భగవద్గీత 7 వ అధ్యాయం –జ్ఞాన విజ్ఞాన యోగము

Bhagavadgita meaning in telugu

7 వ అధ్యాయం  -జ్ఞాన విజ్ఞాన యోగము

అర్జునా ! బ్రహ్మజ్ఞానాన్ని గురించి నేను నీకు సంపూర్ణంగా చెబుతాను. దీనిని గ్రహిస్తే ఈ లోకంలో నీవు మళ్ళీ తెలుసుకోదగిందేమి వుండదు. ఎన్నో వేలమందిలో, ఏ ఒక్కడో, యోగసిద్ది కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి సాధకులైన వాళ్ళలో కూడా, నన్ను నిజంగా తెలుసుకున్న వాడు ఏ ఒక్కడో వుంటాడు. నా మాయాశక్తి ఎనిమిది విధాలుగా విభజించబడినది. అవి భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ది, అహంకారం. సర్వ జగత్తు ఆవిర్భవించడానికి, అంతం కావడానికి కారణం నేనే.
నా కంటే ఉత్కృష్టమైన దేదీ లేదు. దారం హారంగా మణులను కలిపి నిలిపినట్లు, నేనే ఈ సమస్త జగత్తునీ ధరిస్తున్నాను. నేను నీటిలో రుచిగా, సూర్యచంద్రులలో కాంతిగా, సర్వవేదాలలో ఓంకారంగా, ఆకాశంలో శబ్ధంగా, నరులలో పురుషుడిగా వున్నాను. నేలలోని సుగంధం, నిప్పులోని తేజస్సు, సర్వభూతాలలోని ఆయుష్షు,  తపోధనులలోని తపస్సు నేనే. పార్ధ! సమస్త జీవులకూ మూలకారణం నేనే అని తెలుసుకో. బుద్దిమంతులలోని బుద్ది, తేజోవంతులలోని తేజస్సు నేనే. ప్రాణులలోని ధర్మవిరుద్ధం కాని కామాన్ని నేనే. సాత్విక, రాజసిక, తామసిక భావనలన్నీ నా వల్లనే కలిగాయని తెలుసుకో. వాటిలో నేను లేను. నాలోనే అవి వున్నాయి. త్రిగుణ స్వరూపమైన ఈ నా దైవమాయను దాటడం, సామాన్యులకు సాధ్యపడదు. అయితే నన్నే ఆశ్రయించినవాళ్ళు దానిని అతిక్రమిస్తారు.
పాపాత్ములు, మూఢులు, మానవాధములు మాయలోపడి, వివేకం కోల్పోయినవాళ్ళు రాక్షస భావాలను ఆశ్రయించినవాళ్ళు నన్ను పొందలేరు. నన్ను సేవించే పుణ్యపురుషులు నాలుగు రకాలు. ఆపదలో వున్నవాడు, ఆత్మతత్వం తెలుసుకోగోరేవాడు, సిరిసంపదలు కోరేవాడు, ఆత్మజ్ఞానం కలిగినవాడు. ఈ నలుగురిలో, నిత్యమూ భగవంతుణ్ణి భక్తితో భజించే ఆత్మజ్ఞాని ఆత్యుత్తముడు.
వీళ్ళంతా గొప్పవాళ్ళే అయినప్పటికీ జ్ఞాని మాత్రం నా ఆత్మ స్వరూపుడే అని నా అభిప్రాయం. ఎందువల్లనంటే అతను నన్నే పరమగతిగా భావించి సేవిస్తాడు. అనేక జన్మలలో ఆచరించిన పుణ్యకర్మల ఫలితంగా, జ్ఞాని జగత్తు సర్వమూ వాసుదేవ మయము అనే జ్ఞానంతో నన్నాశ్రయిస్తాడు. ఈ లోకంలో అలాంటి మహానుభావులు చాలా అరుదు. తమ తమ పూర్వ జన్మల సంస్కారాలకు సంబంధించిన కోరికల మూలంగా, వివేకం కోల్పోయిన కొందరు, ఇతర దేవతలను వాళ్ళకు తగిన నియమాలతో ఉపాసిస్తున్నారు.
అలాంటి శ్రద్దా భక్తులతో ఆ దేవతామూర్తిని ఆరాధించినవాడు, నేను కలగజేసే కామితార్ధాలనే, ఆ దేవత ద్వారా పొందుతున్నాడు. మందబుద్దులైన ఈ మానవులు పొందే ఫలితాలు ఆశాశాశ్వతాలు. అవివేకులు… శాశ్వతం, సర్వోత్తమం అయిన నా స్వరూపాన్ని గుర్తించలేక, నన్ను మానవమాత్రుడిగా తలుస్తారు.
యోగమాయచేత కప్పబడివున్న నేను అందరికి కనబడడం లేదు. మూఢ ప్రపంచం నన్ను పుట్టుక, నాశనం లేనివాడినని తెలుసుకోలేకపోతున్నది. భూతభవిష్యద్వర్ధమాన కాలాలకు సంబంధించిన జీవులందరు నాకు తెలుసు. అయితే నేనే ఒక్కడికీ తెలియను. సమస్త భూతాలు, పుట్టుకతోనే అనురాగ ద్వేషాల మూలంగా కలిగే సుఖదుఃఖాలవల్ల, మోహంలో మునిగి, అజ్ఞానంలో పడుతున్నాయి. ముసలితనం, మృత్యువుల నుంచి ముక్తి పొందడానికి నన్ను ఆశ్రయించే వాళ్ళు, పరబ్రహ్మ తత్వాన్ని, ఆత్మ స్వరూపాన్ని సమస్త కర్మలనూ గ్రహించగలుగుతారు.

మిగిలిన అధ్యాయాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ⬇️

1 వ అధ్యాయం – అర్జున విషాద యోగం
2 వ అధ్యాయం – సాంఖ్య యోగం
3 వ అధ్యాయం – కర్మ యోగం
4 వ అధ్యాయం -జ్ఞాన యోగం
5 వ అధ్యాయం – కర్మసన్యాస యోగము
6 వ అధ్యాయం – ఆత్మ సంయమ యోగము
7 వ అధ్యాయం  -జ్ఞాన విజ్ఞాన యోగము
8 వ అధ్యాయం –అక్షర పరబ్రహ్మ యోగము
9  వ అధ్యాయం – రాజ విద్య రాజగుహ్య యోగము
10  వ అధ్యాయం –విభూతి యోగము
11  వ అధ్యాయం –విశ్వరూప సందర్శన యోగము
12  వ అధ్యాయం – భక్తి యోగము
13  వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము
14  వ అధ్యాయం – గుణత్రయ విభాగయోగము
15  వ అధ్యాయం- పురుషోత్తమప్రాప్తి యోగము
16  వ అధ్యాయం- దైవాసుర సంపద్విభాగయోగము
17  వ అధ్యాయం – శ్రద్దాత్రయ విభాగ యోగము
18  వ అధ్యాయం – మోక్షసన్యాస యోగము
Tags: , , , , , , , , , , ,