వైశాఖ పురాణం 25 వ అధ్యాయము
నారదుడు అంబరీష మహారాజుతో శంఖుడు మరియు కిరాతుడి మధ్య జరిగిన సంభాషణను ఇలా కొనసాగించాడు. శంఖ మహాముని మాటలు విన్న కిరాతుడు.. స్వామీ, ఈ లోకంలో భగవంతుడు సృష్టించిన కోట్ల కొలది జీవులు రకరకాల స్వభావాలతో, వేర్వేరు దారుల్లో ఎందుకు ఉంటున్నారు? దీనికి అసలు కారణం ఏంటి అని అడిగాడు. అప్పుడు శంఖుడు ఇలా వివరించాడు. నాయనా! సత్వ, రజో, తమో అనే మూడు గుణాల వల్లే జీవులు ఏర్పడ్డారు. ఎవరి గుణాన్ని బట్టి వారు ఆయా పనులు చేస్తూ ఉంటారు. తాము చేసే కర్మలను బట్టి ఈ గుణాల పాళ్లు మారుతుంటాయి. ఎక్కువ పుణ్యం చేస్తే ఎక్కువ సుఖం, పాపం చేస్తే దుఃఖం కలగడం సహజం. తామస గుణం ఉన్నవారు క్రూరంగా ఉంటూ రాక్షస, పిశాచ జన్మలు పొందుతుంటారు. రాజస గుణం ఉన్నవారు పుణ్యపాపాలు రెండూ చేస్తూ స్వర్గ నరకాల మధ్య తిరుగుతుంటారు. ఇక సాత్విక గుణం ఉన్నవారు దయ, జాలి కలిగి ఉత్తమ లోకాలను చేరుకుంటారు. భగవంతుడు అందరినీ సమానంగానే చూస్తాడు, కానీ జీవుల కర్మల బట్టే ఫలితాలు ఉంటాయి. ఒక తోటమాలి అన్ని చెట్లకు ఒకేలా నీళ్లు పోసినా, అది ముళ్ల చెట్టా లేక పండ్ల చెట్టా అనేది ఆ విత్తనం మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు ఆ తోటమాలి వంటి వాడు, మన కర్మలే ఆ విత్తనాలు.
ముక్తి ఎప్పుడు కలుగుతుంది అని కిరాతుడు అడగగా, శంఖుడు బ్రహ్మదేవుడి కాలమానం గురించి చెప్పాడు. నాలుగు వేల యుగాలు బ్రహ్మకు ఒక పగలు, మరో నాలుగు వేల యుగాలు ఒక రాత్రి. ఇలా వంద ఏళ్లు గడిస్తే ఒక బ్రహ్మ కల్పం అంటారు. ప్రళయాలు మూడు రకాలుగా ఉంటాయి. మనుషులు మాత్రమే నశించేది మానవ ప్రళయం, బ్రహ్మ నిద్రపోయినప్పుడు లోకాలు నశించేది దిన ప్రళయం, బ్రహ్మ వంద ఏళ్లు పూర్తి అయ్యాక వచ్చేది బ్రహ్మ ప్రళయం. మన్వంతర ప్రళయంలో మూడు లోకాలు మాత్రమే నశిస్తాయి, మళ్ళీ సృష్టి మొదలవుతుంది. శ్రీమహావిష్ణువు కన్ను మూస్తే ఒక కల్పం ముగిసి బ్రహ్మకు రాత్రి అవుతుంది, ఆయన కన్ను తెరిస్తే మళ్ళీ సృష్టి మొదలవుతుంది. విష్ణుమూర్తి తనలోని వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ అనే నాలుగు వ్యూహాల ద్వారా సృష్టి, స్థితి, లయలను నిర్వహిస్తుంటాడు. ఈ రహస్యాలన్నీ తెలుసుకున్న జ్ఞాని మాత్రమే సంసార బంధాల నుండి విముక్తుడవుతాడు.
భాగవత ధర్మాలు అంటే ఏంటని కిరాతుడు అడగగా.. ఏ పనులు చేస్తే చిత్తశుద్ధి కలిగి ఇతరులకు మేలు జరుగుతుందో అవే సాత్విక ధర్మాలు అని శంఖుడు చెప్పాడు. తన వర్ణానికి, ఆశ్రమానికి తగిన పనులు చేస్తూ ఆ ఫలితాన్ని భగవంతుడికి అర్పించేవాడే నిజమైన భాగవతుడు. ఎవరి మనసు విష్ణువు మీద, నాలుక హరి నామం మీద, హృదయం ఆయన పాదాల మీద ఉంటుందో వారే నిజమైన భక్తులు. సజ్జనుల మనసు సూర్యకాంత శిల లాంటిది, జ్ఞానమనే సూర్య కిరణాలు తగలగానే అది ప్రకాశిస్తుంది. వెన్నను మధించి తీసినట్లుగా, అన్ని ధర్మాల సారం వైశాఖ ధర్మాలే అని సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పాడు. వైశాఖ మాసంలో బాటసారులకు నీడ నిచ్చే మండపాలు కట్టడం, చలివేంద్రాలు పెట్టడం, విసనకర్రలు, గొడుగులు, చెప్పులు, గంధం దానం చేయడం వంటివి చాలా ముఖ్యం. సాయంత్రం వేళ పానకం, పండ్లు, తాంబూలం, పాలు, మజ్జిగ వంటివి ఇవ్వాలి. శక్తి ఉంటే బావులు, చెరువులు తవ్వించాలి.
వైశాఖ మాసంలో కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలి. నూనె స్నానం చేయకూడదు, కంచు పాత్రలో భోజనం చేయకూడదు. ఉల్లి, వెల్లుల్లి, సొరకాయ, నువ్వుల పిండి, చద్ది అన్నం, నేతి బీరకాయ వంటివి తినకూడదు. బచ్చలకూర, ములగకాడలు, ఉలవలు, చిరుశెనగలు కూడా నిషిద్ధం. పొరపాటున వీటిని తింటే నీచ జన్మలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. నెలంతా భక్తితో లక్ష్మీనారాయణులను పూజించి, ఆ విగ్రహాన్ని బ్రాహ్మణులకు దానమివ్వాలి. వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగన్నం, నీళ్ల కుండ, తాంబూలం దానం చేస్తే యమధర్మరాజు శాంతిస్తాడు. ఈ విధంగా వ్రతం ఆచరించిన వారు ఇహలోకంలో సుఖపడి, చనిపోయాక విష్ణులోకానికి వెళ్తారని శంఖుడు వివరించాడు.
నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మాస విశిష్టతను ఇలా కొనసాగించారు. శంఖ ముని కిరాతుడికి వైశాఖ ధర్మాల గురించి వివరిస్తూ.. చల్లని నీటిని, పెరుగు కలిపిన అన్నాన్ని ఒక కంచు పాత్రలో ఉంచి, దానికి దక్షిణ, తాంబూలం, పిండివంటలు, పండ్లను జతచేసి పిల్లలున్న బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని చెప్పారు. దీనితో పాటు గోదానం కూడా చేస్తే శ్రీహరి లోకం లభిస్తుందని వివరించారు. ఎటువంటి ఆడంబరం కానీ, కపటం కానీ లేకుండా మనస్ఫూర్తిగా వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తే, ఆ వ్యక్తి చేసిన పాపాలన్నీ పోవడమే కాకుండా అతని వంశంలో వంద తరాల వారికి పుణ్యలోకాలు దక్కుతాయని తెలిపారు. ఇలాంటి పుణ్యకార్యాలు చేసిన వారు మరణించిన తర్వాత సూర్యలోకాన్ని, ఆపై శ్రీమహావిష్ణువు నివసించే వైకుంఠాన్ని చేరుకుంటారని శంఖ ముని వివరించారు.
శంఖ మహాముని కిరాతుడికి ఈ విషయాలన్నీ చెబుతుండగా అక్కడ ఒక వింత జరిగింది. హఠాత్తుగా ఐదు కొమ్మలు ఉన్న ఒక పెద్ద మర్రిచెట్టు నేలకూలిపోయింది. ఆ చెట్టు తొర్రలో నుండి ఒక పెద్ద శరీరమున్న భయంకరమైన పాము బయటకు వచ్చింది. కానీ అందరూ ఆశ్చర్యపోయేలా ఆ పాము వెంటనే తన సర్ప రూపాన్ని వదిలేసి, ఒక దివ్య పురుషుడిలా మారి శంఖ ముని ముందు తలవంచి నమస్కరించింది. ఈ విషయాలన్నీ శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుకు వివరించగా, నారద మహర్షి ఈ వృత్తాంతాన్ని అంబరీష మహారాజుకు తెలియజేశారు.
వైశాఖ పురాణం ఇరవై ఐదవ అధ్యాయము సంపూర్ణము.
ఇరవై ఆరవ అధ్యాయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వైశాఖ పురాణం 1-30 అధ్యాయాలు

వైశాఖ పురాణము (Vaisakha Puranam) లోని అధ్యాయములు:
2వ అధ్యాయం – వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు – వాటి ఫలితములు
3వ అధ్యాయం – వివిధ దానములు – వాటి మహత్యములు
4వ అధ్యాయం – వైశాఖ ధర్మ ప్రశంస
5వ అధ్యాయం – వైశాఖమాస విశిష్టత
6వ అధ్యాయం – జలదాన మహత్యము – గృహగోధికా కథ
10వ అధ్యాయం – దక్షయజ్ఞ నాశము – కామదహనము
11వ అధ్యాయం – రతి దుఃఖము – దేవతల ఊరడింపు
13వ అధ్యాయం – అశూన్య శయన వ్రతము
17వ అధ్యాయం – యమ దుఃఖ నిరూపణము
18వ అధ్యాయం – విష్ణువు యముని ఊరడించుట
19వ అధ్యాయం – పిశాచత్వ విముక్తి
20వ అధ్యాయం – పాంచాలరాజు రాజ్యప్రాప్తి
21వ అధ్యాయం – పాంచాలరాజు సాయుజ్యము
22వ అధ్యాయం – దంతిల కోహల శాపవిముక్తి
23వ అధ్యాయం – కిరాతుని పూర్వజన్మ
27వ అధ్యాయం – కలిధర్మములు – పితృముక్తి
28వ అధ్యాయం – అక్షయతృతీయ విశిష్టత
29వ అధ్యాయం – శునీ మోక్షప్రాప్తి
30వ అధ్యాయం – పుష్కరిణి – ఫలశ్రుతి
శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన వైశాఖ మాసంలో సూర్యోదయ సమయమున నదీస్నానం ఆచరించి, పూజలు, జపాలు, దానాలు భక్తితో నిర్వహించి, వైశాఖ పురాణాన్ని పఠించినవారిపై శ్రీహరి ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహంతో భక్తులకు పాప విముక్తి కలిగి, వైకుంఠ ప్రాప్తి సాధ్యమగును. 🙏


