google.com, pub-2532166691306495, DIRECT, f08c47fec0942fa0

భక్త కన్నప్ప శివుడికి కళ్లను అర్పిస్తున్న దృశ్యం

భక్త కన్నప్ప పూర్తి కథ

భక్త కన్నప్ప పూర్తి కథ

పురాణాల ప్రకారం మహా శివుడికి 63 మంది ప్రసిద్ధ భక్తులు ఉన్నారు. వారిని నాయనార్లు అంటారు. వారిలో ‘తిన్నడు’ ఒకడు. ద్వాపరయుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు. ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు. తిన్నడు బోయవాడు. మరి ఒక బోయవాడికి అంతటి భక్తి ఎలా అబ్బింది? తిన్నడి పుట్టుపూర్వోత్తరాలను, భక్త కన్నప్పగా మారిన వైనం మొదలైన పూర్తి విశేషాలను తెలుసుకుందాం.

ఇప్పటి శ్రీకాళహస్తి పట్టణం ఉన్న అప్పటి ‘పొత్తపినాడు’ అని పిలిచే ప్రాంతంలో ఉన్న ఉడుమూరు అనే ఒక బోయ పల్లెలో తిన్నడు జన్మించాడు. శ్రీకాళహస్తి నుండి శ్రీశైలందాక వ్యాపించిన పొత్తపినాడులోని అడవులలోని పల్లెల్లో ఆటవిక జాతులు ఎక్కువగా నివసించేవారు. ఉడుమూరు పల్లెకు నాయకుడు ఎటుక జాతికి చెందిన నాథనాథుడు.  ఆయన భార్యపేరు తందె. వీరిద్దరూ సుబ్రహ్మణ్యస్వామి భక్తులు. అమాయకులూ, విద్యాగంధం లేనివారూ అయినా, ఆ దంపతులకు భక్తిమాత్రం పుష్కలంగా ఉండేది.

వీరి కొడుకు కన్నప్ప అర్జునుడి అవతారం. ఒకానొకప్పుడు అర్జునుడు శివుడి కోసం గొప్ప తపస్సు చేసాడు. అర్జునుడి భక్తికి, తపస్సుకి మెచ్చిన శివుడు, ఒకసారి అర్జునుడిని పరీక్షించాలనుకున్నాడు. అర్జునుడి తపస్సుకి భంగం కలిగించాలని ఓ అడవి పందిని పంపించాడు శివుడు. సహనం కోల్పోయిన అర్జునుడు కోపంతో ఆ పందికి బాణం వేశాడు. అదే సమయంలో బోయవాని వేషంలో వచ్చిన శివుడు కూడా ఆ పందికి బాణం వేశాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. మొత్తానికి అర్జునుడి పట్టుదల, ప్రయత్నానికి మెచ్చిన శివుడు.. అర్జునుడికి మహా శివుడిగా దర్శనమిచ్చాడు. అర్జునుడిని రెండు వరాలు కోరుకోమన్నాడు. అప్పుడు అర్జునుడు మొదటిగా పశుపతా అస్త్రం కోరుకున్నాడు. ఆ వరాన్ని ప్రసాదించిన శివుడు- దీనిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలవని అర్జునుడికి చెప్పాడు. తరువాత ఆ అస్త్రం తిరిగి మహా శివుని వద్దకు చేరుతుంది. రెండోవది మోక్షం. ఈ జన్మలో మోక్షం ప్రసాదించమని అర్జునుడు శివుణ్ణి కోరాడు. కానీ అందుకు శివుడు అంగీకరించలేదు. నువ్వు నీ బంధువులైన కౌరవులను చంపడానికి ఆయుధాన్ని అడిగావు కనుక  నీకు ఈ జన్మలో మోక్షం ప్రసాదించలేను. మరుజన్మలో నీకు కిరాతజన్మ లభిస్తుంdi. ఆ జన్మలో శివభక్తి కలిగి తనను మెప్పించి సాయుజ్యమోక్షం పొందగలవని సెలవిచ్చాడు. అందుచేతనే అతడు “తందె” గర్భంలో ఉండగానే శివభక్తిని సొంతం చేసుకున్నాడు.

తిన్నడు కూడా బాల్యం నుంచే అత్యంత శివభక్తి పరాయణుడు. తన ఈడు పిల్లల్తో ఆటలాడుకొంటూ తిన్నడు బాల్యాన్ని ఆనందంగా గడిపాడు. తిన్నడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకశుభముహూర్తంలో చెంచుల కులదైవమైన కాటిటేని సముఖంలో తిన్ననికి వారి కులవిద్యయైన విలువిద్యను ఆరంభించే కార్యక్రమాన్ని ఒక జాతర నిర్వహించి ఎంతో వైభవంగా జరిపించాడు.

తప్పెట్లూ, సొరబుట్జలూ, కిన్హరవీణలూ, కొమ్ములూ, గుమ్మెటలు లాంటి ఎన్పోరకాల వాద్యాల మోతతో అడవంతా మారుమోగింది. తిన్నని చక్కగా అలంకరించి, విభూతి రేఖలు ఒంటిమీదనూ, నుదుటి మీదనూ చక్కగ దిద్దారు. రక్షకోసం తాయెతుల్లో మూలికలు నింపి బాలునికి కట్టారు. చక్కగా అలంకరించిన విల్లునొకదానిని అతనిచేతి కిచ్చారు. అమ్ముల పొదిని వీపున వేళ్లాడేటట్టు కట్టారు. ఈకలు కూర్చిన తలకట్టూ, మొలచుట్టూ పులిచర్మం, దానిపై ఒక చర్మపుదట్టీ కట్టారు. జాతరలో చెంచుగూడేల్లోని ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

విల్లు పట్టిన తక్కువ కాలంలోనే విలువిద్యలో నైపుణ్యం సంపాదించాడు. ఈటెలు, రకరకాల విండ్లూ, బాణాలూ, వలలూ లాంటి పరికరాలు తీసుకొని, అడవిలో కుందేళ్లూ, జింకల్లాంటి సాధుజంతువుల్ని పట్టి తెచ్చేవాడు. పందులూ, దున్నలూ, చిరుతలూ, తోడేళ్లలాంటి వాటిని నేర్పుగా చిన్నచిన్న ఆయుధాలతోనే మట్టుపెట్టేవాడు. బోయవానిగా తన కులధర్మముననుసరించి వేటాడినా తిన్ననికి అన్ని జీవులపట్ల కరుణ, ప్రేమలు పుట్టుకతో వచ్చాయి. జంతువులలో పిల్లలని, ఆడవాటిని, రోగాలతో ఉన్నవాటిని వేటాదేవాడు కాదు. తనలోని జంతు భావాలైన కామ, క్రోధ, మద మాత్సర్యాలను జయించాడు. కాలం గడుస్తున్నది.

ఒకరోజు తిన్నడు తన ఈడు యువకులతో కలిసి వేటకోసం వేంకటాచలం అడవుల వైపుబయలుదేరి వెళ్లారు.  వెంటవచ్చిన స్నేహితులూ, పెద్దలూ, పరివారమూ అడవిలో వేరువేరు మార్గాల్లో వెళ్లారు. వేటలో తిన్నడు ఎన్నో జంతువుల్ని పట్టుకుంటూ ఉత్సాహంగా జంతువుల వెంటబడి ఒంటరిగా చాలాదూరం వెళ్లిపోయాడు. అలసట వచ్చి ఒక పొగడ చెట్టు నీడలో నిద్రపోయాడు. ఆ నిద్రలో ఒక చిత్రమైన కలవచ్చింది. ఒళ్లంతా తెల్లగా విభూతి పూసుకొని పులితోలుతో చేసిన మొలదట్టీ కట్టుకొని, పిడచలుకట్టి ఎర్రబారి ఉన్న జడల జుట్టుకల ఒక జంగమరూపుడు  కలలో తిన్నడిని ఒడిలో పడుకోబెట్టుకొని నుదుట విభూతి పూసి శివతీర్థం త్రాగించాడు. తరువాత తిన్నడితో “కన్నప్పా! ఈ సమీపంలో సువర్ణముఖి అనే నదిగట్టున ఉన్న కలుజువ్వి చెట్టు కింద నీకు ప్రాణలింగమైన ఒక శివలింగం కనిపిస్తుంది. నీవు వెళ్లి ఆ స్వామిని భక్తితో సేవించు. నీకు మేలు జరుగుతుంది.” అని చెప్పి మాయమయ్యాడు.  ఇంతలో అతనికి మెలుకువ వచ్చి చుట్టూ చూడగా తనకు దగ్గరలో ఒక కొత్త మార్గమొకటి కనిపించింది. ఆ దారిలో కొంత దూరం వెళ్లేసరికి కలలోని స్వామి చెప్పిన అద్భుత శివలింగం తిన్ననికి కనిపించింది.

విశాలమైన పానవట్టంతో కర్పూరకాంతితో, రుద్రాక్ష చిహ్నంతో, మానవనిర్మితమైనదిగా కాకుండ స్వయంభువై, వెలసింది. ఆ భక్తుని శరీరం పులకరించి, ఆనందంతో కన్నీరుబికింది. అనంతమైన భక్తిభావంతో సాష్టాంగపడ్డాడు. అతనిలోని భక్తి పారవశ్యం వల్ల అది ఒక కదలని లింగంగా మాత్రమే కాక సాకారుడైన శివుడే తన కోసం వచ్చినట్టుగా అనిపించాడు. అమాయకంగా, ఆత్మీయంగా శివునితో మాట్లాడటానికి ప్రయత్నించాడు. “స్వామీ! భాగ్యమంటే నాదే కదా! నీవు చెప్పినట్లే వచ్చి నిన్ను కలుసుకోగలిగాను. ఇది పులులూ, సింహాలూ ఉండే అడవి. నా వెంటరా. మాపల్లెకు పోదాం. అక్కడ నీకన్నీ సమకూరుస్తాను.

 పుట్టతేనె, పుట్టజున్ను, రకరకాల పళ్ళు మాకు దండిగా దొరుకుతాయి. మా పల్లెకు రా స్వామీ” అని స్వామిని బతిమాలాడు తిన్నడు. స్వామి ఉలకలేదు, పలకలేదు. అయినా తిన్నడు శివలింగాన్ని విడువకుండ భక్తిమైకంలో పడిఉన్నాడు.

అతనివెంట వేటకు వచ్చినవాళ్ళు తిన్నన్ని వెతుక్కుంటూ అతన్ని కలుసుకొని “ఇంటికి పోదాము రా” అని బతిమాలారు. అప్పుడు తిన్నడు “ఈ శివలింగంతో నా ప్రాణాన్ని ముడివేసి ఉన్నాను. నావెంట ఈ స్వామి వస్తే, నేనూ మన పల్లెకు వస్తాను. లేకపోతే ఈయనతోనే ఉండిపోతాను. మీరు గూడేనికి పొండి. మీరు తొందరపెడితే ఇక్కడే ప్రాణాలు విడుస్తాను.” అని చెప్పిమరల శివుని ధ్యానంలో మునిగిపోయాడు. ఇక చేసేది లేక వారు జరిగిన విషయం రాజుకు చెప్పడానికి వచ్చిన దారినే తిరిగి వెళ్లారు.

తరువాత తిన్నడు శివునికి ఆహారం తెచ్చిపెట్టాలని అడవికి బయలు దేరాడు. కానీ ఆకలి తీర్చడానికి కందమూలాలు పండ్లూ కాయలు దొరకలేదు. అప్పుడే ఒక వింత జరిగింది. మాంసపు పుష్టిగల జంతువులు కొన్ని, మచ్చికయినవిలా, తమంత తాముగా తిన్నని దగ్గరికి వచ్చి అతని చేతికి చిక్కాయి. అవి తాముగా తిన్నడి దగ్గరకు ఎందుకొచ్చాయి? వాటి పూర్వజన్మవృత్తాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకప్పుడు సుందర శరీరంకల రాక్షసులు కొందరు శివుని గూర్చి తపస్సు చేశారు. కొంతకాలానికి శివుడు కరుణించి “ఏమికోరి తపించారు చెప్పండి. మీకు కోరిన వరం ప్రసాదిస్తాను. మీరు కోరుకొంటే విష్ణుపదవి, బ్రహ్మపదవి, ఇంద్రాది పదవులైనా ప్రసాదిస్తాను” అన్నాడు. అందుకు వారు అవేవీ అక్కరలేదన్నారు. “స్వామీ! మా యీ సుందర శరీరాలను నీవు నేరుగా తిని, మాకు మోక్షం ప్రసాదించు. ఇదే మా కోరిక” అన్నారు. అందుకు స్వామి “మీ కోరిక వచ్చే జన్మలో తీరుతుంది. మిమ్మల్ని “కన్నప్ప” అనే కిరాత భక్తుడు చంపి మీ మాంసాన్ని నాకు సమర్పిస్తాడు. అలా మీ దేహాల మాంసాన్ని స్వీకరించి మీరు కోరిన ముక్తిని ప్రసాదిస్తాను” అని అన్నాడు. అప్పుడు రాక్షసులు, శ్రీకాళహస్తి సమీపంలో ఉన్న కైలాసగిరి అడవుల్లో, నానావిధ జంతువులై పుట్టి కన్నప్పరాక కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అప్పుడు శివుని ఆకలి తీర్చడానికి బయలుదేరిన కన్నప్పను తమంత తాముగా సమీపించి, అతి సులభంగా తిన్నడికి చిక్కాయి. స్వామి ఇచ్చిన వరాన్ని అనుసరించి ఆయనకు ఆహారంగా మారాయి. ఆ సుందరదానవులు తమ కోరిక తీర్చుకుని ముక్తిపొందారు. 645

అలా ఒక అడవిపందిని పట్టి తెచ్చి పక్వంగా కాల్చి రుచి చూసి మేలురకం మాంసపు ముక్కల్చి దొన్నెలో పెట్టి తెచ్చి స్వామిని తినమన్నాడు. కాని ఆ నైవేద్యం పెట్టేటప్పుడు అభిషేకించే పద్ధతి, అలంకరించే పద్ధతి లాంటివి ఎలా చేయాలో పూర్తిగా తెలియదు. తనకు తోచిన రీతిలో పూజా విధానాలను పాటించాలనుకున్నాడు. వీపున అమ్ముల పొది, భుజానికి విల్లు తగిలించుకొని, సువర్ణముఖీ నదిలో మునిగి లేచాడు. కాళ్లకు చెప్పులు ఉన్నాయి. మాంసపుదొన్నెలు చేతుల్లో ఉన్నాయి. తాను సేకరించిన మారేడు దళాల్ని తలపై చింకిజుట్టు మధ్యలో పెట్టుకున్నాడు. నోటినిండుగా పవిత్రమైన సువర్ణముఖీనది నీటిని నింపుకొన్నాడు. భక్తితో పరమేశ్వరుని పవిత్రలింగం దగ్గరికి వెళ్ళి, అంతకుముందు ఆ శివలింగంపై ఉన్న పదార్థాలేవో, వాటినంతా తన చెప్పుకాలితోనే ప్రక్కకునెట్టి శుభ్రంచేశాడు. నోటినిండుగా పట్టితెచ్చిన పవిత్ర నదీజలాన్ని తన పుక్కిటినుండి- వేగంగా వెళ్లి శివలింగం మీద పడేటట్టు ఊశాడు. తిన్నడు నెత్తిపై పెట్టుకుని తెచ్చిన మారేడు ఆకుల్ని లింగంపై వేశాడు. స్వామిముందు మోకాళ్లపై కూచున్నాడు. తన చేతుల్లోని పక్వంగా కాల్చిన పందిమాంసపు ముక్కల దొన్చెల్ని స్వామిముందుకు జరిపి “ఎన్నాళ్లుగా ఆకలితో పస్తులున్నావో తినవయ్యా” అంటూ అమాయకంగా వేడుకున్నాడు తిన్నడు. ఆ కపట మెరుగని భక్తుని చిత్తశుద్ధిని శివుడు మెచ్చుకొన్నాడు. లింగంనుండి స్వామి సాకారుడై తిన్నని కరుణించి ఆ నైవేద్యం తిన్నాడు. అలా ప్రారంభమైన కిరాత భక్తుని శివపూజ రోజూ కొనసాగింది. 

మరోపక్క తిన్నడు పూజిస్తున్న వాయులింగేశ్వరుణ్ణే శివగోచర అనే బ్రాహ్మణ భక్తుడూ నిత్యమూ సేవించేవాడు. ఆతని పూజనే తిన్నడు చెప్పుకాలితో చెరిపేసి, తన పద్ధతిలో పూజ చేసేవాడు. తిన్నడు మాంసపు ముక్కల్ని స్వామికి తినిపించి, మిగిలినవి తాను తిని ఎంగిలాకుల్ని అక్కడే పారవేసేవాడు. అతని పుక్కిటి నీటితో శివలింగం తడపడం వల్ల ఎంగిలిచారలు శివలింగంపై కనిపించేవి. సుగంధపుష్పాలతో బ్రాహ్మణ భక్తుడు పూజించి వెళ్లిన చోట తిన్నని పూజతో పరిసరమంతా దుర్వాసనతో ఉండేది. ఇలా నిత్యమూ జరగడం చూచిన శివగోచరుడికి కోపం వచ్చింది. బాధ కలిగింది. ఎవడో తుంటరి తన వూజను ఉద్దేశపూర్వకంగానే పాడు చేస్తున్నాడు అనిపించింది. తనబాధను స్వామితో చెప్పుకున్నాడు. “ఇదేమిటి స్వామీ! నీవు నా ఇలవేల్పని, నీ మందిరాన్ని నిత్యమూ వచ్చి శుభ్రపరచి, పూజ చేస్తున్నాను.  నా పూజను ఎవరో పాడు చేస్తున్నారు. ఇక నేను దీన్ని భరించలేను. నీకీపూజ ఇష్టమైతే వుండనీ. ఇలా చేస్తున్నవాడెవడో అతణ్ణి నాకు చూపించు. నీవలా చేయకపోతే నేను ఇక్కడే ప్రాణం విడుస్తాను” అంటూ ఏడుస్తూ స్వామిముందు సాగిలపడ్డాడు. అప్పుడు ఆశ్చర్యకరంగా శివునివాణి వినిపించి “శివగోచరా! చింతించకు. నన్నొక భక్తుడు వేదేతర పద్ధతితో పూజిస్తున్నాడు. అయినా అతని భక్తి నిర్మలమైనది. అమాయకత్వంతో, దృఢసంకల్పంతో కూడినది. కొంతసేపు నీవు నావెనుక దాగి ఉండు. అతని భక్తివిశ్వాసాలు ఎంతగాఢమైనవో నీవే కళ్లారా చూడగలవు” అంటూ శివలింగం నుండి వినిపించిన మాటలు విని శివగోచరుడు శివలింగం వెనక్కివెళ్లి, నక్కి కూర్చొని తన పూజను పాడుచేస్తున్న భక్తుడెవడో చూడాలి అని ఎదురుచూస్తున్నాడు. 

అంతలో కన్నప్ప ఎప్పటిలాగే వచ్చి చెప్పుకాలితో బ్రహ్మనుని పూజను పక్కకు నెత్తి, పుక్కిటి నీటితో లింగాన్ని అభిషేకించాడు. కాల్చితెచ్చిన మాంసపు ముక్కల్ని తినుమని స్వామి ముందుంచాడు. కాని ఆ రోజు శివుడు తిన్నని పరీక్షించి బ్రాహ్మణునికి ఆతని భక్తిశక్తిని చూపదలచుకొన్నాడు కనుక ఆహారాన్ని స్వీకరించడానికి ప్రత్యక్షమూ కాలేదు. తిననూ లేదు. పైగా శివలింగంపై తన కళ్ళను సజీవంగా  ప్రదర్శించాడు.

అందులో స్వామి కుడికంటినుంచి నీరు కారుతోంది. మొదట సన్నగా కారుతున్న కన్నీరు కొంతసేపటికి పెద్దధారగా మారింది. తాను తెచ్చేమాంసం ఇష్టంగా తినే స్వామి, నేడెందుకో తినడంలేదు. పైగా ఈ కన్నీరేంటి? స్వామికంటికేదో అయ్యింది! దీనికేదైనా వైద్యం చేయాలి అని తనకు తోచిన వైద్యాలేవో ప్రయత్నించాడు. ఈ లోపున శివుని వెనుక ఉండి చూస్తున్న బ్రాహ్మణభక్తునికి తిన్నని మీద కోపం పోయి అతను చేస్తున్నదంతా గౌరవభావంతో, శ్రద్ధతో గమనిస్తున్నాడు

ఎన్నెన్నో మందులు తనకు తెలిసినవీ, ఇతరులు చెప్పగా వినివున్నవీ ప్రయత్నంతో తెచ్చి స్వామికి చికిత్స చేశాడు. చేసినా వీసమంత గుణం కనిపించలేదు సరికదా, నీటికి బదులు కంటినుండి నెత్తురు కారడం ఆరంభమయ్యింది. తానుచేసిన చేతగాని వైద్యం వికటించినందువల్లే, నీటికిబదులు నెత్తురుకారుతున్నదని తిన్నడు విలవిలలాడిపోయాడు.  స్వామి కంటికి హాని కలిగింది. ఈ కంటికి బదులు మరొక కన్నుపెడితే సరిపోతుంది కదా. స్వామి కంటికి నా కంటిని అమర్బుతాను” అని అనుకున్నదే తడవుగా, తన అమ్ముల పొదిలోని వాడి బాణపు కొసను తనకంటి కొసనుపెట్టి క్షణంలో కనుగుడ్డును పెకలించి తీశాడు. తనకంట్లో నెత్తురు ధారగా వస్తున్నా లెక్కచేయలేదు. స్వామి కుడికంటిపై, తన కనుగ్రుడ్డుపెట్టాడు. ఆశ్చర్యంగా స్వామి కన్ను బాగయ్యింది. మునుపటి కన్నా మెరిసిపోతున్నది. 

కన్నప్ప ఆనందానికి అంతు లేదు. “స్వామీ! నన్ను కరుణించావా? నీ బాధతీరిందా?”అంటుండగానే శివుని ఎడమ కంట, మునుపటిలాగే నీరు కారడం ప్రారంభమయ్యింది. కన్నప్పకు అర్థమయ్యింది. చిరునవ్వు నవ్వాడు. తనకన్ను ఇప్పుడు శివుని దివ్యనేత్రంగా మారింది. అందుకు తానెంతో ఆనందపడుతున్నాడు. ఇప్పుడు స్వామి ఎడమకంటినుండి నీరుకార్చడంలో అంతరార్థం అర్థమయ్యింది. తన ఉత్సాహం రెట్టింపయ్యింది. తన రెండవ కంటిని కూడా పెరికి పెడితే, ఇకపై స్వామి తన కళ్లతోనే లోకాలనన్నింటినీ చూస్తాడు. ఆ విషయం తలచుకోగానే తనువు పులకరించింది. ఇది స్వామి పరీక్షేలే అనుకుని తన ఎడమ కంటిని పెకలింపబోతూ, కొంచెం ఆగాడు. స్వామి ఎడమకంటికే కదా నా ఎడమకంటిని పెట్టాలి. నా కన్ను పెరికాక, నాకు చూపు ఉండదు కనుక ముందుగా స్వామి ఎడమ కంటిని గుర్తుపెట్టుకుంటాను  అని, తనచెప్పుకాలిని స్వామి ఎడమకంటి కొసన గుర్తుగా తన్నిపెట్టాడు. మరుక్షణంలో తిన్నడు తన కంటిని బాణంతో గ్రుచ్చితీయబోతున్నాడు. అప్పుడు “అగు!ఆగు!” అంటూ పరమేశ్వరుడు ప్రత్యక్షమై బోయని చేయిపట్టి ఆపాడు. స్వామితో పాటు పార్వతీదేవీ ఉన్నది.  ఈ దృశ్యాన్నంతా శివుని వెనుక ఉన్న తపస్వి, బ్రాహ్మణభక్తుడు ఆసక్తిగా చూస్తూనే ఉన్నాడు. పార్వతీ పరమేశ్వరులు ఆ భక్తుని కోసం సాక్షాత్కరించినా ఆదిదంపతుల దర్శనభాగ్యం తనకూ కలిగించినందుకు తిన్ననిమీద శివబ్రాహ్మణునికి అమిత గౌరవం, భక్తీ, కృతజ్ఞతాభావం కలిగాయి. పరుగెత్తుకు వచ్చి కన్నప్పకు సాగిలపడి మొక్కాడు. 

కన్నప్పకు కన్ను తీసిన స్థానంలో ఒకకొత్త కన్నువచ్చిచేరింది. కన్నప్ప కళ్లలో ఆనందబాప్పధారలు ఆరంభం కాగా ఆ సమయంలో ఆకాశాన దేవతలూ, దానవులూ, బుషులూ, మునులూ వచ్చి నిలిచి దుందుభులు మ్రోయించారు. పూలవాన కురిపించి స్తుతులతో మెప్పించారు.  పరమేశ్వరుడు “నీకేమికావాలి నాయనా!” అని అడగగా “స్వామీ! కోరికంటే ఏమో తెలియదు. మోక్షమంటేనూ తెలియదు. నేనేమి కోరుకోవాలో నాకు తెలియనే తెలియదు. కానీ నీమీద భక్తి, అనురక్తి ఎప్పటికీ ఇలాగే ఉండాలి” అన్నాడు భక్తిగా. బ్రాహ్మణభక్తుడు కూడా ముందుకు వచ్చి చేతులు జోడించి శివపార్వతుల ముందు భక్తిప్రవత్తులతో నిలుచున్నాడు. స్వామి ఆ భక్తునితో “చూశావా, నేను వేదేతర పద్ధతిలో పూజిస్తున్న కిరాత భక్తుని పూజను ఎందుకు అంగీకరిస్తున్నానో అర్థమయిందికదా? ఈ సృష్టిసర్వమూ నాదే. ఇందులో నేను ఇష్టపడనిదీ, ఈసడించేదీ ఏదీ వుండదు. భక్తులు తమకు ఇష్టమైన వానినే నాకు సమర్పిస్తుంటారు. వారికి అందుబాటులో ఉన్నదానినే నాముందు పెడతారు. అందులో స్వీకరింపదగిందీ, తిరస్కరింపదగిందీ ఏమీవుండదు. నేను స్వీకరించేది భక్తినే. ధనవంతుని వైభవోపేతమైన విలువైన అలంకారాలూ, కానుకలూ నన్ను ప్రలోభపెట్టలేవు” అని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు కూడా కన్నప్ప కోరినట్టే- తనకు శివభక్తి మాత్రమే కావాలని వినయంగా పలికాడు.  పార్వతీమాత వాత్సల్యంతో దీవిస్తుండగా, శివపరివారం “జయజయ” ధ్వానాలతో ‘హరహర మహాదేవ” ఘోషలతో ఆ భక్తద్వయాన్ని కీర్తిస్తుండగా, స్వామి తన అనంతశరీరంలోనికి వారిని ఆహ్వానించి, లీనంచేసుకొని, అపురూపమైన అనన్య సామాన్యమైన ‘సాయుజ్యమోక్షమిచ్చి” తిన్ననీ, శివబ్రాహ్మణునీ శాశ్వత కీర్తిమంతులను చేశాడు. దేవతలు పూల వాన కురిపిస్తూ దివినుండి ఆశీర్వదించారు.

స్వామి భక్తునికోసం భక్తులకోసం సువర్ణముఖరీ నదీతీరాన వాయులింగేశ్వరుడై స్థిరవాసుడై వెలసి ఉన్నాడు. కన్నప్పను కూడ తననలా కొలువుమని, తనచెంత పర్వతాగ్రాన చేర్చి గౌరవిస్తున్నాడు. ఇదీ కన్నప్పనాయనారుని కమనీయ భక్తిగాథ. భక్తతిన్నడుగా తెలుగు వారు, కన్నప్పగా కర్ణాటులూ, తమిళులూ కొలిచే భక్తాగ్రగణ్యుడీ కారణజన్ముడు.   కన్నప్ప కథలో భగవంతున్ని పొందాలంటే sభక్తునకు కావలసినది భక్తిగాని ఏ ఇతర శాస్త్రార్హతలు కాదు అని నిరూపించబడినది.

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top