శ్రీ మహాగౌరీ దేవి – శాంతి, పవిత్రతకు ప్రతిరూపం
నవరాత్రులలో ఎనిమిదవ రోజైన ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. ఈమె ఎంతో ప్రశాంతమైన, పవిత్రమైన రూపంలో దర్శనమిస్తుంది. మహాగౌరి అమ్మవారి శరీరకాంతి తెల్లగా, చంద్రుడిలా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈమె తెల్లని వస్త్రాలను ధరించి, తెల్లని వృషభంపై (ఎద్దుపై) కూర్చుని దర్శనమిస్తుంది. అందుకే ఈమెకు మహాగౌరి అనే పేరు వచ్చింది.
మహాగౌరీ నాలుగు చేతులతో ఉంటుంది. కుడిచేయి అభయముద్రలో ఉండగా, కింది కుడి చేతిలో త్రిశూలం ఉంటుంది. కింది ఎడమ చేతిలో ఢమరుకం ఉండగా, పై ఎడమ చేయి దీవిస్తున్నట్టుగా ఉంటుంది. పార్వతీదేవి శివుడిని తన భర్తగా పొందడంకోసం, నారదుడు ఇచ్చిన సలహాతో, అనేక సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తుంది. దాంతో పార్వతి శరీరం దుమ్ము, ధూళి, చెట్ల ఆకులతో నిండిపోయి, దేహం నల్లబడుతుంది.
ప్రసన్నుడైన శివుడు గంగాజలముతో అభిషేకించగా, ఆమె శరీరం గౌరవర్ణం అంటే అద్భుతమైన తెలుపు వర్ణంతో, విద్యుత్తు కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా పిలుస్తారు. ఈమెను ఉపాసించిన భక్తుల పాపాలన్నీ తొలగిపోతాయి. మహాగౌరిని ఉపాసన చేయడం వల్ల అసంభవములైన కార్యాలు కూడా సంభవమవుతాయి.
మహాగౌరి అమ్మవారు పవిత్రత, శాంతి, కరుణ, మంగళానికి ప్రతీకగా భావించబడతారు. ఆమెను పూజించడం వల్ల భక్తుల జీవితంలో శుభఫలితాలు కలుగుతాయని, కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని నమ్ముతారు.
అందుకే నవరాత్రుల్లో ఎనిమిదవ రోజున మహాగౌరి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి, ఆమె అనుగ్రహాన్ని కోరుకుందాం. అమ్మవారి కృపతో మన కుటుంబంలో సుఖశాంతులు, శుభాలు, ఐశ్వర్యం కలగాలని ప్రార్థిద్దాం.
ధ్యాన శ్లోకం:
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః |
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా || 8 ||
అర్థం:
తెల్లని వృషభంపై కూర్చుని, తెల్లని వస్త్రాలను ధరించి, ఎంతో పవిత్రంగా, నిర్మలంగా ఉన్న మహాగౌరీ అమ్మవారు నాకు ఎల్లప్పుడూ శుభాలను ప్రసాదించాలి.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏








