71. శ్లోకం
నఖానా ముద్ద్యోతైర్నవ నలినరాగం విహసతాం
కరాణాం తే కాంతిం కథయ కథయామః కథముమే ।
కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం
యది క్రీడల్లక్ష్మీ చరణ తలలాక్షారస ఛణమ్ ॥ 71 ॥
తాత్పర్యం:
తల్లీ ! ఉమాదేవీ ! అప్పుడే వికసించు తామరపూవు యొక్క ఎర్రని కాంతులను సైతం పరిహసించు గోళ్ళ కాంతులతో శోభిల్లు – నీ యొక్క హస్త ప్రభావైభవమును ఏ విధముగా వర్ణించగలము? క్రీడించు లక్ష్మీదేవి పాద లాక్షారుణరసముతో కూడి సమర్థవంతమైనచో, అప్పుడు నీ హస్త ప్రభల 16వ పాలుతో పోల్చుటకు ఏమైనా అవి సరిపోవునేమో!
72. శ్లోకం
సమం దేవి స్కందద్విపవదన పీతం స్తనయుగం
తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుతముఖమ్ ।
యదాలోక్యాశంకా కులిత హృదయో హాసజనకః
స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝడితి ॥ 72 ॥
తాత్పర్యం:
ఓ త్రిపుర సుందరీ దేవీ! ఒకే సమయములో కుమారస్వామి చేతను, వినాయకుని చేతనుగూడా పాలు త్రాగబడినవి, పాలు స్రవింపజేయు అగ్రభాగములు కలవి, పాలు త్రాగునపుడు ఏ జంటను చూచి వినాయకుడు- “తన తలపై నుండు కుంభములు దొంగిలింపబడి ఇక్కడ చాటుగా ఉన్నవా? అన్న శంకతో వెంటనే తన కుంభస్థలములను తొండము చేత తడుముకొనగా, అది చూచిన పార్వతీ కుమారులకు నవ్వు వచ్చెనో – అట్టి నీ హృదయ భాగము మా దుఃఖములను తొలగించుగాక!
73. శ్లోకం
అమూ తే వక్షోజావమృత రస మాణిక్య కుతుపౌ
న సందేహస్పందో నగపతి పతాకే మనసి నః ।
పిబంతౌ తౌ యస్మాదవిదిత వధూ సంగరసికౌ
కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంచదలనౌ ॥ 73 ॥
తాత్పర్యం:
పర్వతరాజు వంశమునకు వన్నెతెచ్చిన గిరిజాదేవీ! మాకు కనిపించు ఈ నీ స్తనములు అమృత రసముతో నిండినవై, పద్మరాగమణులచే చేయబడిన కుప్పెలుగా ఉన్నవి. ఈ విధముగా చెప్పుటలో మాకు మనస్సునందు కొంచెమైనను సందేహము లేదు. ఏలయనగా – దానిని గ్రోలిన వారైన గజముఖుడైన గణపతి, క్రౌంచపర్వతమును కొట్టిన కుమారస్వామి నేటి వరకు గూడ ఏ కాంతాసంగము వలన గూడా ఆనందమును పొందు రసికులు కానివారై, బాలురుగానే వున్నారు గదా!
74. శ్లోకం
వహత్యంబ స్తంబేరమదనుజ కుంభ ప్రకృతిభిః
సమారబ్ధాం ముక్తామణిభి రమలాం హార లతికామ్ ।
కుచాభోగో బింబాధర రుచిభిరంతః శబలితాం
ప్రతాపవ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివ తే ॥ 74 ॥
తాత్పర్యం:
ఓ జగజ్జననీ! విశాలముగను, పక్వముగను ఉండు నీ స్తనములకు మెడకు మధ్య నున్న ప్రదేశము – గజాసురుని కుంభస్థలము నుండి పుట్టినది , దోషరహితము, స్వచ్ఛమైనది అయిన ముత్యముల చేత కూర్చబడిన తీగల వంటి ముత్యాల హారమును కలిగి, దొండపండు కెంపురూపు గలదైన నీ క్రింది పెదవి కాంతులచేత, లోన ప్రతిఫలించిన చిత్రవర్ణముతో గూడినదై – రక్త వర్ణకాంతులతో త్రిపుర హరుడైన శివుని కీర్తిని పొందిన దానివలె నున్నది.
75. శ్లోకం
తవ స్తన్యం మన్యే ధరణి ధరకన్యే హృదయతః
పయఃపారావారః పరివహతి సారస్వతమివ ।
దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవ యత్
కవీనాం ప్రౌఢానామజని కమనీయః కవయితా ॥ 75 ॥
తాత్పర్యం:
ఓ పార్వతీ ! నీ చనుబాలను – నీ హృదయము నుండి పుట్టి పొరలి వచ్చు ప్రాలసముద్ర రూపమైన సారస్వతము వలె తలంచెదను. లేనిచో – అమిత ప్రేమతో నీవు ఇచ్చిన ఆ నీ పాలను త్రాగి ద్రవిడ దేశములో (అనగా కేరళలోని కాలడి గ్రామములో) పుట్టిన బాలుడు (అనగా ఈ స్తోత్ర కర్త అయిన శంకారాచార్యుల వారే!) ప్రౌఢులు, ఉద్దండులు అయిన కవీశ్వరులలో కెల్లా కమనీయమైన కవిత్వమును చెప్పగల వానిగా ప్రసిద్ది చెందువాడగునా?
76. శ్లోకం
హరక్రోధ జ్వాలావలి భిరవలీఢేన వపుషా
గభీరే తే నాభీసరసి కృతసంగో మనసిజః ।
సముత్తస్థౌ తస్మాదచల తనయే ధూమలతికా
జనస్తాం జానీతే తవ జనని రోమావలిరితి ॥ 76 ॥
తాత్పర్యం:
ఓ పార్వతీ ! శివుని క్రోధాగ్ని జ్వాలలు కమ్మబడిన తన శరీరముతో మన్మథుడు ఉపశమనము కోసము, లోతైన నీ నాభి అను కొలనులోకి దూకి మునిగినపుడు, నిప్పు చల్లారి ఆ కొలను నుండి తీగవలె పొగపైకి ప్రాకినది. దానిని (ఆ పాగతీగను) చూచిన జనులు నీ రోమావళి అని అనుకొనుచున్నారు.
77. శ్లోకం
యదేతత్ కాలిందీ తనుతరతరంగాకృతి శివే
కృశే మధ్యే కించిజ్జనని తవ యద్భాతి సుధియామ్ ।
విమర్దాదన్యోఽన్యం కుచ కలశయోరంతరగతం
తనూభూతం వ్యోమ ప్రవిశదివ నాభిం కుహరిణీమ్ ॥ 77 ॥
తాత్పర్యం:
ఓ భగవతీ! జగజ్జననీ! యమునానదీ తరంగము వలె సన్నగా చిన్నగా ఉండి, నీ నడుము మధ్యమునందు మెరయుచూ కనబడెడు నూగారును చూసే మేధావులకు, విద్వాంసులకు, అది – నీ స్తనముల మధ్యనున్న ఆకాశము – ఆ స్తనములు రెండును ఒరయుట వలన ఆ రాపిడికి తాళలేక, చోటు చాలక నలిగి, నల్లనై, సన్ననై, మెల్లగా అధోమార్గముగా నీ నాభిని ప్రవేశించుచున్నట్లనిపించును.
78. శ్లోకం
స్థిరో గంగావర్తః స్తనముకుల రోమావలిలతా-
కలావాలం కుండం కుసుమ శరతేజో హుతభుజః ।
రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే
బిలద్వారం సిద్ధేర్గిరిశ నయనానాం విజయతే ॥ 78 ॥
తాత్పర్యం:
ఓ గిరిరాజపుత్రికా ! పార్వతీ! నీ యొక్క నాభి స్టిరముగా ఉన్న గంగానది సుడిగాను, స్తనములు అను పూల మొగ్గలను దాల్చు నూగారు అను తీగకు పాదుగాను, మన్మథుని యొక్క తేజస్సుకు, లేదా అగ్నికి హోమ గుండముగాను, రతీదేవికి శృంగార గృహముగాను, నీ పతియగు సదాశివుని తపస్సిద్దికి గుహాద్వారముగాను అగుచూ, వర్ణనాతీతమై, సర్వోత్కృష్టముగా ప్రకాశించుచున్నది.
79. శ్లోకం
నిసర్గ క్షీణస్య స్తనతట భరేణ క్లమజుషో
నమన్మూర్తేర్నారీ తిలక శనకైస్త్రుట్యత ఇవ ।
చిరం తే మధ్యస్య త్రుటిత తటి నీతీర తరుణా
సమావస్థాస్థేమ్నో భవతు కుశలం శైలతనయే ॥ 79 ॥
తాత్పర్యం:
ఓ నారీ తిలకమా! పార్వతీ! స్వభావసిద్దముగనే మిక్కిలి సన్నగానున్నదై, రెండు స్తనములు అను గట్టుల బరువుచే అలసట పొందుచూ- కొంచెము వంగిన రూపు గలదై, తునిగి పోవుచున్నట్లనిపించునదై, కట్ట తెగిపోయిన ఏటి గట్టు నందలి చెట్టుతో పోల్చదగిన స్థితిలో స్థిరముగా నున్న – నీ నడుమునకు కలకాలము క్షేమము కలుగు గాక!
80. శ్లోకం
కుచౌ సద్యః స్విద్యత్తట ఘటిత కూర్పాసభిదురౌ
కషంతౌ దోర్మూలే కనక కలశాభౌ కలయతా ।
తవ త్రాతుం భంగాదలమితి వలగ్నం తనుభువా
త్రిధా నద్ధం దేవి త్రివలి లవలీవల్లిభిరివ ॥ 80 ॥
తాత్పర్యం:
ఓ దేవీ! అప్పటికప్పుడే చెమట పోయుచున్న పార్శ్యములను అంటుకొని వున్న రవికె పిగిలిపోవునేమో అను భావమును కలుగచేయుచూ, బాహుమూల ప్రదేశములను రాచుకొనుచూ, బంగారు కడవల చక్కదనముతో ఒప్పారి, గొప్పగా కనబడుచూ నుండు స్తనములను నిర్మించుచున్న మన్మథుడు ఈ స్తనభారము వలన నడుము తునిగే కీడు రాకుండా ఆ నడుమును కాపాడుటకై, ఏలకి తీగెల (అడవిలోని ఒకమొక్క తీగలు) చేత ముప్పేటగా కట్టబడెనా అనునట్లు – త్రివళులతో గూడిన నీ నడుము తోచుచున్నది.