శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం. ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తి పీఠాలు. సాక్షాత్త్ శ్రీ ఆదిపరాశక్తి శక్తి రూపాలే ఈ అష్టాదశ శక్తి పీఠాలని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు ఆరాధనా స్థలాలు అయ్యాయి. శక్తిస్వరూపిణిగా భక్తుల కోరికలు నెరవేర్చే అమ్మవారిని అష్టాదశ శక్తిపీఠాల్లో దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు చేకూరుతాయని భక్తులు భావిస్తారు. మరి ఈ శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి? మొత్తం ఎన్ని ఉన్నాయి? వాటి ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ ఆహ్వానించలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలా ఏమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికి వెళ్ళింది. కాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు- తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు, ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి, తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి, విష్ణువు- సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు ఆరాధనా స్థలాలు అయ్యాయి. పైకి సతీ దేవి శరీరఖండాలు పడిన ప్రదేశాలు అని చెప్పినా, తాత్విక దృష్టితో చూస్తే శ్రీమన్నారాయణుడు, అమ్మవారి శక్తిని వివిధ రూపాలుగా విభజించి ఈ శక్తి పీఠాలలో నిక్షిప్తం చేశాడు అని భావించవచ్చు. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలు ఉన్న ప్రాంతాల్లో దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
దేవి భాగవతం ప్రకారం సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలను శక్తి పీఠాలుగా గుర్తించి, భక్తులు అమ్మవారి ఆరాధనలో తరిస్తున్నారు. అందులో 51 ముఖ్యమైనవిగా కొందరంటే, మళ్ళీ అందులోంచి 18 ప్రదేశాలను అతి ముఖ్యమైనవాటిగా భావించి, అష్టాదశ శక్తి పీఠాలుగా, పరమ పవిత్రమైన ప్రదేశాలుగా సేవిస్తున్నారు. ఇందులో రెండు శక్తి పీఠాలు మాత్రం మన దేశంలో లేవు. ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీరులో, రెండవది శ్రీలంకలో వున్నాయి. మిగతా 16 శక్తి పీఠాలలో నాలుగు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి.
ఇది ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకం. అష్టాదశ శక్తిపీఠాల విషయంలో దీన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి, శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో మూడు గయాక్షేత్రాలూ, రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉండటం మరో విశేషం.
ఈ అష్టాదశ శక్తిపీఠాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1. శాంకరీదేవి, శ్రీలంక
అష్టాదశ పీఠాల్లో మొదటిదైన “శ్రీ శాంకరీ దేవి పీఠం” శ్రీలంకలో ఉందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ అమ్మవారి కాలి గజ్జెలు పడ్డాయని పండితులు చెప్తారు. రావణుని స్తోత్రాలకు ప్రసన్నమైన పార్వతీదేవి, లంకలో అవతరించింది. రావణుని సీతాపహరణ దోషం వల్ల ఆ తల్లి అంతర్ధానమైంది. రావణ సంహారానంతరం, తిరిగి లంకలో మహర్షుల చేత ప్రతిష్ఠించబడింది. ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకోమలీలోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తోంది. చోళ, పాండ్య, పల్లవ పాలకులు శాంకరీ ఆలయ సంరక్షణ, అభివృద్ధికి చాలా కృషి చేశారు. ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది. దగ్గరలో ‘త్రికోణేశ్వర స్వామి’ అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.
2. కామాక్షిదేవి ఆలయం, కంచి, తమిళనాడు
అష్టాదశ శక్తి పీఠాల్లో రెండవది “శ్రీ కామాక్షీ దేవి” క్షేత్రం. ఈ ఆలయం చెన్నై నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో, కాంచీపురం, తమిళనాడులో ఉంది. ఇక్కడ అమ్మవారి వీపు భాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. భారతదేశంలోని సప్త మోక్షపురాలలో కంచి క్షేత్రం ఒకటి. కాత్యాయనమహర్షి తపస్సు చేసి, గౌరీదేవిని కూతురుగా పొందాలని వరం కోరుకున్నాడు. దేవి- కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజ చేసేదట. అప్పుడు శివుడు దేవిని పరీక్షించేందుకు కంబనది రూపంలో అలల ఉద్ధృతిని పెంచగా, ఆ దేవి తన రెండు చేతులలో విగ్రహాన్ని ఉంచుకుని అలల నుంచి కాపాడిందని ఇక్కడి స్థల పురాణం. సూదిమొనపై కూర్చొని పంచాగ్నుల మధ్య నిలబడి, శివుడిని పూజించగా దానికి సంతసించి, శివుడు ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహమాడినట్లు ప్రతీతి. ఈ ఆలయాన్ని ఆరవ శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించారని చరిత్ర చెపుతుంది. ఇక్కడ అమ్మవారు శ్రీకామాక్షి, శ్రీబిలహాసం, శ్రీచక్రం అనే మూడు రూపాలలో దర్శనమిస్తారు. ఆలయంలో అమ్మవారు యోగముద్రలో పద్మాసనముపై కూర్చుని, తన చేతులతో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరకుగడలతో దర్శనమిస్తుంది. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడి అమ్మవారు చాలా ఉగ్రరూపంలో బలి కోరుతుండటంతో.. ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ఇక్కడ ఆ శ్రీచక్రానికి పూజలు జరుగుతాయి. పుట్టుకతోనే చెవిటి, మూగ వారైన మూక శంకరులు, ఈ కామాక్షి దేవి అనుగ్రహంతోనే మాట వచ్చి, భక్తి పారవశ్యంతో మూక పంచశతి స్తోత్రం చేశారు.
కామాక్షి దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట, అమ్మవారిని ఆదిపీఠ పరమేశ్వరిగా కొలుస్తారు భక్తులు. ఈ నేపథ్యంలో ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆదిపరాశక్తి యోగపీఠంగానూ, కామాక్షీదేవి ఆలయాన్ని భోగపీఠంగానూ భావిస్తారు. దశరథ, తుండీర, శ్రీ కృష్ణదేవరాయలు, చోళ రాజులు, ఇక్ష్వాకు వంశస్థులు అమ్మవారిని ఆరాధించినట్లు చరిత్ర చెబుతోంది.
3. శృంఖలా దేవి ఆలయం, ప్రద్యుమ్నం, వెస్ట్ బెంగాల్
అష్టాదశ శక్తి పీఠాల్లో మూడోది శ్రీశృంఖలా దేవి క్షేత్రం. ఈ ప్రదేశాన్ని అమ్మవారి ఉదర భాగం పడిన చోటుగా భావిస్తారు. త్రేతాయుగంలో ఋష్యశృంగమహర్షి- ఇక్కడి శృంగగిరిపై దేవీ ఉపాసన చేసి, అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడు. అక్కడ ప్రత్యక్షమైన దేవి, శృంగుడు ప్రతిష్టించిన దేవత కనుక శృంగదేవి- శృంఖళా దేవిగా మారిందని ఒక గాథ. ఋష్యశృంగుని తపశ్శక్తి తరంగాలను ఆది శంకరులు ఆవాహన చేసి, శారదాపీఠాన్ని ఏర్పాటు చేశారని పురాణ గాథలు చెబుతున్నాయి. శృంఖలాదేవి ఆలయం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, హుగ్లీ జిల్లా, పాండువా పట్టణంలో ఉంది. ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉందని కొందరూ, కోల్‌కతాకు దగ్గరలో ఉందని మరికొందరూ అంటారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు సమీపాన ఉన్న సురేంద్రనగర్‌లో కొలువై ఉన్న చోటిల్లామాతను అక్కడివారు శృంఖలా(శృంగళా)దేవిగా భావిస్తారు. కానీ పశ్చిమబెంగాల్‌లో కలకత్తాకి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాండువానే అసలైన శక్తిక్షేత్రం అని ఎక్కువ శాతం మంది విశ్వసిస్తారు.
ప్రస్తుతం ఇక్కడ హజ్రత్ షా దర్గా – మినార్ మాత్రమే ఉంది. ఈ మినార్ ఉన్న ప్రదేశంలోనే శృంఖల దేవి ఆలయం ఉండేదని చెప్తారు. సుమారుగా 750 ఏళ్ల క్రితం ఈ ప్రదేశాన్ని పాండు రాజులు పరిపాలించేవారు. 1290-1295 మధ్యలో ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా ఖిల్జీ ఈ ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు శృంఖలా దేవి ఆలయాన్ని ఆక్రమించి ఈ మినార్ నిర్మించారు. ఈ మినార్ ప్రవేశ ద్వారంలో ఆలయ శిథిలాలు మనం గమనించవచ్చు.
అవసాన దశలో ఉన్న ఆలయంలోని కొన్ని ప్రదేశాలు మాత్రం పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉన్నాయి..ఇప్పటికీ ఇక్కడ ఏ ఆలయం లేనప్పటికీ ప్రతి మాఘమాసంలో మసీదు మినార్ వద్ద ఉన్న ఆలయం ప్రదేశంలో మేళతాళాలతో సుమారు 30 రోజుల పాటు ఉత్సవాలు,తిరున్నాళ్ళు జరుగుతుంటాయి.
4. చాముండేశ్వరి దేవి మైసూర్, కర్ణాటక
అష్టాదశ పీఠాల్లో 4వ శక్తిపీఠమైన శ్రీ చాముండేశ్వరీ దేవి పీఠం కర్నాటక రాష్ట్రం, మైసూరులో మైసూరు ప్యాలెస్కు 13 కిలోమీటర్ల దూరంలో చాముండేశ్వరి కొండపై ఉంది. హరుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు వూడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం. బ్రహ్మ గారి వరప్రభావంతో దేవతలను హింసిస్తున్న మహిషాసురుని సంహరించడానికి త్రిమూర్తుల శక్తితో, చాముండేశ్వరిగా సర్వదేవతల తేజస్సులతో ఆవిర్భించిన ప్రాంతం ఇదేనని చెబుతున్నారు.ఈ పుణ్యక్షేత్రాన్ని 12 వ శతాబ్దంలో హోయసల పాలకులు నిర్మించారని భావిస్తున్నారు. ఈ దేవాలయ గోపురాన్ని 17 వ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారు. మైసూరు మహారాజులు చాలా సంవత్సరాలుగా ఈ దేవతను పూజిస్తూ, కుల దేవతగా ఆరాధిస్తూ, ఈ దేవాలయాన్ని పోషిస్తూ దేవాలయ అభివృద్ధికి సహకరించారు. సముద్ర మట్టానికి 3500 కి.మీ ఎత్తున చాముండేశ్వరి కొండపై ఈ శక్తి పీఠం ఉంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది. కొండ మీద 800 వ మెట్ల వద్ద ఒక చిన్న శివాలయం ముందు, ఒక పెద్ద నల్లరాతి నంది విగ్రహం ఉంది. ఈ నంది విగ్రహం 15 అడుగుల ఎత్తుతో, 24 అడుగుల పొడవుతో ఉంటుంది. ఈ నంది విగ్రహం మెడ చుట్టూ చాలా అందమైన గంటలు చెక్కబడి ఉన్నాయి. ఈ శక్తిపీఠంలోనే ప్రతి ఏడాది దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి
5. జోగులాంబా దేవి, అలంపూర్, ఆంధ్రప్రదేశ్
అయిదవ అష్టాదశ పీఠం తెలంగాణలోని జోగులాంబ జిల్లా అలంపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారిని శ్రీ జోగులాంబా దేవి అని పిలుస్తారు. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు అంటే దవడ భాగం పడినట్టు చెప్తారు. 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్యులు నిర్మించారు. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు నాగర శైలిలో చెక్కారు. 8వ శతాబ్దంలో శంకరాచార్యులవారు శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు. 14 వ శతాబ్ధంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశాడు. అయితే, ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్నా, జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటినుంచి 2005 వరకూ అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి, అమ్మవార్లని పునప్రతిష్టించారు.
జోగులాంబ అమ్మవారు ఉగ్ర రూపంలో, వృద్ధురాలిగా కనపడుతుంది. పరమేశ్వరుడు ఒక్కో శక్తి పీఠంలో ఉన్నప్పుడూ ఒక్కో అమ్మవారు ఆయన్ని ఆర్చిస్తుంది. అలా పరమేశ్వరుడు శ్మశానంలో ఉన్నప్పుడూ అర్చించే దేవత జోగులాంబ. పరమేశ్వర మోక్షం లభించేది శ్మశానంలోనే కాబట్టి, జోగులాంబా అమ్మవారు మోక్షానికి అధిపతిగా ఇంకా నరఘోషకు అధిపతిగా చెప్పబడుతుంది. ఈ అమ్మవారు యోగానికి అధిపతి కనుక, జోగులాంబాను పూజిస్తే కుండలినీ శక్తి జాగృతమవుతుంది అని చెప్తారు.
అమ్మవారి శిరస్సు మీద బల్లి, తేలు, గుడ్లగూబ, కపాలం కనిపిస్తాయి. చతుర్భుజిగా కపాలము, గొడ్డలి, ఖడ్గము, పాన పాత్ర ధరించి, శవమును ఆసనముగా కలిగి, ఎడమవైపు తల తిప్పి మోకాళ్ళపై కూర్చొని ఉన్న ఒక శిరస్సుపై తన వృష్టభాగాన్ని ఆనించి, అరికాలు కనపడేలా ఎడమపాదం నేలపై ఆనించి, కపాలమును యఙ్ఞోపవీతంగాను, ఐదు ఆకులలాగా వేలాడుతున్న కటిసూత్రం ధరించి ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు స్థానికులు. ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు, సరస్వతీదేవి, వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయంలో శివుని రూపమైన బాలబ్రహ్మేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఆలంపూర్ క్షేత్రంలో కార్తీకమాసం పూజలు, శివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. కార్తీకమాసంలో జోగుళాంబ అమ్మవారి విశేష పూజలో పాల్గొనేందుకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఈ క్షేత్రంతో నవబ్రహ్మల ఆలయాలు కనిపిస్తాయి.
6. భ్రమరాంబిక దేవి, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్, శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికాదేవి ఆలయాన్ని ఆరవ అష్టాదశ పీఠంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మ వారి మెడ భాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకు, మునులకు కంటకుడిగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు ఇక్కడ కొలువైన సతీ శక్తి- భ్రమర అంటే తుమ్మెద రూపంలో అవతరించిందట. అసురవధ అనంతరం, భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక ఎత్తైన ప్రదేశంలో కొలువై ఉందనేది స్థలపురాణం.
ఈ దేవాలయం బయట కుడి వైపు భాగంలో చెవిని గోడకు ఆనిస్తే భ్రమరగీతం వినిపిస్తుంది. ఈ భ్రమరగీతం భ్రమరాంబికా దేవి ఇక్కడ ఆసీనురాలైవుందని తెలియజేస్తుంది. గర్భగుడిలో ఉన్న భ్రమరాంబ ఎనిమిది చేతులతో ప్రతి చేతిలో ఒక ఆయుధంతో కనపడుతుంది. మహిషాసురమర్దిని రూపంలో భ్రమరాంబ దర్శనమిస్తుంది. గర్భగుడి ప్రవేశద్వారం దగ్గరే భక్తులు శ్రీచక్రానికి, కమల పీఠానికి కుంకుమపూజ చేస్తారు. ఇక్కడ వున్న కమలపీఠం మీద కూర్చొని భ్రమరాంబికా దేవి తపస్సు చేసిందట. శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే శంకరాచార్యులవారు “సౌందర్యలహరి” కూడా రచించారని చెబుతుంటారు. ఈ ఆలయాన్ని పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు సందర్శించి, పూజలు చేసారని చరిత్ర చెబుతుంది. ఇక్కడే పరమేశ్వరుని ద్వాదశ జోతిర్లింగ క్షేత్రం కూడా ఉండటం వల్ల, ఈ ప్రదేశాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి.
7. మహాలక్ష్మి దేవి, కొల్హాపూర్, మహారాష్ట్ర
అష్టాదశ పీఠాల్లో ఏడవదైన శ్రీమహాలక్ష్మీ దేవి ఆలయం మహారాష్ట్రలోని కొల్హపూర్‌లో ఉంది. రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి కొల్హాసుర రాక్షస సంహారం అనంతరం, అంబాబాయిగా కొల్హాపూర్ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. శ్రీ మహాలక్ష్మి ఆలయం 9వ శతాబ్దంలో నిర్మించబడింది. ఆలయం పైన ఐదు గోపురాలు దర్శనమిస్తాయి. హిందూ ఆలయాలు సహజంగా తూర్పు ఉత్తరదిశగా ఉంటాయి. కాని ఇక్కడ మహాలక్ష్మి ఆలయం పడమరదిశగా ఉంటుంది. ఇక్కడ మరో ప్రత్యేకతేమిటంటే ఆలయంలో పడమరలో ఒక చిన్న కిటికీ ఉంటుంది. సంవత్సరంలో మార్చి, సెప్టెంబర్ నెలల్లో సూర్యాస్తమయ సమయంలో 3 రోజులు సూర్య కిరణాలు ఈ కిటికీగుండా ప్రసరించి, అమ్మవారిపై ప్రకాశిస్తాయి. ఈ 3 రోజులు కిరణోత్సవాలుగా జరుపుకుంటారు. మహాలక్ష్మి దేవి విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. గర్భగుడిలో సుమారు ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం, దానిమీద నాలుగు చేతులతోనూ, 40 కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతోనూ మహాలక్ష్మీ కొలువై ఉంటుంది
అమ్మవారి నల్లరాతి విగ్రహం మూడు అడుగుల ఎత్తున ఉంటుంది. వెనుక భాగంలో అమ్మవారి వాహనమైన రాతితో చేసిన సింహం ఉంటుంది. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు. ఆలయంలోని ఒక గోడపై శ్రీయంత్రం చెక్కబడి ఉంది. మహాప్రళయకాలంలో కూడా లక్ష్మీదేవి ఈ క్షేత్రాన్ని వీడదని పురాణప్రతీతి. అందుకే కొల్లాపూర్‌ను అవిముక్త క్షేత్రంగా వ్యవహరిస్తారు. కొల్హాపూర్ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగానూ, కరవీరవాసినిగానూ కొలుస్తారు. పురాణాల ప్రకారం, తనను ఛాతీ పై తన్నిన భృగు మహర్షిని ఉపేక్షించినందుకు, శ్రీమహాలక్ష్మి విష్ణువుపై అలిగి వైకుంఠాన్ని విడిచిపెట్టి, కొల్హాపూర్‌కు చేరుకుంది. అగస్త్య మహామునికి వృద్ధాప్యంలో సుదూరంగా ఉన్న కాశీ నగరాన్ని దర్శించుకోవడం కష్టమై శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా.. కాశీకి ప్రత్యామ్నాయంగా తనకో క్షేత్రాన్ని చూపించమన్నాడు. కొల్హాపుర సందర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్య ఫలాన్ని ఇస్తుంది- అన్నాడు పరమశివుడు.
8. ఏకవీరాదేవి, నాందెడ్, మహారాష్ట్ర
అష్టాదశ పీఠాల్లో ఎనిమిదవదైన ఏకవీరా దేవి శక్తి పీఠం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రానికి 128 కి.మీ. దూరంలో దత్తాత్రేయుని జన్మక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మాహోర్‌కు 15 కి.మీ. దూరంలో ఉంది . ఇది అమ్మవారి కుడి భుజం పడిన చోటు. ఎనిమిది లేదా తొమ్మిది వందల సంవత్సరాల క్రితం దేవగిరికి చెందిన యాదవ రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడని నమ్ముతారు. ఏకవీర దేవి ఆలయం కొండపై ఉంది. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో, మెడ భుజాలు లేకుండా భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. అమ్మవారి ముఖమంతా సింధూరంతో పూసి ఉంటుంది. అమ్మవారి ముక్కు, నోరు, కళ్ళు స్పష్టముగా చూడవచ్చును. ఇక్కడ మూడు కొండలు ఉన్నాయి. ఒక దానిపై అత్రి- అనసూయలు, రెండవ దానిపై దత్తాత్రేయుడు, మూడవ దానిపై ఏకవీరాదేవి ప్రతిష్ఠితమయ్యారు. ఇక్కడ రేణుకాదేవి, ఏకవీర దేవి ఆలయ విషయంలో కొంత సందిగ్దత ఉంది. రేణుకా దేవి ఆలయాన్ని కొంత మంది శక్తి పీఠం అని చెప్తారు. రేణుకా దేవి, ఏకవీరదేవి వేరని, ఒక్కరే అని వేరువేరు అని భిన్న వాదనలు వినిపిస్తాయి. కానీ అష్టాదశ శక్తిపీఠాల శ్లోకంలో “మాహుర్యే ఏకవీరికా” అని ఉంటుంది. ఇద్దరు దేవతల స్వరూపాలు కూడా దాదాపు ఒకేలా తల మాత్రమే కనిపించేలా ఉంటాయి. ఇదే అసలైన ఏకవీరాదేవి మాత శక్తి పీఠం.
9. మహాకాళి దేవి, ఉజ్జయిని మధ్య ప్రదేశ్
అష్టాదశ శక్తిపీఠాల్లో తొమ్మిదవ క్షేత్రం, శ్రీ మహంకాళీ దేవి క్షేత్రం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో క్షిప్రా నదీ తీరంలో ఉంది. ఇది అమ్మవారి పైపెదవి పడిన చోటు. ఈ ఉజ్జయినీ నగరాన్ని సప్త మోక్షపురాలలో ఒకటిగా భావిస్తారు. ఈ ఆలయాన్ని ఘడ్ కాళికా ఆలయం అని కూడా పిలుస్తారు. కాళికాదేవి మాత గర్బాలయంలో ఎంతో ప్రకాశవంతంగా- నాలుకను బయటపెట్టి కోపాగ్ని రూపంతో భయంకరంగా దర్శనమిస్తుంది. కాళికామాత- నల్లని కళ్లు, సింధూర రంగుతో, చంద్రవంక కిరీటం ధరించి భక్తుల పూజలందుకుంటుంది. ఆలయంలో మహాలక్ష్మి, సరస్వతి విగ్రహాల మధ్య మహాకాళి విగ్రహం దర్శనమిస్తుంది. అమ్మవారు శిరస్సు వరకు మాత్రమే మనకు కనపడుతుంది. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే, అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి, యుద్ధభూమిలో నిలిచి, తన పొడవైన నాలుక చాచి, అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. ఇది అవంతికా శక్తి పీఠము. విక్రమాదిత్యుడు ఆరాధించిన భవానీ ఈమెయే. ఉజ్జయినీ మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రం కూడా. ఇక్కడ క్షీప్రా నది ప్రవహిస్తుంది. ఇక్కడే మహాకవి కాళిదాసుకు కాళికాదేవి- నాలుక మీద బీజాక్షరాలు రాసిందట. నిరక్షరాస్యుడైన ఒక గొర్రెల కాపరి ఈ అమ్మవారి కటాక్షం వల్లనే మహాకవి కాళిదాసుగా మారాడు. ఆలయం బయట కాళిదాసు విగ్రహం కనిపిస్తుంది. అఘోరాలు తరచుగా ఇక్కడ తాంత్రిక పూజలు చేస్తారని చెప్తారు. అందుకే ఈ శక్తిపీఠాన్ని తాంత్రిక శక్తి పీఠం అని చెప్తారు.
10. పురుహూతికా దేవి, పిఠాపురం, ఆంధ్రప్రదేశ్
అష్టాదశ శక్తి పీఠాల్లోని శ్రీ పురుహూతికా దేవి క్షేత్రం- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడకి 18 కిలోమీటర్ల దూరంలో పిఠాపురంలో ఉంది. పూర్వం దీనిని పీఠికాపురం అని పిలిచేవారు. దక్షిణ కాశీగా ఈ క్షేత్రం పిలవబడుతోంది. ఇక్కడ సతీదేవి పీఠభాగం అంటే పిరుదుల భాగం పడిన చోటు కాబట్టి, ఈ ప్రదేశానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణలు తెలుపుతున్నాయి. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా, హూంకారిణిగా భక్తుల పూజలందుకుంటూ ఉంటుంది. ఈ అమ్మవారి నాలుగు చేతుల్లో- కుడివైపు చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి, ఎడమ చేతుల్లో- తామరపువ్వు, మధుపాత్ర ఉంటాయి. అన్ని దేవాలయాలలో ఉన్నట్టు రాతివిగ్రహం కాకుండా, ఇక్కడ కొలువై ఉన్నది చెక్కతో తయారు చేసిన విగ్రహం. సింహం పైన నిలబడి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ విగ్రహం వందల సంవత్సరాలు భూస్థాపితమై ఉంది. సుమారు 18 శతాబ్దంలో పైకి తీసి ఇక్కడ ప్రతిష్టించారు. ఇది పాద గయాక్షేత్రం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని అంటారు. ఈ క్షేత్రంలోనే పురుహూతికా అమ్మవారు గయాసురుడికి మోక్షమిచ్చారని చెప్తారు. అలాగే దత్తాత్రేయుడి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన పుణ్యస్థలం అని చెబుతారు. వ్యాసమహర్షి తన శిష్య బృందంతో దర్శించిన క్షేత్రంగా దీనికి పేరుంది. ఇంద్రుడు వృత్తాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి, ఆ బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి పొందేందుకు 5 మాధవుడి ఆలయాలను నిర్మించాడని పురాణ కథనం. అహల్యా దేవి విషయంలో- గౌతమ మహర్షి చేత శపించబడిన ఇంద్రుడు ఇక్కడికి వచ్చి, జగన్మాత కోసం తపస్సు చేసి, శాప విమోచనం పొందాడు. ఇంద్రుడు అమ్మవారిని పురుహూతికా దేవిగా పూజించాడు. ఈ ఆలయంలో ఆశ్వయుజ మాసంలోని నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ మహాదేవుడు కుక్కుటేశ్వర స్వామిగా దర్శనమిస్తాడు.
11. గిరిజాదేవి, కటక్, ఒరిస్సా
అష్టాదశ శక్తి పీఠాల్లో పదకొండవ శక్తిపీఠం- ఒరిస్సాలోని భువనేశ్వర్ కు సుమారు 113 కిలోమీటర్ల దూరంలో, వైతరణీ నదీతీరంలో, జాజ్‌పూర్ రోడ్డుకు 20 కి. మీ.దూరంలో ఓడ్యాణం అనే ప్రాంతంలో వెలసింది. ఇది అమ్మవారి నాభి భాగం పడిన చోటుగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ వెలసిన అమ్మవారిని శ్రీ గిరిజా దేవి అని పిలుస్తారు. ఇక్కడ యమలోకంలో ప్రవహించే వైతరణీ నది అంశగా ఈ గుడికి సమీపంలోనే వైతరణీ నది ప్రవహిస్తూ ఉంటుంది. బ్రహ్మ దేవుడు ఈ వైతరణీ నది ఒడ్డున యజ్ఞం చేశారట. ఆ సమయంలో బ్రహ్మ దేవుని కోరిక మేరకు ఆ యజ్ఞం లోనుంచి, ఈ గిరిజాదేవి అమ్మవారు ఉద్భవించారని స్థల పురాణం చెబుతోంది. ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉంటుంది. ఈ క్షేత్రము తాంత్రికపీఠంగా కూడా ఖ్యాతి పొందినది. ఇక్కడ ఎక్కువగా తంత్ర శాస్త్రానికి సంబంధించిన పూజలు జరిగేవట. ఇక్కడ జరిగే ఆబ్దిక క్రియలు పితృ దేవతలను నరకం నుంచి బయటపడేసి స్వర్గ ప్రవేశాన్ని కలిగిస్తాయని అంటారు.
గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనేపేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ, బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. సర్వాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివితీరదంటారు భక్తులు. గుప్తుల కాలంనాటి విరజాదేవి విగ్రహం, రెండు చేతులు కలిగిన మహిషాసురమర్ధినిగా ఉంటుంది. రాక్షసశక్తి అయిన ఎనుబోతును, అమ్మవారు తన ఎడమకాలితో త్రొక్కి, కుడిచేతిలోని త్రిశూలమును ఎనుబోతు శరీరములో గ్రుచ్చి, తోకను ఎడమచేతితో పట్టుకొని నిలబడినట్టుగా సింహవాహినిగా దర్శనమిస్తుంది. ఇంకెక్కడా ఇలాంటి రూపంలో అమ్మవారు కనిపించరు. ఇక్కడ గిరిజాదేవిని శ్వేతవరాహమూర్తి రూపంలో విష్ణుమూర్తి అర్చిస్తుంటాడు. ఈమెను శక్తిత్రయరూపిణిగా కొలుస్తారని ఆలయ పురాణాలు చెబుతున్నాయి. ఇది నాభిగయా క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికొచ్చే భక్తుల్లో అధికసంఖ్యలో ఆలయప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది.
12. మాణిక్యాంబా దేవి, ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్
అష్టాదశ శక్తి పీఠాల్లో 12వ శక్తి పీఠమే ఆంధ్రప్రదేశ్‌లోని ద్రాక్షారామం. ఇక్కడ అమ్మవారిని శ్రీ మాణిక్యాంబా దేవిగా పిలుస్తారు. సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేయడం వల్ల దీనిని దక్షవాటికగా వ్యవహరిస్తారు. శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి సమేతంగా భక్తులకు దర్శనమివ్వడంతో, ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆలయం లోపల గోడలకు రత్న దీపాలుండేవని ప్రతీతి. గర్భాలయాన్ని అవి వెలుతురుతో నింపేవని చెబుతారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 12 వ శక్తి పీఠమైన ద్రాక్షారామంలో అమ్మ వారు శ్రీచక్ర యంత్రం మేరువపై నిలబడి ఉంటుంది. అమ్మ వారు మేరువపై ఉండటం వల్ల శక్తి స్వరూపిణిగా, సుందర మూర్తిగా విశేషమైన కళతో దర్శనమిస్తుంది. ఏకకాలంలో శ్రీ చక్ర యంత్రానికి , అమ్మ వారికి పూజలు చేసే అరుదైన అవకాశం ఇక్కడ ఉంటుంది .
ఇది దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న చోటని పురాణాలు చెబుతున్నాయి. సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమే ఈ ప్రాంతమనీ ఆ చక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ ఉన్నాడనీ స్థలపురాణం. ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలచి తిండి దొరక్కుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకూ ఆయన పరివారానికీ అన్నం పెట్టిందట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీవిడిచిపెట్టి వెళ్లమన్నాడనీ, అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందనీ పురాణప్రతీతి. ఈ క్షేత్రానికి దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా గుర్తింపు ఉంది. ఉత్తరాది నుంచి వింధ్యపర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి కూడా కొన్నాళ్లు ఈ క్షేత్రంలో ఉన్నాడని విశ్వసిస్తారు భక్తులు. ఈ శివాలయం పంచారామాలలో ఒకటి కావడం విశేషం.
13. కామాఖ్యా దేవి, గౌహతి, అస్సాం
సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత శక్తిమంతమైన కామాఖ్యాదేవి క్షేత్రం ఒకటి. అస్సాంలోని బ్రహ్మపుత్రా నది ఒడ్డున, గౌహతికి సమీపంలో నీలాచల పర్వతశిఖరంపై ఉందీ క్షేత్రం. ఇక్కడ సతీదేవి యోనిభాగం పడిందని చెబుతారు. మానవ సృష్టికి మూల కారణమైన స్థానం కాబట్టి, ఈ ప్రదేశం అన్ని శక్తి పీఠాల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అంతే కాకుండా ఈ పీఠమే అన్ని శక్తి పీఠాలకూ ఆధార స్థానంగా భావిస్తారు. అలాగే, ఈ శక్తి పీఠాన్ని మహాయోగ స్థలమని పిలుస్తారు. ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు వూటలా స్రవిస్తూ ఉంటుంది. అమ్మవారి ఆలయ శక్తి పీఠం ముందు ఒక పుష్కరిణి కనిపిస్తుంది. ఇది ఎంతో శక్తిమంతమైంది. దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారంటారు. ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలం వస్తుందని భక్తుల భావన. ఇందులో నీరు ఎరుపురంగులో ఉంటుంది. దీన్ని సౌభాగ్య కుండం, పాతక వినాశ కుండం అని పిలుస్తారు. అమ్మ వారి యోని స్రావిత పవిత్ర జలలాతో పునీతమైన ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైనా నశిస్తుందని, బ్రహ్మ హత్యా పాతకమైనా నివారణ మవుతుందని విశ్వాసం. ఇక్కడ విశేష మేమిటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యాదేవీకి ప్రతి ఏటా జూన్ లో అంటే ఆషాఢ మాసంలో నెలలో మూడు రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది. దేవీ భాగవతంలో ఈ ప్రత్యేక రోజుల గురించి ప్రస్తావన స్పష్టంగా ఉంది. ఈ రోజుల్లో యోనిశిల నుండి ఎర్రని స్రావం వెలువడుతుంది. ఈ ఎర్రని నీరే శక్తిపీఠం ముందున్న సౌభాగ్య కుండంలోని నీరుగా చెబుతారు. ఈ ప్రత్యేకమైన మూడు రోజులు ఆలయం మూసి ఉంచుతారు. నాలుగో రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు. దానికన్నా ముందుగా ఆలయంలో వస్త్రాన్ని కప్పి ఉంచుతారు. రుతు స్రావం పూర్తైన తర్వాత నాలుగో రోజు తిరిగి తెరుస్తారు. అంబుబాచీ మేళా అనే పండుగను నిర్వహించి.. రుతు స్రావం సమయంలో కప్పిన వస్త్రాన్ని ముక్కలుగా చేసి భక్తులకు పంచుతారు. సాధువులు, సంతులు, అఘోరాలు, తాంత్రికులు ఇక్కడకు వచ్చి అమ్మను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. అన్నట్టు ఈ ఆలయం ఎక్కువగా మంత్ర, తాంత్రిక, ఐంద్ర జాలాలకు కామాఖ్యాక్షేత్ర శక్తి పీఠం కేంద్రస్థానంగా చెబుతారు
పరశురాముని మాతృ హత్యాదోషాన్ని ఈ తల్లి పోగొట్టిందని, శివుని కంటి మంటకు దహనమైన మన్మథుణ్ని జీవింపచేసిన తల్లిగా ఈమె ప్రఖ్యాతి చెందిందని పురాణాలు చెబుతున్నాయి.
14. మాధవేశ్వరి దేవి, ప్రయాగ, ఉత్తర ప్రదేశ్
అష్టాదశ శక్తి పీఠాల్లో 14వ శక్తి పీఠమే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాదు, ప్రయాగ లో ఉన్న శ్రీ మాధవేశ్వరీ దేవి శక్తి పీఠం. అమ్మవారి కుడిచేతి వేళ్ళు పడిన చోటుగా దీన్ని పిలుస్తారు. ఇక్కడ సతీదేవిని అలోపీదేవిగా కొలుస్తారు. ఈ ఆలయంలో ఏ దేవతా విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి, కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను ఆ ఊయలలో ఉంచుతారు.
మరో జానపద కథనం కూడా ఈ క్షేత్రానికి ఉంది. పూర్వం ఈ ప్రాంతమంతా ఓ దట్టమైన అరణ్య ప్రదేశంగా ఉండేది. అలోపి అనే రాణి పెళ్లి చేసుకొని ఈ మార్గంలోనే అత్తవారింటికి కాపురానికి వెళ్తూ ఉంటుంది. ఆమె ప్రయాణిస్తున్న పల్లకి ప్రయాగ వద్దకు రాగానే దోపిడి ముఠా ఈ బృందంపై దాడి చేసి దోచుకుంటుంది. అప్పుడు పెళ్ళికూతురు అయిన రాణి.. అమ్మవారిని ప్రార్ధించగా, ఆవిడ పెళ్ళికూతురుని మాయంచేసి, ఆ దొంగలబారినుండి రక్షించిందట. ఆనాటినుంచి ఆ దేవిని అలోపీదేవిగా పిలుస్తున్నారు. అలోపీ అంటే మాయమవటం అని అర్ధం. అప్పటినుంచీ ఇక్కడివారు పెళ్ళిళ్ళకి ముందు ఈ అమ్మవారిని పూజించిన తర్వాతే శుభకార్యం మొదలు పెడతారు. శక్తిత్రయస్వరూపిణి పీఠమైన ఈ ప్రాంతంలో బ్రహ్మదేవుడు ఇక్కడ వరుసగా ఎన్నో యాగాలు చేసినందున ప్రయాగ్‌గా మారింది. ఈమెను కృతియుగంలో బృహస్పతి అమృతంతో అభిషేకించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రాన్ని అమృత తీర్థం అని అంటారు. త్రేతాయుగంలో రాముడు, ద్వాపరంలో శ్రీకృష్ణుడు ఈ తల్లిని పూజించారని పండితులు చెబుతున్నారు. అలాగే సూర్యుడు పూజించడం వలన ఈ క్షేత్రాన్ని భాస్కరక్షేత్రం అని కూడా పిలుస్తారు.
15. వైష్ణవీదేవి, జ్వాలాక్షేత్రం, కాంగ్రా, హిమాచల్ ప్రదేశ్
అష్టాదశ శక్తిపీఠాల్లో 16 వ శక్తిపీఠం శ్రీ వైష్ణవీదేవి శక్తిపీఠం. ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రాకి సమీపంలో జ్వాలాముఖి అనే ప్రదేశంలో ఉంది. దీనిని జ్వాలాముఖి శక్తి పీఠ క్షేత్రం అని కూడా అంటారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఇది సతీదేవి నాలుక పడిన శక్తిపీఠము అని అంటారు. జ్వాలాముఖి అంటే నోట్లోంచి మంటలు వస్తున్న అమ్మవారు అని అర్థం. అందుకనే అక్కడ అమ్మవారు నాలుక చాస్తున్నట్లుగా నిరంతరం ఒక జ్వాల వెలువడుతూ ఉంటుంది. అందుకు ప్రతీకగానే ఇక్కడి మందిరంలో అమ్మవారి విగ్రహానికి బదులుగా కొండ గోడలనుంచి, చిన్న నీటి కుండం గోడలలోంచి వస్తున్న మంటలను అమ్మవారిగా భావించి పూజలు చేస్తుంటారు. శ్రీయంత్రానికి ఎర్ర వస్త్రం, పసుపు కుంకుమలతో పూజలు నిర్వహిస్తుంటారు.
పూర్వం కటోచ్ వంశానికి చెందిన ‘మహారాజా భూమా చంద్’ దుర్గాదేవికి పరమభక్తుడు. ఒక రోజు భూమా చంద్ కు స్వప్నంలో అమ్మవారు కనిపించి తాను జ్వాలగా ఆ అడవులలో పూజా నైవేద్యాలు లేక ఉన్నట్లు తనను వెలికి తెచ్చి నిత్య పూజలు నిర్వహించవలసిందిగా సెలవివ్వగా మహారాజు ఆ అడవులలో వెతికి అమ్మవారిని కనుగొన్నారు. ఆమెకు దేవాలయం కట్టించి నిత్యపూజలు నిర్వహించసాగాడు. ఇప్పటి అక్కడ ‘జ్వాల’తప్ప మరే విగ్రహమూ కనిపించకపోవడం విశేషం.
మొఘల్ చక్రవర్తి అక్బర్ పాదుషా లోహంతో, తరువాత నీటితో ఇక్కడి మంటలను ఆర్పడానికి ప్రయత్నించగా ఎంతకీ మంటలు ఆరకపోవడంతో, జ్వాలాముఖి అమ్మవారి మహిమను తెలుసుకొని అమ్మవారికి క్షమాపణ చెప్పి, ఒక బంగారు గొడుగును చేయించి, తన స్వహస్తాలతో మోస్తూ, కొండపైకి నడిచి వెళ్లి అమ్మవారికి సమర్పించారట. ఆ గొడుగు, మంటలను ఆర్పడానికి ఉపయోగించిన లోహం నేటికీ ఈ ఆలయంలో ఉన్నాయి.
16. మంగళగౌరి దేవి, గయ, బీహార్
మంగళ గౌరీ దేవాలయం, భారతదేశం, బీహార్ రాష్ట్రం, గయ జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ శక్తి పీఠం. ఇక్కడ అమ్మవారి శరీరభాగాల్లో వక్షస్థలం పడినట్టుగా చెప్తారు. ఈ అమ్మవారిని మంగళగౌరీదేవి, సర్వమంగళ అని పిలుస్తారు. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. ప్రస్తుతం ఉన్న ఆలయం 15వ శతాబ్దానికి చెందింది. తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం మంగళగౌరి కొండపై నిర్మించబడింది. కేవలం మూడు అడుగుల ఎత్తు ఉండే మార్గం గుండా గర్భాలయంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. అమ్మవారి స్తనములు పోలిన శిలకు పూజలు జరుగుతాయి. పూర్వం గాయాసురుడు అనే రాక్షస రాజు ఉండేవాడు. రాక్షసుడైనా చాలా మంచి వాడు.
పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండేచోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా వ్యవహరిస్తారు. ఫల్గుణీనదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు. తనను తాకిన ప్రతి జీవికీ మోక్షం వచ్చేలా విష్ణుమూర్తి వరం పొందిన గయాసురుడు పర్వతాకారంలో ఉన్న ప్రాంతమిది. గయాసురుడు శరీరాన్ని విపరీతంగా పెంచి అందరికీ మోక్షాన్ని ఇచ్చే సందర్భంలో, అతని శరీరం పెరగకుండా ధర్మవతశిలను అతని శిరస్సుపై ఉంచి, దాని పైకి విష్ణువును ఆవాహన చేసినట్లు ఒక పురాణగాథ ఉంది.
17. విశాలాక్షి దేవి, వారణాసి, ఉత్తరప్రదేశ్
అష్టాదశ శక్తి పీఠాల్లో 17వ పుణ్యక్షేత్రం కాశీలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో వెలసిన అమ్మవారిని శ్రీ విశాలాక్షీదేవిగా ప్రార్థిస్తారు. సతీదేవి మణికర్ణిక(చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ స్థలపురాణం. ఈ శక్తిపీఠంలో విశాలాక్షి గర్భాలయంలో రెండు రూపాలతో దర్శనమిస్తుంది. ఒకరూపం స్వయంభువు. మరొక రూపం అర్చామూర్తి. మనం ఆలయంలోని ప్రవేశించగానే ముందుగా అర్చామూర్తిని, అటు పిమ్మట స్వయంభువును దర్శించుకోవాలి. ఈ విశాలాక్షి ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. దీని ఆకారం దక్షిణ భారతదేశంలోని దేవాలయాలను పోలి ఉంటుంది.
శివుని కన్నులు మూసి లోకాన్ని చీకటి చేసిన పాపానికి నల్లగా మారిన గౌరి, అన్నదానపుణ్యంతో తిరిగి బంగారు వర్ణంలోకి మారిన క్షేత్రం కాశి. వ్యాసునికి కడుపార భోజనం పెట్టిన తల్లి అన్నపూర్ణ తిరుగాడిన క్షేత్రం కాశిగా పురాణాలు చెబుతున్నాయి. హిమాలయాలపై ఉండడం ఇష్టం లేక తన కోసం అమ్మవారు నిర్మించుకున్న పట్టణం కాశిగా పరిగణించబడుతోంది.. శివుని వైభవాన్ని విశాల నేత్రాలతో చూసిన తల్లి శక్తిపీఠంగా వెలసినదే విశాలాక్షి పీఠమని పురాణాలు చెబుతున్నాయి. కాశీలో ఉన్న విశాలాక్షి దర్శనం వల్ల రోగాలు, దుఃఖాలు మొదలైనవి పోయి సంతానం కలుగుతుంది.
18. సరస్వతి దేవి శక్తి పీఠం, శ్రీనగర్, కాశ్మీర్
కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు 40 కి.మిదూరంలో ఉన్న ఈ క్షేత్రంలో అమ్మవారి కుడి చేయి పడిందని చెబుతారు. శారదా పీఠం లేదా సరస్వతీ దేవి శక్తి పీఠం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులో నీలం నది ఒడ్డున ఉండేది. ఇది పురాతన విద్యా కేంద్రం. సా.శ. 6వ, 12వ శతాబ్దాల మధ్య ఇది భారత ఉపఖండంలోని అత్యంత ప్రముఖ దేవాలయ విశ్వవిద్యాలయాలలో ఒకటి. కాష్మీర్ లోని శారదా మందిరం అత్యంత పురాతనమైనదిగా చెప్పబడుతున్నది. ఇది ఒకప్పుడు కాశ్మీరీ పండితుల విద్యాకేంద్రంగా విరాజిల్లింది. ఇక్కడే ఆది శంకరుడు సర్వజ్ఞానపీఠాన్ని అధిష్టించాడు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఇక్కడ సరస్వతీ దేవీని కీరవాణి అని పిలుస్తారు. అనంత్‌నాగ్‌లోని మర్తాండ్ సూర్యదేవాలయం, అమర్‌నాథ్‌తో పాటు శారద మాత ఆలయం కాశ్మీరీ పండిట్లకు ముఖ్యమైన ఆలయాలు. ఈ శారదా పీఠంలో కొలువై ఉన్న శారదా మాత త్రిశక్తుల సంగమం అని చెబుతారు. విద్యకు దేవత అయిన శారద, జ్ఞాన దేవత అయిన సరస్వతి, వాక్ దేవత అయిన వాగ్దేవి శక్తుల సంగమంగా భావిస్తారు. శైవమత పితామహుడిగా చెప్పబడే శంకరాచార్యులు, వైష్ణవ శాఖకు మూలకర్త అయిన రామానుజాచార్యులు ఇద్దరూ ఇక్కడికి వచ్చి, రెండు కీలక విజయాలు సాధించారని చరిత్రకారులు చెబుతున్నారు. పద్నాలుగో శతాబ్దం వరకు ప్రకృతి వైపరీత్యాల వల్ల అనేక సార్లు ఈ ఆలయం తీవ్రంగా దెబ్బతింది. అటు విదేశీ దండయాత్రల వల్ల కూడా ధ్వంసమయింది. చివరగా 19వ శతాబ్దానికి చెందిన రాజా గులాబ్ సింగ్ హయంలో చివరగా శారదా మాత ఆలయానికి మరమ్మతులు చేశారు. ఆ తర్వాత పాక్ దురాక్రమణతో భారత్‌కు దూరమైంది శారదా శక్తి పీఠం. ఇక్కడికి వెళ్లడానికి అనుమతి లేదు. గత 70 ఏళ్లుగా అక్కడ పూజలు జరగడం లేదు.
ఈ సమాచారాన్ని video రూపంలో చూడాలనుకుంటే ఈ link పైన click చేయండి.