81. శ్లోకం
గురుత్వం విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజా-
న్నితంబాదాచ్ఛిద్య త్వయి హరణ రూపేణ నిదధే ।
అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం
నితంబప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి చ ॥ 81 ॥
తాత్పర్యం:
అమ్మా పార్వతీ! పర్వతరాజగు నీ తండ్రి హిమవంతుడు బరువు, విశాలత్వములను తన కొండ నడుమయందు గల చదునైన ప్రదేశము నుండి వేరు చేసి, నీకు “స్త్రీ ధనము” రూపముగా సమర్పించెను. అందువలననే – నీ పిరుదుల యొక్క గొప్పదనము – బరువు గాను, విశాలముగాను, విరివిగాను వుండి, ఈ సమస్త భూభాగమును కప్పుచుండుటయే గాక, దానిని మించుతున్నది.
82. శ్లోకం
కరీంద్రాణాం శుండాన్ కనక కదలీ కాండపటలీమ్
ఉభాభ్యామూరుభ్యామ్ ఉభయమపి నిర్జిత్య భవతీ ।
సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే
విధిజ్ఞ్యే జానుభ్యాం విబుధకరి కుంభద్వయమసి ॥ 82 ॥
తాత్పర్యం:
వేద ప్రతిపాదిత విధులను సక్రమముగా అనుష్టించు దేవీ! పార్వతీ! ఏనుగు తొండములను, బంగారు అరటి స్తంభములను – ఈరెంటిని నీవు – నునుపుగాను, మెత్తగానునున్న నీ రెండు తొడలచే జయించి; నునుపుగా, సొగసుగా, గుండ్రముగా ఉండి – పతియైన పరమేశ్వరునికి నీవు సాగిలపడి మ్రొక్కునపుడు భూమిని తాకుట చేత గట్టిపడిన మోకాటి చిప్పల చేత – దేవలోకమునందలి ఐరావత కుంభస్థలములను గూడా జయించిన దానవగుచున్నావు.
83. శ్లోకం
పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే
నిషంగౌ జంఘే తే విషమ విశిఖో బాఢమకృత ।
యదగ్రే దృశ్యంతే దశశరఫలాః పాదయుగలీ-
నఖాగ్రచ్ఛద్మానః సురమకుట శాణైక నిశితాః ॥ 83 ॥
తాత్పర్యం:
ఓ గిరి రాజపుత్రీ! పార్వతీ! పంచశరుడైన మన్మథుడు- రుద్రుని గెల్చుట కోసం తనకున్న ఐదు బాణములు చాలవని రెండింతలుగా, అనగా – పదిబాణములుగా చేసుకోవాలని, నీ పిక్కలను అమ్ముల పొదులుగా, రెండు కాళ్ళ వేళ్ళను పది బాణములుగా, ఇంద్రాది దేవతలు నీ పాదములకు మొక్కినపుడు వారి కిరీట రత్నముల రాపిడిచే సానపెట్టబడిన నీ పాదముల వేళ్ళ గోళ్ళను – ఆ బాణములకు ములుకులుగాను చేసుకొనెను.
84. శ్లోకం
శ్రుతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా
మమాప్యేతౌ మాతః శిరసి దయయా ధేహి చరణౌ ।
యయోః పాద్యం పాథః పశుపతి జటాజూట తటినీ
యయోర్లాక్షాలక్ష్మీరరుణ హరి చూడామణి రుచిః ॥ 84 ॥
తాత్పర్యం:
తల్లీ! జగజ్జననీ! ఏ పాదముల జంటను – ఉపనిషత్తులు శిరస్సులందు ధరించునో, వేదవనితలు తమ శిరస్సులందు పూవులుగా ధరింతురో, ఏ పాదముల జంటకు శివుని జటాజూటగంగ- పాదములు కడుగు నీరు అగునో, ఏ పాదముల జంట విష్ణుమూర్తి శిరోభూషణము యొక్క అరుణకాంతికి కారణమో- అట్టి నీ చరణములను దయతో నా శిరస్సుపై ఉంచుము.
85. శ్లోకం
నమోవాకం బ్రూమో నయన రమణీయాయ పదయో-
స్తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిర సాలక్తకవతే ।
అసూయత్యత్యంతం యదభిహననాయ స్పృహయతే
పశూనామీశానః ప్రమద వనకంకేలిత రవే ॥ 85 ॥
తాత్పర్యం:
అమ్మా భగవతీ! నీ పాదయుగళము చూచువారికి నయనానందకరముగా ఉన్నది. చక్కని స్ఫష్టమైన ప్రకాశముతో వెలుగులు విరజిమ్ముచున్నది. లత్తుక రసముచే తడిసి కెంపురంగుతో ఇంపుగా ఉన్నది. నీపాద తాడనమును ఎప్పుడూ పొందు అవకాశము గలిగిన అలరులతోటలోని అశోకవృక్షములను గాంచి, అసూయ కలిగి, శివుడు నీ పాదతాడనము తనకూ చెందవలెనని తహతహలాడుచున్నాడు. అట్టి నీపాద యుగళమునకు నమస్కరించు చున్నాను.
86. శ్లోకం
మృషా కృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష్యనమితం
లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే ।
చిరాదంతఃశల్యం దహనకృతమున్మూలితవతా
తులాకోటిక్వాణైః కిలికిలిత మీశానరిపుణా ॥ 86 ॥
తాత్పర్యం:
తల్లీ! జగజ్జననీ! త్వరపడి పొరపాటున నీ దగ్గర నీ సవతి పేరును పలికి, తరువాత ఏమి చేయుటకూ తోచకపోవుటచే నీకు పాద ప్రణామము చేసి లొంగిపోయిన నీ భర్తను- నీ పాద పద్మముతో నుదుట తాడనము జరుపగా – దానిని గమనించిన శివుని శత్రువైన మన్మథుడు – హృదయశల్యమైన తన చిరకాల బాధ తీరి, శివునికి తగిన శాస్త్రి జరిగినదని కిలకిలా నవ్వినట్లు నీ కాలిగజ్జెల చిరు సవ్వడులు తోచుచున్నవి.
87. శ్లోకం
హిమానీహంతవ్యం హిమగిరి నివాసైకచతురౌ
నిశాయాం నిద్రాణం నిశి చరమభాగే చ విశదౌ ।
వరం లక్ష్మీపాత్రం శ్రియమతిసృజంతౌ సమయినాం
సరోజం త్వత్పాదౌ జనని జయతశ్చిత్రమిహ కిమ్ ॥ 87 ॥
తాత్పర్యం:
తల్లీ! జగజ్జననీ! నిత్యము మంచుకొండ యందు నివసించుచూ, సంచరింపగలవి, రాత్రిపూట, రాత్రి చివరి సమయములలో కూడా ప్రకాశించునవి, సమయాచార పరులకు సిరిసంపదలను మిక్కుటముగా కలుగజేయునవి అయిన నీ పాదములు- మంచు మొత్తము చేత నశింపచేయతగినది, రాత్రివేళ ముడుచుకొని వుండునది, పగలు మాత్రమే లక్ష్మీదేవి అథిష్టించుటకు అనువైనది అగు పద్మమును జయించుచున్నవి. ఈ విషయములో ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు.
88. శ్లోకం
పదం తే కీర్తీనాం ప్రపద మపదం దేవి విపదాం
కథం నీతం సద్భిః కఠినకమఠీ కర్పరతులామ్ ।
కథం వా బాహుభ్యాముపయమనకాలే పురభిదా
యదాదాయ న్యస్తం దృషది దయమానేన మనసా ॥ 88 ॥
తాత్పర్యం:
అమ్మా! జగజ్జననీ! అన్ని సత్కీర్తులకు ఆలవాలమై, అన్ని ఆపదలకు ఇరవుగానిదైన నీ పాదముల పై భాగమును సత్కవీంద్రులు – మిక్కిలి గట్టిగా నుండు ఆడు తాబేలు యొక్క వీపు పైడిప్పతో సరిపోల్చుటకు ఎట్లు ప్రయత్నించుచున్నారు? త్రిపుర హరుడైన శివుడు నిర్దయుడై వివాహ సమయమున సన్నికల్లు మీద మెత్తని నీ పాదమును ఏ విధముగా ఉంచగలిగినాడు.
89. శ్లోకం
నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచ శశిభి-
స్తరూణాం దివ్యానాం హసత ఇవ తే చండి చరణౌ ।
ఫలాని స్వఃస్థేభ్యః కిసలయ కరాగ్రేణ దదతాం
దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ ॥ 89 ॥
తాత్పర్యం:
అమ్మా! చండీ! జగజ్జననీ! సకల సంపదలతో తులతూగుచూ నుండు దేవతల కోరికలను మాత్రమే- తమ చిగురుటాకులు అను హస్తముల చేత తీర్చు కల్పవృక్షములను చూసి – దీన దరిద్ర జనులకు శుభప్రదమైన అధిక సిరిసంపదలను ఎప్పటికప్పుడు కలిగించు నీ పాదములు – శచీదేవి మొదలైన దేవతా స్త్రీల యొక్క చేతులనే పద్మములను ముకుళింపచేయు గోళ్ళు అను చంద్రుల చేత – పరిహసించుచున్నట్టున్నవి.
90. శ్లోకం
దదానే దీనేభ్యః శ్రియమనిశమాశాను సదృశీ-
మమందం సౌందర్యప్రకర మకరందం వికిరతి ।
తవాస్మిన్ మందారస్తబక సుభగే యాతు చరణే
నిమజ్జన్మజ్జీవః కరణచరణః షట్చరణతామ్ ॥ 90 ॥
తాత్పర్యం:
తల్లీ! జగజ్జననీ! దీనజనులకు ఎల్లప్పుడు వారి కోర్కెలకు తగిన విధముగా సిరిసింపదలను అనుగ్రహించునది, అధికమైన లావణ్య, సౌభాగ్యములు అనే పూతేనెలను చల్లుచున్నది, కల్పవృక్ష పుష్పగుఛ్చము వలె అందమైనది అగు నీ పాదపద్మమునందు – మనస్సుతో కూడిన పంచజ్ఞానేంద్రియములు ఆరునూ పాదములుగా గలవాడనైన నేను మునుగుచూ భ్రమర భావమున వసింతును గాక!
Leave a Reply