రామావతారం ఎందుకు వచ్చింది.
శ్రీరాముడు రావణ సంహారం కోసం భూమిపై అవతరించాడు అనేది మనకు తెలిసిందే. కానీ ఆయన అవతారానికి ముఖ్య ఉద్దేశం రావణ సంహారం మాత్రమే కాదు. ఆయన నుండి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. మరి శ్రీరాముడు నుండి నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటి? ఆయనను ఏ విధంగా, ఏ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి? అనే విషయాలను తెలుసుకుందాం.
అయోధ్య నగరానికి రాజైన దశరథుడు సంతానం పొందడం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు. మంత్రబలం, దశరథుని భక్తి, శ్రద్ధ వలన ఆహ్వానించిన దేవతలందరూ హవిస్సులను స్వీకరించడానికి అక్కడికి వచ్చారు. రావణాసురుని వల్ల బాధలను అనుభవిస్తున్న దేవతలు, లోకకళ్యాణం కోసం రావణాసుర వధ కొరకు మీరు ఈ దశరథ మహారాజుకు జన్మించాలి అని శ్రీమన్నారాయణుని కోరారు. నారాయణుడు అందుకు అంగీకరించాడు. ఇచ్చిన మాట ప్రకారం శ్రీహరి కౌసల్యా–దశరథులకు కుమారునిగా శ్రీరామచంద్రునిగా చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించాడు.
సనక సన౦దల ఆగ్రహానికి గురైన వైకుంఠ ద్వారపాలకులు జయ, విజయులు త్రేతాయుగంలో భూలోకంలో రావణ, కుంభకర్ణులుగా జన్మించారు. వారు బ్రహ్మను గూర్చి ఘోరమైన తపస్సు చేసి మరణం లేకుండా వరం కోరారు. మరణం తప్పదని బ్రహ్మ చెప్పి మరొక వరం కోరమన్నాడు. రావణుడు దేవతలు, రాక్షసులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, పశు–పక్ష్యాదుల వలన మరణం లేకుండా వరం కోరుకున్నాడు. మనుషులను తక్కువగా భావించిన కారణంగా వారి చేతిలో చావకుండా వరం కోరుకోలేదు. అందువల్ల రావణుడు మనుషుల చేతిలోనే మరణించాల్సి వచ్చింది. కాబట్టి నారాయణుడు మనుజునిగా శ్రీరామునిగా అవతరించాడు. రావణాసుర వధ కొరకే రామావతారం ఏర్పడినట్లు అర్థమవుతుంది.
కానీ రామునిగా అవతరించడంలో మరో ముఖ్యమైన పరమార్థం ఉంది. మనం ఎలా బ్రతకాలో శిక్షణ ఇవ్వడమే శ్రీమన్నారాయణుడు మానవ అవతారం ఎత్తిన అసలు ఉద్దేశమని శాస్త్రాలు చెప్పాయి. కేవలం రాక్షసులను సంహరించడం మాత్రమే ఆయన లక్ష్యం కాదు. ఆయనను ఆదర్శంగా తీసుకుని మానవులు జీవించాలి.
ఉత్తమ మానవుని ఆదర్శ జీవితాన్ని సమాజం ముందు ఉంచవలసినవాడు కావడంతోనే వాల్మీకి మహర్షి, నారదుని వద్ద “అటువంటి 16 గుణాలు కలిగినవాడు ఎవరు?” అని అడిగాడు. నారదుడు శ్రీరాముని గురించి వివరించగా, వాల్మీకి రామాయణం రచించాడు. రావణ వధ కొరకు మాత్రమే అవతారం అయితే ఆన్ని గుణాల అవసరం ఉండేది కాదు. సమాజం ముందు ఆదర్శ మానవుని నిలబెట్టాలనే ఉద్దేశంతోనే ఆ గొప్ప లక్షణాలను రామునిలో చూపించారు.
రాముని జీవితంలో జరిగిన సంఘటనలన్నీ మన జీవితంలో రావలసిన అవసరం లేదు. కానీ మనకు తటస్థపడే సందర్భాలలో శ్రీరాముడు ఎలా ప్రవర్తించాడో, అలా మనం ప్రవర్తించాలి. కర్తవ్య విషయంలో మన ముందున్న ఆదర్శం శ్రీరామచంద్రుడు.
తల్లిదండ్రులతో ఎలా మసులుకోవాలి? భార్యపట్ల ఎలా ఉండాలి? గురువులను ఎలా గౌరవించాలి? సోదరులు, మిత్రులు, ప్రజలు, శత్రువులతో ఎలా ప్రవర్తించాలి? అనే విషయాలను రాముని జీవితం మనకు నేర్పుతుంది. ఆయన ధర్మ స్వరూపుడు. అందుకే ఆయనను ఆదర్శంగా తీసుకుంటే మనం ధర్మమార్గంలో నడవగలం.
“జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి” అని తల్లి, మాతృభూమి స్వర్గం కంటే గొప్పదని రాముడు తెలిపాడు. ఈ మాట నాటికే కాదు, నేటికీ, ఏనాటికీ సత్యమే.
తండ్రి ఇచ్చిన వరాల గురించి తెలిపిన కైకేయితో రాముడు, “వ్యక్తికి జన్మనిచ్చిన తండ్రి ప్రత్యక్ష దైవమే. ఆయన సజీవుడై ఉండగా ఆయనకు అనుకూలంగా ప్రవర్తించడమే కర్తవ్యం. ఆయన మాట పాటించడం కంటే వేరే ధర్మం లేదు” అని అన్నాడు.
కౌసల్యాదేవికి భర్తను పూజించే స్త్రీకి ఉత్తమ గతి కలుగుతుందని, భర్తను అనుసరించడమే స్త్రీధర్మమని ఉపదేశించాడు. తండ్రిపట్ల పుత్రుడు, భర్తపట్ల భార్య ఎలా ఉండాలో ఆయన చూపించాడు.
భార్యపట్ల భర్త ఎలా ఉండాలో కూడా రాముడు ఆదర్శంగా నిలిచాడు. సీతాదేవిపై అపార గౌరవం, ప్రేమ చూపించాడు. తనకు అపకారం చేసిన కైకేయిని కూడా నిందించలేదు.
భరతుని పట్ల ఆయన ప్రేమ అపారమైనది. శ్రీరాముని పట్టాభిషేకం గురించి ప్రజల అభిప్రాయం కోరినప్పుడు, ప్రజలు రాముడు తమ కష్టాన్ని తన కష్టంగా భావిస్తాడని ప్రశంసించారు.
ఆటవికుడైన గుహతో, వానరుడైన సుగ్రీవునితో, రాక్షసుడైన విభీషణునితో రాముడు ప్రవర్తించిన విధానం స్నేహబంధాల విలువను తెలియజేస్తుంది.
వాలిని సంహరించిన సందర్భంలో వచ్చిన విమర్శలను సహనంతో స్వీకరించి, తన ధర్మాన్ని వివరించాడు. యుద్ధరంగంలో అలసిపోయిన రావణునికి, “వెళ్ళి విశ్రాంతి తీసుకుని రేపు రా” అని చెప్పడం ద్వారా శత్రువుపై కూడా కరుణ చూపించాడు. మరణించిన వాలి, రావణులకు సక్రమ అంత్యక్రియలు జరిపించాడు. శత్రువు మరణించిన తర్వాత ద్వేషం చూపకూడదని ఆచరణలో చూపించాడు.
విశ్వామిత్రుని పాదాలను పూజించి గురుభక్తిని తెలియజేశాడు. ఇలా ప్రతి వ్యక్తితో ధర్మబద్ధంగా ప్రవర్తించి, శ్రీరాముడు “మర్యాద పురుషోత్తముడు” అనే ఖ్యాతిని పొందాడు. మనుషులు ఎలా బ్రతకాలో నేర్పిన వాడయ్యాడు.
ఇదే శ్రీరాముని అవతారానికి ప్రధాన లక్ష్యం.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

