భగవద్గీత 13 వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము
భగవద్గీత 13 వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము
November 7, 2024
No Comments
admin
13 వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము
అర్జునుడు… ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయం వీటన్నిటి గురించి తెలుసుకోవాలని నా అభిలాష అని పలికాడు. కృష్ణ భగవానుడు అర్జునుడితో “కౌంతేయా! ఈ శరీరమే క్షేత్రమనీ, దీనిని తెలుసుకుంటున్న వాడే క్షేత్రజ్ఞుడనీ, క్షేత్ర క్షేత్రజ్ఞుల తత్వం తెలిసినవాళ్లు చెబుతారు. క్షేత్రాలన్నీటిలోనూ వున్న క్షేత్రజ్ఞుణ్ణి నేనే అని తెలుసుకో. క్షేత్రానీకీ క్షేత్రజ్ఞుడికి సంబంధించిన జ్ఞానమే సరియైన జ్ఞానమని నా వుద్దేశం.
ఋషులు ఎన్నో విధాలుగా ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుల తత్వాన్ని చాటి చెప్పారు. వేరు వేరుగా వేదాలు, సహేతుకంగా సందేహరహితంగా సవివరంగా బ్రహ్మసూత్రాలూ ఈ స్వరూపాన్ని నిరూపించాయి.
పంచభూతాలు, అహంకారం, బుద్ది, మూలప్రకృతి, పది ఇంద్రియాలు, మనస్సు, ఐదు విషయ ఇంద్రియాలు కోరిక, ద్వేషం, సుఖం, దుఃఖం, దేహేంద్రియాల సమూహం, తెలివి, ధైర్యం, వికరాలతో పాటు వీటి సముదాయాన్ని సమగ్రహంగా క్షేత్రమని చెబుతారు. తనని తాను పొగడక పోవడం, కపటం లేకపోవడం, అహింసా, సహనం, సరళత్వం సద్గురు సేవ, శరీరాన్ని మనస్సును పరిశుద్దంగా వుంచుకోవడం, స్థిరత్వం, ఆత్మ నిగ్రహం, ఇంద్రియ విషయాల పట్ల విరక్తి కలిగి వుండడం, అహంకారం లేకపోవడం, పుట్టుక చావు ముసలితనం రోగం అనే వాటివల్ల కలిగే దుఖాన్ని దోషాన్ని కలిగి గమనించడం, దేనిమీద ఆసక్తి లేకపోవడం, శుభా శుభాలలో సమభావం కలిగి వుండడం, నా మీద అనన్యమూ, అచంచలమూ అయిన భక్తి కలిగి ఉండడం, ఏకాంత ప్రదేశాన్ని ఆశ్రయించడం, ఆత్మ ధ్యానంలో నిరంతరం నిమగ్నమై వుండడం ఇదంతా జ్ఞానమని చెప్పబడింది. దీనికి విరుద్దమయింది అజ్ఞానం.
ఏది తెలుసుకోదగ్గదో దేనిని తెలుసుకుంటే మానవుడు మోక్షం పొందుతాడో అనాది అయిన ఆ పరబ్రహ్మన్ని గురించి చెబుతాను. అది అంతటా చేతులూ కాళ్ళూ తలలూ ముఖాలూ చెవులూ కలిగి సమస్త జగత్తుని ఆవరించి వున్నది. బ్రహ్మం ఆకారమంతా ఒక్కటే అయినప్పటికీ సర్వప్రాణులలోనూ ఆకారభేదం కలిగిన దానిలాగ కనపడుతుంది. అది భూతాలన్నిటిని పోషిస్తుంది. భుజిస్తుంది. సృజిస్తుంది. అది జ్యోతులన్నీటిని ప్రకాశింపచేస్తుంది.
అజ్ఞానాంధకారానికి అతీతమూ, జ్ఞానస్వరూపమూ, జ్ఞానంతో తెలుసుకోదగ్గదీ, జ్ఞానంతో పొందదగ్గదీ అయి అందరి హృదయలలో అధీష్టించి వున్నది. ఇలా క్షేత్రం జ్ఞానం, జ్ఞేయం గురించి క్లుప్తంగా చెప్పడం జరిగినది. నా భక్తుడు ఈ తత్వాన్ని తెలుసుకొని మోక్షం పొందడానికి అర్హుడవుతున్నాడు. ప్రకృతి పురుషుడు- ఈ ఉభయులకి ఆదిలేదని తెలుసుకో. వికారాలూ, గుణాలు ప్రకృతి నుంచి పుడుతున్నాయని గ్రహించు. శరీరం ఇంద్రియాల ఉత్పత్తికి ప్రకృతే హేతువనీ, సుఖ దఃఖాలను అనుభవించేది పురుషుడని చెబుతారు. ప్రకృతిలో వుండే పురుషుడు ప్రకృతి పట్ల కలిగే గుణాలను అనుభవిస్తాడు. ఆ గుణాలపట్ల కల ఆసక్తిని బట్టే పురుషుడు ఉచ్చనీచ జన్మలు పొందుతాడు. ధ్యానయోగం ద్వారా కొంతమంది, జ్ఞానయోగం వల్ల మరికొంతమంది, కర్మయోగంతో ఇంకొంతమంది పరమాత్మను తమలో దర్శిస్తున్నారు. అలా తెలుసుకొలేని మరికొంతమంది గురువుల ఉపదేశం పొంది ఉపాసిస్తారు. వినడంలో శ్రద్ద కలిగినవాళ్లు కూడా సంసారరూపమైన మృత్యువు నుంచి ముక్తి పొందుతారు. అర్జునా! ఈ ప్రపంచంలో పుడుతున్న చరాచరాత్మకమైన ప్రతి వస్తువూ ప్రకృతి పురుషుల కలయికవల్లనే కలుగుతున్నదని తెలుసుకో. శరీరాలు నశిస్తున్నా తాను నశించకుండా, సమస్త ప్రాణులలోనూ సమానంగా వుండే పరమాత్మను చూసేవాడే సరైన జ్ఞాని. ప్రకృతి వల్లనే సమస్తకర్మలు సాగుతున్నాయని తానేమీ చేయడం లేదనీ తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞాని. వేరువేరుగా కనిపించే సర్వ భూతాలు ఒకే ఆత్మలో వున్నాయనీ అక్కడ నుంచే విస్తరిస్తున్నాయనీ గ్రహించినప్పుడు మానవుడు బ్రహ్మపదం పొందుతాడు. అంతటా వ్యాపించివున్న సూక్ష్మమైన ఆకాశం దేనినీ అంటనట్లు శరీరమంతటా వున్న ఆత్మ కలుషితం కాదు. అర్జునా! సూర్యుడోక్కడే ఈ సమస్త లోకాన్ని ప్రకాశింప చేస్తున్నట్లే క్షేత్రజ్ఞుడైన పరమాత్మ క్షేత్రమంతటినీ ప్రకాశింపచేస్తున్నాడు. ఇలా క్షేత్ర క్షేత్రజ్ఞుల భేదాన్ని ప్రకృతి గుణాలనుంచి ప్రాణులు మోక్షం పొందే విధానాన్ని జ్ఞానదృష్టితో తెలుసుకున్న వాళ్లు పరమపదం పొందుతారు.