అప్పుడు అర్జునుడు “కృష్ణా ! ఒకసారి కర్మ సన్యాసం చేయమనీ, మరొసారి కర్మయోగం ఆచరించమని ఉపదేశిస్తున్నావు. ఈ రెండింటిలో ఏది మంచిదో నాకు తేల్చి చెప్పు” అని అడిగాడు.
దానికి సమాధానంగా శ్రీ భగవానుడు “కర్మత్యాగమూ, కర్మయోగమూ కూడా మోక్షం కలుగజేస్తాయి. అయితే ఈ రెండింటిలో నిష్కామకర్మయోగం మేలు. దేనిమీద కోపం, ద్వేషం లేనివాడు నిత్య సన్యాసి. సుఖదుఃఖాది ద్వంద్వాలు లేకుండా, అలాంటివాడు సులభంగా భవబంధాల నుంచి విముక్తి పొందుతాడు. జ్ఞానం వేరూ, కర్మయోగం వేరూ అని ఆవివేకులే తప్ప వివేకులు చెప్పరు. ఈ రెండింటిలో చక్కగా ఏ ఒక్కదాన్ని ఆచరించినా మోక్షం లభిస్తుంది. జ్ఞాన యోగులు పొందే కర్మ ఫలమే కర్మ యోగులు పొందుతారు. జ్ఞానయోగం, కర్మయోగం ఒకటే అని గ్రహించినవాడే నిజమైన జ్ఞాని. అర్జునా! కర్మయోగం అవలంబించకుండా సన్యాసం పొందడం సాధ్యపడేది కాదు. నిష్కామకర్మ చేసే ముని, అచిర కాలంలో బ్రహ్మ సాక్షాత్కారం పొందుతాడు. నిష్కామ కర్మాచరణం, నిర్మలహృదయం, మనోజయం, ఇంద్రియ నిగ్రహం కలిగి, సమస్త జీవులలో వుండే ఆత్మ ఒక్కటే అని తెలుసుకున్నవాడు, కర్మలు చేసినా ఎలాంటి దొషమూ అంటదు. పరమార్ధతత్వం తెలిసిన కర్మయోగి, తానేమీ చేయడం లేదనే తలుస్తాడు. చూడడంలో, వినడంలో, తాకడంలో, వాసన చూడడంలో, తినడంలో, నడవడంలో, ఊపిరి పీల్చడంలో, మాట్లాడడంలో, గ్రహించడంలో, కళ్ళు తెరవడంలో, మూయడంలో ఆయా ఇంద్రియాలే వాటి వాటి విషయాలలో ప్రవర్తిస్తున్నాయని అతను తెలుసుకోవడమే, దీనికి కారణం. నిష్కామకర్మయోగి కర్మఫలాన్ని విడిచిపెట్టి ఆత్మజ్ఞానం వల్ల కలిగే శాశ్వతమైన శాంతి పొందుతాడు. అలా కాకుండా ఫలాపేక్షతో కర్మలు చేసేవాడు కర్మబంధంలో చిక్కుకుంటాడు.
నిష్కామకర్మయోగి కర్మఫలాన్ని విడిచిపెట్టి, ఆత్మజ్ఞానం వల్ల కలిగే శాశ్వతమైన శాంతి పొందుతాడు. అలా కాకుండా ఫలాపేక్షతో కర్మలు చేసేవాడు, కర్మబంధంలో చిక్కుకుంటాడు. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు మనస్సుతో కర్మలన్నీటిని వదిలిపెట్టి, తాను ఏమి చేయకుండా, ఇతరుల చేత చేయించకుండా, తొమ్మిది ద్వారాలుండే శరీరమనే పట్టణంలో హాయిగా ఉంటాడు. భగవంతుడికి ఎవరి పాపపుణ్యాలతో ప్రమేయం లేదు. జ్ఞానాన్ని అజ్ఞానం ఆవరించడం వల్ల, జీవులకు అలాంటి భ్రమ కలుగుతుంది. ఆత్మజ్ఞానంతో అజ్ఞానాన్ని రూపుమాపుకున్న వాళ్లు, సూర్యుడు కాంతి లాంటి తమ జ్ఞానంతో, పరబ్రహ్మ స్వరూపాన్ని సాక్షాత్కరింపచేసుకుంటారు.
ఆ పరమాత్మ మీదే బుద్దిని, మనస్సునూ నిలిపిన వాళ్ళు ఆ పరాత్పరుని మీదే ఆసక్తి కలిగిన వాళ్లూ, జ్ఞానంతో పాటు పాపాలను పోగొట్టుకొని పునఃజన్మ లేని మోక్షం పొందుతారు. విద్యా వినయాలు కలిగిన బ్రహ్మణుడిని, గోవును, ఏనుగును, కుక్కను, చండాలుడిని ఆత్మజ్ఞానులు సమదృష్టితో చూస్తారు. సర్వభూతాలనూ నిశ్చల మనస్సుతో సమభావంతో సందర్శించిన వాళ్ళు, సంసార బంధాన్ని ఈ జన్మలోనే జయిస్తారు. మోహం లేకుండా నిశ్చలమైన బుద్ది వున్న బ్రహ్మవేత్త, ఇష్టమైనది సంప్రాప్తించినప్పుడు సంతోషించడు. ఇష్టం లేనిది సంభవించినప్పుడు విచారించడు. బ్రహ్మంలోనే నిరంతరం లీనమై వుంటాడు. ప్రపంచ సుఖాలమీద ఆసక్తి లేనివాడు, శాశ్వతమైన ఆనందం పొందుతాడు. ఇంద్రియ లోలత్వం అనుభవించే బాహ్య సుఖాలు దుఃఖహేతువులు, క్షీణికాలు. కామ క్రోధాల వల్ల కలిగే ఉద్రేకాన్ని జీవితకాలంలో అణగదోక్కిన వాడే యోగి, సుఖవంతుడు. ఆత్మలోనే ఆనందిస్తూ, ఆత్మలోనే క్రీడిస్తూ, ఆత్మలోనే ప్రకాశిస్తూ వుండే యోగి, బ్రహ్మస్వరూపుడై బ్రహ్మనందం పొందుతాడు. సంశయాలను తొలగించుకొని, మనో నిగ్రహంతో సకల ప్రాణులకు మేలు చేయడంలో ఆసక్తి కలిగిన ఋషులు, పాపాలన్నిటినీ పోగొట్టుకొని, బ్రహ్మ సాక్షాత్కారం పొందుతారు.
కామక్రోధాలను విడిచిపెట్టి, మనస్సును జయించిన, ఆత్మజ్ఞాన సంపన్నులైన సన్యాసులకు సర్వత్రా మోక్షం కలుగుతుంది. బాహ్య విషయాల మీద ఆలోచనలు లేకుండా, దృష్టిని కనుబొమ్మల మధ్య నిలిపి, ముక్కు లోపల సంచరించే ప్రాణాపాన వాయువులను సమానం చేసి, ఇంద్రియాలనూ, మనస్సునూ, బుద్దినీ వశపరచుకొని, మోక్షమే పరమ లక్ష్యంగా ఆశ, క్రోధం, భయం విడిచిపెట్టిన ముని అనంతరమూ ముక్తుడై వుంటాడు. యజ్ఞాలకూ, తపస్సుకూ, భోక్తననీ, సర్వ లోకాలకూ ప్రభువుననీ, సమస్త ప్రాణులకూ మిత్రుడననీ నన్ను తెలుసుకున్నవాడు పరమశాంతి పొందుతాడు.