. 16 వది బిందువునందు ఉంటుంది.
1. కామేశ్వరీ – కామేశ్వరుని అర్థాంగియై భక్తుల కోరికలను నెరవేర్చునట్టి కామేశ్వరీ స్వరూపిణి
2. భగమాలినీ – పరిపూర్ణత్వ, వీర్య, కీర్తి, సంపత్, జ్ఞాన వైరాగ్యములనే భగవద్గుణాలను మాలా రూపములో ధరించిన మాత
3. నిత్యక్లిన్నే – శుక్లపక్ష తృతీయాతిథికి దేవతయగు నిత్యక్లిన్నా దేవి
4. భేరుండే – శ్రీచక్ర మేరువులో నవమావరణలో చతుర్థాన్వితా దేవతా స్వరూపిణియగు భేరుండాదేవి
5. వహ్నివాసినీ – శ్రీచక్రాంతర్గత త్రికోణములో నివసిస్తూ వహ్ని మండలాంతర్వర్తినిగా భాసిల్లు రుద్రాణి స్వరూపిణి
6. మహావజ్రేశ్వరీ – నిత్య తిథులలో శుక్ల షష్టి తిథికి అధీశ్వరియై పిండాండములోని విశుద్ధ చక్రానికి అధిష్టాత్రియై, శ్రీచక్రబిందు వికాసమందలి త్రికోణాకారములోని అథిష్టాన దేవతయగు మహావజ్రేశ్వరి
7. శివదూతీ – శుంభ నిశుంభుల దగ్గరకు శివుని దూతగా పంపినదీ, శుక్లపక్ష సప్తమీ తిథికి అధిష్టాత్రీ దేవియైన శివదూతి
8. త్వరితే – తన భక్తులకు శీఘ్రగతిని ముక్తిని ప్రసాదించునట్టి త్వరితాదేవి
9. కులసుందరీ – శ్రీవిద్యా కులంలో సుందర స్వరూపిణిగా భాసిల్లునట్టి కులసుందరీదేవి
10. నిత్యే – నిత్యతిథుల రూపముతో భాసిల్లునట్టిది, ఆదిమధ్యాంతాలు లేనట్టిది అగు జనని
11. నీలపతాకే – నీల వర్ణముగల పతాకముతో రథాన్ని అధిరోహించినట్టి తల్లి
12. విజయే – రక్కసిమూకలను అంతముచేసి విజయ రూపిణియై తేజరిల్లు మాత
13. సర్వమంగళే – సమస్తమైన శుభములు స్వరూపముగా కలిగి, తన భక్తులకు శుభములను ప్రసాదించునట్టి శ్రీదేవి
14. జ్వాలామాలినీ – అగ్నిప్రాకార మధ్య భాగములో జ్వాలామాలినీ స్వరూపిణిగా, ప్రతిమాసములో శుక్ల చతుర్దశి, బహుళ తిథులకు అధిష్టాత్రిగా తేజరిల్లు జగదంబ
15. చిత్రే – విచిత్ర స్వరూపముగల పరమేశ్వరి
16. మహానిత్యే – సృష్టి స్థితి సంహారాతీతురాలై, ఆదిమధ్యాంత రహితయై, సర్వకాల సర్వావస్థలలోనూ స్థిరముగా ఉండునట్టి మహానిత్య స్వరూపిణియగు మాత.
దివ్యౌఘగురవః (7)
1. పరమేశ్వరపరమేశ్వరీ – శివ – శక్తి భేదాతీతురాలగు పరమేశ్వర పత్నియగు పరదేవత
2. మిత్రేశమయీ – భక్తులకు శ్రేయస్సును కలిగించు మైత్రీ భావముగల జగజ్జనని
3. షష్ఠీశమయీ – పష్ఠీ దేవతా శక్తి స్వరూపిణి అయిన జగన్మాత
4. ఉడ్డీశమయీ – ఉడ్డీశ శక్తి రూపిణి అయిన మాత
5. చర్యానాథమయీ – తాను నిత్యరూపిణిగా విలసిల్లుతూ, సృష్టిస్థితి సంహారాదులు కలిగించే సమస్తచర్యలకూ హేతుభూతురాలైన దేవి
6. లోపాముద్రమయీ – లోపాముద్రాదేవిచే పూజింపబడిన శ్రీదేవి
7. అగస్త్యమయీ – అగస్త్యమునిచే పూజింపబడిన శ్రీదేవి
సిద్ధౌఘగురవః (4)
1. కాలతాపనమయీ – సృష్టి స్థితి సంహార కారణాలగు దుఃఖ తాపాదులకు అతీతురాలై విలసిల్లు పరదేవత
2. ధర్మాచార్యమయీ – ధర్మప్రవర్తకులకు ముక్తిని ప్రసాదిస్తూ అధర్మాన్ని నాశనము చేయునట్టి అంబ
3. ముక్తకేశీశ్వరమయీ – నీలవర్ణముతో సుదీర్ధకేశపాశము కలిగి తాపత్రయ దూరురాలగు శ్రీమాత
4. దీపకలానాథమయీ – అజ్ఞానాంధకారాన్ని రూపుమాపు జ్ఞానజ్యోతి స్వరూపురాలగు పరమేశ్వరి
మానవౌఘగురవః (8)
1. విష్ణుదేవమయీ – నారాయణ స్వరూపిణియైన శ్రీదేవి
2. ప్రభాకరదేవమయీ – భాస్కర మండలములోని మార్తాండ భైరవస్వరూపిణియైన మాత
3. తేజోదేవమయీ – స్వయముగా తాను తేజరిల్లుతూ సూర్యచంద్రాగ్నులకు కూడా తేజస్సును ప్రసాదించు తేజోస్వరూపిణి
4. మనోజదేవమయి – మన్మథ స్వరూపిణియైన శ్రీదేవి
5. కళ్యాణదేవమయీ – మంగళకారక కళ్యాణప్రద స్వరూపిణైన మాత
6. వాసుదేవమయీ – శ్రీకృష్ణ భగవద్రూపిణియైన శ్రీదేవి
7. రత్నదేవమయీ – రత్నాలు పొదిగిన ముత్యాలమణిహరాన్ని, రత్నాలు పొదిగిన బంగారు గంటలతో కూడిన మొలత్రాడును ధరించిన దేవి
8. శ్రీరామానందమయీ – నిత్యానంద లక్షణాలు కలిగి,యోగిజన హృదయారవిందములను వికసింపజేయునట్టి పరదేవత
ఇక్కడి నుండి మొత్తం 9 ఆవరణలలో దేవతా శక్తులు కొలువై ఉంటాయి. ఒక్కొక్క చక్రంలోకి వెళ్ళేటప్పుడు యోగినిని, చక్రేశ్వరిని తలుచుకొని దేవతా పేర్లను చదవాలి. తిరిగి చక్రంలోనుండి బయటికి వచ్చేటప్పుడు చక్రేశ్వరి నామాన్ని చదవాలి.
- శ్రీచక్ర ప్రథమావరణదేవతాః
ఈ ఆవరణకు త్రైలోక్య మోహన చక్రము అని పేరు ఈ ఆవరణలో మూడు చతురస్రాలు ఉంటాయి. దీనినే భూపుర త్రయము అంటారు. వీటిలో 4 వైపులా ద్వారాలు ఉంటాయి. ఇందులో సిద్ధి దేవతలు, అష్ట మాతృకలు, ముద్రా దేవతలు పరివేష్టించి ఉంటారు. భూపుర త్రయము అంటే ఒకే ఆవరణ. అందువలన ఒకే యోగిని, ఒకే చక్రేశ్వరి ఉంటారు.
త్రైలోక్య మోహన చక్రము | యోగిని: ప్రకట యోగిని | చక్రేశ్వరి: త్రిపురే
1 వ భూపురం – సిద్ధి దేవతలు
త్రైలోక్యమోహన చక్రస్వామినీ – దేవతాకార స్వరూపురాలైన చక్రాలన్నింటికన్నా శ్రేష్టమై శ్రీచక్రములో భాసిల్లుతూ ముల్లోకాలను మోహపరచునటువంటి శ్రీదేవి
ప్రకటయోగినీ – బ్రహ్మజ్ఞాన యోగాన్ని ప్రకటింపజేయునట్టి యోగినీ మాత
1. అణిమాసిద్ధే – అణిమాసిద్ధి స్వరూపిణియై, భక్తులకు తత్సిద్ధిని ప్రసాదించగల సర్వసమర్థురాలైన జనని
2. లఘిమాసిద్ధే – లఘిమాసిద్ధి స్వరూపిణియై, భక్తులకు తత్సిద్ధిని ప్రసాదించగల దయాస్వరూపురాలైన జనని
3. మహిమాసిద్ధే – మహిమాసిద్ధి స్వరూపిణియై, తత్సిద్ధిని సాధక భక్తలోకానికి ప్రసాదించునట్టి అపార కరుణా సముద్రురాలైన తల్లి
4. ఈశిత్వసిద్ధే – ఈశిత్వసిద్ధి స్వరూపిణియై ఉపాసకులైన భక్తులకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించునట్టి పరదేవతయైన తల్లి
5. వశిత్వసిద్ధే – వశిత్వసిద్ధి స్వరూపిణియై శీఘ్రగతిన భక్తులకు వశమగునట్టి జనని
6. ప్రాకామ్యసిద్ధే – ప్రాకామ్యసిద్ధి స్వరూపిణియై నిజభక్తుల అభీష్టాలను నెరవేర్చునట్టి మాత
7. భుక్తిసిద్ధే – భుక్తిసిద్ధి స్వరూపిణియై భక్త జనావళికి భుక్తిని ప్రసాదించు తల్లి
8. ఇచ్ఛాసిద్ధే – ఇచ్ఛాసిద్ధి స్వరూపిణియై భక్తుల కోరికలు నెరవేర్చునటువంటి శ్రీదేవి
9. ప్రాప్తిసిద్ధే – ప్రాప్తిసిద్ధి స్వరూపిణియై భక్తలోకానికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రాప్తింపజేయు మాత
10. సర్వకామసిద్ధే – సమస్తకోరికలనూ తీర్చునటువంటి మాత
2 వ భూపురం – అష్ట మాతృకలు
1. బ్రాహ్మీ – సృష్టికారిణి అయిన సరస్వతీ స్వరూపిణి
2. మాహేశ్వరీ – లయకారిణియైన మాహేశ్వరీ స్వరూపిణి
3. కౌమారి – షోడశవర్షప్రాయముతో తేజరిల్లునట్టి కౌమారీశక్తి (కుమారస్వామి) స్వరూపిణి
4. వైష్ణవీ – సర్వవ్యాపకత్వమే స్వభావంగాగల విష్ణురూపిణి
5. వారాహీ – వరాహశక్తి స్వరూపిణి
6. మాహేంద్రీ – ఐంద్రీశక్తి రూపిణి
7. చాముండే – అసురులను అంతము చేయడానికి చాముండా రూపాన్ని ధరించి లోకాలకు మేలుచేసిన మాత
8. మహాలక్ష్మీ – కోల్హాపురి పీఠాధిష్టాత్రియైన అష్టలక్ష్మీ స్వరూపిణి
3 వ భూపురం – ముద్రా దేవతలు
1. సర్వసంక్షోభిణీ – తాను నాశనముకాకుండా ప్రళయ వేళలో మహా సంక్షోభాన్ని చెలరేగించు మాత
2. సర్వవిద్రావిణీ – సర్వవిద్రావిణి శక్తి స్వరూపిణియగు శ్రీదేవి
3. సర్వాకర్షిణీ – సర్వాన్నీ ఆకర్షించునట్టి అఖిలలోకాశ్చర్యకర సౌందర్యరాశియైన శ్రీదేవి
4. సర్వవశంకరీ – ప్రపంచమును వశము చేసుకొనునట్టి, భక్తలోక సర్వస్వానికి వశమగునట్టి పరమేశ్వరి
5.సర్వోన్మాదినీ – సృష్టి లయ వేళల్లో అందరినీ ఉన్మాదులను చేసి, కల్లోలాన్ని సృష్టించునట్టి జగన్మాత
6. సర్వమహాంకుశే – మహాంకుశాన్ని ధరించి, దుర్మార్గులను నాశనము చేయునట్టి జగన్మాత
7. సర్వఖేచరీ -ఖేచరీశక్తి స్వరూపిణియగు జనని
8. సర్వబీజే – సమస్త మంత్రముల బీజస్వరూపిణియై భాసిల్లు మాత
9. సర్వయోనే – శ్రీచక్రాంతర్గత త్రికోణములో భాసిల్లు యోనీ శక్తియైన బిందు స్వరూపిణి
10. సర్వత్రిఖండే – వాగ్భావ కామరాజు శక్తి కూటములనే త్రిఖండ స్వరూపిణియైన దేవి
త్రిపురే,
- శ్రీచక్ర ద్వితీయావరణదేవతాః
సర్వాశా పరిపూరక చక్రము | యోగిని: గుప్తయోగినీ | చక్రేశ్వరి: త్రిపురేశి
(షోడశ దళం)
సర్వాశా పరిపూరక చక్రస్వామినీ – శ్రీ చక్రస్వామినియగు పరదేవతను ఆరాధించిన వారికి శీఘ్రముగా సమస్తమైన ఆశలూ సిద్ధింపజేయు సర్వాశాపరిపూరకురాలగు శ్రీలలితాంబ
గుప్తయోగినీ – మూలాధార చక్రములో నివసించే ఢాకిన్యాది యోగినీ దేవతల మధ్య గుప్తముగా సంచరిస్తూ, వారికి అధిదేవతగా ఉండు గుప్తయోగినీ దేవి
1. కామాకర్షిణీ – కోరికలను ఆకర్షించునది, ప్రసాదించగల సమర్థురాలు అయిన శ్రీమాత
2. బుద్ధ్యాకర్షిణీ – బుద్ధిని ఆకర్షించి బ్రహ్మజ్ఞాన ప్రదాయినియగు శ్రీదేవి
3. అహంకారాకర్షిణీ – భక్తజనుల అహంకారాన్ని రూపుమాపి, వారు పతనకూపములో పడకుండా జ్ఞానాన్ని ప్రసాదించు పరదేవత
4. శబ్దాకర్షిణీ – శబ్ద బ్రహ్మ స్వరూపిణియై, ఓంకార మూర్తియై, భక్తులకు బ్రహ్మజ్ఞానోపదేశము చేయునట్టి తల్లి
5. స్పర్శాకర్షిణీ – స్పర్శాకర్షణ శక్తితో, భక్తులకు ముక్తిని ప్రసాదించు తల్లి
6. రూపాకర్షిణీ – రూపాకర్షణ శక్తితో భక్తులకు సౌందర్యాన్ని ప్రసాదించు తల్లి
7. రసాకర్షిణీ – రసమే స్వరూపముగా కలిగి సర్వులనూ ఆకర్షించగలుగునట్టి నవరస స్వరూపిణియగు దేవి
8. గంధాకర్షిణీ – సర్వ సుగంధాలనూ ఆకర్షించి, గంధ లేపనాదులయందు విశేషాకర్షణ కలిగియుండు తల్లి
9. చిత్తాకర్షిణీ – భక్తులకు నిశ్చిలత్వాన్ని ప్రసాదించు మాత
10. ధైర్యాకర్షిణీ – భక్తజనులకు ధైర్యసాహసాదులను ప్రసాదించు జనని
11. స్మృత్యాకర్షిణీ – స్మృత్యాదులచే స్తుతించు భక్తుల స్మరణ శక్తిని వర్ధిల్లజేయు మాత
12. నామాకర్షిణీ – నామపారాయణ ప్రీతియై భక్తుల అభీష్టాలను నెరవేర్చు మాత
13. బీజాకర్షిణీ – బీజ స్వరూపాన్ని ఆకర్షించి, దర్శనమిచ్చు జనని
14. ఆత్మాకర్షిణీ -ఆత్మస్వరూపాన్ని ఆకర్షించి, అమృత తత్త్వాన్ని ప్రసాదించు పరమాత్మ స్వరూపిణి
15. అమృతాకర్షిణీ – అమృతమూర్తియై, సాధకులకు అమృతతత్వాన్ని ప్రసాదించునట్టి జనని
16. శరీరాకర్షిణీ – దేహములోని నాడీమండల రూపములో భక్తులకు శక్తిని ప్రసాదించు పరదేవత
త్రిపురేశి
- శ్రీచక్ర తృతీయావరణదేవతాః
(అష్టదళం)
చక్రము: సర్వ సంక్షోభణ చక్రము యోగిని: గుప్తతరయోగినీ చక్రేశ్వరి: త్రిపురసుందరి
సర్వసంక్షోభణ చక్రస్వామినీ – ప్రళయకాలములో సర్వసంక్షోభాన్ని కలిగించునట్టి చక్రస్వామిని
గుప్తతరయోగినీ – మూలాధార చక్రములో రహస్యాతి రహస్యముగా సంచరిస్తూ, ఆరాధ్య దేవతలగు యోగినులకు అధీశ్వరియై భాసిల్లు పరమేశ్వరి
1. అనంగకుసుమే – అనంగకుసుమా స్వరూపిణియగు శ్రీదేవి
2. అనంగమేఖలే – యావద్విశ్వమూ మొలనూలుగా ధరించిన అనంగమేఖలా దేవి
3. అనంగమదనే – ముక్కంటి కంటిమంటకు అనంగుడైన మదనుని అనుగ్రహించిన మాత
4. అనంగమదనాతురే – నిజ సౌందర్యం మాత్రముచే యోగీశ్వరుడైన శంకరుని కూడా మదన ప్రభావితుని గావించిన, అపురూప సౌందర్య రాశియైన జగదీశ్వరి
5. అనంగరేఖే – మన్మథ రేఖలతో విలసిల్లు దివ్యాంగాలు గల శ్రీదేవి
6. అనంగవేగినీ – ఊహాతీత తీవ్రతర వేగము గల సర్వవ్యాపినియగు జగన్మాత
7. అనంగాంకుశే – అంకుశాయుధ ధారిణియగు శ్రీమాత
8. అనంగమాలినీ – అకారాది క్షకారాంతముగా గల వర్ణమాలా స్వరూపిణియగు పరదేవత
త్రిపురసుందరీ
- శ్రీచక్ర చతుర్థావరణదేవతాః
సర్వసౌభాగ్యదాయక చక్రము యోగిని: సంప్రదాయయోగినీ | చక్రేశ్వరి: త్రిపురవాసిని
(14 త్రిభుజాలు)
ఈ 14 కోణములలోని దేవతలు- అలంబుస, కుహు, విశ్వోదరి, వరుణ, హస్తిజిహ్వ, యశోవతి, పయస్విని, గాంధారి, పూస, శంఖిణి, సరస్వతి, ఇడ, పింగళ, సుషుమ్న అనే 14 నాడులను అదుపులో ఉంచుతారు. కొందరు వీటిని ప్రాణులకు ఆధారమైన 14 లోకాలను తెలుపుతాయని చెప్తారు.
సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ, సంప్రదాయయోగినీ
సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ – తన ప్రియభక్తులకు సర్వసౌభాగ్యాలను అనుగ్రహించునట్టి జనని
సంప్రదాయయోగినీ – గురుశిష్య సంప్రదాయ పరంపరయందు ఉపాసింపబడు యోగినీ దేవతయగు శ్రీలలితాంబ
1. సర్వసంక్షోభిణీ – తాను నిత్యయై తేజరిల్లుతూ, చరాచర జగత్తును లయవేళల్లో కల్లోలపరచునట్టి సర్వసంక్షోభిణీ స్వరూపిణి
2. సర్వవిద్రావిణీ – సర్వజీవరాశిని నాశనము చేయునట్టి జగదంబ
3. సర్వాకర్షిణీ – సర్వులనూ ఆకర్షించునట్టి దివ్య సుందర రూపిణియగు శ్రీదేవి
4. సర్వాహ్లాదినీ – భక్తజనులందరికీ సంతోషము కలుగజేయునట్టి పరమేశ్వరి
5. సర్వసమ్మోహినీ – సర్వులనూ సమ్మోహింపజేయగల శక్తి స్వరూపిణియగు పరమేశ్వరి
6. సర్వస్తంభినీ – లయవేళలో యావద్విశ్వాన్నీ స్తంభింపజేయునట్టి స్తంభినీ స్వరూపిణి
7.సర్వజృంభిణీ – సంహార వేళలో విజృంభించి వీరవిహారము చేయునట్టి, జృంభిణీ స్వరూపిణియగు జగదంబ
8. సర్వవశంకరీ – సర్వాన్నీ స్వాధీనము చేసుకొని, భక్తజన సర్వస్వానికి వశంకరియై ముక్తిని ప్రసాదించు శ్రీదేవి
9. సర్వరంజనీ – యావద్విశ్వాన్నీ రంజింపజేయునట్టి అఖిలేశ్వరి
10. సర్వోన్మాదినీ – యావద్విశ్వాన్నీ భ్రమింపజేసి ఉన్మాద స్థితిలో ముంచెత్తగలుగునట్టి అఖిలేశ్వరి
11. సర్వార్థసాధికే – భక్తజనులయొక్క సమస్తమైన ప్రార్థనలను మన్నించి, వారి అభీష్టాలను నెరవేర్చునట్టి తల్లి
12. సర్వసంపత్తిపూరిణీ – తనను ఆరాధించు భక్తులకు సమస్త సంపదలనూ ప్రసాదించు పరమేశ్వరి
13. సర్వమంత్రమయీ – సమస్తమైన మంత్రములకూ తానే అధిష్టాత్రియైన దేవి
14. సర్వద్వంద్వక్షయంకరీ – సమస్తమైన భేదభావాలనూ దూరముచేసి, భక్తులకు అద్వైత తత్త్వాన్ని ప్రసాదించు కరుణామూర్తి
త్రిపురవాసిని
- శ్రీచక్ర పంచమావరణదేవతాః
సర్వార్థసాధక చక్రము యోగిని: కులోత్తీర్ణయోగినీ | చక్రేశ్వరి: త్రిపురా శ్రీః
(10 త్రిభుజాలు)
ఈ చక్రము 10 ఇంద్రియములకు సంకేతము. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు-చర్మము, కన్ను, చెవి, నాలుక, ముక్కు. 5 కర్మేంద్రియాలు-వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ. ఈ చక్రము దశావతారాత్మకము అని కూడా చెప్తారు.
సర్వార్థసాధక చక్రస్వామినీ – శ్రీచక్ర అధిష్టానదేవతయై, తననర్చించు భక్తులకు సర్వార్థములనూ ప్రసాదించు తల్లి
కులోత్తీర్ణయోగినీ – శ్రీచక్రములో విరాజిల్లే నవావరణ దేవతలకు అధీశ్వరియైన, బిందు రూపములో తేజరిల్లే పరాశక్తియే కులోత్తీర్ణయోగిని
1. సర్వసిద్ధిప్రదే – భక్తజనులకు అష్టసిద్ధులనూ ప్రసాదించగల సర్వసమర్థురాలైన జగదంబ
2. సర్వసంపత్ప్రదే – భక్తులకు సర్వసంపదలనూ ప్రసాదించు మాత
3. సర్వప్రియంకరీ – తన భక్తులకు మంచిని చేకూర్చునట్టి ప్రేమమూర్తి
4. సర్వమంగళకారిణీ – తాను నిత్యకళ్యాణియై, తనను స్మరించు భక్తులకు సమస్త శుభములనూ చేకూర్చునట్టి మాత
5. సర్వకామప్రదే – తనను ఆరాధించువారి సర్వకామనలనూ సిద్ధింపజేయునట్టి పరదేవత
6. సర్వదుఃఖవిమోచనీ – తనను స్మరించిన భక్తుల దుఃఖాలను రూపుమాపునట్టి జనని
7. సర్వమృత్యుప్రశమని – అకాలమృత్యువు, అపమృత్యువు, మొదలైన మృత్యువులను తన భక్తులకు రాకుండా కాపాడి, జన్మాంతములో అమృతత్వాన్ని ప్రసాదించు దేవి
8. సర్వవిఘ్ననివారిణీ – తనను సేవించు భక్తులకు ఆరాధన, ఉపాసన, సత్కర్మానుష్టానాదులలో ఎట్టి విష్నుములూ కలుగకుండా కాపాడు తల్లి
9. సర్వాంగసుందరీ – సర్వాంగ సౌందర్యరాశియై భాసిల్లు పరమేశ్వరి
10. సర్వసౌభాగ్యదాయినీ – భక్తులైన పుణ్యాత్ములకు సమస్తమైన సౌఖ్యాలను ప్రసాదించు శ్రీదేవి
త్రిపురా శ్రీః
- శ్రీచక్ర షష్టావరణదేవతాః
సర్వరక్షాకర చక్రము యోగిని: నిగర్భయోగినీ | చక్రేశ్వరి: త్రిపురమాలిని
(10 త్రిభుజాలు)
ఈ చక్రానికి పది కోణాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న కోణ దేవతలు- ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కుర్మ, కృకర, దేవదత్త, ధనంజయ అనే 10 ప్రాణములకు సంకేతము.
సర్వరక్షాకర చక్రస్వామినీ – శ్రీచక్రాధిష్టాన దేవతయై, భక్తులను సర్వవిధములా కాపాడు శ్రీలలితా పరమేశ్వరి
నిగర్భయోగినీ – యోనికూట స్వరూపిణియైన దేవి
1. సర్వజ్ఞే – సర్వమూ తెలిసిన జ్ఞానమూర్తి
2. సర్వశక్తే – సృష్టి స్థితి సంహారములను చేయగలిగినట్టి, భక్తులకు సర్వశక్తులనూ ప్రసాదించు మహాశక్తి
3. సర్వైశ్వర్యప్రదాయినీ – నిశ్చల హృదయముతో ఆరాధించు తన భక్తులకు, సర్వైశ్వర్యములనూ ప్రసాదించు మహేశ్వరి
4. సర్వజ్ఞానమయీ – తనను ఉపాసించు భక్తులకు బ్రహ్మజ్ఞానాదులను ప్రసాదించు పరమేశ్వరి
5. సర్వవ్యాధివినాశినీ – భక్తుల శారీరక మానసిక వ్యాధులన్నింటినీ రూపుమాపు జనని
6. సర్వాధారస్వరూపే – సృష్టిస్థితిలయలకూ, సర్వజీవరాశికీ ఆధార స్వరూపిణియైన పరమేశ్వరి
7. సర్వపాపహరే – భక్తులయొక్క సమస్త పాపములనూ హరించునట్టి మాత
8. సర్వానందమయీ – భక్తులకు సమస్త ఆనందములనూ ప్రసాదించునట్టి మాత
9. సర్వరక్షాస్వరూపిణీ – భక్తులను సమస్త ఆపదలనుండి కాపాడునట్టి మాత
10. సర్వేప్సితఫలప్రదే – నామ స్మరణ మాత్రాన భక్తుల కోరికలను తీర్చు మాత
త్రిపురమాలిని
- శ్రీచక్ర సప్తమావరణదేవతాః
సర్వరోగహర చక్రము యోగిని: రహస్య యోగినీ | చక్రేశ్వరి: త్రిపురసిద్ధే
(8 త్రిభుజాలు)
ఈ 8 కోణాలు- భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అనే 8 ప్రకృతులను సూచిస్తాయి.
సర్వరోగహర చక్రస్వామినీ – శ్రీచక్రాధిష్టాత్రియై తేజరిల్లుతూ, తన ఉపాసకులకు రోగములు రాకుండా కాపాడునట్టి, జన్మాంతరాది వ్యాధులను కూడా రూపుమాపునట్టి మహేశ్వరి
రహస్య యోగినీ – శ్రీచక్రాంతర్గత నవావరణ దేవతలలో గల రహస్యయోగినీ బృందానికి అధిష్టాత్రియైన మాత
1. వశినీ – భక్తజన వశంకరి, వశినీశక్తి స్వరూపిణియగు మాత
2. కామేశ్వరీ – అనంగుడైన మదనుని ద్వారా ఉపాసించబడిన కామవిద్యా స్వరూపిణియగు కామేశ్వరి
3. మోదినీ – నామపారాయణ మాత్రముచే తృప్తిచెందు దేవి
4. విమలా – శుద్ధ సత్త్వ రూపిణియై దశ సంస్కార రహితయైన విమలాదేవి
5. అరుణా -బాలభాస్కర సమమగు అరుణవర్ణం కలిగి, అరుణ వస్త్రాన్ని ధరించి, మందారాది అరుణపుష్పాలయందు ప్రీతికల దేవి
6. జయినీ – జయమే స్వరూపముగా కలిగి, భక్తులకు జయాలను ప్రసాదించు తల్లి
7. సర్వేశ్వరీ – చరాచర విశ్వానికి, సృష్టి స్థితి సంహారాలు చేయునట్టి త్రిమూర్తులకు సైతముఈశ్వరియైన సర్వేశ్వరి
8. కౌలిని – నిర్గుణ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడు శివుడు, జగత్కారణ స్వరూపిణియగు సగుణ బ్రహ్మ శక్తియే మాత. ఇట్టి శివశక్త్యాత్మక సామరస్య సూచిక కౌలినీ
త్రిపురసిద్ధే
- శ్రీచక్ర అష్టమావరణదేవతాః
సర్వసిద్ధిప్రద చక్రము, యోగిని: అతిరహస్యయోగినీ | చక్రేశ్వరి: త్రిపురాంబిక
(1 త్రిభుజం)
సత్త్వరజస్తమస్సులు అనే 3 గుణాలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే త్రిమూర్తులు, చంద్ర, అగ్ని, సూర్యులు అనే 3 తేజస్వరూపములు, ఈ త్రికోణానికి బిందువులుగా భావిస్తే, ఈ 3 తేజస్వరూపములకు తేజస్సునిచ్చేటటువంటి త్రికోణాంతరదీపిక – శ్రీ లలితా మహా భట్టారికా.
సర్వసిద్ధిప్రద చక్రస్వామినీ – తనను సేవించునట్టి శ్రీవిద్యోపాసకులకు, సర్వసిద్ధులనూ ప్రసాదించు బిందుస్థాన విరాజమానయగు జగన్మాత
అతిరహస్యయోగినీ – శ్రీచక్ర నవావరణలలో అతి రహస్యముగా విహరించునట్టి రహస్యయోగినులకు అధీశ్వరియై భాసిల్లు దేవి
1. బాణినీ – బాణములను దాల్చి, భక్తులను రక్షించు మాత
2. చాపినీ – చాపాయుధ ధారిణి
3. పాశినీ – భవబంధపాశములను అనువర్తింపచేయు మాత
4. అంకుశినీ – అంకుశాయుధాన్ని దాల్చిన శ్రీలలితాంబ
5. మహాకామేశ్వరీ – సర్వవాంఛలనూ నెరవేర్చు మహా మహేశ్వరుని హృదయేశ్వరియైన మాత
6. మహావజ్రేశ్వరీ – శుద్ధ షష్టి తిథికి అథిష్టాన దేవతయైన మహావజ్రేశ్వరీ నామక దేవి
7. మహాభగమాలినీ – షడ్గుణైశ్వర్యాలనూ, ద్వాదశాదిత్యులనూ మాలగా ధరించిన మహాభగమాలినీ దేవి
త్రిపురాంబిక
- శ్రీచక్ర నవమావరణదేవతాః
సర్వానందమయ చక్రము యోగిని: పరాపరరహస్య యోగినీ (బిందువు), చక్రేశ్వరి: మహా మహా కామేశ్వరి
ఇక్కడే కామేశ్వరుని వామోరు భాగంలో కామేశ్వరి కూర్చుని ఉంటుంది. ఈ బిందువే సర్వమునకూ మూలము. ఇక్కడే బ్రహ్మానందములు, సర్వ ఆనందములు ఉంటాయి. అందుకే దీనికి సర్వానందమయ చక్రమని పేరు.
శ్రీ శ్రీ మహాభట్టారికే – నవావరణ దేవతలగు శక్తి స్వరూపిణుల చేతా, అసుర సంహార రూపిణులైన కౌశిక దుర్గాది శక్తుల చేతా సేవింపబడుతూ, వారిచే పరివేష్టితురాలై సింహాసనాన్ని అధిష్టించిన శ్రీలలితా పరాభట్టారిక
సర్వానందమయ చక్రస్వామినీ – శ్రీచక్రస్వామినియై తన ఉపాసకులైన వారికి సర్వానందాలనూ ప్రసాదించు సర్వానందమయ స్వరూపిణియగు శ్రీలలితా మాత
పరాపరరహస్య యోగినీ – ఆద్యంతరహితయై వాటికి హేతుభూతురాలై అతిరహస్యముగా విహరించునట్టి, సాధారణులకు గోచరము కానట్టి పరమేశ్వరి
నవచక్రేశ్వరీ నామాని
1. త్రిపురే -త్రిపురసుందరీ స్వరూపిణీ, సృష్టి స్థితి సంహారములకు కూడా పూర్వములో తేజరిల్లు ఆదిపరాశక్తి అయిన మాత
2. త్రిపురేశీ – స్థూల సూక్ష్మ కారణ శరీరాలను – త్రిపురాలకు అధీశ్వరియైన పరమేశ్వరి
3. త్రిపురసుందరీ – త్రిపురాసుర సంహారకుడైన మహాదేవుని పత్ని అయిన త్రిపురసుందరీదేవి
4. త్రిపురవాసినీ – శ్రీచక్రరాజములోని త్రికోణాలలో బిందు స్వరూపిణియై భాసిల్లు దేవి
5. త్రిపురాశ్రీః – త్రిపురాలకూ లక్ష్మీ స్వరూపిణియైన మాత
6. త్రిపురమాలినీ – పంచదశీ మహామంత్రములోని త్రికూటములకూ, శరీర త్రయానికి స్వామినియై తత్త్వత్రయాన్ని మాలగా ధరించిన మహేశ్వరి
7. త్రిపురసిద్ధే – త్రిపురాలలోని అష్టసిద్దులను తన సాధకులకు, ఉపాసకులకు ప్రసాదించు మాత
8. త్రిపురాంబా – జగత్రయ, గుణత్రయ, పురత్రయ, దేహత్రయ మూర్తి త్రయాదులకు జననియైన మాతృదేవి
9. మహాత్రిపురసుందరీ- త్రిపురసుందరీ స్వరూపిణియైన మహామాత
శ్రీదేవి విశేషణాని నమస్కారనవాక్షరీచ
1. మహామహేశ్వరీ – మహేశ్వరుని ప్రాణశక్తి స్వరూపిణియై, అనంతకోటి బ్రహ్మాండాల సృష్టి స్థితి సంహారములకు, నిర్వహణాదులకు కారణ స్వరూపిణియైన పరమేశ్వరి
2. మహామహారాజ్ఞీ – చరాచర విశ్వాలకు అధిష్టాన దేవతైన మహారాజ్ఞి స్వరూపిణి
3. మహామహాశక్తే – మహత్తరాతి మహత్తర శక్తి స్వరూపిణియైన శ్రీలలితామాత
4. మహామహాగుప్తే – అనంత ప్రళయ వేళలో సృష్టికారణ బీజ సర్వస్వాన్నీ తనలో గుప్తపరచుకొనునట్టి జగదీశ్వరి
5. మహామహాజ్ఞప్తే – అనంత జ్ఞాపకశక్తి గల మాత
6. మహామహానందే – మహత్తరాతి మహత్తరానందమూర్తియై సాధక సందోహానికి మహానందాన్ని ప్రసాదించు మాత
7. మహామహాస్కంధే – మహత్తరాతి మహత్తరమైన భుజస్కంధాలతో భాసిల్లు పరమేశ్వరి
8. మహామహాశయే – సర్వోత్కృష్టాశయాలు కలిగినదై తన ఉపాసకులకు సదాశయాలను నెరవేర్చునట్టి దేవి
- మహామహా శ్రీచక్రనగరసామ్రాజ్ఞీ, నమస్తే నమస్తే నమస్తే నమః ।
– సర్వోత్కృష్ట యంత్ర రాజమైన శ్రీచక్ర మహానగరానికి సామ్రాజ్ఞియై భాసిల్లునట్టి రాజరాజేశ్వరీ పరదేవతకు నమస్కారము.
ఫలశ్రుతిః
ఏషా విద్యా మహాసిద్ధిదాయినీ స్మృతిమాత్రతః ।
అగ్నివాతమహాక్షోభే రాజారాష్ట్రస్యవిప్లవే ॥
లుంఠనే తస్కరభయే సంగ్రామే సలిలప్లవే ।
సముద్రయానవిక్షోభే భూతప్రేతాదికే భయే ॥
అపస్మారజ్వరవ్యాధిమృత్యుక్షామాదిజేభయే ।
శాకినీ పూతనాయక్షరక్షఃకూష్మాండజే భయే ॥
మిత్రభేదే గ్రహభయే వ్యసనేష్వాభిచారికే ।
అన్యేష్వపి చ దోషేషు మాలామంత్రం స్మరేన్నరః ॥
తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్తస్థితేనవై ।
అష్టాదశమహాద్వీపసమ్రాడ్భోక్తాభవిష్యతి ॥
సర్వోపద్రవనిర్ముక్తస్సాక్షాచ్ఛివమయోభవేత్ ।
ఆపత్కాలే నిత్యపూజాం విస్తారాత్కర్తుమారభేత్ ॥
ఏకవారం జపధ్యానం సర్వపూజాఫలం లభేత్ ।
నవావరణదేవీనాం లలితాయా మహౌజనః ॥
ఏకత్ర గణనారూపో వేదవేదాంగగోచరః ।
సర్వాగమరహస్యార్థః స్మరణాత్పాపనాశినీ ॥
లలితాయామహేశాన్యా మాలా విద్యా మహీయసీ ।
నరవశ్యం నరేంద్రాణాం వశ్యం నారీవశంకరమ్ ॥
అణిమాదిగుణైశ్వర్యం రంజనం పాపభంజనమ్ ।
తత్తదావరణస్థాయి దేవతాబృందమంత్రకమ్ ॥
మాలామంత్రం పరం గుహ్యం పరం ధామ ప్రకీర్తితమ్ ।
శక్తిమాలా పంచధాస్యాచ్ఛివమాలా చ తాదృశీ ॥
తస్మాద్గోప్యతరాద్గోప్యం రహస్యం భుక్తిముక్తిదమ్ ॥
॥ ఇతి శ్రీ వామకేశ్వరతంత్రే ఉమామహేశ్వరసంవాదే దేవీఖడ్గమాలాస్తోత్రరత్నం సమాప్తమ్ ॥
ఈ స్తోత్రాన్ని చదివినా, విన్నా సకల దోషాలూ, సమస్త దుఖాలూ తొలగి, అన్ని పనులలో విజయం లభిస్తుంది. ఒక్క ఖడ్గమాల స్తోత్రం చదువుతూ శ్రీ చక్రానికి కుంకుమతో అర్చించినా పూర్ణ శ్రీవిద్యా పూజగా పరిగణింపబడుతుంది. తీవ్ర సమస్యలు వచ్చినప్పుడు పూర్ణ భక్తి తో ఈ స్తోత్ర పారాయణం చేస్తే వెంటనే రక్షణ లభిస్తుంది. జటిలమైన సమస్యల పరిష్కారానికి ఈ స్తోత్రాన్ని ప్రతి రోజు 11 సార్లు పారాయణం 41 రోజుల పాటు చేస్తూ అన్ని నియమాలను పాటిస్తూ ఆచరిస్తే, సత్వర సహాయం లభిస్తుంది. చదవలేని వారు ఈ స్తోత్రం ప్రతిరోజూ విన్నా మెరుగైన ఫలితాలు కలుగుతాయి.
ఖడ్గమాలా స్తోత్రం తెలుగులో అర్థాలను, వివరణను pdf రూపంలో download చేసుకోవాలనుకుంటే, ఈ వీడియొ description చూడండి.
మీకు ఈ వివరణ నచ్చినట్లయితే మీ బంధుమిత్రులతో share చేసుకోండి. ధన్యవాదములు.
.