31. శ్లోకం
చతుః-షష్టయా తంత్రైః సకల మతిసంధాయ భువనం
స్థితస్తత్తసిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః !
పునస్త్వ-న్నిర్బంధాదఖిల-పురుషార్థైక ఘటనా-
స్వతంత్రం తే తంత్రం క్షితితల మవాతీతరదిదమ్ !!
తాత్పర్యం:
తల్లీ! జగజ్జననీ! పశుపతి అయిన శివుడు, జీవులను తృప్తి పరచడానికి వివిధ ప్రక్రియలతో వివిధ ఫలితాలనిచ్చు 64 రకముల తంత్రములను ఈ లోకమునకు ఇచ్చి, జీవులను మోహవ్యావాహములలో చిక్కుకొనునట్లు చేయగా – ఆ విధముగా మోహమునందు పడకుండుటకు బిడ్డలైన జీవులయందు వాత్సల్యముతో – నీవు నీ భర్త అయిన శివుని ప్రేమతో నిర్బంధ పెట్టగా – పరమ పురుషార్థ ప్రదమైన- నీదైన శ్రీవిద్యాతంత్రమును, ఈ భూలోక వాసులకు ప్రసాదింపజేసేను.
32.శ్లోకం
శివః శక్తిః కామః క్షితిరథ రవిః శీతకిరణః
స్మరో హంసః శక్ర-స్తదను చ పరామారహరయః !
అమీ హృల్లేఖాభి-స్తిసృభి-రవసానేషు ఘటితా
భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్ !!వివి
తాత్పర్యం:
· శివుడు, శక్తి మన్మథుడు, భూమి – ఈ నలుగురూ వరుసగా సూచించు క, ఏ, ఈ, ల – అను అక్షర కూటము;
· సూర్యుడు, చంద్రుడు, మన్మథుడు, సూర్యుడు, ఇంద్రుడు – ఈ ఐదుగురు వరుసగా సూచించు హ, స్మ, కృ హ, ల- అను అక్షర కూటము,
· పరాశక్తి, మన్మథుడు, హరి – ఈ ముగ్గురు వరుసగా ‘సూచించు స, క, ల – అను అక్షర కూటములు –
వాటి అంతము నందలి విరామ స్థానములందు – “హ్రీం” కారముల చేత సమకూర్చబడినపుడు ఏర్పడు ఆ మూడు కూటములలోని మొత్తము 15 అక్షరములు ‘ఓ జగజ్జననీ! నీ పంచదశాక్షరీ మంత్ర స్వరూపమునకు అవయవములుగా భాసించుచున్నవి.
33. శ్లోకం
స్మరం యోనిం లక్ష్మీం త్రితయ-మిద-మాదౌ తవ మనో
ర్నిధాయైకే నిత్యే నిరవధి-మహాభోగ-రసికాః !
భజంతి త్వాం చింతామణి-గుణనిబద్ధాక్ష-వలయాః
శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృత-ధారాహుతి-శతై !!
తాత్పర్యం:
ఓ నిత్యస్వరూపిణీ! రసజ్ఞులు, సమయాచారపరులు అయిన కొంతమంది యోగీంద్రులు- నీ మంత్రమునకు ముందు కామరాజ బీజమును, భువనేశ్వరీ బీజమును, శ్రీ బీజమును చేర్చి చింతామణులతో కూర్చిన జపమాలికను బూని, కామధేనువు యొక్క ఆజ్యధారలతో నిత్యస్వరూపురాలవైన నిన్ను- తమ హృదయ కమలములందు నిలిపి హోమము చేస్తూ, నిన్ను సంతృప్తి పరుస్తూ తాము నిరుపమాన, శాశ్వత సుఖానుభవమును పొందుతున్నారు.
34. శ్లోకం
శరీరం త్వం శంభోః శశి-మిహిర-వక్షోరుహ-యుగం
తవాత్మానం మన్యే భగవతి నవాత్మాన-మనఘమ్ !
అతః శేషః శేషీత్యయ-ముభయ-సాధారణతయా
స్థితః సంబంధో వాం సమరస-పరానంద-పరయోః !!
తాత్పర్యం:
ఓ భగవతీ! నవాత్మకుడయిన శంభునకు సూర్యచంద్రులు వక్షోరుహములుగా గల నీవు శరీరమగుచున్నావు. కాబట్టి అతడు శేషి (ప్రధానము) నీవు శేషము (అప్రధానము) అగుచున్నారు. ఆయన పరుడు. నీవు పరానందము. మీ ఇద్దరికిని ఉభయ సాధారణమైన సంబంధము కలదు. మనలో జీవం ఉన్నంతవరకే మనము అంబికా నామాన్ని జపించగలము. పూజ చేయగలము. సమస్త భౌతిక వ్యవహారములు నిర్వర్తించుకోగలము. అయితే ఈ పనులన్నిటి నిర్వహణ కేవలం మన ప్రాణశక్తి వలన మాత్రమే జరగటం లేదు. మన ప్రాణానికి ప్రాణంగా, ఆ తల్లి మన జీవం చేత సమస్త వ్యవహారాలు నడిపిస్తోంది.
35. శ్లోకం
మనస్త్వం వ్యోమ త్వం మరుదసి మరుత్సారథిరసి
త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం న హి పరమ్ ।
త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా
చిదానందాకారం శివయువతి భావేన బిభృషే ॥ 35 ॥
తాత్పర్యం:
ఓ శివుని ప్రియురాలైన జగజ్జననీ! ఆజ్ఞా చక్రమందలి మనస్తత్వము, విశుద్దియందలి ఆకాశతత్త్వము, అనాహత మందలి వాయుతత్త్వము, స్వాధిష్టాన మందలి అగ్నితత్వము, మణిపూరమందలి జలతత్త్వ్యము, మూలాధార మందలి భూతత్త్వ్యము గూడా నీవే అయి వున్నావు. ఈ విధముగా పంచభూతములు నీవే అయినపుడు ఇంక ఈ విశ్వమందు నీ కంటె ఇతరమైన పదార్ధము ఏదియు కొంచెము కూడా వుండదు, ఉండలేదు. నీవే నీ స్వరూపమును జగదాకారముగ పరిణమింప చేయుటకు చిచ్చక్తియుతుడైన ఆనందభైరవుని స్వరూపమును లేదా శివతత్వమును నీ చిత్తముతో ధరించుచున్నావు.
36. శ్లోకం
తవాజ్ఞా చక్రస్థం తపన శశికోటి ద్యుతిధరమ్
పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వంపరచితా !
యమారాధ్య న్భక్త్యా రవి శశి శుచీనామవిషయే
నిరాలోకే లోకే నివసతి హి భాలోక భువనే !!
తాత్పర్యం:
ఓ జగజ్జననీ! నీకు సంబంధించినదైన ఆజ్ఞాచక్రము నందు- కొన్ని కోట్ల సూర్య, చంద్రుల కాంతిని ధరించిన వాడును, “పర”యను పేరు పొందిన చిచ్చక్తిచేత కలిసిన, ఇరు పార్శ్యములు కలవాడును అగు పరమశివునికి నమస్కరించుచున్నాను. ఏ సాధకుడు భజనతత్పరుడై ఇట్టి పరమ శివుని ప్రసన్నునిగా చేసుకొనునో- అతడు రవిచంద్రాగ్నులకు సైతం వెలిగించడానికి వీలుకానటువంటిది, బాహ్యదృష్టికి గోచరింపనిది అయిన నీ సాయుజ్యమును పొందును.
37.శ్లోకం
విశుద్ధౌతే శుద్ధ స్పటిక విశదం వ్యోమ జనకం
శివం సేవే దేవీ _ మపి శివ సమాన వ్యవసితామ్!
యయోః కాంత్యాయాంత్యాః శశికిరణసారూప్యసరణే
చిధూతాంతర్థ్వాంతా విలసతి చకోరీవ జగతీ !!
తాత్పర్యం:
ఓ జగజ్జననీ! నీ విశుద్ది చక్రము నందు దోషరహితమైన స్ఫటిక స్వచ్చతతో మిక్కిలి నిర్మలమై వుండు వాడు, ఆకాశోత్పత్తికి హేతువైన వాడు అగు శివునిని, అట్టి శివునితో సమానమైన దేవివైన నిన్ను గూడా ఉపాసించుచున్నాను. చంద్రకాంతులతో సాటి వచ్చు మీ ఇరువురి కాంతులు కమ్ముకొనుటచే, ఈ సాధక లోకము- అజ్ఞానము నుండి తొలగి, ఆడు చకోర పక్షివలె ఆనందించును.
38. శ్లోకం
సమున్మీల త్సంవిత్కమల మకరందైక రసికమ్
భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానసచరమ్!
యదాలాపాదష్టాదశ గుణిత విద్యా పరిణతిః
యదాదత్తే దోషాద్గుణ మఖిల మద్భ్యః పయ ఇవ !!
తాత్పర్యం:
ఓ జగజ్జననీ! అనాహత జ్ఞాన కమలము నందలి తేనెను మాత్రమే గ్రోలుట యందు ఆసక్తి కలిగినది, యోగీశ్వరుల మానస సరోవరములందు విహరించునది, నీరమును విడిచి పాలను మాత్రమే గ్రహించు సామర్ధ్యము గలది, దేనిని భజించినచో అష్టాదశ విద్యలు చేకూరునో- అట్టి అనిర్వచనీయమైన శివశక్తులనే రాజహంసల జంటను ధ్యానించి భజించుచున్నాను.
39. శ్లోకం
తవ స్వాధిష్ఠానే హుతవహ మధిష్ఠాయ నిరతం
తమీడే సంవర్తం జనని మహతీం తాంచ సమయామ్!
యదా లోకేలోకాన్ దహతి మహతి క్రోధకలితే
దయార్ద్రాయా దృష్టి శ్శిశిర ముపచారం రచయతి !!
తాత్పర్యం:
తల్లీ! నీ స్వాధిష్ఠాన చక్రంలో అగ్ని తత్త్వాన్ని అధిష్టించి, నిరంతరం వెలిగే సదాశివుడిని నిత్యం స్మరిస్తాను. అలాగే ‘సమయ‘ అనే పేరు కలిగిన, చల్లని దయార్ద్రపూరిత దృష్టి గల నిన్ను స్తుతిస్తాను. ఎందుకంటే మహత్తరము, అధ్బుతము అయిన పమశివుని క్రోధాగ్ని దృష్టి భూలోకాదులను దహించగా, నీవు నీ దయతో కూడిన చల్లని చూపులతో- లోకాలన్నింటికీ ఉపశమనము కలుగజేసి సంరక్షిస్తున్నావు.
40. శ్లోకం
తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంథి స్ఫురణయా
స్ఫురన్నానా రత్నాభరణ పరిణద్ధేంద్ర ధనుషమ్ !
తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణమ్
నిషేవే వర్షంతం హరమిహిర తప్తం త్రిభువనమ్ !!
తాత్పర్యం:
నీ మణిపూర చక్రమే నివాసముగా గలిగి, ఆ మణిపూర చక్రమును ఆక్రమించి యుండు చీకటికి శత్రువై ప్రకాశించునట్టి మెరుపుశక్తిని గలిగి, వివిధ రత్నముల చేత తయారు చేయబడిన నగల చేత కూర్చబడిన ఇంద్రధనుస్సును గలిగి, నీలి వన్నెలు గలిగిన హరుడను సూర్యునిచే దగ్ధమైన మూడు లోకములకు- తాపము నుండి ఉపశమనముగా వర్షించునది, ఇంతటిది అని చెప్పనలవి కానిదీ అయిన – మేఘమును, మేఘ స్వరూపములోనున్న శివుని సేవించుచున్నాను.
Leave a Reply