మణిద్వీప వర్ణన
మణిద్వీపం శ్రీ లలితా త్రిపురసుందరి దేవి నివాసస్థలం. మణిద్వీపాన్ని శ్రీపురం, శ్రీనగరం అని కూడా అంటారు. వేదవ్యాసుడు దీనిని సుధాసముద్రం అనే అమృత మహాసముద్రం మధ్యలో ఉన్న దివ్య ద్వీపంగా వర్ణించాడు. ఇది 108 వైష్ణవ దివ్యక్షేత్రాలకు అవతల ఉన్న సర్వలోకం. ఆ సర్వలోక పరిధిలో వేదజలధి తరంగాలు మణిద్వీప ప్రాకారాలను అభిషేకిస్తూ ఉంటాయి.
మణిద్వీపంలో ఏమేమి ఉన్నాయి? అక్కడ ఏ దేవతలు నివసిస్తున్నారు? ఈ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి.
దేవీ భాగవతంలో మణిద్వీపం గురించిన విశేష వర్ణన ఉంది. ఈ ద్వీపం బ్రహ్మలోకానికి పైన ఉంటుంది. దీనిని సర్వలోకం అని కూడా అంటారు. మణిద్వీపం కైలాసం, వైకుంఠం, గోలోకం కంటే శ్రేష్ఠంగా విరాజిల్లుతూ ఉంటుంది. నాలుగు వైపులా అమృత సముద్రం విస్తరించి ఉంటుంది. ఆ సముద్రంలో శీతల తరంగాలు, రత్నాలతో కూడిన సైకత ప్రదేశాలు, శంఖాలు, అనేక వర్ణాల జలచరాలు ఉంటాయి.
దాని అవతల ఏడు యోజనాల విస్తీర్ణంలో నదులు వేగంగా ప్రవహిస్తుంటాయి. మొదట ఇత్తడి ప్రాకారం ఉంటుంది. దానిని దాటితే పంచలోహమయ ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారాల వద్ద నానా శస్త్రాస్త్రాలు ధరించిన రక్షక భటులు కాపలా కాస్తుంటారు. వారిలో వందలాది మంది ఉంటారు. అక్కడ శ్రీ అమ్మవారి భక్తులు నివసిస్తుంటారు. స్వచ్ఛమైన మధుర జలసరోవరాలు, నవపల్లవాలతో అలంకరించిన పచ్చని వృక్షాలు కనులవిందుగా ఉంటాయి. అందమైన ఉద్యానవనాలు దర్శనమిస్తాయి.
అవి దాటితే కంచుతో నిర్మించిన మహాప్రాకారం ఉంటుంది. ఇత్తడి, పంచలోహ ప్రాకారాల మధ్య మందారవనాలు నయనానందకరంగా ఉంటాయి. పంచలోహ ప్రాకారం దాటితే మహోన్నత శిఖరాలతో రజత ప్రాకారం కనిపిస్తుంది. అక్కడ పారిజాత పుష్పాలు సుగంధాలను వెదజల్లుతాయి. ఆ తరువాత సువర్ణమయ ప్రాకారం తేజోమయంగా వెలుగుతుంది. ఆ ప్రాకారాల మధ్య కదంబవనం ఉంటుంది. కదంబమధు ధారలుగా ప్రవహిస్తుంది. దానిని సేవించడం వల్ల ఆత్మానందం కలుగుతుంది.
ఇలా వరుసగా పుష్యరాగ, పద్మరాగ, గోమేధిక, వజ్ర, వైడూర్య, మరకత, పగడ, నవరత్న ప్రాకారాలు ప్రకాశిస్తుంటాయి. ప్రతి ప్రాకారంలో విభిన్న దేవతలు, శక్తులు, లోకాలు విరాజిల్లుతాయి.
వైడూర్య ప్రాకారంలో బ్రాహ్మీ, మహేశ్వరీ, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండాదేవి వంటి సప్తమాతృకలు నివసిస్తారు. మహాలక్ష్మీ అష్టమ మాతృకగా పూజింపబడుతుంది.
నవరత్న ప్రాకారంలో పాశాంకుశేశ్వరి, భువనేశ్వరి, భైరవి, త్రిపురసుందరి, తారా, కాళి, మాతంగి తదితర దశమహావిద్యలు ప్రకాశిస్తుంటాయి.
అంతిమంగా చింతామణి గృహం ఉంటుంది. దానికి వేయి స్తంభాలు ఉంటాయి. శృంగార, ముక్తి, జ్ఞాన, ఏకాంత అనే నాలుగు మండపాలు ఉంటాయి. అనేక మణివేదికలు, సుగంధ వాతావరణం, కాశ్మీర వనాలు, పుష్పవాటికలు అక్కడ కనువిందు చేస్తాయి.
చింతామణి గృహమధ్యంలో దివ్య సింహాసనం ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు ఆ సింహాసనానికి నాలుగు కోణాలుగా నిలుస్తారు. దాని మీద శివకామేశ్వరుని ఒడిలో అరుణవర్ణంతో ప్రకాశిస్తూ శ్రీ లలితా మహాత్రిపురసుందరి ఆసీనురాలై ఉంటుంది.
ఆమె నుదురు అష్టమి చంద్రునివలె ప్రకాశిస్తుంది. కస్తూరి తిలకం అలంకరించి ఉంటుంది. కనుబొమ్మలు మంగళతోరణంలా ఉంటాయి. కన్నులు చేపలవలె చలించుతాయి. పెదవులు పగడంలా ఎర్రగా మెరుస్తాయి. ఆమె పలుకులు సరస్వతీ వీణానాదాన్ని మించిపోతాయి. కామేశ్వరుడు కట్టిన మంగళసూత్రంతో కంఠం శోభిల్లుతుంది. రత్నాభరణాలు ఆమె శోభను మరింత పెంచుతాయి. ఆమె పాదకాంతి భక్తుల అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది.
నిజానికి మన దేహమే మణిద్వీపం. అజ్ఞానాంధకారాన్ని తొలగించే జగన్మాత మన హృదయంలో సూక్ష్మరూపంగా ప్రకాశిస్తోంది. తెలుసుకునే వారికి ఆ పరాశక్తి మనసులోనే కొలువై ఉంటుంది.
ఆమెను సేవించిన వారికి ప్రశాంతత, సంతృప్తి కలుగుతాయి. అన్ని కార్యాలు సిద్ధిస్తాయి. జీవనంలో ఎదురయ్యే అడ్డంకులు, దిగులు, అనారోగ్యాలు, అకాల మరణ భయం తొలగిపోతాయని వేదవ్యాసుడు పేర్కొన్నాడు.
ద్వీపవాసిని అయిన అమ్మను భక్తితో సేవించి ఆ అనుగ్రహాన్ని పొందుదాం.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

