ఇంకా శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. “వినాశనం లేని ఈ యోగం, పూర్వం నేను సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు మనువుకూ, మనువు ఇక్ష్వాకుడికి బోధించారు. ఇలా సంప్రదాయ పరంపరగా ఇచ్చిన కర్మయోగాన్ని, రాజర్షులు తెలుసుకున్నారు. అయితే, అది ఈ లోకంలో క్రమేపీ కాలగర్భంలో కలిసిపోతుంది. నాకు భక్తుడవూ, స్నేహితుడవూ కావడం వల్ల పురాతనమైన ఈ యోగాన్ని నీకిప్పుడు మళ్ళీ వివరించాను. ఇది ఉత్తమం, రహస్యమూ అయిన జ్ఞానం సుమా! అన్నాడు.
దానికి అర్జునుడు “సూర్యుడి జన్మ చూస్తే ఏనాటిదో. మరి నీవు ఇప్పటివాడవు. అలాంటప్పుడు నీవు సూర్యుడికి ఎలా ఉపదేశించావో ఊహించలేకపోతున్నాను” అన్నాడు. అప్పుడు శ్రీ భగవానుడు “అర్జునా! నాకు, నీకు ఎన్నో జన్మలు గడిచాయి. వాటన్నిటినీ నేను ఎరుగుదును. నీవు మాత్రం ఎరుగవు. జననమరణాలు లేని నేను, సర్వ ప్రాణులకూ ప్రభువును అయినప్పటికి, నా పరమేశ్వర స్వభావం విడిచిపెట్టకుండా, నేను మాయాశక్తి వల్ల జన్మిస్తున్నాను. ఈ లోకంలో ధర్మం అధోగతిపాలై, అధర్మం ప్రబలినప్పుడల్లా నేను ఉద్భవిస్తుంటాను. సజ్జన సంరక్షణకూ, దుర్జన సంహారానికి, ధర్మసంస్థాపనకూ, నేను అన్ని యుగాలలో అవతరిస్తుంటాను. అలౌకికమైన నా అవతార రహస్యం యధార్ధంగా ఎరిగిన వాడు, ఈ శరీరం విడిచిపెట్టాక మళ్ళీ జన్మించడు. నన్నే చేరుతాడు. అనురాగం, భయం, కోపం విడిచిపెట్టి, నన్నే ఆశ్రయించి, నా మీదే మనస్సు లగ్నం చేసినవాళ్ళు ఎంతో మంది, తత్వజ్ఞానమనే తపస్సు వల్ల పవిత్రులై నన్ను పొందారు.
ఎవరు ఎలా నన్ను ఆరాధిస్తారో, వాళ్ళని అలాగే నేను అనుగ్రహిస్తాను. ఈ లోకంలో కర్మలకు ఫలం శీఘ్రంగా సిద్దిస్తుంది. కనుకనే కర్మఫలం ఆశించి, మానవులు దేవతలను ఆరాధిస్తారు. వారి వారి గుణాలకు, కర్మలకు తగ్గట్లుగా, నాలుగు వర్ణాలూ నేనే సృష్టించాను. అయినప్పటికీ వాటికి కర్తనైన నేను శాశ్వతుడనని తెలుసుకో. నన్ను కర్మలంటవనీ, నాకు కర్మఫలాపేక్ష లేదని గ్రహించిన వాడిని, కర్మలు బంధించవు. మోక్షం పట్ల ఆసక్తి కలిగిన పూర్వులు కూడా, ఈ విషయం గుర్తించే కర్మలు చేశారు. కనుక పురాతనకాలం నుంచీ వస్తున్న కర్మ విధానం నీవూ గ్రహించు. పండితులు కూడా కర్మ ఏదో, కర్మ కానిది ఏదో తెలియక తికమకపడుతున్నారు. సంసారబంధాల నుంచి విముక్తి పొందడానికి అవసరమైన కర్మ స్వరూపం వివరిస్తాను విను. కర్మ అంటే ఏమిటో, శాస్త్రాలు నిషేదించిన వికర్మ అంటే ఏమిటో, ఏ పని చేయకపోవడమే అకర్మ అంటే ఏమిటో, తెలుసుకోవడం అవసరం. కర్మతత్వాన్ని గ్రహించడం కష్టసాధ్యం.
ఫలాసక్తి లేకుండా అన్ని కర్మలూ ఆచరించకపోవడంతో పాటు జ్ఞానమనే అగ్నితో పూర్వపు వాసనల్ని నాశనం చేసుకున్న వాడిని పండితుడని పెద్దలు చెబుతారు. కర్మఫలాపేక్ష విడిచి పెట్టి నిత్యం సంతృప్తి తో దేనిమీదా ఆధారపడకుండా కర్మలు చేసేవాడు, వాంఛలు వదిలిపెట్టి చిత్తము, మనస్సు వశపరచుకొని, ఈ వస్తువు నాది అనేది లేకుండా కేవలం శరీరపోషణ కోసం కర్మలు ఆచరించేవాడు పాపం పొందడు. అప్రయత్నంగా లభించిన వస్తువులతో సంతృప్తి చెందుతూ, ఇతరుల మీద ఈర్ష్య పడకుండా, సుఖదుఃఖాలకు లొంగకుండా జయాపజయాల పట్ల సమదృష్టి కలిగినవాడు కర్మలు చేసినా, బంధాలలో చిక్కుకోడు. దేనిమీదా ఆసక్తి లేకుండా విముక్తి పొంది మనస్సును ఆత్మజ్ఞానం మీదే నిలిపినవాడు భగవంతుడి ప్రీతి కోసం కానీ, లోక కళ్యాణార్ధం కానీ చేసే కర్మలన్ని, పూర్తిగా నశించిపోతాయి. యజ్ఞంలోని హోమ సాధనాలు, హోమద్రవ్యాలు, హోమాగ్ని, హోమం చేసేవాడు- పరబ్రహ్మ స్వరూపాలే అని భావించి యజ్ఞకర్మలు ఆచరించేవాడు పరబ్రహ్మని పొందుతాడు.
దేవతలను ఉద్దేశించి కొంత మంది యోగులు యజ్ఞం చేస్తారు. మరి కొంతమంది బ్రహ్మమనే అగ్నిలో ఆత్మచేత తమ ఆత్మనే ఆహుతి చేస్తారు. దానధర్మలే యజ్ఞంగా కొంతమంది, తపస్సే యజ్ఞంగా కొంతమంది, యోగసాధనే యజ్ఞంగా కొంతమంది ఆచరిస్తున్నారు. కార్యదీక్ష, కఠోరవ్రతం కలిగిన మరికొంతమంది వేదాధ్యయనమే యజ్ఞమని భావించి, స్వాధ్యాయ యజ్ఞమూ, జ్ఞానయజ్ఞమూ చేస్తున్నారు. అలాగే ప్రాణాయామపరులు కొంతమంది ప్రాణవాయువు, అపానవాయువుల గతులను నిరోధించి, హోమం చేస్తున్నారు. యజ్ఞాలు తెలిసిన వాళ్ళంతా యజ్ఞాలవల్ల, పాపపంకిలాన్ని ప్రక్షాళనం చేసుకుంటున్నారు. యజ్ఞాలలో మిగిలిన అన్నమనే అమృతాన్ని భుజించేవారు, శాశ్వత పరబ్రహ్మం పొందుతారు. యజ్ఞం ఒకటి చేయని వాడికి ఇహలోక సుఖం లేదు. పరలోకం అస్సలే లేదు. ఈ విధంగా వివిధ యజ్ఞాలూ వేదంలో విశధీకరించబడ్డాయి. ద్రవ్యం వల్ల సాధించబడే యజ్ఞం కంటే జ్ఞానం శ్రేష్టం. సమస్త కర్మలూ జ్ఞానం లోనే పరిసమాప్తం కావడం దీని కారణం. తత్వవేత్తలైన జ్ఞానులు అలాంటి జ్ఞానం నీకు ఉపదేశిస్తారు. వారి వద్దకు వెళ్ళినప్పుడు వినయవిధేయతలతో వారికి నమస్కరించి, సమయం సంధర్బం చూసి ప్రశ్నించి, సేవలు చేసి తెలుసుకో. ఆ భావం తెలుసుకుంటే నీవు మళ్లీ ఇలాంటి మోహం పొందవు. సమస్త ప్రాణులు నీలోనూ, నాలోనూ చూడగలవు. బాగా మండుతున్న అగ్ని, కట్టెలను ఎలా భస్మం చేస్తుందో… అలాగే జ్ఞానమనే అగ్ని సర్వకర్మలను భస్మం చేస్తుంది. ఈ ప్రపంచంలో జ్ఞానమునకు సరితూగే వస్తువు మరొక్కటి లేదు.
కర్మ యోగ సిద్ది పొందినవాడికి, కాలక్రమేణా అలాంటి జ్ఞానం ఆత్మలోనే కలుగుతుంది. శ్రద్ధాసక్తులూ, ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు, బ్రహ్మ జ్ఞానం పొందుతాడు. జ్ఞానం కలిగిన వెంటనే పరమ శాంతి లభిస్తుంది. అజ్ఞానం, ఆశ్రద్ధ, అనుమానం మనిషిని పాడు చేస్తాయి. అడుగడుగునా సందేహించే వాడికి ఇహలోకంలో కూడా సుఖశాంతులుండవు. నిష్కామ కర్మయోగం వల్ల, కర్మఫలాలు విడిచిపెట్టి, జ్ఞానంతో సంశయాలు పోగొట్టుకున్న ఆత్మజ్ఞానిని, కర్మలు బంధించలేవు. అందువల్ల, అజ్ఞానం మూలంగా నీ హృదయంలో కలిగిన ఈ సందేహాన్ని, జ్ఞానమనే కత్తితో నరికివేసి, నిష్కామ కర్మయోగం ఆచరించు. లేచి యుద్దం చెయ్యి” అన్నాడు.