భగవద్గీత 9 వ అధ్యాయం –రాజ విద్య రాజగుహ్య యోగము

Bhagavadgita meaning in telugu

9  వ అధ్యాయం – రాజ విద్య రాజగుహ్య యోగము

సంసారబంధం నుంచి విముక్తి పొందడానికి తెలుసుకోవలసిన అతి రహస్యం, అనుభవసహితమూ అయిన జ్ఞానాన్ని, అసూయ లేని నీకు ఉపదేశిస్తున్నాను. విద్యలలో ఉత్తమం, పరమరహస్యము, పవిత్రమూ అయిన ఈ బ్రహ్మ జ్ఞానం ప్రత్యక్షానుభవం వల్ల తెలుసుకోదగ్గది. ఇది ధర్మయుతం, శాశ్వతం, సులభసాధ్యం. ఈ ధర్మం పట్ల శ్రద్ద లేని పురుషులు, నన్ను పొందకుండా మరణ రూపమైన సంసారపధంలో పరిభ్రమిస్తారు. ఇంద్రియాలకు కనిపించని నా రూపం, ఈ విశ్వమంతా వ్యాపించి వున్నది. సకలజీవులూ నాలో వున్నాయి. నేను మాత్రం వాటిలో లేను. ఈశ్వర సంబంధమైన నా యోగశక్తి చూడు. భూతాలు నాలో లేవు.
నా ఆత్మ సమస్త భూతాలను సృష్టించి పోషిస్తున్నప్పటికి, వాటిలో వుండదు. సర్వత్రా సంచరించే మహావాయువు, ఆకాశంలో నిరంతరం నిలిచి వున్నట్టే, సర్వభూతాలు నాలో వున్నాయి అని తెలుసుకో. ప్రళయకాలంలో ప్రాణులన్నీ నా ప్రకృతిలో ప్రవేశిస్తున్నాయి. సృష్టికాలంలో వాటిని మళ్ళీ నేను సృష్టిస్తుంటాను. అయినప్పటికీ అర్జునా! వాటిపై ఆసక్తి లేని తటస్థుణి కావడం వల్ల ఈ కర్మలు బంధించలేవు. ప్రకృతి నా పర్యవేక్షణలో ఈ చరాచర జగత్తును సృష్టిస్తున్నది. అందువల్లనే ఆవిచ్చినంగా జగన్నాటకం జరుగుతుంది.
సమస్త ప్రాణకోటికి ప్రభువైన నా పరమతత్వం తెలియని మూఢులు, మానవ రూపంలో వున్న నన్ను మామూలు మనిషిగా భావించి అవమానిస్తున్నారు. అలాంటి మూఢులు పనికిమాలిన కాంక్షలూ, కర్మలూ, జ్ఞానమూ కలిగి వివేకం కోల్పోయి, రాక్షసుల స్వభావాన్ని ఆశ్రయిస్తారు. సాత్వికస్వభావం కలిగిన మహాత్ములు సర్వభూతాలకూ కారణమైన వాడిగా, నాశనం లేని వాడినిగా నన్ను తెలుసుకొని ఏకాగ్రచిత్తంతో సేవిస్తారు.
క్రతువూ, యజ్ఞమూ, పితృదేవతలకు అర్పించే అన్నమూ, ఔషధమూ, మంత్రమూ, నేయీ, నిప్పూ, హొమమూ నేనే. ఈ జగత్తుకు తండ్రి, తల్లి, కర్మఫలదాత, తెలుసుకోదగ్గ వస్తువు నేనే. ఓంకారం, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం కూడా నేనే. ఈ జగత్తుకు గతిపతి, ప్రభువు, సాక్షి, నివాసస్థానం, ఆశ్రయం, ఆప్తుడు, సృష్టికర్త, సంహారకుడు, ఆధారం, ప్రళయం, స్థానం, శాశ్వతబీజం నేనే. నేనే వేడి కలుగజేస్తున్నాను. వర్షాన్ని నిలుపుచున్నాను. కురిపిస్తున్నాను.
మూడు వేదాలు చదివినవారు యజ్ఞాలతో నన్ను పూజించి, పాపాలు పోగొట్టుకొని స్వర్గం కోరుతారు. అలాంటి వాళ్ళు పుణ్యఫలమైన దేవేంద్రలోకాన్ని పొంది, దివ్యభోగాలు అనుభవిస్తుంటారు. వాళ్ళు విశాలమైన స్వర్గలోకంలో సుఖాలు అనుభవించి, పుణ్యం క్షిణించిపోగానే మానవలోకంలో మళ్ళీ ప్రవేశిస్తారు. ఇలా వేదంలోని కర్మ కాండను పాటించే భోగపరాయణులు జనన మరణాలు పొందుతుంటారు. ఏకాగ్రచిత్తంతో నిరంతరం నన్నే స్మరిస్తూ, సేవించేవాళ్ళ యోగక్షేమాలు నేనే చూస్తాను.
సర్వ యజ్ఞాలలో భోక్త, ప్రభువు నేనే. ఇతర దేవతల భక్తులు ఈ వాస్తవాన్ని గ్రహించలేక, మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు. దేవతలను సేవించే వాళ్ళు దేవతలనూ, పితృదేవతలను ఆరాధించే వాళ్ళు పితృదేవతలనూ, భూతాలను అర్పించే వాళ్ళు భూతాలను పొందుతారు. నన్ను పూజించే వాళ్ళు నన్నే పొందుతారు. పరిశుద్ధుడైన మనస్సు కలిగినవాడు, భక్తితో నాకు ఆకుకాని, పువ్వుకాని, పండుకాని, నీరుకాని సమర్పిస్తే సాదరంగా స్వీకరిస్తాను. నీవు ఏం చేసినా- భోజనం చేసినా, హోమం చేసినా, దానం చేసినా, తపస్సు చేసినా, నాకు ఆ సర్వం సమర్పించు.
శుభాశుభఫలాలు కలగజేసె కర్మబంధాల నుంచి నీవు అలా విముక్తి పొందుతావు. సన్యాసయోగం అవలంబిస్తే జీవించి వుండగానే ముక్తి పొంది, మరణనంతరం నన్ను చేరుతావు. సమస్త ప్రాణుల పట్ల సమభావం కలిగిన నాకు- విరోధి కాని, ఇష్టుడుకాని లేడు. నన్ను భక్తితో భజించే వాళ్ళు నాలోనూ, నేను వాళ్ళలోనూ వుంటాను. నా భక్తుడెప్పుడు చెడిపొడని ఘంటాపధంగా శపధంచేసి మరి చెప్పు. నన్ను ఆశ్రయించిన వాళ్ళు ఎవరైనా సరే, పాప జన్ములు గాని, స్త్రీలు కాని, వైశ్యులు కాని, శుద్రులు కాని, పరమశాంతిపదం పొందుతారు. ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులు, భక్తులైన రాజర్షుల గురించి వేరే చెప్పాలా? సుఖం లేని అశాశ్వతమైన ఈ లోకంలో పుట్టిన నీవు నన్ను సేవించు. నామీదే మనస్సు, భక్తి కలిగి నన్నే పూజించు, నాకే నమస్కరించు. ఇలా నన్ను ఆశ్రయించి, నా మీదే మనస్సు నిలిపితే,  నన్నే పొందుతావు.

మిగిలిన అధ్యాయాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ⬇️

1 వ అధ్యాయం – అర్జున విషాద యోగం
2 వ అధ్యాయం – సాంఖ్య యోగం
3 వ అధ్యాయం – కర్మ యోగం
4 వ అధ్యాయం -జ్ఞాన యోగం
5 వ అధ్యాయం – కర్మసన్యాస యోగము
6 వ అధ్యాయం – ఆత్మ సంయమ యోగము
7 వ అధ్యాయం  -జ్ఞాన విజ్ఞాన యోగము
8 వ అధ్యాయం –అక్షర పరబ్రహ్మ యోగము
9  వ అధ్యాయం – రాజ విద్య రాజగుహ్య యోగము
10  వ అధ్యాయం –విభూతి యోగము
11  వ అధ్యాయం –విశ్వరూప సందర్శన యోగము
12  వ అధ్యాయం – భక్తి యోగము
13  వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము
14  వ అధ్యాయం – గుణత్రయ విభాగయోగము
15  వ అధ్యాయం- పురుషోత్తమప్రాప్తి యోగము
16  వ అధ్యాయం- దైవాసుర సంపద్విభాగయోగము
17  వ అధ్యాయం – శ్రద్దాత్రయ విభాగ యోగము
18  వ అధ్యాయం – మోక్షసన్యాస యోగము
Tags: , , , , , , , , , , ,