శ్రీరామరక్షా స్తోత్రం

Ramaraksha Stotram Sanskrit verses with Lord Rama image

శ్రీ రామ రక్షా స్తోత్రం

శ్రీ రామ రక్షా స్తోత్రం అత్యంత ప్రతిభావంతమైనది. ఈ స్తోత్రం శారీరక, మానసిక, రుగ్మతలను పూర్తిగా తొలగిస్తుంది. శత్రుభయం అశాంతి, నిరాశ, నిస్పృహ, దుఃఖం, మొదలైన పరిస్థితులలో ఈ స్తోత్రాన్ని పఠిస్తే, అన్ని బాధలు దూరమౌతాయి. అయితే కావలసినదల్లా అచంచలమైన, దృఢమైన విశ్వాసం, భక్తి. ధనబలం, విద్యాబలం, బుద్ధిబలం ప్రసాదించే ఈ స్తోత్ర రాజాన్ని నిరంతరం పఠించి తరిద్దాం.

ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య
బుధకౌశిక ఋషిః
శ్రీ సీతారామ చంద్రోదేవతా
అనుష్టుప్ ఛందః
సీతా శక్తిః
శ్రీమద్ హనుమాన్ కీలకం
శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగః ॥

శ్రీరామ రక్షా స్తోత్రం మంత్రమునకు బుధకౌశికుడు – బుషి; సీతాసమేత శ్రీరామచంద్రస్వామి – అధిదేవత; సీతామాత – శక్తి, హనుమంతుడు -కీలకము. ఈ స్తోత్రం అనుష్టుప్ ఛందస్సులో వ్రాయబడినది. శ్రీ రామరక్షాస్తోత్రమును శ్రీరామచంద్రుని అనుగ్రహం కొరకు వినియోగించెదరు.

ధ్యానం
ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం
పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్ ।
వామాంకారూఢ సీతాముఖ కమలమిలల్లోచనం నీరదాభం
నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్ ॥

ఆజానుబాహుడు, ధనుర్బాణాలను ధరించినవాడు, పసుపు పచ్చని వస్త్రాలను ధరించి పద్మాసనస్తుడై కూర్చుని యున్నవాడు, కలువ రేకులకన్న మిన్న అయిన కన్నులు కలవాడు, నీల మేఘ శ్యాముడు, వివిధ అలంకారాలతో ప్రకాశించుచున్న జటామండలం గలవాడు, ఎడమవైపు ఒడిలో కూర్చుని ఉన్న సీతాదేవి ముఖకమలాన్ని చూస్తు  ప్రసన్నమైన  వదనం కలవాడు అయిన  శ్రీరామచంద్రుని ధ్యానించవలెను.

స్తోత్రం
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ ।
ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్ ॥ 1 ॥

వందకోట్ల శ్లోకాలతో విస్తరించిన శ్రీరాముని `చరిత్రలోని ప్రతి అక్షరము మహాపాపములను సైతం పోగొట్టగల శక్తిని కలిగి ఉన్నది.

ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్ ।
జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్ ॥ 2 ॥

నల్లకలువల వంటి శరీరవర్ణం కలవాడు, కమల నేత్రుడు, జటామండలమే కిరీటముగా ధరించినవాడు, సీతాలక్ష్మణులతో కూడి ఉన్నవాడైన శ్రీరాముని హృదయమున నిలిపి ధ్యానించవలెను.

సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్ ।
స్వలీలయా జగత్త్రాతు మావిర్భూతమజం విభుమ్ ॥ 3 ॥

ఖడ్గము, ధనుస్సు బాణ తూణీరములు ధరించి రాక్షసులను సంహరించువాడు, జననములేని వాడు, లోకములను రక్షించుట కోసమై లీలామానుష విగ్రహుడై అవతరించు భగవానుని ధ్యానించవలెను.

రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ ।
శిరో మే రాఘవః పాతు ఫాలం (భాలం) దశరథాత్మజః ॥ 4 ॥

సమస్త పాపములను నాశనం చేయునది, కోరిన కోర్కెలు తీర్చునది అయిన రామరక్షా స్తోత్రమును జ్ఞాని అయినవాడు పఠించవలెను. రఘువంశ సంజాతుడైన ఆ  రామచంద్ర  ప్రభువు  నా శిరస్సును రక్షించుగాక. నా నుదిటిని దశరథనందనుడైన శ్రీరాముడు రక్షించుగాక.

కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్రప్రియః శృతీ ।
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః ॥ 5 ॥

కౌసల్యానందనుడు నా నేత్రాలను, విశ్వామిత్రునికి అతి ఇష్టుడు నా కర్ణములను, యజ్ఞములను రక్షించినవాడు నా జ్ఞానేంద్రియములను, సౌమిత్రీ వత్సలుడు నా ముఖమును రక్షించుగాక.

జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః ।
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః ॥ 6 ॥

విద్యానిధి అయినవాడు నా జిహ్మను, భరతునిచే పూజింపబడిన వాడు నా కంఠమును, దివ్యాయుధుడు నా స్కంధములను, శివుని విల్లు విరచినవాడు నా భుజములను రక్షించుగాక.

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ ।
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః ॥ 7 ॥

సీతామనోహరుడు నా హస్తాలను, పరశురాముని జయించినవాడు నా హృదయాన్ని, రాక్షసాంతకుడు నా మధ్య భాగాన్ని, జాంబవంతుడు ఆశ్రయించిన వాడు నా నాభిని రక్షించుగాక.

సుగ్రీవేశః కటిం పాతు సక్థినీ హనుమత్-ప్రభుః ।
ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకుల వినాశకృత్ ॥ 8 ॥

సుగ్రీవుని ప్రభువు నాభి క్రిందిభాగమును – హనుమంతుని ప్రభువు నా తొడ, ఎముకలను – రాక్షసులను సంహరించిన రఘురాముడు నా ఊరువులను రక్షించుగాక.

జానునీ సేతుకృత్-పాతు జంఘే దశముఖాంతకః ।
పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఽఖిలం వపుః ॥ 9 ॥

సముద్రానికి  వారధి నిర్మించినవాడు నా  మోకాళ్ళను  – రావణుని సంహరించినవాడు నా పిక్కలను విభీషణునికి రాజ్య సంపదను ప్రసాదించిన ప్రభువు నా పాదములను రక్షించుగాక. – శ్రీరామచంద్ర ప్రభువు నా దేహమంతటినీ కాపాడుగాక.

ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ ।
స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ ॥ 10 ॥

శ్రీరాముని దివ్యబలసంపన్నమైన ఈ రామరక్షా స్తోత్రము పఠించు పుణ్యాత్ముడు దీర్ఘాయువును, సుఖమును, పుత్రసంతానమును, విజయమును, వినయమును పొందగలడు.

పాతాళ-భూతల-వ్యోమ-చారిణ-శ్చద్మ-చారిణః ।
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః ॥ 11 ॥

భూమి, ఆకాశము, పాతాళ లోకాలలో చరించే ఏ జీవి అయినా కూడా, రామనామం చేత రక్షించబడినవాడిని కన్నెత్తి అయినా చూడడం సాధ్యం కాదు.

రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ ।
నరో న లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి ॥ 12 ॥

రామా, రామభద్రా, రామచంద్రా అనే ఈ నామాలను స్మరించడం వలన మానవుడు పాపాలనుండి విముక్తి పొందడమే కాక సకల భోగాలను, అంత్యములో మోక్షాన్ని కూడా పొందుతాడు.

జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్ ।
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః ॥ 13 ॥

మూడు లోకాలను జయించు శక్తిగల రామ మంత్రముచే రక్షింపబడి ఉన్న ఈ రామ రక్షా స్తోత్రమును కంఠస్థము చేసిన వారికి సర్వ సిద్ధులు కరతలామలకములు అవుతాయి.

వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్ ।
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళమ్ ॥ 14 ॥

వజ్రసదృశ్యమైన ఈ రామ రక్షా స్తోత్రాన్ని స్మరించే వారి ఆజ్ఞలను దాటటం ఎవరి వల్ల కాదు. అతడికి అన్ని విధాలా జయము, మంగళము కలుగుతాయి.

ఆదిష్టవాన్-యథా స్వప్నే రామరక్షామిమాం హరః ।
తథా లిఖితవాన్-ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః ॥ 15 ॥

పరమ శివుడు స్వప్నములో ఉపదేశించిన, ఈ రామ రక్షా స్తోత్రమును బుధకౌశిక ముని ప్రాతః కాలమున రచించెను.

ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్ ।
అభిరామ-స్త్రిలోకానాం రామః శ్రీమాన్ స నః ప్రభుః ॥ 16 ॥

కోరిన కోర్కెలు తీర్చు కల్ప వృక్షముల సమూహము వంటివాడు, సమస్త ఆపదలను రూపుమాపువాడు, మూడు లోకములకు అభిరాముడు, శ్రీమంతుడు అయిన శ్రీరామ చంద్రుడే మనకు ప్రభువు.

తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ ।
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ॥ 17 ॥

ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ ।
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ॥ 18 ॥

శరణ్యౌ సర్వసత్త్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్ ।
రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ ॥ 19 ॥

తరుణ  వయస్సు  కలవారు, రూపంలో అతి సుందరులు బలపరాక్రములు, కమలములవంటి విశాలమైన నేత్రాలు కలవారు, నారచీరలను, కృష్ణమృగ చర్మాలను ధరించి, కంద మూల ఫలాలను ఆహారంగా స్వీకరించేవారు, మహా తపస్వులు, శరణు నిచ్చువారు,  శ్రేష్ట  ధనుర్ధారులు,  రాక్షసులను నశింపచేయువారు అయిన రామలక్ష్మణులు మమ్ములను రక్షింతురుగాక.

ఆత్త సజ్య ధనుషా విషుస్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ ।
రక్షణాయ మమ రామలక్షణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్ ॥ 20 ॥

నారిని సారించిన ధనుస్సును చేతబట్టిన వారు, ఎల్లప్పుడూ బాణంపై తమ చేతులు కలవారు, అక్షయ బాణములు తూణీరంలో కలిగినవారు అయిన రామ లక్ష్మణులు ఎల్లప్పుడూ నా ముందుండి నన్ను రక్షించెదరుగాక.

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా ।
గచ్ఛన్ మనోరథాన్నశ్చ (మనోరథోఽస్మాకం) రామః పాతు స లక్ష్మణః ॥ 21 ॥

జగద్రక్షణార్థము సర్వదా సంసిద్ధుడై కవచ, ఖడ్గములు, విల్లంబులు ధరించి యువకుడై, తమ్ముడైన లక్ష్మణునితో కూడిన శ్రీరాముడు మన కోరికలను తీరుస్తూ మనలను రక్షించుగాక.

రామో దాశరథి శ్శూరో లక్ష్మణానుచరో బలీ ।
కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః ॥ 22 ॥

వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః ।
జానకీవల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః ॥ 23 ॥

ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః ।
అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః ॥ 24 ॥

శ్రీరాముడు ఇట్లు పలికెను – “రాముడు, దాశరథి, శూరుడు, లక్ష్మణానుచరుడు, బలవంతుడు, కాకుత్స్థుడు, పురుషుడు, పూర్ణుడు, కౌసల్యాతనయుడు, రఘూత్తముడు, వేదాంతవేద్యుడు, యజ్ఞేశుడు, పురాణ పురుషోత్తముడు, జానకీ వల్లభుడు, శ్రీమంతుడు, అప్రమేయ పరాక్రముడు” అను ఇటువంటి (నా) పదహారు నామములను శ్రద్ధా భక్తులతో నిత్యము జపించే నా భక్తుడు నిస్సంశయముగా అశ్వమేధ యాగము కన్న అధికమైన పుణ్యఫలమును

పొందగలడు.

రామం దూర్వాదళ శ్యామం పద్మాక్షం పీతవాససమ్ ।
స్తువంతి నాభి-ర్దివ్యై-ర్నతే సంసారిణో నరాః ॥ 25 ॥

దూర్వాదళం వంటి నీల వర్ణం కలిగినవాడు, కమల నేత్రుడు, పీతాంబరాలు ధరించినవాడు అయిన శ్రీరామచంద్రుని నామాలను జపించే వారు సంసార సాగరములనుండి ఉద్ధరించబడతారు.

రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్ ।
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్ ॥ 26 ॥

లక్ష్మణునికి అగ్రజుడు, రఘుకుల శ్రేష్టుడు,  సీతామనోహరుడు, కాకుత్స్థ కులనందనుడు, కరుణామూర్తి, గుణనిథి, బ్రాహ్మణ ప్రియుడు, రాజులకు రాజు, సత్య ప్రతిజ్ఞ కలవాడు, దశరథసుతుడు, శ్యామవర్ణుడు,  అతిలోక సుందరుడు, రఘుకుల తిలకుడు, రాఘవుడు, రావణుని సంహరించినవాడు అయిన శ్రీ రామచంద్రునకు నమస్కరిస్తున్నాను.

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే ।
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ॥ 27 ॥

రాముడు, రామభద్రుడు, రామచంద్రుడు, రఘునాథుడు, సీతాపతి అని పిలువ బడుచున్న శ్రీరామ చంద్రునకు నమస్కారము.

శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ ।
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ ॥ 28 ॥

రఘునందనా, భరతునికి అగ్రజుడా, యుద్ధములో అతి కర్కశుడైన వాడా, మాకు శరణు నొసంగి మమ్ములను రక్షించుము.

శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి
శ్రీరామ చంద్ర చరణౌ వచసా గృహ్ణామి ।
శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి
శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే ॥ 29 ॥

శ్రీరామచంద్రుని పాదాలను మనసులో నిరంతరం స్మరిస్తున్నాను. రామచంద్రుని పాదాలనే భజిస్తున్నాను.  రామచంద్రుని చరణాలకు శిరస్సు వంచి అభివాదం చేస్తున్నాను. శ్రీ రామచంద్రుని పాదాలు నాకు శరణు నొసంగుగాక.

మాతా రామో మత్-పితా రామచంద్రః
స్వామీ రామో మత్-సఖా రామచంద్రః ।
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నాన్యం జానే నైవ జానే న జానే ॥ 30 ॥

శ్రీ రామచంద్రా, నాకు తల్లివి, తండ్రివి, ప్రభువువు, స్నేహితుడవు, నా సర్వస్వము నీవే. నీవు తప్ప నేను ఇతరులను ఎవరిని ఎరుగను.

దక్షిణే లక్ష్మణో యస్య వామే చ (తు) జనకాత్మజా ।
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ ॥ 31 ॥

కుడివైపున లక్ష్మణుడు, ఎడమ వైపు సీతాదేవి, ఎదుట ఆంజనేయుడు ఉండగా, విరాజిల్లుతున్న రఘునందనుడైన శ్రీరామునికి వందనం.

లోకాభిరామం రణరంగధీరం
రాజీవనేత్రం రఘువంశనాథమ్ ।
కారుణ్యరూపం కరుణాకరం తం
శ్రీరామచంద్రం శరణ్యం ప్రపద్యే ॥ 32 ॥

సర్వ లోకాలకు సంతోషాన్ని కలిగించేవాడు, రణం అనే క్రీడలో ధీరత్వం కలిగినవాడు, కమలములవంటి కన్నులు కలవాడు, రఘువంశ నాయకుడు, కరుణ రసం మూర్తీభవించినవాడు అయిన శ్రీరామచంద్రుడు నాకు శరణునిచ్చుగాక.

మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్ ।
వాతాత్మజం వానరయూథ ముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే ॥ 33 ॥

మనో వేగము గలవాడు, వాయుసమాన వేగం గలవాడు, ఇంద్రియములను జయించినవాడు, బుద్ధిమంతులలో శ్రేష్టుడు, వాయుపుత్రుడు, వానర వీరులలో ముఖ్యుడు, శ్రీరాముని దూత అయిన హనుమానుని శరణువేడుచున్నాను.

కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్ ।
ఆరుహ్యకవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ॥ 34 ॥

కవిత్వమనే చెట్టుకొమ్మపై కూర్చుని, ‘రామా! రామా” అనే తీయని అక్షరములను మరింత  తీయతీయగా కూసే  వాల్మీకి అనే కోకిలకు నమస్కరించెదను.

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ ।
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్ ॥ 35 ॥

ఆపదలను పోగొట్టి, సమస్త సంపదలను ప్రసాదించే లోకాభిరాముడైన శ్రీరామునకు మరల మరల నేను నమస్కరింతును.

భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదామ్ ।
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్ ॥ 36 ॥

రామనామ జపం అన్ని సంసార బంధనాలను తొలగించి, సమస్త సుఖ సంపత్తులను ప్రసాదించి, యమదూతలను కూడా భయపెట్టగల శక్తివంతమైనది.

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః ।
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర ॥ 37 ॥

రాజులలో శ్రేష్టుడైన శ్రీ రామచంద్రునకు ఎప్పటికీ విజయమే. సీతాపతి అయిన రామచంద్రుని నేను భజిస్తాను. రాక్షస సంహారకుడైన శ్రీరామచంద్రునకు నేను నమస్కరిస్తున్నాను. రాముని కన్నా అన్య దైవం లేదు. నేను శ్రీరామ చంద్రునకు దాసానుదాసుడను. నా మనసు ఎప్పుడు రామునిలోనే లగ్నమై ఉండుగాక. రామా నన్ను ఉద్ధరించుము తండ్రీ.

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ।
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ॥ 38 ॥

శ్రీ రామచంద్రుని “రామ రామ” అంటూ నేను (శివుడు) మనసులోనే ప్రార్థిస్తున్నాను. ఒక్క రామనామమే సహస్రనామాలకు సమానమైనది. (రామనామము, విష్ణు సహస్రనామాలతో సమానమైనదని శివుడు పార్వతికి తెలియ జేసిన సందర్భము లోనిది)

ఇతి శ్రీబుధకౌశికముని విరచితం శ్రీరామ రక్షాస్తోత్రం సంపూర్ణమ్ ।

శ్రీరామ జయరామ జయజయరామ ।

శ్రీ రామరక్షా స్తోత్రానికి తెలుగులో అర్థం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియొ చూడండి. 👇👇👇👇👇

 

ఇవి కూడా చూడండి 👇👇👇👇👇

🙏 Spread the devotion - Share now
Tags: , , , , , , ,