google.com, pub-2532166691306495, DIRECT, f08c47fec0942fa0

Janaka Maharaju performing a yajna as baby Sita emerges from the earth.

జనకుడు మహారాజై ఉండి కూడా సన్యాసిలా ఎలా బ్రతికాడు?

జనకుడు మహారాజై ఉండి కూడా సన్యాసిలా ఎలా బ్రతికాడు?

జనకుడు

జనకుడు మిథిలా నగరానికి రాజు. రామాయణంలో సీతమ్మకు తండ్రిగా ప్రసిద్ధుడు. యాజ్ఞవల్క్యుడి వరంతో బ్రాహ్మణత్వాన్ని పొందాడు. జనక మహారాజు మహాజ్ఞాని, రాజర్షి అని పేరు పొందాడు. రాచరికపు వ్యవహారాలు చూసుకుంటూ, గృహస్థుడిగా జీవితం కొనసాగిస్తూ కూడా ఆయన మనస్సు ఆత్మజ్ఞానంతో నిండి, నిత్యం భగవంతుని మీదే లగ్నమై ఉండేది.

అసలు శివధనుస్సు జనక మహారాజు వద్దకు ఎలా వచ్చింది? రోజంతా రాజభోగాలను అనుభవిస్తూ, రాజ్యానికి సంబంధించిన లౌకిక వ్యవహారాలతో నిమగ్నమై ఉండే జనక మహారాజును యోగి, జ్ఞాని అని ఎందుకు అంటారు? ఎక్కువగా తెలియని జనక మహారాజు జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా మిస్ కాకుండా వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి.

పూర్వం దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సులు ఇవ్వకుండా యాగం ప్రారంభించాడు. శివుడు లేని చోట మంగళం ఎలా ఉంటుందని భావించిన దక్షుని కుమార్తె సతీదేవి యోగాగ్నిలో తన శరీరాన్ని త్యజించింది. ఆగ్రహించిన శివుడు రుద్రుడయ్యాడు. ఇలాంటి యాగానికి దేవతలు ఎందుకు వెళ్లారని ఆగ్రహంతో తన ధనుస్సును పట్టుకున్నాడు. దేవతలు ప్రార్థించగా శాంతించి ఆ ధనుస్సును వారికి కానుకగా ఇచ్చాడు. దేవతలు ఆ ధనుస్సును జనక మహారాజు పూర్వీకుడైన దేవరాతుడు అనే రాజు వద్ద ఉంచారు. దేవరాతుడు దానిని ఒక పెద్ద మంజూషలో (పెట్టెలో) భద్రపరిచాడు. చక్రాలున్న ఆ మంజూషలో శివధనుస్సు ఉండేది; దానిని కదిలించడానికి దాదాపు ఐదు వేల మంది అవసరం అయ్యేది. అలా విదేహ వంశీయులు ఆ శివధనుస్సును ప్రతిరోజూ పూజిస్తూ పరమపవిత్రంగా సంరక్షించారు.

వాల్మీకి రామాయణంలో పేర్కొన్న జనక వంశక్రమం:

  1. నిమి

  2. మిథి – మిథిలా రాజ్య స్థాపకుడు, మొదటి జనకుడు

  3. ఉదావసుడు

  4. నందివర్ధనుడు

  5. సుకేతుడు

  6. దేవరాతుడు

  7. బృహద్రథుడు

  8. మహావీర్యుడు

  9. సుధృతి

  10. దృష్టకేతుడు

  11. హర్యశ్వుడు

  12. మరువు

  13. ప్రతిందకుడు

  14. కృతరథుడు

  15. దేవమీధుడు

  16. విధృతుడు

  17. మహాధృతి

  18. కీర్తిరాతుడు

  19. మహారోముడు

  20. స్వర్ణరోముడు

  21. హ్రస్వరోముడు

  22. సీరధ్వజుడు (రామాయణంలోని సీత తండ్రి), కుశధ్వజుడు

వంశానికి మూలపురుషుడైన నిమి చక్రవర్తి వంశంలో 22వ తరానికి చెందినవాడు జనకుడు. జనక మహారాజు హ్రస్వరోముడి కుమారుడు. జనకునికి సీరధ్వజుడు అనే పేరు కూడా ఉంది. భార్య రత్నమాల. కుశధ్వజుడు ఇతని సోదరుడు.

జనక మహారాజు దంపతులకు సంతానం లేకపోవడంతో పుత్రేష్టి యాగం చేశారు. యాగంలో భాగంగా భూమిని దున్నుతుండగా నాగేటి చాలో నాగలి ఏదో తగిలింది. తవ్వి చూస్తే ఒక బంగారు పెట్టెలో అపూర్వ కాంతితో ప్రకాశిస్తున్న ఆడశిశువు కనిపించింది. నాగేటి చాలో దొరికినందున ఆమెకు “సీత” అని పేరు పెట్టారు. ఆమె అపూర్వ సౌందర్యరాశి. తరువాత జనక మహారాజుకు ఊర్మిళ అనే కూతురు పుట్టింది.

ఒకరోజు చిన్నతనంలో సీత బంతితో ఆడుతుండగా అది శివధనుస్సు కిందికి వెళ్లింది. ఆమె దానిని అలవోకగా పైకి లేపింది. ఈ దృశ్యాన్ని చూసిన జనక మహారాజు, శివధనుస్సును ఎక్కుపెట్టగలిగిన వాడికే సీతను వివాహం చేస్తానని ప్రకటించాడు. ఎందరో రాజులు వచ్చి ప్రయత్నించినా ఎవరూ దానిని కదపలేకపోయారు.

సాంకాశ్యపు రాజు సుధన్వుడు యుద్ధం చేసి అయినా సీతను పొందుతానని వచ్చాడు. జనకుడు యుద్ధంలో అతన్ని ఓడించి ఆ రాజ్యాన్ని తన తమ్ముడు కుశధ్వజునికి ఇచ్చాడు.

తరువాత విశ్వామిత్ర మహర్షితో కలిసి రామ–లక్ష్మణులు మిథిలాకు వచ్చారు. శివధనుస్సును తెప్పించగా, రాముడు దానిని సులభంగా ఎత్తి నారి కట్టడానికి ప్రయత్నించగా అది పిడుగుల శబ్దంతో విరిగిపోయింది. జనకుని ఆనందానికి అవధులు లేకపోయాయి. దశరథ మహారాజును ఆహ్వానించి సీత–రాముల వివాహం వైభవంగా జరిపించాడు. అదే సమయంలో ఊర్మిళ–లక్ష్మణుడు, మాండవి–భరతుడు, శ్రుతకీర్తి–శతృఘ్నుడు వివాహాలు కూడా జరిగాయి.

భగవద్గీత 3వ అధ్యాయంలో జనక మహారాజు ప్రస్తావన ఉంది. కృష్ణుడు అర్జునునితో “నిష్కామ కర్మ ద్వారా జనకుడు వంటి వారు మోక్షం పొందారు” అని చెబుతాడు.

జనక మహారాజు ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఎల్లప్పుడూ ఆసక్తి చూపేవాడు. ఆధ్యాత్మిక పండితులను సభలో ఆహ్వానించి చర్చలు నిర్వహించేవాడు. అష్టావక్ర మహర్షితో జరిగిన సంభాషణ “అష్టావక్ర గీత”గా ప్రసిద్ధి చెందింది. అష్టావక్రుని ఉపదేశంతో జనకుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందిన జీవన్ముక్తుడయ్యాడు.

బాహ్యంగా రాజసౌఖ్యాలలో ఉన్నప్పటికీ, అంతర్గతంగా పరబ్రహ్మ తత్త్వంపై లగ్నమై జీవించినవాడే నిజమైన సన్యాసి అని జనకుడు తన జీవనంతో నిరూపించాడు. అందుకే ఆయనను రాజర్షి, జీవన్ముక్తుడు అని పిలుస్తారు.

శ్రీదేవీభాగవతంలో కూడా జనకుని ప్రస్తావన ఉంది. వ్యాస మహర్షి కుమారుడు శుక మహర్షి కూడా జనకుని వద్ద బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నాడు. గృహస్థాశ్రమంలో ఉండి కూడా మోక్షం సాధ్యమని జనకుడు బోధించాడు.

జనక మహారాజు ధర్మాచరణలో, జ్ఞానంలో, వైరాగ్యంలో అపూర్వుడు. అందుకే అనేక మంది ఋషులు, పండితులు ఆయన సభను ఆశ్రయించేవారు. గృహస్థుడై ఉండి కూడా ఆత్మజ్ఞానంతో జీవించిన మహాజ్ఞాని జనక మహారాజు.

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top