జయ విజయులు రాక్షసులుగా ఎందుకు మారారు?
వైకుంఠంలో ద్వారపాలకులు జయ–విజయులు పరమ విష్ణుభక్తులు. ఈ కథ భాగవత పురాణంలో వివరించబడింది. వారు నిరంతరం శ్రీహరి సన్నిధిలో ఉండి ఆయనను సేవించేవారు. మహావిష్ణువు దర్శనానికి వచ్చే వారిని పరీక్షించి, అనుమతి ఉన్నవారినే లోపలికి పంపేవారు.
ఒకసారి బ్రహ్మమానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు విష్ణువు దర్శనార్థం వైకుంఠానికి వచ్చారు. వీరు అపారమైన యోగశక్తితో సమస్త లోకాలలో సంచరించే మహర్షులు. ఎల్లప్పుడూ ఐదేళ్ల బాలుర రూపంలో కనిపించే వరం వీరికి ఉంది. వీరు దేహాభిమానాన్ని దాటి, నిర్లిప్తంగా, నిర్భోగంగా సంచరించేవారు. సకల జగత్తును ఈశ్వరస్వరూపంగా దర్శించే జ్ఞానులు కావడంతో వారికి ఎక్కడా ఎలాంటి ఆపాదించలేని స్థితి.
వైకుంఠానికి చేరిన ఆ మహర్షులు ద్వారం వద్దకు రాగానే, అక్కడ ఉన్న జయ–విజయులు వారిని అడ్డగించారు. అది లక్ష్మీదేవి–విష్ణుమూర్తుల మందిరానికి ఏడవ ద్వారం. దీనికి కోపించిన సనకాదులు జయ–విజయులను శపించారు. లక్ష్మీదేవి శాపం కూడా వారికి కలిసింది.
ఆ శాపఫలితంగా వారు భూలోకంలో రాక్షసులుగా మూడు జన్మలు ఎత్తారు.
మొదటి జన్మ: హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు గా జన్మించారు. హిరణ్యాక్షుడిని శ్రీమహావిష్ణువు వరాహావతారంలో సంహరించాడు. హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు మహావిష్ణుభక్తుడు. “నీ స్వామి ఎక్కడ ఉన్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడా?” అని హిరణ్యకశిపుడు అడిగినప్పుడు, శ్రీమహావిష్ణువు నృసింహావతారంలో ప్రత్యక్షమై అతనిని సంహరించాడు.
రెండవ జన్మ: రావణుడు, కుంభకర్ణుడు గా జన్మించారు. విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముడు వీరిని సంహరించాడు.
మూడవ జన్మ: శిశుపాలుడు, దంతవక్రుడు గా జన్మించారు. వీరిని విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడు సంహరించాడు.
ఇలా మూడు జన్మలపాటు శ్రీమహావిష్ణువుకు విరోధులుగా పుట్టి, శాపఫలితాన్ని అనుభవించి, తమ స్వామి చేతిలోనే విముక్తి పొందారు. తరువాత శాపం నుండి విముక్తి పొంది మళ్లీ వైకుంఠంలో ద్వారపాలకులుగా సేవ చేస్తున్నారు.
ప్రతి వైష్ణవ ఆలయంలో గర్భగుడి బయట ఇరువైపులా కనిపించే విగ్రహాలు జయ–విజయులవే. వీరిని దర్శించిన తరువాతే స్వామివారి దర్శనం లభిస్తుంది.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.


