శ్రీ లలిత సహస్ర నామాలు స్తోత్రాలకు తెలుగులో అర్థం

soundarya lahari meaning in telugu

సౌందర్యలహరి శ్లోకాలకు తెలుగులో అర్థం
21. శ్లోకం
తటిల్లేఖాతన్వీం తపన శశివైశ్వానరమయీం
నిషణ్ణాం షణ్ణామవ్యుపరి కమలానాం తవ కలామ్,
మహాపద్మాటవ్యాం మృదిత మలమాయేన మనసా
మహాన్తః పశ్యన్తోదధతి పరమానన్ద లహరీమ్ !!
తాత్పర్యం:
తల్లీ! భగవతీ! మెరుపు తీగవలె సొగసైన, సూక్ష్మమైన, పొడవైన, ప్రకాశించు లక్షణము కలిగిన, సూర్య చంద్రాగ్ని స్వరూపమైనది, షట్చక్రాలకు పైన సహస్రారంలో మహాపద్మాటవిలో కూర్చున్న నీ యొక్క సాదాఖ్య అనే బైందవీ కళను- కామాది మలినములను పోగొట్టుకున్న మహాపురుషులైన యోగీశ్వరులు ధ్యానించి, మహదానంద ప్రవాహములో ఓలలాడుచున్నారు.
22. శ్లోకం
భవాని త్వందాసే మయి వితర దృష్టిం సకరుణామ్
ఇతిస్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితియః !
తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్యపదవీమ్
ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజితపదామ్ !!
తాత్పర్యం:
“తల్లీ! భవానీ! నేను దాసుడను. నీవు నా యందు దయతో కూడిన నీ చల్లని చూపును ప్రసరింపచేయుము” అని  స్తుతిస్తూ, “భవానీత్వం” అని మొదలుపెట్టి ఇంకా చెప్పబోయేలోపే వారికి హరి బ్రహ్మేంద్రులు రత్న కిరీటములచే హారతి పట్టబడు నీ పద సాయుజ్యమును ఇచ్చెదవు.
23. శ్లోకం
త్వయా హృత్వా వామం వపు-రపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభోరపరమపి శంకే హృతమభూత్ !
యదేతత్ త్వద్రూపం సకలమరుణాభం త్రినయనం
కుచాభ్యామానమ్రం కుటిలశశిచూడాలమకుటమ్ !!
తాత్పర్యం:
తల్లీ! జగజ్జననీ! నీ దేహమంతా అరుణకాంతులు వెదజల్లుతూ, మూడు కన్నులు గలిగి, స్తనభారముచే కొద్దిగా వంగినట్లు కనబడుతూ, నెలవంకను శిరోమణిగా కలిగియుండుటను చూడగా – మొదట నీవు శివుని శరీర వామభాగమును హరించి, అంతటితో సంతృప్తి చెందక, కుడిభాగమైన శరీరార్థమును కూడా హరించితివి కాబోలునని సందేహము కలుగుచున్నది.
24. శ్లోకం
జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే
తిరస్కుర్వ-న్నేతత్ స్వమపి వపు-రీశ-స్తిరయతి !
సదా పూర్వః సర్వం తదిద మనుగృహ్ణాతి చ శివ-
స్తవాఙ్ఞా మలంబ్య క్షణచలితయో ర్భ్రూలతికయోః !!
తాత్పర్యం:
అమ్మా! నీ లతలవంటి కనుబొమల కదలికనుండి ఆజ్ఞను స్వీకరించి, బ్రహ్మ ప్రపంచమును సృష్టించును. విష్ణువు పాలించును. రుద్రుడు లయింపజేయును. ఈశ్వరుడు ఈ త్రయమును తన శరీరమునందు అంతర్ధానము నొందించును. సదాశివుడు నీ కటాక్షమును అనుసరించి ఈ నాలుగు పనులను మరలా ఉద్ధరించుచున్నాడు.
25. శ్లోకం
త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే
భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా !
తథా హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే
స్థితా హ్యేతే శశ్వన్ముకులిత కరోత్తంసమకుటాః !!
తాత్పర్యం:
తల్లీ! నీ సత్త్వరజస్తమోగుణములచేత జనించిన బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురూ, నీవు పాదములుంచెడి మణిపీఠమునకు దగ్గరగా చేతులు జోడించి, శిరస్సున దాల్చి ఎల్లప్పుడు నిలిచి ఉండెదరు. అందువలన నీ పదములకు చేసే పూజ త్రిమూర్తులకు కూడా పూజ అగుచున్నది.
26. శ్లోకం
విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం
వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనమ్ ।
వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సంమీలితదృశా
మహాసంహారేఽస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ ॥ 26 ॥
తాత్పర్యం:
తల్లీ! జగజ్జననీ! ఈ ప్రపంచమునకు మహా ప్రళయము సంభవించినపుడు బ్రహ్మదేవుడు, విష్ణువు, యముడు, కుబేరుడు, చివరకు ఇంద్రుడు – వీరందరూ కాలధర్మము చెందుచున్నారు. కాని, ఓ పతివ్రతామతల్లీ ! నీ భర్త అయిన సదాశివుడు మాత్రము, ఎట్టి మార్పులకు గురికాకుండా నిరంకుశుడై విహరించుచున్నాడు గదా!
27. శ్లోకం
జపో జల్పః శిల్పం సకలమపి ముద్రావిరచనా
గతిః ప్రాదక్షిణ్య-క్రమణ-మశనాద్యా హుతి-విధిః !
ప్రణామః సంవేశః సుఖమఖిల-మాత్మార్పణ-దృశా
సపర్యా పర్యాయస్తవ భవతు యన్మే విలసితమ్ !!
తాత్పర్యం:
తల్లీ! నా మాటలన్నీ నీ జపముగా, నా కార్యకలాపమంతయూ నీకు అర్పించే ముద్రలుగా, నా గమనము అంతా నీ ప్రదక్షిణగా, నేను భుజించేదంతా నీకు ఆహుతిగా, నిద్రించేటప్పుడు, పరుండినప్పుడు జరుగు దేహములోని మార్పులు- నీకు సాష్టాంగ ప్రణామములుగా, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది సుఖములు నేను ఆత్మార్పణ బుద్దితో చేసే నీ పూజలుగా అగుగాక.
28. శ్లోకం
సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరమృత్యుహరిణీం
విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః !
కరాలం యత్ క్ష్వేలం కబలితవతః కాలకలనా
న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా !!
తాత్పర్యం:
తల్లీ ! భయంకరమైన జరామృత్యువులను పరిహరించు అమృతమును త్రాగి కూడా బ్రహ్మేంద్రాది దేవతలందరూ మృతి చెందుతున్నారు. కానీ నీ భర్త అయిన శివునకు- కాలకూటము భుజించినప్పటికీ కల్పాంతములందు కూడా చావు లేడు. దానికి కారణము నీ కర్ణాభరణములయిన తాటంకముల మహిమయే.
29. శ్లోకం
కిరీటం వైరించం పరిహర పురః కైటభభిదః
కఠోరే కోఠీరే స్ఖలసి జహి జంభారిమకుటమ్ !
ప్రణమ్రేష్వేతేషు ప్రసభ ముపయాతస్య భవనం
భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే !!
తాత్పర్యం:
నీ మందిరమునకు నీ పతియగు పరమేశ్వరుడు వచ్చిన తరుణములో, నీవు వెనువెంటనే స్వాగత వచనములతో ఎదురేగి, ఆయనను పలుకరించుటకు లేచి ముందుకు సాగు ప్రయత్నములోనుండగా – దారిలో నీకు సాష్టాంగ దండప్రణామము లాచరించు స్థితిలోనున్న బ్రహ్మ, విష్ణు, ఇంద్రాదుల యొక్క కిరీటములు- నీ పాదములకు అడ్డు తగులుతాయి అన్న ఉద్దేశ్యముతో- వీటిని జాగ్రత్తగా దాటుతూ నడువుమని చెప్పే నీ పరిచారికల మాటలు ఎంతో గొప్పవిగా ఉన్నవి.
30. శ్లోకం
స్వదేహోద్భూతాభి-ర్ఘృణిభిరణి మాద్యాభి-రభితో
నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః !
కిమాశ్చర్యం తస్య త్రినయనసమృద్ధిం తృణయతో
మహాసంవర్తాగ్ని-ర్విరచయతి నీరాజనవిధిమ్ !!
తాత్పర్యం:
అమ్మా! నిత్యురాలవగు నీ చరణములనుండి ఉద్భవించిన కాంతులతో, అణిమ, మహిమా మొదలైన అష్ట సిద్ధులతో కూడిన నిన్ను “నీవే నేను” అనే భావముతో, నిత్యమూ ధ్యానము చేయు భక్తుడు ముక్కంటి అయిన శివుని ఐశ్వర్యమును కూడ తృణీకరించగలడు. ఇక వానికి ప్రళయకాలాగ్ని నీరాజనమువలె అగుచున్నదనుటలో ఆశ్చర్యమేమున్నది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *