google.com, pub-2532166691306495, DIRECT, f08c47fec0942fa0

great mothers in hindu mythology

హిందూ పురాణాల్లోనీ గొప్ప తల్లులు

హిందూ పురాణాల్లోనీ గొప్ప తల్లులు

తల్లి, తండ్రి, గురువు, దైవం లో అమ్మకు అగ్రస్థానం ఇచ్చారు మన పెద్దలు. మన వేదాలు, పురాణాలు కూడా ప్రథమ స్థానం తల్లికే కల్పించాయి. ప్రతి మనిషికి తొలి గురువు తల్లే. సైనికుడిగా, స్నేహితుడిగా, కష్టాల్లో కవచంగా ఉండి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది. భారతీయ పురాణాల్లోని తల్లులు అనుకూలం కాని పరిస్థితుల్లో అసాధారణమైన ప్రేమ, ధైర్యం, సమయస్ఫూర్తిని ప్రదర్శించి వీరవనితలుగా, ఆదర్శవంతమైన తల్లులుగా నిలిచారు. మాతృత్వానికి, ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీకలైన పురాణాల్లోని కొందరు మాతృమూర్తుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం.

సీతమ్మ నిస్సహాయ స్థితిలో వాల్మీకి ఆశ్రమానికి చేరి అక్కడే లవ, కుశులకు జన్మనిచ్చింది. ఏదో ఒక రోజు వారు తండ్రి వద్దకు చేరి అయోధ్య పాలనను ముందుకు తీసుకెళ్తారని ఆమెకు తెలుసు. కాబట్టి వారిని సకల విద్యల్లో నిష్ణాతులుగా చేసి భావి సూర్యవంశ రాజులుగా తీర్చిదిద్దింది. అయినా రామునిపై ఎటువంటి కోపం, ద్వేషం పెంచకుండా వారిలో ఆయన గుణాలు, ఔచిత్యాన్ని నూరిపోసింది. యోగ్యులుగా, పెద్దలను, గురువులను గౌరవించే వారిగా పెంచింది. సమయం రాగానే కొడుకులను తండ్రికి అప్పగించింది. కుమారులలో ధైర్యం, జ్ఞానం, సద్గుణాలు పెంపొందించి వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడం ఆమె ఉత్తమ పెంపకానికి నిదర్శనం.

యశోదాదేవి శ్రీకృష్ణుని పెంపుడు తల్లి. చిన్ని కృష్ణుడే ఆమె ప్రపంచం. చంచలమైనా, నిస్వార్థమైనా ప్రేమతో జగమంతటిని కట్టిపడేసింది. కృష్ణుని అల్లరి చేష్టలను చూసి మురిసిపోయేది. కొడుకు తప్పు చేసినప్పుడు దండించి, తర్వాత బాధపడి అపారమైన ప్రేమతో ఓదార్చేది. లోకాలను పాలించే భగవంతుని ఆలనా పాలనా చూసిన యశోదాదేవి మాతృప్రేమ ఎన్నటికీ ఆదర్శనీయం.

కుంతీదేవి మహాభారతంలో పాండురాజు భార్య. తన భర్త పాండురాజు, సపత్ని మాద్రి మరణించిన తర్వాత, మాద్రి కుమారులైన నకుల, సహదేవులను తన బిడ్డలతో సమానంగా పక్షపాతం లేకుండా ప్రేమతో పెంచింది. అవివాహితగా కర్ణునికి జన్మనిచ్చి, సామాజిక ఆచారాల కారణంగా ఎంతో బాధతో తన బిడ్డను వదులుకోవాల్సి వచ్చింది. ఎన్నో కష్టాలు ఎదురైనా తన కుమారులను ధర్మపాలన, ధైర్యం, విలువలతో పెంచింది. పాండవులలో కనిపించే ధర్మబద్ధత, ధీరత్వం ఆమె పెంపకానికి నిదర్శనం.

కౌసల్యాదేవి దశరథుని మొదటి భార్య, శ్రీరామచంద్రుని తల్లి. తరతరాలుగా శ్రీమహావిష్ణువును ఆరాధిస్తూ వచ్చిన ఆమెకు ఆ మహావిష్ణువు పుత్రునిగా జన్మించడం అదృష్టం. భర్త నిస్సహాయత, కైకేయి స్వార్థం కారణంగా పట్టాభిషిక్తుడు కావాల్సిన తన కుమారుని దూరం చేసుకోవాల్సి వచ్చింది. అయినా రాముడిని ఆశీర్వదించి పంపింది. భరతుడిని ఓదార్చి, రాముని ఆదేశాలను అనుసరించి రాజ్యాన్ని పాలించమని ప్రోత్సహించింది. తన కొడుకులు, కోడలిని దూరం చేసుకుని ఎంతో బాధతో కాలం గడిపింది.

సుమిత్రాదేవి దశరథుని రెండో భార్య, లక్ష్మణుడు, శత్రుఘ్నుల తల్లి. సీతారామలక్ష్మణులు అడవులకు వెళ్లే ముందు ఆమె వద్దకు సెలవు తీసుకోగా, దుఃఖిస్తూనే లక్ష్మణునితో – “నాయనా, నువ్వు అన్నా, వదినలకు సేవ చేయడానికి పుట్టావు. వారికి ఏ ఆపద కలగకుండా కాపాడుకో” అని ఆశీర్వదించి పంపింది. తన కుమారుడిని అడ్డుకోకుండా ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చిన ఉదాత్త తల్లి. కౌసల్యను కూడా ఓదార్చి ధైర్యం చెప్పింది.

శకుంతల దుర్వాస మహర్షి శాపం కారణంగా భర్త దుష్యంతుడు తిరస్కరించినా, అవమానాలను లెక్క చేయకుండా ఒంటరిగానే తన కుమారుడు భరతుడిని పెంచింది. అతన్ని ధైర్యవంతుడు, శక్తివంతుడు అయిన చక్రవర్తిగా తీర్చిదిద్దింది.

చిత్రాంగద తన కుమారుడు బభ్రువాహనుని రాజ్యపాలనలో నిష్ణాతుడిగా తీర్చిదిద్దింది. ఒక యుద్ధంలో అతడు తన తండ్రి అర్జునుడినే ఓడించాడు. ఉత్తమ తల్లిగానే కాక, రాజ్య వ్యవహారాలను నేర్పుగా నిర్వహించిన స్త్రీగా నిలిచింది.

దేవకీదేవి తన అన్న కంసుడు బంధించి, పుట్టిన పిల్లలను హతమార్చినా, అపార ధైర్యంతో బాధను భరించింది. బలరాముడిని రోహిణి గర్భంలోకి మార్చడం, కృష్ణుడిని రక్షించడానికి యశోద వద్దకు పంపించడం ద్వారా తన పిల్లల రక్షణ కోసం త్యాగం చేసింది.

అంజనాదేవి వాయుదేవుని అనుగ్రహంతో ఆంజనేయుడికి జన్మనిచ్చింది. అతన్ని విద్యావంతుడిగా, పరాక్రమశాలిగా తీర్చిదిద్దింది. సర్వశాస్త్ర పారంగతుడైన హనుమంతుడి వెనుక తల్లి పాత్ర అపారమైనది.

అనసూయాదేవి తన పతివ్రత ధర్మంతో త్రిమూర్తులను బాలలుగా మార్చి సేవ చేసిన మహాసాధ్వి. ఆమెకు దత్తాత్రేయుడు జన్మించాడు. ఆమె మాతృత్వం, తపోనిష్ఠ ఆదర్శనీయం.

శృతి (శిశుపాలుని తల్లి) తన కుమారుడు వికృత రూపంతో జన్మించినా అపారమైన ప్రేమతో పెంచింది. కృష్ణుడిని అవమానించినా, తన బిడ్డను క్షమించమని వేడుకుంది. తల్లి ప్రేమకు లోపాలు అడ్డుకావని చూపించింది.

హిడింబి భీమునితో వివాహం తర్వాత ఒంటరిగానే ఘటోత్కచుడిని పెంచి మహావీరుడిగా తీర్చిదిద్దింది. యుద్ధవిద్యలు నేర్పి పరాక్రమవంతుడిగా తీర్చిదిద్దింది.

లీలావతి హిరణ్యకశిపుని భార్య. గర్భవతిగా ఉన్నప్పుడు నారద మహర్షి ఉపదేశాలు విని హరిభక్తిని అలవర్చుకుంది. అదే ప్రభావం ప్రహ్లాదునిపై పడింది. గర్భస్థ శిశువుపై తల్లి ఆలోచనలు ప్రభావం చూపుతాయని నిరూపించింది.

వీరందరూ అసమానమైన దృఢ వ్యక్తిత్వంతో తమ పిల్లలను వీరులుగా, సత్ప్రవర్తన కలిగిన వారిగా తీర్చిదిద్దారు. త్యాగం, ధైర్యం ఎప్పటికీ మాతృత్వానికి నిదర్శనాలు.

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top