స్తోత్రాలకు తెలుగులో అర్థం » దేవీ స్తోత్రాలు » లలితా స్తోత్రాలు » శ్రీ లలితా సహస్రనామం తెలుగులో అర్థం 41-60
లలితా సహస్రనామాలు 41 నుండి 60 వరకు తెలుగులో అర్థం – శ్రీ లలితా త్రిపురసుందరి దేవి దివ్య నామాల వివరణ

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -3

మన హిందూ సనాతన ధర్మంలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రానికి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు బ్రహ్మాండ పురాణంలో సాక్షాత్తు ఆ హయగ్రీవుడు అగస్త్య మహామునికి ఉపదేశించిన మహా మంత్రం ఇది.

అమ్మవారి అనుగ్రహం పొందడానికి, జీవితంలో సకల శుభాలు, ప్రశాంతత కలగడానికి ప్రతిరోజూ ఎంతోమంది భక్తులు ఈ సహస్రనామాన్ని పఠిస్తుంటారు అయితే, ఏదైనా స్తోత్రాన్ని కేవలం చదవడం కన్నా అందులోని ప్రతి నామానికి ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుని, భావయుక్తంగా పఠిస్తే ఆ అనుభూతి మరింత అద్భుతంగా ఉంటుంది ఆ జగన్మాత తత్వం మనసుకు మరింత దగ్గరవుతుంది. లలితా పరమేశ్వరి వైభవాన్ని తెలుసుకునే ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం.

భవానీ,భావనాగమ్యా,భవారణ్యకుఠారికా।
భద్రప్రియా,భద్రమూర్తిర్భక్తసౌభాగ్యదాయినీ॥41॥
భవానీ – పరమశివుని భార్య
భావనాగమ్యా – పవిత్రమైన భక్తి భావంతో మాత్రమే చేరుకోగలిగే తల్లి
భవారణ్యకుఠారికా – జనన మరణాలు అనే సంసారపు చిట్టడవిని నరికివేసే గొడ్డలి లాంటి తల్లి
భద్రప్రియా – ఎల్లప్పుడూ మంగళకరమైన వాటిని అమితంగా ఇష్టపడే తల్లి
భద్రమూర్తి – శుభప్రదమైన, మంగళకరమైన రూపమే తానైన తల్లి
భక్తసౌభాగ్యదాయినీ – భక్తులకు సౌభాగ్యమును ప్రసాదించే తల్లి

భక్తిప్రియా,భక్తిగమ్యా,భక్తివశ్యా,భయాపహా।
శాంభవీ,శారదారాధ్యా,శర్వాణీ,శర్మదాయినీ॥42॥
భక్తిప్రియా – భక్తుల భక్తిని అమితంగా ఇష్టపడే తల్లి
భక్తిగమ్యా – కేవలం నిష్కల్మషమైన భక్తి ద్వారా మాత్రమే చేరుకోగలిగే తల్లి
భక్తివశ్యా – స్వచ్ఛమైన భక్తికి మాత్రమే వశమయ్యే తల్లి
భయాపహా – తనను నమ్ముకున్న భక్తుల సకల భయాలను పోగొట్టే తల్లి
శాంభవీ – శంభుని పత్ని
శారదారాధ్యా – చదువుల తల్లి అయిన సరస్వతీ దేవి చేత కూడా పూజింపబడునది
శర్వాణీ – శర్వుని భార్య
శర్మదాయినీ – భక్తులకు సకల సుఖాలను, బ్రహ్మానందాన్ని ప్రసాదించునది

శాంకరీ,శ్రీకరీ,సాధ్వీ,శరచ్చంద్రనిభాననా।
శాతోదరీ,శాంతిమతీ,నిరాధారా,నిరంజనా॥43॥
శాంకరీ – శంకరుని అర్థాంగి
శ్రీకరీ – శుభములను చేకూర్చునది
సాధ్వీ – పతివ్రతాశిరోమణి
శరచ్చంద్రనిభాననా – శరదృతువులోని పున్నమి చంద్రుని వంటి ప్రకాశవంతమైన ముఖము కలది
శాతోదరీ – సన్నని ఉదరము కలది
శాంతిమతీ – శాంతమును స్వరూపముగా కలిగినది
నిరాధారా – ఎటువంటి ఆధారము అవసరము లేనిది
నిరంజనా – ఎటువంటి మాలిన్యము లేని నిర్మల స్వరూపిణి

నిర్లేపా,నిర్మలా,నిత్యా,నిరాకారా,నిరాకులా।
నిర్గుణా,నిష్కళా,శాంతా,నిష్కామా,నిరుపప్లవా॥44॥
నిర్లేపా – కర్మ బంధములు అంటనిది
నిర్మలా – ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండే తల్లి
నిత్యా – శాశ్వతమైనది
నిరాకారా – ఒక నిర్దిష్టమైన రూపానికి పరిమితం కానిది
నిరాకులా – ఎటువంటి అలజడి లేక, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది
నిర్గుణా – సత్వ,రజ,తమో అనే మూడు గుణాలకు అతీతమైనది
నిష్కళా – విభజించడానికి వీలులేని పూర్ణ స్వరూపం
శాంతా – పరమ శాంతికి నిలయం
నిష్కామా – ఎటువంటి కోరికలు లేనిది
నిరుపప్లవా – ఎన్నటికీ నాశనం లేనిది

నిత్యముక్తా,నిర్వికారా,నిష్ప్రపంచా,నిరాశ్రయా।
నిత్యశుద్ధా,నిత్యబుద్ధా,నిరవద్యా,నిరంతరా॥45॥
నిత్యముక్తా – ఎల్లప్పుడూ బంధాల నుండి విముక్తురాలు
నిర్వికారా – ఎటువంటి మార్పులు లేనిది
నిష్ప్రపంచా – ఈ మాయా ప్రపంచానికి అతీతమైనది
నిరాశ్రయా – ఎవరిపైనా ఆధారపడనిది
నిత్యశుద్ధా – ఎల్లప్పుడూ పవిత్రమైనది
నిత్యబుద్ధా – ఎల్లప్పుడూ మేల్కొన్న జ్ఞాన స్వరూపం
నిరవద్యా – ఎటువంటి లోపాలు లేని నిర్మల మూర్తి
నిరంతరా – ఎక్కడా ఖాళీ లేకుండా అంతటా నిండి ఉన్నది

నిష్కారణా,నిష్కళంకా,నిరుపాధిర్నిరీశ్వరా।
నీరాగా,రాగమథనీ,నిర్మదా,మదనాశినీ॥46॥
నిష్కారణా – తన ఉనికికి కారణం అవసరం లేనిది
నిష్కళంకా – ఎటువంటి మచ్చ లేని చంద్రబింబం వంటిది
నిరుపాధిః – ఎటువంటి పరిధులు లేదా ఉపాధులు లేనిది
నిరీశ్వరా – తనకంటే పైన ఉన్న అధికారి ఎవరూ లేనిది
నీరాగా – కోరికలు లేదా రాగద్వేషాలు లేనిది
రాగమథనీ – భక్తులలో ఉన్న మమకారాన్ని తొలగించేది
నిర్మదా – అహంకారం లేదా గర్వం లేని తల్లి
మదనాశినీ – భక్తులలో ఉండే గర్వాన్ని అణచివేసేది

నిశ్చింతా,నిరహంకారా,నిర్మోహా,మోహనాశినీ।
నిర్మమా,మమతాహంత్రీ,నిష్పాపా,పాపనాశినీ॥47॥
నిశ్చింతా – ఎటువంటి చింతలు, ఆందోళనలు లేనిది
నిరహంకారా – ఏ విధమైన అహంకారము లేనిది
నిర్మోహా – మాయ లేదా భ్రమలకు లోనుకానిది
మోహనాశినీ – భక్తుల మనస్సులోని అజ్ఞానపు భ్రమలను పోగొట్టేది
నిర్మమా – నాది అనే స్వార్థం లేనిది
మమతాహంత్రీ – భక్తులలో ఉండే మమకారాన్ని దూరం చేసేది
నిష్పాపా – పాపము లేనిది
పాపనాశినీ – తనను నమ్మిన వారి పాపాలను కడిగివేసేది

నిష్క్రోధా,క్రోధశమనీ,నిర్లోభా,లోభనాశినీ।
నిఃసంశయా,సంశయఘ్నీ,నిర్భవా,భవనాశినీ॥48॥
నిష్క్రోధా – కోపం లేని శాంత స్వరూపిణి
క్రోధశమనీ – భక్తులలో కలిగే కోపాన్ని చల్లార్చేది
నిర్లోభా – అత్యాశ లేని మహోన్నత తల్లి
లోభనాశినీ – మనస్సులోని పిసినారితనాన్ని లేదా లోభాన్ని పోగొట్టేది
నిస్సంశయా – ఎటువంటి సందేహాలు లేని స్పష్టమైన జ్ఞానమూర్తి
సంశయఘ్నీ – మనలోని అనుమానాలను, సంశయాలను తుడిచిపెట్టేది
నిర్భవా – పుట్టుకే లేనిది
భవనాశినీ – సంసార బంధాలను పోగొట్టేది

నిర్వికల్పా,నిరాబాధా,నిర్భేదా,భేదనాశినీ।
నిర్నాశా,మృత్యుమథనీ,నిష్క్రియా,నిష్పరిగ్రహా॥49॥
నిర్వికల్పా – ఎటువంటి మార్పులు లేదా సంకల్పాలు లేని నిశ్చల స్థితి
నిరాబాధా – ఏ రకమైన ఆటంకాలు లేదా బాధలు లేనిది
నిర్భేదా – భేదభావం లేనిది
భేదనాశినీ – భేద భావాలను, ద్వైతాన్ని తొలగించేది
నిర్నాశా – ఎన్నటికీ నాశనం లేని శాశ్వతమైన తల్లి
మృత్యుమథనీ – మృత్యువును సైతం జయించిన మహాశక్తి
నిష్క్రియా – ఏ పనీ చేయాల్సిన అవసరం లేని పరిపూర్ణ స్థితి
నిష్పరిగ్రహా – దేనినీ ఆశించనిది, స్వీకరించనిది

నిస్తులా,నీలచికురా,నిరపాయా,నిరత్యయా।
దుర్లభా,దుర్గమా,దుర్గా,దుఃఖహంత్రీ,సుఖప్రదా॥50॥
నిస్తులా – సాటిలేనిది
నీలచికురా – దట్టమైన నల్లని జుట్టు కలిగిన సుందరి
నిరపాయా – ఎటువంటి ప్రమాదాలు లేనిది, సురక్షితమైనది
నిరత్యయా – ఎన్నటికీ అంతం లేనిది
దుర్లభా – కఠిన సాధనతోనే తప్ప సులభంగా లభించనిది
దుర్గమా – సామాన్యులకు చేరుకోవడానికి వీలుకాని మార్గంలో ఉండేది
దుర్గా – కష్టాలను తొలగించి భక్తులను కాపాడే తల్లి
దుఃఖహంత్రీ – సమస్త దుఃఖాలను రూపుమాపేది
సుఖప్రదా – శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది

దుష్టదూరా,దురాచారశమనీ,దోషవర్జితా।
సర్వజ్ఞా,సాంద్రకరుణా,సమానాధికవర్జితా॥51॥
దుష్టదూరా – చెడుతనానికి, చెడ్డవారికి ఎన్నటికీ దొరకని తల్లి
దురాచారశమనీ – దురాచారాలను నశింపజేసేది
దోషవర్జితా – ఎటువంటి దోషాలు లేని నిర్మలమైన స్వరూపిణి
సర్వజ్ఞా – సమస్తము తెలిసినది
సాంద్రకరుణా – అపారమైన కరుణ కలిగినది
సమానాధికవర్జితా – తనతో సమానమైనవారు కానీ, తన కంటే అధికులు కానీ లేనిది

సర్వశక్తిమయీ,సర్వమంగళా,సద్గతిప్రదా।
సర్వేశ్వరీ,సర్వమయీ,సర్వమంత్రస్వరూపిణీ॥52॥
సర్వశక్తిమయీ – అన్ని శక్తులు తనలోనే కలిగినది
సర్వమంగళా – లోకానికే శుభాన్ని చేకూర్చే మంగళమూర్తి
సద్గతిప్రదా – భక్తులకు సరైన మార్గాన్ని, ఉత్తమ గతులను ఇచ్చేది
సర్వేశ్వరీ – సమస్త లోకాలకు ఏకైక అధినేత్రి
సర్వమయీ – అంతటా తనే నిండి ఉన్న విశ్వరూపం
సర్వమంత్రస్వరూపిణీ – అన్ని మంత్రములు తన స్వరూపముగా గలది

సర్వయంత్రాత్మికా,సర్వతంత్రరూపా,మనోన్మనీ।
మాహేశ్వరీ,మహాదేవీ,మహాలక్ష్మీర్మృడప్రియా॥53॥
సర్వయంత్రాత్మికా – సమస్త యంత్రాలకు ప్రాణశక్తిగా ఉన్నది
సర్వతంత్రరూపా – అన్ని తంత్ర శాస్త్రాల సారాంశం తానే అయినది
మనోన్మనీ – మనస్సును మాయ నుండి మళ్లించి ఉన్నత స్థితికి చేర్చేది
మహేశ్వరీ – పరమేశ్వరుని శక్తి, సర్వలోక నియామకురాలు
మహాదేవీ – దేవతలందరిలో గొప్పదైన అధిదేవత
మహాలక్ష్మీ – గొప్పదైన ఐశ్వర్యాన్ని, శుభాలను ప్రసాదించే తల్లి
మృడప్రియా – శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది

మహారూపా,మహాపూజ్యా,మహాపాతకనాశినీ।
మహామాయా,మహాసత్త్వా,మహాశక్తిర్మహారతిః॥54॥
మహారూపా – అనంతమైన విశ్వరూపం కలిగినది
మహాపూజ్యా – అత్యంత పూజనీయురాలు
మహాపాతకనాశినీ – ఘోరమైన పాపాలను తుడిచివేసేది
మహామాయా – అంతుచిక్కని విశ్వమాయా స్వరూపిణి
మహాసత్త్వా – గొప్ప ధైర్యం, బలం కలిగినది
మహాశక్తిః – అనంతమైన శక్తి సామర్థ్యములు గలది
మహారతిః – పరిపూర్ణమైన బ్రహ్మానంద రూపంలో ఉండే తల్లి

మహాభోగా,మహైశ్వర్యా,మహావీర్యా,మహాబలా।
మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరీ॥55॥
మహాభోగా – గొప్ప భోగమును పొందునది, ప్రసాదించునది
మహైశ్వర్యా – విలువ కట్టలేని ఐశ్వర్యమును ఇచ్చునది
మహావీర్యా – అత్యంత శక్తివంతమైన వీర్యత్వము గలది
మహాబలా – అనంతమైన బలసంపన్నురాలు
మహాబుద్ధిః – సర్వశ్రేష్ఠమైన బుద్ధి స్వరూపిణి
మహాసిద్ధిః – గొప్ప సిద్ధులకు ఆశ్రయమైనది
మహాయోగేశ్వరేశ్వరీ – గొప్ప యోగీశ్వరులకే అధినేత్రి

మహాతంత్రా,మహామంత్రా,మహాయంత్రా,మహాసనా।
మహాయాగక్రమారాధ్యా,మహాభైరవపూజితా॥56॥
మహాతంత్రా – అత్యున్నతమైన తంత్ర శాస్త్ర రూపం
మహామంత్రా – గొప్పదైన మంత్ర స్వరూపిణి
మహాయంత్రా – శ్రీచక్రం వంటి శక్తివంతమైన యంత్రాల రూపం
మహాసనా – మహోన్నతమైన సింహాసనం కలిగినది
మహాయాగక్రమారాధ్యా – గొప్ప యజ్ఞయాగాల ద్వారా పూజింపబడేది
మహాభైరవపూజితా – భైరవ రూపుడైన శివునిచే ఆరాధింపబడే తల్లి

మహేశ్వరమహాకల్పమహాతాండవసాక్షిణీ।
మహాకామేశమహిషీ,మహాత్రిపురసుందరీ॥57॥
మహేశ్వరమహాకల్పమహాతాండవసాక్షిణీ – ప్రళయకాలంలో శివుడు చేసే తాండవానికి ఏకైక సాక్షి
మహాకామేశమహిషీ – కామేశ్వరుని పట్టపురాణి
మహాత్రిపురసుందరీ – మూడు పురములలో సుందరంగా ప్రకాశించేది

చతుఃషష్ట్యుపచారాఢ్యా,చతుష్షష్టికళామయీ।
మహాచతుష్షష్టికోటియోగినీగణసేవితా॥58॥
చతుష్షష్ట్యుపచారాఢ్యా – 64 రకాల ఉపచారాలతో పూజింపబడేది
చతుష్షష్టికళామయీ – 64 రకాల కళలకు ప్రాణమైనది
మహాచతుష్షష్టికోటియోగినీగణసేవితా – 64 కోట్ల మంది యోగినులచే సేవించబడేది

మనువిద్యా,చంద్రవిద్యా,చంద్రమండలమధ్యగా।
చారురూపా,చారుహాసా,చారుచంద్రకళాధరా॥59॥
మనువిద్యా – మనువు అనే మహర్షిచే ఆరాధింపబడే విద్య
చంద్రవిద్యా – చంద్రునికి సంబంధించిన విద్య (శ్రీవిద్య) రూపం
చంద్రమండలమధ్యగా – చంద్రమండలం మధ్యలో నివసించే చల్లని తల్లి
చారురూపా – అత్యంత అందమైన రూపం కలిగినది
చారుహాసా – మనోహరమైన చిరునవ్వు కలది
చారుచంద్రకళాధరా – అందమైన చంద్రవంకను తలపై ధరించిన తల్లి

చరాచరజగన్నాథా,చక్రరాజనికేతనా।
పార్వతీ,పద్మనయనా,పద్మరాగసమప్రభా॥60॥
చరాచరజగన్నాథా – కదిలేవి, కదలనివి ఈ లోకంలోని అన్నింటికీ యజమానురాలు
చక్రరాజనికేతనా – చక్రాలలో రాజైన శ్రీచక్రంలో నివసించేది
పార్వతీ – హిమవంతుని పుత్రిక
పద్మనయనా – పద్మాల వంటి విశాలమైన కన్నులు కలది
పద్మరాగసమప్రభా – పద్మరాగమణిలా ఎర్రని కాంతితో మెరిసే తల్లి

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top