అప్పుడు అర్జునుడు “జనార్ధన ! కర్మకంటే జ్ఞానమే మేలని నీ వుద్దేశమా. అలాంటప్పుడు ఘోరమైన ఈ యుద్దకర్మ కు నన్నెందుకు వురికొల్పుతున్నావు. అటు యిటూ కాని మాటలతో, నా మనసుకు మరింత కలత కలగజేస్తున్నావు. అలా కాకుండా, నాకు మేలు చేకూర్చే మార్గం ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పు” అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణభగవానుడు “అర్జునా! గతంలో నేను చెప్పిన రెండు మార్గాలూ లోకంలో వున్నాయి. అవి సాంఖ్యూలకు జ్ఞానయోగం. యోగులకు నిష్కామ కర్మయోగం. కర్మలు చేయనంతమాత్రాన పురుషుడు కర్మ బంధాలకు దూరంగా ఉండలేడు. కేవలం కర్మసన్యాసం వల్ల కూడా ఆత్మజ్ఞానం లభించదు. ప్రకృతి గుణాల ప్రభావాలకు లోనై ప్రతివాళ్ళు అస్వతంత్రులై కర్మలు చేస్తునే వున్నారు. పైకి కర్మేంద్రియాలను అణిచిపెట్టి, మనసులో మాత్రం విషయ సౌఖ్యాల గురించి ఆలోచించే ఆవివేకిని, కపటాచారం కలవాడు అంటారు. అర్జునా! మనసుతో జ్ఞానేంద్రియాలను స్వాధీనంలోకి పుంచుకొని, కర్మేంద్రియాల ద్వారా నిష్కామకర్మ చేస్తున్నవాడు ఉత్తముడు.
నీ కర్తవ్య కర్మ నీవు ఆచరించవలసిందే. కర్మలు విడిచిపెట్టడం కంటే చేయడమే శ్రేయస్కరం. కర్మలు చేయకుండా నీవు జీవయాత్ర కూడా సాగించలేవు. యాగసంబంధమైనవి తప్ప తక్కిన కర్మలన్ని, మానవులకు సంసారబంధం కలగజేస్తాయి. కనుక ఫలాపేక్ష లేకుండా, దైవప్రీతి కోసం కర్మలు ఆచరించు. ప్రాచీనకాలంలో ప్రజలనూ, యాగాలను సృష్టించి ప్రజాపతి ఇలా అన్నాడు. యజ్ఞం కోర్కెలను నెరవేర్చే కామధేనువు. దీనివల్ల మీరు పురోభివృద్ది చెందండి. యజ్ఞయాగాదులతో మీరు దేవతలను సంతృప్తి పరచండి. పాడిపంటలు లాంటి సంపదలిచ్చి, వారు మీకు సంతోషం కలగజేస్తారు. దేవతలిచ్చిన సుఖభోగాలు అనుభవిస్తూ, వారికి మళ్ళీ ఆ సంపదలోనే కొంత కూడా అర్పించనివాడు దొంగ. యజ్ఞాలు చేసి దేవతలకు అర్పించగా మిగిలిన పదార్ధాలు భుజించే సజ్జనులు, సర్వపాపాల నుంచి విముక్తు లవుతున్నారు. అలా కాకుండా తమ కోసమే వండుకుంటున్న వాళ్లు పాపమే తింటున్నారు. అన్నంవల్ల సర్వప్రాణులు వుడుతున్నాయి. వర్షం వల్ల అన్నం లభిస్తున్నది. యజ్ఞం మూలంగా వర్షం కలుగుతున్నది. యజ్ఞం సత్కర్మల వల్ల సంభవిస్తుంది. అంతటా వ్యాపించిన పరమాత్మ యజ్ఞంలో ఎప్పుడూ వుంటాడు. ఇలా తిరుగుతున్న జగత్ చక్రాన్ని అనుసరించనివాడు పాపి, ఇంద్రియలోలుడు. అలాంటివాడి జీవితం వ్యర్ధం. ఆత్మలోనే ఆసక్తి, సంతృప్తి, సంతోషం పొందేవాడికి విద్యుక్తకర్మ లేవీ వుండవు. స్వార్ధదృష్టితో సృష్టిలో దేనినీ అతను ఆశ్రయించడు. అందువల్ల నిరంతరం నిష్కామంగా కర్మలు ఆచరించు. అలా ఫలా పేక్ష లేకుండా కర్మలు చేసేవాళ్లకు మోక్షం కలుగుతుంది. జనకుడు మొదలైనవారు నిష్కామకర్మతోనే మోక్షం పొందారు. లోకక్షేమం కోసమైనా నీవు సత్కర్మలు చేయాలి. ఉత్తముడు చేసిన పనినే ఇతరులు కూడా అనుకరిస్తారు. ముల్లోకాలలోనూ నేను చేయవలసిన పని ఏమి లేదు.
నాకు లేనిది కాని కావలసింది కాని ఏమి లేకపోయినప్పటికీ లోకవ్యవహారాలు నిత్యమూ నిర్వహిస్తూనే వున్నాను. ఏ మాత్రమూ ఏమరపాటు లేకుండా నేను నిరంతరం కర్మలు చేయకపోతే ప్రజలంతా అలాగే ప్రవర్తిస్తారు. నేను కర్మలు ఆపివేస్తే ప్రజలంతా భ్రష్టులైపోతారు. రకరకాల సంకరాలకూ, ప్రజల నాశనానికి నేనే కర్తనవుతాను. అర్జునా! అజ్ఞానులు ఫలితాలు ఆశించి కర్మలు చేసినట్టే ఆత్మజ్ఞానులు ఫలాపేక్ష లేకుండా లోకకళ్యాణం కోసం కర్తవ్య కర్మలు ఆచరించాలి. జ్ఞాని యోగిగా సమస్తకర్మలూ చక్కగా ఆచారిస్తూ, ఇతరుల చేతకూడా చేయించాలి. ప్రకృతి గుణాల వల్ల సర్వకర్మలూ సాగుతుండగా, అజ్ఞాని అహంకారంతో, కర్మలను తానే చేస్తున్నానని తలుస్తాడు.
నీవు చేసే సమస్త కర్మలూ నాకు సమర్పించి, వివేకంతో ఆశా, మమకారాలు విడిచిపెట్టి నిశ్చితంగా యుద్దం చెయ్యి. అసూయ లేకుండా, శ్రద్ధా భక్తులతో నిరంతరం నా ఈ అభిప్రాయం ప్రకారం ప్రవర్తించే మానవులు, కర్మబంధాల నుంచి విముక్తులవుతారు. నేను ఉపదేశించిన ఈ నిష్కామకర్మ యోగా విధానాన్ని నిందించి ఆచరించని వాళ్లు అవివేకులూ, అజ్ఞానులూ, అన్ని విధాలా చెడిపోయిన వాళ్లూ అని తెలుసుకో. ఇంద్రియాలన్నిటికి తమతమ విషయాల పట్ల అనురాగం, ద్వేషం వున్నాయి. ఎవరూ వాటికి వశులు కాకూడదు. అవి మానవులకు బద్దశత్రువులు. ఇతరుల ధర్మం అనుసరించడం కంటే, లోటుపాటులతో అయినా, తన ధర్మం పాటించడమే మేలు. పరధర్మం భయభరితం కావడంవల్ల స్వధర్మాచరణలో మరణమైనా మంచిదే” అన్నాడు.
ఆ మాటలకు అర్జునుడు “కృష్ణా! తనకు ఇష్టం లేకపోయినా మానవుడు దేని బలవంతం వల్ల పాపాలు చేస్తున్నాడు” అన్నాడు. దానికి శ్రీ కృష్ణాభగవానుడు “రజోగుణం వల్ల కలిగిన కామక్రోధాలు అన్ని పాపాలకూ మూలకారణాలు. ఎంత అనుభవించినా తనివితీరని కామమూ, మహాపాతకాలకు దారితీసే క్రోధమూ, ఈ లోకంలో మానవుడికి మహాశత్రువులు. పొగ అగ్నిని, మురికి అద్దాన్ని, మావి గర్భంలోని శిశువుని కప్పివేసినట్లు కామం ఆత్మజ్ఞానాన్ని అవరించింది. ఎంతకీ తృప్తి ఎరుగని అగ్ని లాంటి కామం, జ్ఞానులకు నిత్య శత్రువు. ఈ కామానికి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఆశ్రయాలని చెబుతారు. అందువల్ల మొట్టమొదట ఇంద్రియాలను నీ చెప్పుచేతల్లో వుంచుకొని, జ్ఞానవిజ్ఞానాలను నాశనం చేసే కామమనే పాపిని పారద్రోలు. దేహం కంటే ఇంద్రియాలు గొప్పవి. మనస్సు ఇంద్రియాలకంటే శ్రేష్టం. బుద్ది మనస్సు కంటే అధికం. అయితే బుద్దిని అధిగమించింది ఆత్మ. ఇలా బుద్దికంటే ఆత్మ గొప్పదని గుర్తించి, బుద్దితోనే మనస్సును నిలకడ చేసుకొని, కామరూపంలో వున్న జయించరాని శత్రువును రూపుమాపు” అన్నాడు.