పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥
పరా – పరాస్థితిలోని వాగ్రూపము.
ప్రత్యక్చితీరూపా – స్వస్వరూపము యొక్క జ్ఞానమే స్వరూపముగా గలది.
పశ్యంతీ – రెండవస్థితిగా వ్యక్తం కాబోయే వాక్కు
పరదేవతా – పశ్యంతీ వాక్కు యొక్క సూక్ష్మరూపము.
మధ్యమా – పశ్యంతీ, వైఖరీ వాక్కులకు మధ్య వుండు స్థితికి సంబంధించిన వాక్కు.
వైఖరీరూపా – స్పష్టముగా వ్యక్తమైన వాక్కు.
భక్తమానస హంసికా – భక్తుల యొక్క, మనస్సులందు విహరించు ఆడు హంస.
కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।
శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥
కామేశ్వర ప్రాణనాడీ – శివుని ప్రాణనాడీ స్వరూపిణి.
కృతజ్ఞా – చేయబడే పనులన్నీ తెలిసింది.
కామపూజితా – కామునిచే పూజింపబడునది.
శృంగార రససంపూర్ణా – శీర్షములతోను, కోణములచేతను, నవరసాదినావముల చేతను కూడి నిండుగా ఉంది.
జయా – జయస్వరూపిణి.
జాలంధరస్థితా – జాలంధరసూచిత స్థానము నందున్నది.
ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।
రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥
ఓడ్యాణ పీఠనిలయా – ఓడ్యాణ పీఠమునందు ఉన్నది.
బిందుమండల వాసినీ – బిందువును పరివేష్టించి యుండు స్థానమున వసించునది.
రహోయాగ క్రమారాధ్యా – ఒంటరిగా చేయు యాగ పద్ధతిలో క్రమముగా ఆరాధింపబడునది.
రహస్తర్పణ తర్పితా – రహస్యముగా చేయు తర్పణములచే తృప్తి చెందునది.
సద్యః ప్రసాదినీ, విశ్వసాక్షిణీ, సాక్షివర్జితా ।
షడంగదేవతా యుక్తా, షాడ్గుణ్య పరిపూరితా ॥ 84 ॥
సద్యఃప్రసాదినీ – తక్షణములోనే అనుగ్రహించునది.
విశ్వ సాక్షిణీ – విశ్వములోని కృత్యములకు ఒకే ఒక సాక్షి.
సాక్షి వర్జితా – సాక్షి లేనిది.
షడంగదేవతా యుక్తా – ఆరు అంగదేవతలతో కూడి ఉంది.
షాడ్గుణ్య పరిపూరితా – ఆరు విధములైన గుణములచే పుష్కలముగా నిండి యుండునది.
నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ ।
నిత్యా, షోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ ॥ 85 ॥
నిత్యక్లిన్నా – ఎల్లప్పుడూ దయార్ద్రతతో తడుపబడి యుండునది.
నిరుపమా – పోల్చిచెప్పుటకు ఉపమానము ఏమియు లేనిది.
నిర్వాణ సుఖదాయినీ – సర్వనివృత్తి రూపమైన బ్రహ్మపద ప్రాప్తి లేక మోక్ష సంబంధమైన ఆనందమును ఇచ్చునది.
నిత్యాషోడాశికారూపా – నిత్యాదేవతలుగానున్న పదహారు కళల రూపము.
శ్రీకంఠార్థశరీరిణీ – శివుని సగము శరీరముగా నున్నది.
ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ ।
మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ ॥ 86 ॥
ప్రభావతీ – వెలుగులు విరజిమ్ము రూపము గలది.
ప్రభారూపా – వెలుగుల యొక్క రూపము.
ప్రసిద్ధా – ప్రకృష్టముగా సిద్ధముగా నున్నది.
పరమేశ్వరీ – పరమునకు అధికారిణి.
మూలప్రకృతిః – అన్ని ప్రకృతులకు మూలమైనది.
అవ్యక్తా – వ్యక్తము కానిది.
వ్యక్తావ్యక్త స్వరూపిణీ – వ్యక్తమైన, అవ్యక్తమైన అన్నిటి యొక్క స్వరూపముగా నున్నది.
వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ ।
మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ॥ 87 ॥
వ్యాపినీ – వ్యాపనత్వ లక్షణము కలది.
వివిధాకారా – వివిధములైన ఆకారములతో నుండునది.
విద్యావిద్యా స్వరూపిణీ – విద్యకు సంబంధించిన భాగమును, అవిద్యకు సంబంధించిన భాగమును తన రూపముగా గలది.
మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముదీ – మహాకామేశ్వరుని కన్నులనెడు కలువపువ్వులకు ఆనంద వికాసమును కలిగించు వెన్నెలవెల్లువ.
భక్తహార్ద తమోభేద భానుమద్-భానుసంతతిః ।
శివదూతీ, శివారాధ్యా, శివమూర్తి, శ్శివంకరీ ॥ 88 ॥
భక్తహార్దతమోభేద భానుమద్భాను సంతతిః – భక్తుల హృదయగతమైన అంధకార అజ్ఞానమును భేదించునట్టి కాంతితో కూడిన సూర్యకిరణ పుంజము.
శివదూతీ – శివుని వద్దకు పంపిన దూతిక.
శివారాధ్యా – శివునిచే ఆరాధింపబడునది.
శివమూర్తిః – శివునియొక్క స్వరూపము.
శివంకరీ – శుభములు చేకూర్చునది.
శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।
అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥
శివప్రియా – శివునికి ఇష్టమైనది.
శివపరా – శివుని పరమావధిగా కలిగినది.
శిష్టేష్టా – శిష్టజనులు అనగా సజ్జనుల యందు ఇష్టము గలిగినది.
శిష్టపూజితా – శిష్టజనుల చేత పూజింపబడునది.
అప్రమేయా – ప్రమాణము లేనిది; ప్రమాణములకు లొంగనిది.
స్వప్రకాశా – తనంతట తానే ప్రకాశించునది.
మనోవాచామగోచరా – మనస్సు చేత వాక్కుల చేత గోచరము కానిది అనగా గ్రహింప వీలుకానిది.
చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।
గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥
చిచ్ఛక్తిః – చైతన్య శక్తి.
చేతనారూపా – చలించు తెలివి యొక్క రూపము.
జడశక్తిః – ఒక స్థితిలో ఉండి పోవునట్లు చేయు శక్తి.
జడాత్మికా – జడశక్తి యొక్క స్వరూపము.
గాయత్రీ – గానము చేసిన వారిని రక్షించునది.
వ్యాహృతిః – ఉచ్ఛరింపబడి వ్యాప్తి చెందునది.
సంధ్యా – చక్కగా ధ్యానము చేయబడునది.
ద్విజబృంద నిషేవితా – ద్విజుల చేత నిశ్శేషముగా సేవింపబడునది.
ఇవి కూడా చూడండి 👉విష్ణు సహస్రనామాలకు తెలుగులో అర్థం
https://www.youtube.com/watch?v=dilDWKsma_4