భగవద్గీత 14 వ అధ్యాయం – గుణత్రయ విభాగయోగము

Bhagavadgita meaning in telugu

భగవద్గీత తెలుగులో అర్థం

14 వ అధ్యాయం – గుణత్రయ విభాగయోగము

జ్ఞానాలన్నిటిలోకి ఉత్తమం, ఉత్కృష్టం అయిన జ్ఞానాన్ని నీకు మళ్లీ చెబుతాను విను. ఈ జ్ఞానం తెలుసుకున్న మునులంతా సంసార వ్యధల నుంచీ, బాధల నుంచీ తప్పించుకుని మోక్షం పొందారు. ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి స్వరూపం పొందినవాళ్లు సృష్టి సమయంలో పుట్టరు. ప్రళయ కాలంలో చావరు. అర్జునా! మూలప్రకృతి నాకు గర్భాదానస్థానం. అందులో నేను సృష్టి బీజాన్ని వుంచుతున్నందువల్ల సమస్త ప్రాణులు పుడుతున్నాయి. అన్ని జాతులలోనూ ఆవిర్భవిస్తున్న శరీరాలన్నీటికి మూల ప్రకృతే తల్లి. నేను బీజాన్ని ఇచ్చే తండ్రిని. ప్రకృతి వల్ల పుట్టిన సత్వం రజస్సు, తమస్సు అనే మూడు గుణాలు శాశ్వతమైన ఆత్మను శరీరంలో బంధిస్తున్నాయి.

వాటిలో సత్వగుణం నిర్మలమైనది కావడం వల్ల కాంతీ ఆరోగ్యమూ కలగజేస్తుంది. అది సుఖం మీద, జ్ఞానం మీద ఆసక్తి కలగజేసి ఆత్మను బంధిస్తుంది.

రాగస్వరూపం కలిగిన రజోగుణం ఆశకూ, ఆసక్తికి మూలమని తెలుసుకో. కర్మలమీద ఆసక్తి కలిగించే అది ఆత్మను బంధిస్తుంది. అర్జునా! అజ్ఞానంవల్ల జనించే తమోగుణం ప్రాణులన్నిటికి అవివేకం కలగజేస్తుందని తెలుసుకో. అది పరాకు, బద్దకం, నిద్రలతో ఆత్మను శరీరంలో బంధిస్తుంది. సత్వగుణం చేకూరుస్తుంది. రజోగుణం కర్మలను చేరుస్తుంది. తమోగుణం జ్ఞానాన్ని మరుగుపరచి ప్రమాదాన్ని కలగజేస్తుంది. ఈ శరీరంలోని ఇంద్రియాలన్నీటి నుంచీ ప్రకాశించే జ్ఞానం ప్రసరించినప్పుడు సత్వగుణం బాగా వృద్దిపొందిందని తెలుసుకోవాలి.

రజోగుణం అభివృద్ది చెందుతున్నప్పుడు లోభం కర్మల పట్ల ఆసక్తి, అశాంతి, ఆశ అనే లక్షణాలు కలుగుతుంటాయి.  బుద్దిమాంద్యం, బద్దకం, అలక్ష్యం, ఆజ్ఞానం ఈ దుర్లక్షణాలు తమోగుణ విజృంభణకు తార్కాణాలు. సత్వగుణం ప్రవృద్ది చెందిన సమయంలో మరణించినవాడు ఉత్తమజ్ఞానులు పొందే పుణ్యలోకాలు పొందుతాడు. రజోగుణం ప్రబలంగా వున్న దశలో మృతిచెందితే కర్మల మీద ఆసక్తి కలవాళ్లకు జన్మిస్తాడు. అలాగే తమోగుణవృద్దిలో తనువు చాలించిన వాడు పామరులకూ, పశుపక్ష్యాదులకూ పుడతాడు.

సత్వగుణం సంబంధమైన సత్కార్యాల ఫలితంగా నిర్మలసుఖమూ రాజస కర్మల మూలంగా దుఃఖం, తామస కర్మల వల్ల అజ్ఞానం కలుగుతాయని చెబుతారు. సత్వగుణం వల్ల జ్ఞానం, రజోగుణం వల్ల లోభం, తమో గుణం వల్ల మోహం అజ్ఞానం సంభవిస్తాయి.

సత్వగుణ సంపన్నులకు ఉత్తమ లోకాలు సంప్రాప్తిస్తాయి. రజోగుణం ప్రధానంగా వున్నవాళ్లు మానవ లోకాన్నే పొందుతుండగా, తమోగుణం కలిగిన వాళ్లు నరకలోకానికి పోతుంటారు. శరీరం కారణంగా కలిగినప్పుడు ఈ మూడు గుణాలనూ అధిగమించినవాడు పుట్టుక, చావు, ముసలితనం, దుఃఖాల నుంచి విముక్తుడై అమృతపదం పొందుతాడు.

అర్జునుడు ఇలా పలికాడు. “ప్రభు! ఈ మూడు గుణాలనూ దాటినవాడి లక్షణాలేమిటి? అతని ప్రవర్తన ఎలా వుంటుంది? ఈ గుణాలను ఎలా అతను అతిక్రమించగలుగుతాడు.

దానికి శ్రీ భగవానుడు “అర్జునా! గుణాతీతుడి గుర్తులివి. తనకు సంప్రాప్తించిన సత్వగుణ సంబంధమైన సౌఖ్యాన్ని కాని, రజోగుణ ధర్మమైన కర్త ప్రవృత్తిని కాని, తమోగుణ లక్షణమైన మోహాన్ని కాని ద్వేషించడు.

అవి లేకుండా పోతే వాటిని ఆకాంక్షించడు. ఏమి సంబంధం లేనివాడిలాగ వుండి గుణాల వల్ల చలించకుండా, సర్వ కార్యాలలోనూ ప్రకృతి గుణాలే ప్రవర్తిస్తున్నాయని గ్రహించి, ఎలాంటి పరిస్థితిలోనూ నిశ్చలబుద్దిని విడిచిపెట్టడు. సుఖదుఃఖాలు, మట్టిబెడ, రాయి, బంగారం ఇష్టానిష్టాలు, దూషణభూషణాలు, మానావమానాలు, శత్రుమిత్రులను సమానదృష్టితో చూస్తూ కామ్యకర్మలన్నీటిని విడిచిపెట్టి నిరంతరం ఆత్మావలోకనంలో నిమగ్నమై ఉండే ధీరుడు, అచంచల భక్తితో నన్ను సేవించేవాడు ఈ మూడు గుణాలనూ అధిగమించి ముక్తి పొందడానికి అర్హుడవుతాడు. ఎందువల్లనంటే వినాశ రహితం, వికారరహితం, శాశ్వత ధర్మ స్వరూపం, అఖండ సుఖ రూపమూ అయిన బ్రహ్మనికి నిలయాన్ని నేనే.

మిగిలిన అధ్యాయాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ⬇️

1 వ అధ్యాయం – అర్జున విషాద యోగం

2 వ అధ్యాయం – సాంఖ్య యోగం

3 వ అధ్యాయం – కర్మ యోగం

4 వ అధ్యాయం -జ్ఞాన యోగం

5 వ అధ్యాయం – కర్మసన్యాస యోగము

6 వ అధ్యాయం – ఆత్మ సంయమ యోగము

7 వ అధ్యాయం  -జ్ఞాన విజ్ఞాన యోగము

8 వ అధ్యాయం –అక్షర పరబ్రహ్మ యోగము

9  వ అధ్యాయం – రాజ విద్య రాజగుహ్య యోగము

10  వ అధ్యాయం –విభూతి యోగము

11  వ అధ్యాయం –విశ్వరూప సందర్శన యోగము

12  వ అధ్యాయం – భక్తి యోగము

13  వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము

14  వ అధ్యాయం – గుణత్రయ విభాగయోగము

15  వ అధ్యాయం- పురుషోత్తమప్రాప్తి యోగము

16  వ అధ్యాయం- దైవాసుర సంపద్విభాగయోగము

17  వ అధ్యాయం – శ్రద్దాత్రయ విభాగ యోగము

18  వ అధ్యాయం – మోక్షసన్యాస యోగము

 

భగవద్గీత తెలుగులో అర్థం వీడియొ రూపంలో చూడండి 👇👇👇👇

 
 

ఇవి కూడా చూడండి 👇👇👇👇

 
🙏 Spread the devotion - Share now
Tags: , , , , , , ,