వేదాలు ఆకులుగా, వేళ్ళు పైకి కొమ్మలు కిందకి ఉండే సంసారమనే అశ్వత్ద వృక్షం నాశనం లేనిదని చెబుతారు. అది తెలుసుకున్న వాడే వేదార్ధం ఎరిగిన వాడు. ఈ సంసారవృక్షం కొమ్మలు గుణాలవల్ల పెంపొందుతూ విషయ సుఖాలే చిగుళ్ళుగా కిందకి మీదకి విస్తరిస్తాయి. మానవ లోకంలో ధర్మాధర్మ కర్మ బంధాల వల్ల దాని వేళ్ళు దట్టంగా కిందకి కూడా వ్యాపిస్తాయి. ఈ సంసార వృక్షం స్వరూపం కాని, ఆది మధ్యంతాలు కాని ఈ లోకంలో ఎవరికి తెలియవు. లోతుగా నాటుకున్న వేళ్ళతో విలసిల్లుతున్న ఈ వృక్షాన్ని వైరాగ్యమనే ఖడ్గంతో ఖండించి వేశాక, పునర్జన్మ లేకుండా చేసే పరమపదాన్ని వెతకాలి. ఆనాదిగా ఈ సంసార వృక్షం విస్తరించడానికి కారకుడైన అది పురుషుణ్ణి శరణు పొందాలి. అభిమానం, అవివేకం లేకుండా, అనురాగదోషాన్ని జయించి, ఆత్మజ్ఞానతత్పరులై కోరికలన్నింటిని విడిచిపెట్టి, సుఖదుఃఖాది ద్వంద్వాలకు అతీతులైన జ్ఞానులు, శాశ్వతమైన ఆ బ్రహ్మపదాన్ని పొందుతారు.
దేనిని పొందితే మళ్ళీ సంసారానికి రానక్కర్లేదో అలాంటి పరమపదం నాది. నాలోని శాశ్వతమైన ఒక అంశమే మానవ లోకంలో జీవాత్మగా పరిణమించి ప్రకృతిలోని జ్ఞానేంద్రియాలను, మనస్సునూ ఆకర్షిస్తుంది. వాయువు పువ్వుల నుంచి వాసనలు తీసుకొపోయేటట్లుగా, జీవుడు శరీరాన్ని ధరించేటప్పుడూ, ఇంద్రియాలను, మనస్సునూ వెంటబెట్టుకుపోతాడు. ఈ జీవుడు చెవి, కన్ను, ముక్కు, చర్మం, నాలుక-అనే ఐదు జ్ఞానేంద్రియాలనూ, మనస్సునూ ఆశ్రయించి, శబ్దాది విషయాలను అనుభవిస్తాడు. మరో శరీరాన్ని పొందుతున్నప్పుడు శరీరంలో ఉన్నప్పుడు, విషయాలను అనుభవిస్తున్నప్పుడూ, గుణాలతో కూడి ఉన్నప్పుడు కూడా, ఈ జీవాత్మను మూఢులు చూడలేరు. జ్ఞానదృష్టి కలిగిన వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. ప్రయత్నం సాగించే యోగులు తమలోని పరమాత్మను దర్శిస్తారు.
సూర్యుడిలో వుండి జగత్తునంతటిని ప్రకాశింపజేసే తేజస్సు, చంద్రుడిలో, అగ్నిలో ఉండే తేజస్సు నాదే అని తెలుసుకో. నేను భూమిలో ప్రవేశించి నా ప్రభావంతో సర్వభూతాలను ధరిస్తున్నాను. అమృతమయుడైన చంద్రుడిగా సమస్తాన్ని పోషిస్తున్నాను. వైశ్వానరుడు అనే జతరాగ్ని రూపంతో సకల ప్రాణుల శరీరాలలోనూ వుండి, ప్రాణాపాన వాయువులతో కలిసి, నాలుగు రకాల ఆహారాలను జీర్ణం చేస్తున్నాను. సర్వప్రాణుల హృదయాలలో వున్న నా వల్లనే, జ్ఞాపకం, జ్ఞానం, మరపు కలుగుతాయి. వేదాలన్నింటి వల్ల తెలుసుకోవలసినటువంటి వాడిని నేనే. వేదాంతులకు, కర్తనూ, వేదాలనూ ఎరిగిన వాణ్ణి నేనే.
ఈ లోకంలో క్షరుడనీ, అక్షరుడనీ ఇద్దరు పురుషులు ఉన్నారు. నశించే సమస్త ప్రాణుల సముదాయాన్ని క్షరుడనీ, మార్పు లేని జీవుడిని అక్షరుడనీ అంటారు. నేనే క్షరుడిని మించిన వాడిని, అక్షరుడి కంటే ఉత్తముడినీ కావడం వల్ల, లోకంలోనూ వేదాలలోనూ పురుషోత్తముడిగా ప్రసిద్ది పొందాను. అర్జునా! అజ్ఞానం లేకుండా అలా నన్ను పురుషోత్తముడిగా తెలుసుకునే వాడు సర్వజ్ఞుడు, అన్ని విధాలా నన్నే ఆరాధిస్తాడు. అతి రహస్యమైన ఈ శాస్త్రాన్ని నీకు చెప్పాను. దీన్ని బాగా తెలుసుకున్న వాడు బుద్దిమంతుడూ, కృతార్ధూడూ అవుతాడు.