దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।
గురుమూర్తి, ర్గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥
దరాందోళిత దీర్ఘాక్షీ – కొంచెముగా చలించు ఆకర్ణాంత విశాలమైన కన్నులు గలది.
దరహాసోజ్జ్వలన్ముఖీ – మందహాసము చేత ప్రకాశించు ముఖము కలది.
గురుమూర్తిః – గురువు యొక్క రూపముగా నున్నది.
గుణనిధిః – గుణములకు గని వంటిది.
గోమాతా – గోవులకు తల్లి వంటిది.
గుహజన్మభూః – కుమారస్వామి తల్లి.
దేవేశీ, దండనీతిస్థా, దహరాకాశ రూపిణీ ।
ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా ॥ 122 ॥
దేవేశీ – దేవతలకు పాలకురాలు.
దండనీతిస్థా – దండనీతి శాస్త్రము లోని విషయములుగా ఉండునది.
దహరాకాశ రూపిణి – హృదయములో ఉండు చోటు రూపముగా ఉండునది.
ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజితా – పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ఉండు తిథివర్గముచే పూజింపబడునది.
కళాత్మికా, కళానాథా, కావ్యాలాప వినోదినీ ।
సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా ॥ 123 ॥
కళాత్మికా – కళల యొక్క రూపమైనది.
కళానాథా – కళలకు అధినాథురాలు.
కావ్యాలాప వినోదినీ – కావ్యముల ఆలాపములో వినోదించునది.
సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా – వింజామరలను కలిగియున్న ఎడమవైపున, కుడివైపున (వరుసగా) లక్ష్మీదేవి చేత, సరస్వతీదేవి చేత సేవింపబడునది.
ఆదిశక్తి, రమేయా,ఽఽత్మా, పరమా, పావనాకృతిః ।
అనేకకోటి బ్రహ్మాండ జననీ, దివ్యవిగ్రహా ॥ 124 ॥
ఆదిశక్తిః – ప్రథమముగా నున్న శక్తి స్వరూపిణి.
అమేయా – కొలుచుటకు, గణించుటకు గాని, నిర్వహించుటకు గాని అలవికానిది.
ఆత్మా – ఆత్మ స్వరూపిణి.
పరమా – సర్వోత్కృష్టమైనది.
పావనాకృతిః – పవిత్రమైన స్వరూపము గలది.
అనేకకోటి బ్రహ్మాండజననీ – అనంతమైన సమూహములుగా నుండు బ్రహ్మాండములకు తల్లి.
దివ్యవిగ్రహా – వెలుగుచుండు రూపము గలది.
క్లీంకారీ, కేవలా, గుహ్యా, కైవల్య పదదాయినీ ।
త్రిపురా, త్రిజగద్వంద్యా, త్రిమూర్తి, స్త్రిదశేశ్వరీ ॥ 125 ॥
క్లీంకారీ – ‘ క్లీం ‘ అను బీజాక్షరమునకు కారణభూతురాలు.
కేవలా – ఒకే ఒక తత్వమును సూచించునది.
గుహ్యా – రహస్యాతి రహస్యమైనది.
కైవల్య పదదాయినీ – మోక్షస్థితిని ఇచ్చునది.
త్రిపురా – మూడు పురములను కలిగి ఉన్నది.
త్రిజగద్వంద్యా – మూడు లోకములచే పూజింపబడునది.
త్రిమూర్తిః – త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, రుద్రుల రూపములో ఉండునది.
త్రిదశేశ్వరీ – దేవతలకు ఈశ్వరి.
త్ర్యక్షరీ, దివ్యగంధాఢ్యా, సింధూర తిలకాంచితా ।
ఉమా, శైలేంద్రతనయా, గౌరీ, గంధర్వ సేవితా ॥ 126 ॥
త్ర్యక్షరీ – మూడు అక్షరముల స్వరూపిణి.
దివ్యగంధాఢ్యా – దివ్యమైన పరిమళ ద్రవ్య గంధములచే ఒప్పునది.
సింధూర తిలకాంచితా – పాపటయందు సింధూర తిలకముచే ప్రకాశించునది.
ఉమా – ఉమా నామాన్వితురాలు. మూడు లోకములచే పూజింపబడునది.
శైలేంద్ర తనయా – హిమవత్పర్వతము యొక్క కుమార్తె.
గౌరీ – గౌర వర్ణములో ఉండునది.
గంధర్వ సేవితా – గంధర్వులచేత పూజింపబడునది.
విశ్వగర్భా, స్వర్ణగర్భా,ఽవరదా వాగధీశ్వరీ ।
ధ్యానగమ్యా,ఽపరిచ్ఛేద్యా, జ్ఞానదా, జ్ఞానవిగ్రహా ॥ 127 ॥
విశ్వగర్భా – విశ్వమును గర్భమునందు ధరించునది.
స్వర్ణగర్భా – బంగారు గర్భము గలది.
అవరదా – తనకు మించిన వరదాతలు లేనిది.
వాగధీశ్వరీ – వాక్కునకు అధిదేవత.
ధ్యానగమ్యా – ధ్యానము చేత పొందబడునది.
అపరిచ్ఛేద్యా – విభజింప వీలులేనిది.
జ్ఞానదా – జ్ఞానమును ఇచ్చునది.
జ్ఞానవిగ్రహా – జ్ఞానమును మూర్తిగా దాల్చినది.
సర్వవేదాంత సంవేద్యా, సత్యానంద స్వరూపిణీ ।
లోపాముద్రార్చితా, లీలాకౢప్త బ్రహ్మాండమండలా ॥ 128 ॥
సర్వవేదాంత సంవేద్యా – అన్ని ఉపనిషత్తులచే తెలియబడునది.
సత్యానంద స్వరూపిణీ – నిత్యసత్యమైన ఆనందమును స్వరూపముగా గలది.
లోపాముద్రార్చితా – లోపాముద్రచే అర్చింపబడింది.
లీలాక్లుప్త బ్రహ్మాండ మండలా – క్రీడా వినోదానికై కల్పింపబడి క్లుప్తీకరింపబడే బ్రహ్మాండముల సమూహము గలది.
అదృశ్యా, దృశ్యరహితా, విజ్ఞాత్రీ, వేద్యవర్జితా ।
యోగినీ, యోగదా, యోగ్యా, యోగానందా, యుగంధరా ॥ 129 ॥
అదృశ్యా – చూడబడనిది.
దృశ్యరహితా – చూడబడుటకు వేరే ఏమీలేని స్థితిలో ఉండునది.
విజ్ఞాత్రీ – విజ్ఞానమును కలిగించునది.
వేద్యవర్జితా – తెలుసుకొనబడవలసినది ఏమీ లేనిది.
యోగినీ – యోగముతో కూడి ఉన్నది.
యోగదా – యోగమును ఇచ్చునది.
యోగ్యా – యోగ్యమైనది.
యోగానందా – యోగముల వలన పొందు ఆనంద స్వరూపిణి.
యుగంధరా – జంటను ధరించునది.
ఇవి కూడా చూడండి 👉విష్ణు సహస్రనామాలకు తెలుగులో అర్థం
https://www.youtube.com/watch?v=dilDWKsma_4