దక్షిణామూర్తి స్తోత్రం తెలుగులో అర్థం

Lord Dakshinamurthy seated under a banyan tree, teaching sages – Dakshinamurthy Stotram in Telugu
దక్షిణా మూర్తి స్తోత్రం
శాంతిపాఠః
ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం
యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై ।
తం హ దేవమాత్మబుద్ధిప్రకాశం
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ॥
ధ్యానం
ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానం
వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః ।
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥ 1 ॥
మౌనముగా చేయబడిన వ్యాఖ్యానముతో, స్పష్టము చేయబడిన పరబ్రహ్మస్వరూపముకలిగి, బ్రహ్మనిష్ఠుడై ప్రసన్నవదనంతో మౌనంగా చిన్ముద్రాంచిత హస్తంతో, వృద్ధులైన మహర్షులకు ఆత్మవిద్యను బోధిస్తున్న యువగురువు శ్రీ దక్షిణామూర్తిని నేను ఆరాధిస్తాను.
వటవిటపిసమీపేభూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ ।
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి ॥ 2 ॥
మర్రిచెట్టు క్రింద కూర్చొని, తనచుట్టూ ఉన్న మహర్షులకు బ్రహ్మవిద్యను అందిస్తూ, జనన మరణాలతో కూడిన సంసారదుఃఖాలను నిర్మూలిస్తూ, ముల్లోకాల చేతనూ గురువుగా కొలువబడే శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా ।
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః ॥ 3 ॥
ఆహా ! ఏమి ఆశ్చర్యకరం ! యువకుడైన గురువుచుట్టూ, వృద్ధులైన శిష్యులు శ్రద్ధాభక్తులతో కూర్చొని ఉన్నారు, గురువు తన మౌనంతోనే వారి సర్వసందేహాలనూ నివారింపగలుగుతున్నాడు.
నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ ।
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః ॥ 4 ॥
భవరోగ రోగులకు వైద్యుడై జగద్గురువై, సర్వవిద్యలకు నిధియై, సమస్తలోకములకు గురువైన దక్షిణామూర్తికి నా నమస్కారములు.
ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే ।
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ॥ 5 ॥
ప్రసన్నస్వరూపుడై, శుద్ధజ్ఞానమే మూర్తిగా, ప్రణవనాదమైన ఓంకారానికి లక్ష్యార్థంగా భాసిస్తూ, నిర్మలుడైన దక్షిణామూర్తికి నా నమస్కారములు.
విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధానిద్రయా
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 1
ఈ చరాచర ప్రపంచమునంతా, ఆత్మచైతన్మమయిన తనలో లీలా మాత్రంగా, స్వానుభవంగా, స్వాత్మగా, అద్దంలో కనిపించే నగరంవలె, స్వప్నదృశ్వం వలె తన కంటే భిన్నంగా ఉందన్న భ్రమకలిగిస్తోందని గుర్తిస్తున్న జగద్గురువైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.

బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం
మాయావీవ విజృంభ త్యపి మయా యోగేవయః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 2
చిన్నివిత్తనంలో మహావ్యక్షం దాగి ఉన్నట్టుగా గోచరించే ఈ మహాజగత్తంతా, దేశకాలావృతమైన సమస్త చరాచర ప్రపంచమును, ఇంద్రజాలికునివలె, మహాయోగి వలె, బహిర్గతం చేసి తన మాయాశక్తితో స్వేచ్ఛగా జగన్నాటకాన్ని నడిపే మహాత్ముడైన నా గురువునకు, శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారములు.
యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పా ర్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసాయో బోధయత్యాశ్రితాన్
యస్సాక్షాత్కరణాద్భవేన్నపురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 3
ఎవని వ్యక్తరూపం ఈ ప్రపంచంగా స్ఫురిస్తూ కూడా నిత్యసత్యమై ప్రకాశిస్తూ ఉంటుందో, శ్రద్ధతో శరణువేడినవారికి తత్త్వమసి అను మహావేదవాక్కుచే ఎవరు జ్ఞానబోధ చేస్తుంటారో, ఎవరి జ్ఞానబోధ వల్ల జననమరణయుక్తమైన ఈ సంసార చక్రం నుండి ముక్తిపొందుతున్నారో, అట్టి పరమ పవిత్రమయిన గురుమూర్తికి, శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారములు.
నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తంజగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 4
ఎవని చైతన్యం, మన కళ్ళు, చెవులు మొదలయిన ఇంద్రియాలద్వారా, అనేక చిల్లులు కలిగిన కుండలో ఉన్న దీపకిరణాలవలె, పైకి ప్రసరిస్తూ ఉందో, ఏ చైతన్యం ప్రకాశించడం వలన ఈ వస్తుమయ మహా ప్రపంచమంతా తెలియబడుతూ ఉందో, అటువంటి దివ్యమూర్తికి సద్గురువుకు, శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారములు.
దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించశూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహ మితి భ్రాంతాభృశం వాదినః
మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 5
బుద్ధిపరంగా స్త్రీలవలె, చిన్నపిల్లలవలె, మూఢులవలె, విషయాలనర్ధం చేసుకునే శక్తిహీనులు, మాయా ప్రభావానికి లోనై శరీరమే సత్యమనీ, ప్రాణమే సత్యమనీ, ఇంద్రియాలనే సత్యమనీ, మనస్సే సత్యమనీ, నిత్యమూ మార్పుచెందే బుద్ధే సత్యమనీ, శూన్యమే సత్యమనీ, శాస్త్రం నుండి తప్పుగా గ్రహిస్తారు. అట్టివారి భ్రమలను తొలగించగలిగే పరమగురువుకు శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారములు.
రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 6
గ్రహణ సమయంలో సూర్యచంద్రులు రాహువుచే కప్పబడినట్లుగా, సర్వేంద్రియ వ్యవహారాలూ ఉపశమించిన సుషుప్తి అవస్థలో ప్రవేశించి మాయావరణతో కూడిన సత్యం సన్నిధిలో విశ్రాంతినంది మళ్ళీ మెలకువలో తాను నిద్రపోయినట్లుగా తెలుసుకునే పరమసత్యానికి శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారములు.
బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథాసర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమి త్యంతస్స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటికరోతిభజతాం యోముద్రయా భద్రయా
తస్మైశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 7
బాల్యకౌమార యౌవన వ్యద్ధాప్య దశలలోనూ, జాగ్రత్‌ స్వప్న సుషుప్తి మొదలైన అన్ని అవస్థలలోనూ భూత వర్తమాన భవిష్యత్‌ కాలాలలోనూ, సర్వదా అన్ని ప్రాణులలోనూ “నేను” గా ఉంటూ, తన భక్తులకు చిన్ముద్ర ద్వారా తన నిజ తత్త్వాన్ని వ్యక్తం చేసే సద్గురుమూర్తి శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పిత్ర పుత్రాద్యాత్మనా భేదతాః
స్వస్నే జాగ్రతి వాయు ఏష పురుషో మయా పరిభ్రామితః
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 8
ఏ పురుషుడు మాయాప్రభావంతో తనలో – కార్యకారణ సంబంధరూపమయిన విశ్వాన్నీ, శిష్యాచార్య విభేదాన్నీ, పితృపుత్ర మొదలయిన తేడాలనీ జాగ్రత్‌ స్వప్నావస్థలనీ చూస్తున్నాడో, ఆయనను, ఆ పరమగురువుకి, శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారములు.
భూరంభాం స్యనలోనిలోబర మహర్నాధోపిమాంశుః పుమాన్
నిత్యాభతి చరాచరాత్మక మిదం యస్మైచ మూర్త్యష్టకం
నాన్యత్కించ నవిద్యతే విమృశతాంయస్మాతత్పర స్వాదిభో
తస్మై గిరిమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 9
ఎవని అష్టమూర్తులు భూమి జలము అగ్ని వాయువు ఆకాశం సూర్యడు చంద్రుడు జీవుడు విరాజిల్లుతున్నారో, ఎవరు చరాచరమయిన జగత్తుగా వ్యక్తమవుతున్నారో, ఎవనిని ఆరాధించి సర్వవ్యాప్తమయిన ఆత్మతత్వంకంటే వేరుగా రెండవ దేదీలేదని సాధకులు తెలుసుకుంటున్నారో… అట్టి సద్గురువునకు శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారములు.
సర్వాత్వమితి స్ఫుటీకృత మిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్వశ్రవణాత్త దర్థ మననా ద్ధ్యానా చ్ఛ సంకీర్తనాత్
సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వత్వం స్వతః
సిద్ధేత్తత్పురష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్ 10
సర్వాత్మత్వం ఈ స్తుతిలో వివరించబడింది. కాబట్టి దీనిని విని, మననం చేసి, ధ్యానించి, కీర్తించడంలో అష్టవిభూతి సహితమయిన సర్వాత్మత్వం, ఈశ్వరత్వం, స్వరూపానుభూతి సిద్ధిస్తాయి.
సంసార బంధములు, జనన మరణ ఋణములు తొలగించే, వట వృక్షము కింద ఆసీనుడై యోగులకు, మునులకు జ్ఞానోపదేశము చేసే వానిగా ధ్యానించబడే, త్రిలోక వంద్యుడైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
॥ ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం దక్షిణామూర్తిస్తోత్రం సంపూర్ణమ్ ॥
Tags: , , , , , , , , , , , , ,