అర్జునుడు ఇలా పలికాడు. “పురుషోత్తమా! బ్రహ్మమంటే ఏమిటి? ఆధ్యాత్మమంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అధిభూతమూ, అధిదైవమూ అనేవి ఏవి? ఈ శరీరంలో ఆధీయజ్ఞుడు దేవడు ఎలా వుంటాడు? మనో నిగ్రహం కలవాళ్ళు మరణ సమయంలో నిన్నెలా తెలుసుకోగలుగుతారు.
అర్జునుని మాటలు విని శ్రీ కృష్ణ భగవానుడు “సర్వోత్తమం, శాశ్వతమూ అయిన పరమాత్మనే బ్రహ్మ. యజ్ఞ రూపమైన కార్యమే కర్మ. ఈ శరీరంలాంటి నశించే స్వభావం కలిగిన పదార్ధాలను అధిభూతమంటారు. పురుషుడే అధిదైవం. ఈ దేహంలో అంతర్యామి రూపంలో వుండే అధిజ్ఞానిని నేనే. మరణ సమయాలో నన్నే స్మరణ చేస్తూ, శరీరాన్ని విడిచిపెట్టిన వాడు నా స్వరూపాన్నే పొందుతాడు. ఇందులో సందేహమేమి లేదు. అంత్యకాలంలో ఎవడు, ఏ భావాలతో శరీరాన్ని వదులుతాడో, ఆ భావాలకు తగిన స్థితినే పొందుతాడు. అందువల్ల నిరంతరం నన్నే స్మరిస్తూ, యుద్దం చేయి. మనస్సునూ, బుద్దినీ నాకు అర్పిస్తే నీవు నిస్సంశయంగా నన్నే పొందుతావు.
పార్ధ! సర్వమూ తెలిసినవాడు, సనాతనుడు, సకలలోకాలనూ శాసించేవాడు, అయిన పరమేశ్వరుణ్ణి, మరణకాలంలో మనస్సు నిశ్చలంగా పుంచుకొని భక్తిభావంతో, యోగబలంతో, కనుబొమ్మల మధ్య ప్రాణవాయువును బాగా నిలిపి ధ్యానించే వాడు, ఆ దివ్యపురుషుణ్ణి పొందుతాడు. వేదార్ధం తెలిసినవాళ్ళు శాశ్వతమని చెప్పేదీ, కామక్రోధాలను జయించిన యోగులు చేరేది, బ్రహ్మచర్యాన్ని పాటించే వాళ్ళు చేరకోరేదీ అయిన, పరమపదాన్ని గురించి, నీకు క్లుప్తంగా చెబుతాను విను. ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి, మనస్సును హృదయంలో నిలిపి, ప్రాణం శిరస్సులో వుంచి, అక్షరాన్ని ఉచ్చరిస్తూ, నన్నే స్మరిస్తూ, శరీరాన్ని విడిచిపెట్టివాడు మోక్షం పొందుతాడు.
బ్రహ్మలోకం వరకూ వుండే సకలలోకాలూ పునర్జన్మ కలగజేసేవే. నన్ను పొందిన వాళ్ళకు మాత్రం మరోజన్మ లేదు. బ్రహ్మదేవుడి వేయి యుగాలు పగలనీ, ఇంకో వేయి యుగాల కాలం రాత్రి అన్నీ తెలుసుకున్న వాళ్ళే, పరబ్రహ్మ తత్వాన్ని గ్రహిస్తారు. ఈ జీవకోటి, బ్రహ్మకు రాత్రి రావడంతో ప్రకృతిలో లీనమవుతుంది. పగలు కాగానే మళ్ళీ పుడుతుంది.
నాకు నిలయమైన పరమపదాన్ని పొందినవాళ్ళకు మళ్ళీ పునర్జన్మ లేదు. సమస్తభూతాలను తనలో ఇముడ్చుకొని సకల లోకాలలో వ్యాపించి వున్న పరమాత్మను ఆచంచలమైన భక్తి వల్లనే పొందవచ్చు. యోగులు ఏ సమయంలో మరణిస్తే మళ్ళీ జన్మించరో, ఏవేళ దేహం విడిచిపెడితే పునర్జన్మ పొందుతారో చెబుతాను విను. అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షం, ఆరుమసాల ఉత్తరాయణం – వీటిలో మరణించే బ్రహ్మాపాసకులకు బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. రాత్రి, కృష్ణపక్షం, ఆరుమసాల దక్షిణాయనంలో గతించిన యోగి, చంద్రజ్యోతిని పొంది, మళ్ళీ మానవలోకంలోకి వస్తాడు.
శుక్లమార్గంలో పయనించిన వాడికి జన్మరాహిత్యమూ, కృష్ణమార్గంలో పోయినవాడికి పునర్జన్మమూ కలుగుతాయి. నీవు నిరంతరం ధ్యానయోగంలో వుండు. దీనినంతా గ్రహించిన యోగి వేదాలు, యజ్ఞాలు, తపస్సులు, దానాలకు చెప్పబడ్డ పుణ్యఫలాలను అధిగమించి, అనాది అయిన పరమపదం పొందుతాడు.