google.com, pub-2532166691306495, DIRECT, f08c47fec0942fa0

Traditional Hindu Telugu wedding ceremony with sacred rituals and cultural practices.

తెలుగువారి పెళ్ళితంతు వెనకున్న అర్ధం, పరమార్ధం

తెలుగువారి పెళ్ళితంతు వెనకున్న అర్ధం, పరమార్ధం

పవిత్రంగా మండే అగ్నిహోత్రం…

ఆ వెలుతురులో కొత్త జీవితాన్ని ఆహ్వానిస్తున్న వధూవరులు…

పెళ్ళికి పరమార్ధం చెప్పే వేదమంత్రాలు…

శ్రావ్యంగా వినిపించే మంగళవాయిద్యాలు

మనస్పూర్తిగా దీవించే పెద్ద మనుషులు…

అందరికీ ఆహ్వానం పలికే పచ్చటి పందిరి

అదే… తెలుగింటి పెళ్లి వైభోగం

మనిషి పుట్టిన దగ్గర్నుంచి జరుపుకొనే ఎన్నో వేడుకల్లో అతి ముఖ్యమైన వేడుక వివాహం. ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని, ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ప్రాంతాలనుబట్టి, కులాలనుబట్టి చిన్నచిన్న మార్పులుంటాయి. తెలుగువారు జరుపుకునే వివాహవేడుకకీ కొన్ని ప్రత్యేకతలున్నాయి. పెళ్లిలో చదివే మంత్రాలు, చేసే వాగ్దానాలు మొదలుకొని, కట్టుకునే నగలు, ఆడుకునే ఆటల వరకు అన్నింటికీ ఓ అర్థం ఉంది. పెళ్లి చేయించే వారికి కానీ, చేసుకొనే వధూవరులకు కానీ, వారి తల్లిదండ్రులకు గానీ మన వివాహ సాంప్రదాయాలు, అందులో జరిగే వేడుకల ఎందుకు అనేది చాలామందికి తెలియదు. ఈ వీడియొలో మన తెలుగు వారి పెళ్లిళ్లలో పాటించే సంప్రదాయాలు, ఆచారాల వెనకున్న పరమార్ధం, ప్రత్యేకతల గురించి అన్నీ వివరాలూ తెలుసుకుందాం. వీడియొ చూశాక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి.

  1. కన్యావరణం:

కన్యావరణం అంటే వరుడి తండ్రి తన కుమారునికి తగిన వధువును వెతకని నలుగురు పెద్దలకు దక్షిణ తాంబూలాలిచ్చి పంపుతారు. వారు కన్యాదాత ఇంటికి వెళ్ళి తమ అబ్బాయికి మీ అమ్మాయిని ఇవ్వమని అడుగుతారు. వారు అంగీకరిస్తే అమ్మాయి చేతికి అబ్బాయి తరపువారు ఒక కంకణాన్ని కడతారు.

  1. పెళ్ళి చూపులు:

పెళ్ళి చూపులతో పెళ్ళి కార్యక్రమం ప్రారంభం అవుతుంది. మంచిరోజున మంచి ముహూర్తంలో సాంప్రదాయం ప్రకారం అబ్బాయి, బంధుమిత్ర సమేతంగా అమ్మాయి ఇంటికి వెళ్ళి, అమ్మాయిని చూస్తారు. వధూవరులు పరస్పరం నచ్చాక, సంప్రదాయాలు, కుటుంబ పద్ధతులు, ఆచార వ్యవహారాలు, ఇచ్చి-పుచ్చుకోవడాలు, లాంఛనాల గురించి చర్చించుకుంటారు. అన్నీ కుదిరాక, నిశ్చితార్థం తేదీ నిర్ణయించుకుంటారు.

నిశ్చితార్థం:

నిశ్చితార్థం అంటే పెళ్ళి ఖాయపరచుకోవడం. ఒక శుభ ముహూర్తంలో, వధువు ఇంటిలో- పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో వధూవరుల తారా బలం-చంద్ర బలం చూసి పెళ్ళి ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. దాన్ని లగ్న పత్రికగా రాయించిన తరువాత, వధూవరుల తల్లి-తండ్రులు లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకుంటారు. నిర్ణయించబడిన ముహూర్తం తెలుపుతూ ఇరువర్గాల వారూ ఆహ్వానపత్రికలు అంటే శుభలేఖలు ముద్రించి మంగళ సూచకంగా నాలుగు వైపులా పసుపు పూస్తారు.

అంకురారోపణం :-

ఎటువంటి విఘ్నాలు లేకుండా వివాహం శుభప్రదంగా జరగాలని కన్యాదాత ఈ కార్యక్రమం నిర్వర్తిస్తాడు. ఒక మంచి ముహూర్తం చూసి ఇంటిని అలంకరించుకొని బాజా భజంత్రీలతో, బ్రాహ్మణులతో, ముత్తైదువలతో ఊరికి తూర్పు లేదా ఉత్తర దిశగా వెళ్ళి 5 పంచపాలికలు అంటే మట్టి మూకుళ్లలో పుట్టమన్ను పోసి నవధాన్యాలను ఆవుపాలతో తడిపి మంత్రయుక్తంగా వేసి ఆయాదేవతలను పూజిస్తారు. అవి వివాహ సమయం నాటికి మొలకెత్తుతాయి. పెళ్లిరోజున వీటిని కల్యాణమండపంలో ఉంచాలి. 16 రోజుల పండుగనాడు పూజలు నిర్వర్తించి మట్టిని చెట్ల పాదుల్లో పొయ్యాలి.

స్నాతకం: పెళ్ళి కుమారుని ఇంటిలోగాని, కళ్యాణమండపంలోగాని లేదా విడిదిలోగాని పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సంస్కారం వరుడిని “బ్రహ్మచర్యం” నుండి “గృహస్థాశ్రమం” స్వీకరించడానికి సిద్ధంచేస్తున్న కార్యక్రమం. పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని-వారనుసరించిన మార్గాన్ని ఎంచుకోమని చెప్పి, ఆశీర్వదించి- గురువు వరుడిని గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు. బ్రహ్మచారిగా ఉండి, తాను చేసిన దోషాలన్నింటికి ప్రాయశ్చిత్తం ఈ స్నాతకం.

సమావర్తనం

‘సమావర్తనం’ అంటే తిరిగిరావటం అని అర్థం. గురుకులంలో విద్య పూర్తయ్యాక, గురువు అనుమతితో తీర్థయాత్రలు చేసి, ఇంటికి తిరిగివచ్చి గృహస్థాశ్రమం స్వీకరించడానికి సిద్ధపడడం.

కాశీ ప్రయాణం

స్నాతకం తరువాత చాలా సరదాగా జరిగే కార్యక్రమం ఇది. బాజా భజంత్రీల మద్య వరుడు గొడుగు పట్టుకొని, చేత్తో కర్ర పుచ్చుకొని, కాళ్లకు పావు కోళ్లు ధరించి, మెడలో పసుపు బట్టను వేసుకొని, సన్యాసం స్వీకరించేందుకు, కాశీకి పోతున్నానని చెప్పి బయలు దేరుతాడు. వధువు సోదరుడు వచ్చి “బ్రహ్మచారిగారూ! మీ కాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసుకొని గృహస్థుగా జీవించండి” అని చెప్పి బొట్టు పెట్టి, బెల్లం ముక్క నోటిలో పెట్టి, నూతన వస్త్రాలను ఇచ్చి బతిమాలి వెనుకకు తీసుకొని వస్తాడు. అన్నీ కులాల వారికి ఈ సంప్రదాయం ఉండదు.

మంగళస్నానం/పెళ్ళికొడుకును -పెళ్ళికూతురును చేయడం

వధూ-వరుల ఇళ్లలో ఉదయం తెలతెలవారుతుండగానే మంగళ వాయిద్యాల మధ్య ఇంటి ముందర మామిడి ఆకులతో తోరణం కట్టే కార్యక్రమం ముందుగా జరుగుతుంది. వధువుకు, కన్యా దాత దంపతులకు, తోటి పెళ్ళి కూతురుకు తెల్లవారక ముందే ముత్తైదువలు బొట్టు పెట్టి, మాడుపై నూనె అద్ది, హారతిచ్చి, మంగళ స్నానాలకు సిద్ధం చేస్తారు. అలానే వరుడికి, తల్లితండ్రులకు, తోటి పెళ్ళికొడుకుకు కూడా జరుగుతుంది.  తరువాత వారి వారి ఇళ్ళలో, బంధువులు స్నేహితుల సమక్షంలో పెళ్లి కొడుకును, పెళ్లి కూతుర్ని చేస్తారు.

ఎదురుకోలు

కాశీయాత్ర విరమించి మండపానికి వచ్చిన వరుణ్ని కన్యాదాత భార్యతో మేళ తాళాల మధ్య పానకం బిందెతో ఎదురు వెళ్లి స్వాగతం పలికి, నూతన వస్త్రాలను, పానకాన్ని వరునికి, వరుడి తరపు బంధువులకీ ఇచ్చి, వారిని పెళ్ళికి ఆహ్వానిస్తాడు.

వరపూజ

కల్యాణమండపానికి వచ్చిన వరుణ్ణి నారాయణ స్వరూపంగా భావించి, కన్యాదాత వరుని పాదాలు పళ్లెంలో పెట్టి కడుగుకొని నీళ్లు తలపై జల్లుకుంటాడు. అతనికి ఆసనం, పాద్యమ్, సుగంధ ద్రవ్యాలు, అలంకరణ సామాగ్రి, పండుతాంబూలలు ఇచ్చి నమస్కారం వంటి ఉపచారాలు చేస్తారు.

గౌరీపూజ:

మంగళసూత్రములకు గౌరి దేవి అధిష్టాన దేవత. కాబట్టి వధువును పెళ్ళికూతురుగా అలంకరించి, కళ్యాణం బొట్టు దిద్ది, పాదాలకు పారాణిని పూసి, పూల జడ వేసి, నూతన వస్త్రాలను కట్టించి తప్పనిసరిగా గౌరీ పూజ చేయిస్తారు. తరువాత ముత్తైదువలు వధువు కాళ్ళకు  పారాణి రాసి, బాసికం కత్తి, బుగ్గన చుక్క పెట్టి అలంకరిస్తారు. తల్లి దండ్రులు, బంధుమిత్రులు, పెద్దలు వధువును అక్షతలతో ఆశీర్వదిస్తారు.

పుణ్యహవచనం/ విఘ్నేశ్వర పూజ

వివాహ ముహూర్త సంకల్పం చెప్పుకొని వివాహం ఎటువంటి అపశకునలూ, ఆటంకాలూ లేకుండా సజావుగా జరగాలని విఘెశ్వరుని పూజిస్తారు. శాంతి, అభివృద్ధి, ఆరోగ్యాల కోసం పుణ్యహవచనం చేస్తారు.

రక్షాబంధనం:

రక్షాబంధన దేవతకు సోడశోపచార పూజలు నిర్వహించి, నమస్కరించి, రక్షాబంధనాన్ని ధరింపజేస్తారు. తొమ్మిది వరసల తెల్లదారం పసుపుతో తడిపి మామిడి ఆకునుగాని, పసుపుకొమ్ము కాని కలిపి తోరం చేయాలి. ఈ రక్షా బంధనాన్ని ధరించిన వధూవరులకు, జాతా శౌచం, మృతా శౌచం మొదలైనవి ఏవీ వర్తించవు.

యజ్ఞోపవీతధారణ

బ్రహ్మచారికి ఒక ముడి కలిగిన జంధ్యం ఉంటుంది. వరుడు గృహస్త్యాశ్రమమ స్వీకరించడాని తెలియడానికి వరుడికి నూతన వెండి జంధ్యామును ధరింపజేస్తారు. దీనిని ఉత్తర జంధ్యము అని కూడా అంటారు. దీనివలన వరుడికి ఆరోగ్యం, ఆయుషు, నిత్య కర్మలను ఆచరించడానికి కావలసిన యోగ్యత లభిస్తుంది.

బాసికం:

వధూవరుల నుదుటిపై శోభించే ఆభరణమే బాసిక. సంతానం, సౌభాగ్యం కోసం ఇంద్రుణ్ణి ప్రార్ధించి బాసికాన్ని కడతారు. దృషి దోష నివారణకు వీటికి పూజ కెఃసి వధూవరులకు ఇద్దరికీ బాసికాన్ని కడతారు. మన శరీరంలో ఉన్న ముఖ్యమైన ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు కలిసే చోట రెండు కనుబొమ్మల మధ్య స్థానం ఆజ్ఞాచక్రం. అలాంటి సున్నిత భాగాలపై దృష్టి దోషం తగలకుండా ఉండటానికి బాసికాన్ని కడతారు.

మధుపర్కం:

తేనె, పెరుగు, నెయ్యి కలిపితే ఏర్పడే తీయని పదార్ధం మధుపర్కం. దీన్ని కంచు పాత్రలో తయారుచేసి మూత పెట్టి దారంతో కడతారు. కన్యాదాత మూడు సార్లు వరునికి, బంధువులకీ ఇస్తారు. పెండ్లికుమారునికి ఈ సందర్భంలో ఇచ్చే పంచెలచాపుని మధుపర్కం అంటారు. మధుపర్కాలు కట్టుకున్న వరుడిలో కొత్తకళ వస్తుంది.

వధువును గంపలో తేవడం:

పూర్వం మేనరికాల వివాహాలు బాగా జరిగేవి. మేనమామ కూడా ఇంకొకకరితో వివాహం చేయడానికి అంగీకరించారనడానికి చిహ్నంగా వధువు మేనమామలు గంపలో పెండ్లి కూతురిని కూర్చోబెట్టి వివాహ వేదిక పైకి తీసుకొస్తారు. కొత్తగా అల్లిన వెదురు గంపను అలంకరించి అందులో బియ్యం పోసి అందులో వధువును కూర్చోబెట్టి, పెళ్లి మండపం వరకు మేనమామలు తీసుకువస్తారు.

తెరసెల్లా: సుముహూర్తం రాకుండా వధూవరులు ఒకరినొకరు చూసుకోకుండా మధ్యలో తెర పట్టుకుంటారు. వరుడు పరమాత్మగాను, వధువు జీవాత్మగాను భావించుకొని మధ్యలో మాయతెర తొలగడం వంటిది తెర తీయడం. సుముహూర్తం రాగానే తెర తొలగగానే ఒకరికళ్లలోకి ఒకరు చొసుకోవాలి. అప్పటి వరకు ఈ తెర అడ్డుగా ఉంటుంది.

మహాసంకల్పం:

తొమ్మిది కల్పాలలోని శ్వేత వరాహ కల్పంలో, పద్నాలుగు మన్వంతరాలలో ఏడవదైన వైవస్వత మన్వంతరంలో- శాలివాహన శకంలో-ఇరవై ఎనిమిదవ మహా యుగంలో-కలియుగంలో-ఫలానా సంవత్సరంలో-ఫలానా మాసంలో-ఫలానా తిది రోజున, ఈ సుముహూర్త సమయంలో శ్రీ లక్ష్మీనారాయణ ప్ర్రీతి కోసం సర్వాలంకార భూషితైన ఈ కన్యను దానం చేస్తున్నాను అని కన్యా దాత చెప్పే సంకల్పం ఇది. ఈ కన్యాదానం వల్ల తనకు బ్రహ్మ లోకంలో నివసించే యోగ్యత సిద్ధించాలని, అగ్ని,స్తోమ, వాజపేయాది యాగాలు చేసిన పుణ్య ఫలం లభించాలని, తనకు వెనుక- ముందు పది తరాల వాళ్ళు బ్రహ్మ లోకంలో నివసించాలని కన్యా దాత సంకల్పం చేస్తాడు.

కన్యాదానం:

కన్యాదాత వరుని కాళ్లు కడిగి కన్యాదానం చేస్తూ తాను లక్ష్మీనారాయణునికే కన్యాదానం చేశానని భావిస్తారు. కొబ్బరిబొండం, పండ్లు, పువ్వులు, అక్షతలు ఉన్న వధువు కుడి చేతిని, ఆమె తల్లిదండ్రులు వరుని కుడిచేతిలో ఉంచి, ఉదకముతో దానం చేస్తారు.

“ఈమె బంగారం వంటి మనస్సు కలది. కనకం వంటి శరీర చాయ కలది. శరీరమంతా ఆభరణాలు కలిగినది. నా పిత్రాదులు సంసారంలో విజయం పొంది శాశ్వత ప్రాప్తి పొందినట్టు నేనూ ఆ శాశ్వత బ్రహ్మలోకప్రాప్తి పొందేందుకు విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానం చేస్తున్నాను” అని కన్యా దాత అంటారు. సమస్త ప్రపంచాన్ని, అఖిలాండ బ్రహ్మాండాలను భరించే శ్రీ మహావిష్ణువు-పంచభూతాల-సర్వ దేవతల సాక్షిగా, పితృదేవతలను తరింపచేసేందుకు, ఈ కన్యను దానం చేస్తున్నాను. సౌశీల్యం కలిగి, బుద్ధిమంతుడి వైన నీకు, ధర్మార్థ కామాలు సిద్ధించేందుకు, సాలంకృత సాధ్వియైన ఈ కన్యను సమర్పించుకుంటున్నాను”. అంటూ, కన్యా దాత వరుడి చేతిలో నీళ్లు పోసి ధర్మేచ, అర్థేచ, కామేచ, ఏషా నాతి చరితవ్యా” అని ప్రతిజ్ఞ చేయిస్తారు. దీనికి సమాధానంగా, “నాతి చ రామి” అని వరుడు అంటాడు. అంటే “ధర్మంలోనూ, అర్థంలోనూ, కామంలోనూ లక్ష్మీస్వరూపిణి అయిన ఈ కన్యను అతిక్రమించను” అని వరుడు మూడుసార్లు వాగ్దానం చేస్తాడు.

పెళ్లిప్రమాణాలు

ధర్మాలలో అర్థకామాలలో ఈ వధువును కాదని నేనేమీ చేయను అని పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉండగా వరుడు ప్రమాణం చేస్తాడు.

సుముహూర్తం (జీలకర్ర, బెల్లం):

వధూ-వరులను కళ్యాణ వేదికపై, తూర్పు-పడమర ముఖంగా కూచోబెట్టి, మధ్య ఉత్తర-దక్షిణ ముఖంగా తెరను అడ్డం పెట్టి, నిశ్చితార్థ సమయంలో నిర్ణయించిన ముహూర్తానికి మంగళ వాయిద్యాలు మోగుతుంటే, పురోహితుడు మంత్రాలు చదువుతుంటే, గౌరీ దేవిని ధ్యానించుకుంటూ వధువు, వరుడు ఏక కాలంలో నిర్ణయించిన ముహూర్తానికి ఒకరి శిరస్సు మీద మరొకరు అంటే బ్రహ్మ రంధ్రం మీద జీల కర్ర-బెల్లం కలిపిన ముద్దను మాడుకు అంటే బ్రహ్మ రంధ్రాన్ని తాకే విధంగా అదిమి పెట్టుకుంటారు. పురోహితుడి తర్వాత, తల్లి-తండ్రులతో మొదలయ్యి, పెద్దలందరూ దంపతులు మీద అక్షితలు చల్లుతారు. ఇప్పుడు తెరను తొలగిస్తారు. తెర తొలగడంతోనే వధూవరులు తలపై చేతులు ఉండగా రెండు కనుబొమ్మల మధ్య స్థానంలో చూసుకుంటారు.  జీలకర్ర, బెల్లం కలిపితే ధన విద్యుత్ శక్తి ఉత్పన్నమై, వధూవరులు ఒకరి తలపై మరొకరు ఉంచిన చేతుల ద్వారా వారి శక్తి ఈ మిశ్రమం ద్వారా బ్రహ్మరంధ్రంలో ప్రవేశించి, అక్కడినుండి సహస్రార చక్రంలోకి, అందులోనుండి కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రం ద్వారా బయటకు ప్రసరిస్తుంది. ఇలా ఇద్దరి శక్తులు పరస్పరం ఒకరినుంచి ఒకరిలోకి లీనమవుతాయి. ఒకరి సహస్రార ఆజ్ఞ్యా చక్రాలు మరొకరి సహస్రార ఆజ్ఞ్యా చక్రాలతో కలిసిపోవడం వల్ల ఆకర్షణ ఏర్పడి ఒకరికొకరు పూర్తిగా వశమౌతారు. ఇలా ఒకరినొకరు తొలిసారిగా స్పృశించడం, చూసుకోవడమే అసలైన సుముహూర్తం. ఇంతటి మహిమాన్వితమైన క్షణాలను ఫోటోలు వీడియొల కోసం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

స్వర్ణ జలాభిషేకం (బండి కాడి పూజ)

ఇరవై దర్భల్ని కలిపి అయిదు దర్భలుగా గుండ్రంగా చుడతారు. దానిపై బండి కాడిని పట్టుకుని ఉత్తర దక్షిణ దిశల్లో ఉంచి ఎడమవైపు రంధ్రంలో బంగారముంచి ఆ బంగారాన్ని తాకే విధంగా నీటిని వధువుపై పడేట్లు చేస్తారు. ఆ పవిత్ర జల స్పర్శ వల్ల ఆ వధువుకు జన్మతః ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోయి, వధువు ఆయురారోగ్యాలతో శాశ్వతంగా వర్ధిల్లాలని, పుట్టబోయే సంతతి ఆరోగ్యంగా ఉంటారు.

మాంగల్యపూజ

కొన్ని బియ్యం పళ్లెంలో పోస్తారు. వీటిని పళ్లెం నిండుగా పరచాలి. అందులో మంచి కొబ్బరిబొండం, తాంబూలం పెట్టి తమలపాకుల్లో మంగళసూత్రాలు, మట్టెలుతో కొబ్బరిబొండం పై పెట్టాలి. వాటికి వధూవరులచే షోడశ విధ పూజలు నిష్ఠగా చెయ్యాలి. మంగళసూత్రాల్ని మంచి ఆచారాలున్న వారిచే, శుభప్రద మనసులచే చలువ చేతుల వారిచే స్పృశింపజేయాలి.

యోక్త్రభంధనం:

యోక్త్రం అంటే 24 దర్భల్ని 32 అంగుళాల పొడవున్న దానిగా పెనిన తాడు. ఇది ఒక రకంగా నడుము బిగించడం/దీక్ష తీసుకోవడం లాంటిది. మంచి మనస్సును, మంచి సంతతిని, సౌభాగ్యాన్ని కలిగి ఉండి సహధర్మచారిణివై సత్కార్యములు చేయడానికి సిద్ధంగా, ఈ జీవిత యజ్ఞమనే పనికి నడుము కట్టు అని వరుడు- వధువు నడుముకి చుట్టి ముడివేస్తారు. 

మంగళసూత్రధారణ:

మంగళ సూత్రాలకు గౌరీ దేవి అనుష్టాన దేవత. ఇవి బంగారంతో తయారుచేస్తారు. రెండు సూత్రాలలో ఒకటి అత్తింటి వారు, ఇంకోటి పుట్టింటి వారు చేయించడం ఆచారం. పూర్వ కాలంలో తాటి ఆకులను గుండ్రంగా చుట్టి, పసుపు రాసి, పసుపుతాడు కడతారు. తాటి ఆకులకు మరొక పేరు తాళ వృక్షం. అందుకే దానిని తాళిబొట్టు అంటారు. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు.

తలంబ్రాల పళ్లేలపై మంగళసూత్రాలు పెట్టి, మాంగల్యదేవతను ఆహ్వానించి, షోడశోపచార పూజ చేసి వరుడు వధువుకు ఎదురుగా నిలబడతాడు. మంగళ వాయిద్యాలు మారుమోగుతుండగా, “నా జీవనానికి హేతువైన ఈ సూత్రాన్ని నీకంఠాన మాంగల్యబద్ధం చేస్తున్నాను. నీవు దీనిని కంఠాన ధరించి నిండు నూరేళ్లూ జీవించు”  అంటూ మూడు ముళ్లూ వేస్తాడు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు మూడు కనుక మూడింటికీ ముళ్లు వేస్తారు. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రము ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువులు నమ్ముతారు.

పుట్టినింటికి, మెట్టినింటికి గౌరవ మర్యాదలు-పరువు ప్రతిష్టలు స్త్రీల వలనే లభిస్తాయి. భర్త సుఖ దుఃఖాలు తనవేనని, పుట్టింటి-అత్తింటి వారి మంచి-చెడులు తనవేనని, ధర్మ మోక్షాలు-అర్థ కామాలు తన సంబంధం ద్వారా భర్తకు కలుగుతాయని, సంపదకు-సంతానానికి తనే కారణమవుతాననే విషయాలు ఎల్లవేళలా గుర్తుండే విధంగా ప్రవర్తించడానికి మంగళ సూత్రాలను వధువు ధరిస్తుందని హిందువుల నమ్మకం.

తలంబ్రాలు

వధూవరులుతో పాటు, బంధుమిత్రులకు కూడా చక్కటి వినోదాన్ని-ఆనందాన్ని కలిగించే కార్యక్రమం తలంబ్రాలు పోసుకోవడం. ఇందులో మొదటిగా వరుడు సమాజ శ్రేయస్సు, కుటుంబవృద్ధి కాంక్షించే ఉత్తమ సంతానాన్ని అందివ్వమని దోసిలిఎత్తి తలంబ్రాలు పోస్తాడు. అందుకు తలవంచి అంగీకరిస్తూ వధువు, ఆ సంతాన జీవన గమనానికి తన వంతుగా తలంబ్రాలు పోస్తుంది. అప్పుడు వరుడు- నేను అందించే ఆర్ధిక సంపదను అణకువగా, సమయోచితంగా వినియోగించమని తిరిగి తలంబ్రాలు పోస్తాడు. ఆ తరువాత ఇద్దరూ త్యాగముతో, ధనముతో సహజీవనం సాగిద్దాం. బ్రతుకు బాధ్యతను సమానంగా పంచుకుందాం అని ఒకరిపై ఒకరు వరుసగా తలంబ్రాలు పోసుకుంటారు.

బ్రహ్మముడి:

తాంబూలం లో దక్షిణ, 2 ఖర్జూర పండ్లు, పూలు, అక్ష్తతలు వేసి, వరుడి ఉత్తరీయానికి, వధువు చీరె కొంగుకు విడిగా ముడి వేసి, తరువాత పైట చెంగును, ఉత్తరీయాన్ని కలిపి బ్రహ్మముడివేస్తారు. ఇకనుంచి “మనం కలిసిమెలిసి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, ఇంటి యజమానురాలిగా అన్ని బాధ్యతలు స్వీకరించి, నీ ఇంటిని నువ్వే చక్కదిద్దుకోవడానికి రమ్మని”, వేద మంత్రాల ద్వారా వధువుని కోరుతాడు వరుడు. భార్య భర్తల బంధంలో ఒకరిని ఒకరు విడిచి ఉండకూడదు. ప్రయాణమైనా, పుణ్యక్షేత్రమైనా, మోక్షమైనా, వనవాసమైనా భార్య భర్తలు కలిసి ఉండాలి. భార్య భర్తలుగా మారటం అంటే రెండు శరీరాలు ఒకే ప్రాణంగా జీవించడం. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు, మనస్పర్ధలు ఉన్నా ఒకరికి ఒకరుగా జీవించాలని, ఏమి జరిగినా భర్తతోనే జీవితం అనుకోవాలని స్త్రీకి – భార్యే సర్వస్వంగా భావించాలని భర్తకి చెప్పి, సీతారాముల్లాగా, పార్వతీపరమేశ్వరుల్లాగా, లక్ష్మీనారాయనుల్లాగా అన్యోన్యంగా జీవించమని చెప్పి బ్రహ్మ ముడి వేస్తారు.

మెట్టెలు

వధువుకి వరుడు కాలిరెండో వేలుకి మెట్టెలు తొడగడం సంప్రదాయం. స్త్రీ ఆభరణాలన్నీ  యోగశాస్త్రంలోనీ  నాడులుకి సంబంధించినవి. స్త్రీలు చేతికి వేసుకొనే గాజులు, కాలి మెట్టెలు రెండు కూడా  సంతానాభివృద్ధికి, సుఖప్రసవానికి అనుకూలించే నాడులనూ సున్నితంగా నొక్కుతూ ఉంటాయి. కాలి బొటనవేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయువుపట్టు వంటిది. దాని నుండి విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదు. అలా తగలకుండా ఉండడానికే మెట్టెలు పెట్టుకునే సంప్రదాయం ఏర్పడిందని పండితులు అంటారు. వివాహతంతులో వధువు పాదాన్ని రోకలిఫై ఉంచి వరుడు ఆమె కాలివేలుకి తొడుగుతారు.

సన్నికల్లు తొక్కడం:

అగ్నిహోత్రానికి ఉత్తరం వైపు సన్నికల్లు అంటే గంధపు చెక్కను అరగదీసే సానను ఉంచి కుడికాలుతో ఎడమ కాలును ఒకరితో ఒకరు మూడుసార్లు తొక్కించాలి. దీనివలన పరస్పర స్పర్శ, ప్రేమ ఏర్పడతాయి. వధువుని ధైర్యంగా, ధృదంగా ఉండాలని చెప్తుంది ఈ వేడుక.

కాళ్ళు తొక్కించడం:

వధూవరులిద్దరూ పాదాలను ఒకరినొకరు తాటించుకోవడంతో వాళ్ళ మధ్య కొత్తదనం పోతుందని ఈ ఆచారం వెనకున్న ఉద్దేశ్యం. వధూవరుల కాళ్ళ కింద సానను ఉంచి ఒకరికుడికాలితో మరొకరి ఎడమకాలిని మూడుసార్లు తొక్కిస్తారు.

పాణిగ్రహణం :

ముందుగా వరుడు వధువుకు ఎదురుగా నిలబడి అగ్ని సాక్షిగా తన కుడిచేత్తో వధువు కుడిచేతిలో పువ్వులు, అక్షతలు ఉంచి, మంత్రపూర్వకంగా వధువు కుడి చేతిని పట్టుకుంటాడు. “పెద్దల ఎదుట నిన్ను ధర్మపత్నిగా స్వీకరిస్తున్నాను. నాకు అర్ధాంగివి అయ్యి, నీవు నేను అనే భేద భావము లేకుండా, మన జీవనయాత్ర గడుపుదాము” అని అంటాడు. తరువాత వధువు కూడా తన కుడిచేత్తో వరుడి కుడిచేతిలో పువ్వులు, అక్షతలు ఉంచి, చేతిని పట్టుకొని “మీతో జీవనయాత్ర గడపాలని కోరుకొని నా చేతిని మీకు అందిస్తున్నాను. జీవితమంతా ప్రేమతో, ఓర్పుతో మీకు అన్నింటా భాగస్వామిని అవుతానని ప్రమాణం చేతున్నాను” అని అంటుంది. ఇంద్రుడు, చంద్రుడు, అగ్నిదేవుడు మొదలైన దేవతాప్రీతితో మనం సంతానం, సౌభాగ్యం, సంతోషం పొందగలం అని ఈ మంత్రాలకున్న అర్ధం.

సప్తపది

వివాహంలో సప్తపది అతి ముఖ్యమైన ఘట్టం. వరుడు వధువుని చేయి పట్టుకొని అగ్నిహోత్రానికి దక్షిణంగా కుడికాలు ముందుకి పెడుతూ, వధువుతో కలిసి ఏడడుగులు వేస్తూ, ఇలా తన కోరికలను వివరిస్తాడు. “ఓ చిన్నదానా ! నీవు నన్ను అనుసరించి నడువు. నీవు నడిచేటప్పుడు శ్రీ మహా విష్ణువు, మొదటి అడుగులో అన్నాన్ని-ఐశ్వర్యాన్ని, రెండవ అడుగులో శారీరక-మానసిక బలాన్ని, మూడవ అడుగులో మంచి పనులు చేయాలన్న సంకల్పాన్ని-ఉత్తమ కర్మనూ-శ్రద్ధనూ, నాలుగవ అడుగులో కర్మ ఫలాన్నీ-సుఖాన్నీ-ఆనందాన్నీ, ఐదవ అడుగులో పశు సమృద్ధినీ-ధన ధాన్యాలనూ, ఆరవ అడుగులో మంచి సంతానాన్నీ, ఏడవ అడుగులో ఇద్దరి ఆధ్యాత్మిక చింతనకు తగు రక్షణను మనకు కలిగించుగాక” అని అంటాడు. దానికి వధువు తన అంగీకారాన్ని తెలియపరుస్తుంది. ఈ సప్తపది తంతు ముగిసిన తరువాత భార్యకు- భర్త ఇంటి పేరు,గోత్రం  సంక్రమిస్తాయి. ఇది గృహస్థా శ్రమ స్వీకారానికి పరమావధి.

లాజహోమం:

లాజలు అంటే వరిపేలాలు. వధువు దోసిలిని వరుడి దోసిలిలో ఉంచి, వధువు సోదరుడు పేలాలను తీసుకొని వారిద్దరి దోసిళ్ళలో పోస్తాడు. ఆ పేలాలపై నెయ్యి చిలకరించి వాటిని అగ్నిలో వేస్తారు. దీనివల్ల అగ్నిహోత్రుడి అనుగ్రహం కలిగి, భర్త శాశ్వత ఆయువుతో విలసిల్లడానికి తాను దీర్ఘసుమంగళిగా ఉండడానికి దోహదపడుతుంది.

స్థాళీపాకం

వధువు ఒక చిన్న గిన్నెలో బియ్యం నీళ్ళు పోసి అగ్నిలో వండితో వరుడు ఆ అన్నంతో హోమమ చేస్తాడు. భర్త చేసే ప్రతి పనిలో భార్యా అధికారాన్ని, అవసరాన్ని ఈ ఆచారం తెలియజేస్తుంది. ఇప్పటి నుండి వరుడు హోమాలు, యజ్ఞాలు చేయడానికి అర్హుడవుతాడు.

మట్టెలు, పిల్లెళ్ళు

వధువు మేనమామలు లేదా తల్లితరపున బంధువులు “గృహస్థాశ్రమంలో ప్రవేశించిన మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము” అని వధువుకు మట్టెలు, పిల్లెళ్ళు, చీర, పసుపుకుంకుమలు, పూలు పళ్ళు ఇస్తారు. వరుడు కాలి బొటన వేళ్ళ పక్క వేళ్ళకు మట్టెలను, నాలుగవ వేళ్ళకు పిల్లెళ్లను తొడుగుతాడు. పురోహితుడు, పెద్దలు పుష్పాక్షతలు వేసి ఆశీర్వదిస్తారు.

ఉంగరాలు తీయడం:

ఉంగరాలు తీయడాన్నే ప్రధానాంగుళీయకం అంటారు. మూత చిన్నదిగా ఉండే చిన్న బిందెలో పాలూ, నీళ్ళూ పోస్తారు. దానిలో ఒక బంగారు ఉంగరాన్ని వేసి పురోహితుడు చెప్పగానే గభాలున దానిని తీయడానికి వధూవరులు ప్రయత్నిస్తారు. దొరికిన వారు వేరొకరికి తొడుగుతారు. అప్పటిదాకా పరిచయం లేని వదూవరులు ఒకరి చేతులొకరు తాకుతూ ఉంగరాన్ని వెతుకుతూ బిడియాన్ని దూరం చేసుకోవడం ఈ తతంగం ఉద్దేశం. బంధుమిత్రుల కోలాహలం మధ్య ఆ కాసేపు అది ఇరు పక్షాల వారి మధ్య ఒక నిజమైన పోటీలా జరుగుతుంది. చూడటానికి చాలా సరదాగా ఉండి- పోటీ పడి గెలవాలనే పట్టుదలని, అంతలోనే తను ఓడిపోయి ఎదుటి మనిషిని గెలిపించాలనే ప్రేమ భావనని చిగురింపజేస్తుంది.

బొమ్మను అప్పగించడం

ఆడపడుచు ఒక కొయ్య బొమ్మను ఉయ్యాలలో వేసి ఊపుతూ బొమ్మ మీద వసంతం పోస్తుంది. అది దంపతులపై పడుతుంది. అప్పుడు ఆడపడుచు పాపనిస్తావా, పాడి ఆవునిస్తావా అని అడగగ, వధువు పాపనిస్తాను అని ఉయ్యాలలోని బొమ్మను ఆడపడుచుకీ ఇచ్చి, ఆమె నుదుట బొట్టు పెడుతుంది. వివాహం అయిన తరువాత ఆడపడుచు పరాయి అయిపోలేదని, తానూ ఈ ఇంట్లో భాగమేనని ఆడపిల్లకు చెప్పడం, త్వరలోనే నూతన వధువు ఉయ్యాలలో పాపను ఆడించాలని కోరుకోవడమే ఈ సాంప్రదాయం వెనకున్న ఉద్దేశ్యం.

నాగవల్లి

ఈ కార్యక్రమంలో వధువుకు బంధువులు చీరలు, నగలు, బహుమతులు పెడతారు. 9 మట్టి పిడతల్లో నవ ధాన్యాలు పోసి 8 దిక్కుల్లో 8, మధ్యలో ఒకటి పెట్టి వధూవరులతో పూజ చేస్తారు.

నల్లపూసలు:

దుష్ట శక్తులు మాంగల్యం మీద పడకుండా ఉండటానికి స్త్రీలు మంగళ సూత్రంతో పాటు నల్ల పూసలు గొలుసుగా ధరిస్తారు. నల్లపూసలు సంతాన సాఫల్యానికి, దానానికి, సుఖానికి, సౌభాగ్యానికి చిహ్నాలు. పెళ్లైందన్న గుర్తుతో పాటుగా- అంగరంగ వైబోగంగా జరిగిన తమ వివాహం గురించి, తమ సంసారిక సుఖజీవనాన్ని గురించి నలుగురు మాట్లాడుకునేటప్పుడు, వారి నోటి వెంట వచ్చిన దోషాలను అరికడుతుందని ఓ నమ్మకం. బంగారంతో చుట్టిన నల్లపూసలు ధరించటం వల్ల ఓ ప్రత్యేక అందం స్రీకి వస్తుందనటంలో సందేహం లేదు.

ధృవ నక్షత్రం

పురోహితుడు నవ దంపతులను ఆరుబయటకు తీసుకువచ్చి ఆకాశంలో ఉత్తర ధృవ నక్షత్రాన్ని చూపిస్తారు. వధూవరులు ఆ నక్షత్రాన్ని చూస్తూ “ఓ ధృవ నక్షత్రమా! నీవు స్థిర నివాసము కలదానివి. ఇతర నక్షత్రములకు కూడా నిన్ను ఆధారము చేసుకొని స్థిరంగా, శాశ్వతముగా ఉంటాయి. అలాగే నా పతి ఇంటియందు మేముకూడా  స్థిరముగా, శాశ్వతముగా, సంపూర్ణ ఆయురారోగ్యములతో, భోగభాగ్యములతో వర్ధిల్లెదము గాక” అని నమస్కరిస్తారు. 

అరుంధతీ నక్షత్రం

ముందు అరంధతీ నక్షత్రం కనిపించేది రాత్రి పూట మాత్రమే. సప్తఋషి మండలం చివర వశిష్టుడి వెనకగా కొంచం చిన్నగా కనిపిస్తుంది అరుంధతీ నక్షత్రం. అగ్ని హోత్రుడు మహా పతివ్రత అయిన అరుంధతికి ఇచ్చిన వరం ప్రకారంగా సప్తపది అయిన తరువాత, రాత్రి కొత్తజంటను బయటికి తీసుకువచ్చి, ఆకాశంలో కనబడే అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. అరుద్ధతిని తన వెనక ఉంచుకొని వశిష్టుడు సదా రక్షించునట్లు భార్ర్యను ఎల్లవేళలా కాపాడమని భర్తకు, భర్తకు జీవితాంతం వెన్నుదన్నుగా నిలిచి అతను చేసే సత్కార్యాలకు సహకరించమని వధువుకు చెప్పడం ఇందులోని ఉద్దేశ్యం. “ఓ నక్షత్రమా! నీలాగే నేనూ శాశ్వతంగా- కుటుంబంలో అన్ని సంపదలతో విలసిల్లాలి, నీవు నాశనం లేక ఎలా వెలుగుతావో అలాగే నేనూ నా కుటుంబంలో వెలగాలని” కోరుకుంటుంది వధువు.

మిధున విడియములు:

పాత దంపతులకి కొత్త దంపతులు తాంబూలాలిచ్చి వారి ఆశీస్సులు తీసుకొంటారు.

అప్పగింతలు:

కని, పెంచి, లాలించి ఇంతకాలం పోషించి ప్రేమను చూపిన కన్నకుమార్తెను అత్తవారింటికి అప్పజెప్పే అప్పగింతలు కార్యక్రమం అన్నింటిలోకి చివరిది-ఉద్వేగ భరితమైంది. సాధారణంగా పెళ్లి జరిగిన రోజున అర్థరాత్రి దాటింతర్వాత అప్పగింతల మంత్రంతో మొదలవుతుంది కార్యక్రమం.

భజంత్రీలు అప్పగింతల పాట పాడుతుంటే, పెళ్ళి పీటపై వధువును మధ్యలో కూర్చుండ బెట్టి, పాలలో చేతిని ముంచిన తర్వాత అప్పగింతల తంతు జరుగుతుంది. వధువు రెండు చేతులను పాలలో ముంచి వరుని చేతిలో పెట్టి అప్పగించాలి. అత్తమామలు వరుడి ప్రక్కన కూర్చుని వుంటే, వారికి కూడా వధువు రెండు చేతులు పాలలో ముంచి వారి చేతులో అద్ది, “మీ పుత్రిక వలె కాపాడాలి” అని అప్పగిస్తారు. అప్పగించిన పెద్దలందరికీ బట్టలు పెట్టే తంతుంటుంది.

ఈ అప్పగింతలు చేసేవారికి, చూసే వారిలో చాలామందికి కంట తడిపెట్టిస్తుందనడంలో అతిశయోక్తి కాదు. అప్పగింతల కార్యక్రమం అనంతరం, పెళ్ళికూతురును లోపటికి తీసుకునిపోయి, పెరుగు అన్నం పెట్టి, దేవుడికి దండం పెట్టించి, బయట ఇంటి సింహద్వారం దగ్గర తల్లి కడుపుపై మజ్జిగతో అద్దించి, గడపను చేతులతో తాకిస్తారు. ఇవన్నీఅయ్యాక విడిది గృహ ప్రవేశానికి పంపుతారు. ఇక అంతటితో కన్యా దాత ఇంటినుంచి ముందు జరగాల్సిన వేడుక, విడిదికి-అక్కడినుంచి పెళ్లికొడుకు ఇంటికి మారుతుంది.

గృహ ప్రవేశము

వివాహం అయిన తరువాత కన్యాదాత ప్రాంతం నుండి వరుడి ఇంటి వరకు పూల పళ్లికిలో గాని, వాహనములో గాని వధూవరులు నూతన దంపతులైనరాని తెలుపడానికి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఇంటికి రాగానే నూతన వధూవరులకు ఆడపడుచులు హారతి పట్టగా వారికి లాంఛనాలు, కానుకలు ఇస్తారు. తరువాత ఆడపడుచులు వారిని గుమ్మంలోనే ఆపి ఒకరి పేరును ఇంకొకరితో చెప్పిస్తారు. ఇక్కడ నూతన దంపతులు వారి పేర్లు చెప్పేందుకు సిగ్గుపడతారు. తరువాత కుదికాలు ముందుపెట్టి గృహప్రవేశం చేయిస్తారు. ఇదంతా ఆద్యంతం ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతుంది. వధూవరులు గృహప్రవేశం చేసిన తరువాత పూజ మందిరానికి వెళ్ళి నమస్కరిస్తారు.

అత్తగారింట్లో కొత్త కొడలికి విశేషమైన స్థానము, గౌరవము ఇవ్వాలి. కుటుంబంలోని వ్యక్తులందరి పైనా ఆమెకు అధికారము ఉంటుంది. కోడలు భావి కుటుంబ యజమానురాలు అని ఋగ్వేదమే చెప్పింది. అత్తామామలు, భర్త, మరుదులు, ఆడపడుచుల దృష్టిలో నీవు ఈ ఇంటికి మహారాణివి కమ్మని పెద్దలు దీవిస్తారు. కొత్తకోడలిగా అత్తగారింట్లో అడుగుపెట్టిన కోడలు పెద్దల పట్ల గౌరవము, పిల్లల పట్ల ఆప్యాయత ప్రదర్శించి కుటుంబంలో అందరి చేతా మన్ననలను పొందాలి. పాలలో చక్కెర కలిపినట్లుగా అత్తగారింట్లో కలిసిపోవాలి. తన ప్రేమాభిమానములతో అత్తగారింట్లో ఆదరణ, అభిమానమును పొందాలి.

సత్యనారాయణ వ్రతం

వివాహం తరువాత వరుని ఇంట్లో శ్రీ సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. vఇయ్యలవారికి, బంధుమిత్రులకు విందుభోజనాలు ఏర్పాటు చేస్తారు. పురోహితులకు వారి తాహతు కొద్దీ దక్షిణ తాంబూలాలిచ్చి ఆశీర్వాదాలు తీసుకొని పంపుతారు.

గర్బాధానం

గర్భాదనం అంటే స్త్రీ గర్భమును పురుషునికి దానం చేయుట. గర్భాధానాన్ని శోభనం అని కూడా అంటారు. గర్బాధానం స్త్రీ యొక్క పుట్టింట 3 రాత్రులు, మెట్టినింట 3 రాత్రులు జరుపుతారు.

16 రోజుల పండుగ

పెళ్లి అయిన రెండు వారాల తరువాత 16 వ రోజు వరుని ఇంట్లో వధు తల్లిదండ్రులు, బంధువులు అందరూ చేరి ఎంతో సంతోశంగా వేడుక చేసుకుంటారు. ఇంతటితో ఈ పెళ్లిసందడి పూర్తవుతుంది. ఆహా. ఇది కదా నిజమయిన తెలుగింటి పెళ్లి అంటే. ప్రస్తుత కాలంలో పరిస్థితులు మారడం వల్ల మన వివాహ సాంప్రదాయంలో ఇన్ని తతంగాలున్నా- వీలునుబట్టి, సమయాన్ని బట్టి వీటిలో కొన్ని మాత్రమే నిర్వహిస్తున్నారు.

పెళ్ళంటే జన్మకి ఒకే సారి జరిగే పండుగ …

రెండు మనసులు జీవితకాలం కలిసుండటానికి వేసే తొలి అడుగు ….

రెండు కుటుంబాలు జీవిత కాలం రక్త సంబంధీకుల్లా కలిసి పోయే ఒక మహత్తర ఘట్టం …

రెండు మనసుల కలయిక, నూరేళ్ల సాన్నిహిత్యం, ప్రమాణాలు, వాటికి కట్టుబడి ఉండటం. ప్రమాణాలకు కట్టుబడి ఉంటే ఆ సంసారం స్వర్గం. స్త్రీపురుషులు కలిసి ధర్మార్థకామమోక్షాలను సాధించుకోవడమే వివాహ పరమార్థం.

                        *** సర్వేజనా సుఖినోభవంతు ***

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top