నా మాటలు విని ఆనందిస్తున్నావు. కనుక నీ శ్రేయస్సు కోరి శ్రేష్టమైన మాటలు మళ్ళీ చెపుతాను విను. దేవగణములకు కాని, మహర్షులకు కాని, నా పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియవు. దేవతలకు, మహర్షులకు అన్ని విధాలా ఆదిపురుషుణ్ణి నేనే కావడం దీనికి కారణం. బుద్ది, జ్ఞానం, మోహం లేకపోవడం, సహనం, సత్యం, బాహ్యేంద్రియ అంతరింద్రియ నిగ్రహం, సుఖం దుఃఖం, జననం మరణం, భయం నిర్భయం, అహింసా, సమదృష్టి, సంతుష్టి, తపస్సు, దానం, కీర్తి – అపకీర్తి వంటి వివిధ భావాలు- ప్రాణులకు వాటి వాటి కర్మనుసారం, నా వల్లనే కలుగుతున్నాయి. సప్తమహర్షులూ, సనకనందనాది నలుగురు ప్రాచీన మునులూ, మనువులూ నా సంకల్పబలం వల్లనే, మానస పుత్రులుగా పుట్టారు. వాళ్ళనుంచే ప్రపంచంలోని ఈ ప్రజలంతా జన్మించారు. నా సృష్టి మహిమనూ, యోగాశక్తినీ, యాదార్ధంగా ఎరిగినవాడికి, నిశ్చయంగా నిశ్చలమైన యోగ సిద్ది కలుగుతుంది. సర్వజగత్తుకూ నేనే మూల కారణమనీ, నా వల్లనే సమస్తం నడుస్తుందనీ, గ్రహించే బుద్దిమంతులు నన్ను భక్తిభావంతో భజిస్తారు.
అలాంటి భక్తులు మనుషులూ ప్రాణాలు నాకే అర్పించి నిరంతరం నన్ను గురించి ఒక్కొళ్లకొకళ్ళు చెప్పుకుంటూ సంతోషం పొందుతారు. నా మీదే మనసు నిత్యం నిలిపి, ప్రేమపూర్వకంగా నన్ను సేవించే వాళ్ళకు, బుద్ది యోగం ప్రసాదిస్తాను. ఆ జ్ఞానంతో వాళ్ళు నన్ను చేరగలుగుతారు. ఆ భక్తులను అనుగ్రహించడం కోసమే నేను వాళ్ళ హృదయాలలో వుండి, అజ్ఞానం వల్ల కలిగిన అంధకారాన్ని ప్రకాశిస్తున్న జ్ఞానమనే దీపంతో రూపుమాపుతారు” అని పలుకగా అర్జునుడు శ్రీ కృష్ణునితో “నీవు పరబ్రహ్మవని, పరమపవిత్రుడవనీ, దివ్యపురుషుడనీ, ఆదిదేవుడవనీ, జన్మలేనివాడవనీ, దేవర్షి అయిన నారదుడు, ఆసితుడూ, దేవలుడూ, వ్యాసుడూ చెపుతున్నారు.
స్వయంగా నాకు అలాగే చెపుతున్నావు. పురుషోత్తమ! నీవు సమస్త భూతాలకు ములకారనుడవు, అధిపతివి, దేవతలందరకూ దేవుడవు, జగత్తు కంతటికి నాధుడవు. ఏ మహిమవల్ల నీవు సకల లోకాలలో వ్యాపించి వున్నావో, ఆ దివ్యమహిమలన్నిటి గురించి చెప్పడానికి నీవే తగినవాడవు. యోగీశ్వర ! నిరంతరం స్మరిస్తూ నిన్నెలా నేను తెలుసుకోవాలి ప్రభు! నిన్ను యేయే భావాలతో నేను ధ్యానించాలి. నీ అమృత వాక్యాలను వినే కొద్దీ తనవి తీరడం లేదు” అని చెప్పగా శ్రీ భగవానుడు “అర్జునా! నా దివ్య వైభవాలను గురించి చెబుతాను. నా విభూతులకు అంతం లేనందువల్ల ముఖ్యమైన వాటినే వివరిస్తాను. ఓ అర్జునా! సమస్త ప్రాణుల హృదయాలలో ఉన్న ఆత్మను నేనే. సకల ప్రాణుల ఆదియు, మధ్యస్థితియు, అంతము నేనే. ప్రాణుల సృష్ఠి స్థితి లయములకు కారణము నేనే. అదితి యొక్క ద్వాదశ పుత్రులైన ఆదిత్యులలో విష్ణువును నేను. జ్యోతిర్మయ స్వరూపులలో నేను సూర్యుడను. వాయుదేవతలలోని తేజమును నేను. నక్షత్రాధిపతియైన చంద్రుణ్ణి నేను. వేదములలో నేను సామవేదమును. దేవతలలో ఇంద్రుడను నేను. ఇంద్రియములలో నేను మనస్సును. ప్రాణులలో ప్రాణశక్తిని నేను. ఏకాదశరుద్రులలో శంకరుడను నేను. యక్ష, రాక్షసులలో ధనాధిపతి యైన కుబేరుడను నేను. అష్ట వసువులలో అగ్నిని నేను. పర్వతములలో సుమేరు పర్వతమును నేను.
పార్థా! పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే. సేనాపతులలో కుమారస్వామిని నేను. జలాశయములలో నేను సాగరుడను. మహర్షులతో భృగువును నేను. శబ్దములలో ఏకాక్షరమును అనగా ఓంకారమును నేను. యజ్ఞముల యందు జప యజ్ఞమును నేను. స్థావరములలో హిమాలయమును నేను. వృక్షములలో నేను అశ్వత్థమును. దేవర్షులలో నారదుడను నేను. గంధర్వులలో నేను చిత్రరథుడను. సిద్దులలో నేను కపిల మునిని. అశ్వములలో పాలసముద్రము నుండి అమృతముతో పుట్టిన ఉచ్ఛైఃశ్రవమును నేను. భద్రగజములలో ఐరావతమును నేను. మనుష్యులలో ప్రభువును నేను. ఆయుధములలో వజ్రాయుధమును నేను. పాడి ఆవులలో కామధేనువును నేను. శాస్త్రవిహిత రీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడను నేను. సర్పములలో వాసుకిని నేను. నాగజాతి వారిలో ఆదిశేషుడను నేను. జలచరములకు అధిపతియైన వరుణుడను నేను.
పితరులతో అర్యముడను నేను. శాసకులలో యమధర్మరాజును నేను. దైత్యులలో నేను ప్రహ్లాదుడను. గణించువారిలో నేను కాలమును. మృగములలో మృగరాజు ఐన సింహమును నేను. పక్షులలో పక్షిరాజైన గరుత్మంతుడను నేను. పవిత్ర మొనర్చు వానిలో వాయువును నేను. శస్త్రధారులలో శ్రీరామచంద్రుడను నేను. మత్స్యములలో మొసలిని నేను. నదులలో గంగానదిని నేను. ఓ అర్జునా! సృష్టి, స్థితి, లయ కారకుడను నేనే. విద్యలలో ఆధ్యాత్మ విద్యను నేను. అక్షరములలో “అ”కారమును నేను. సమాసములలో ద్వంద్వ సమాసమును నేను.
వృష్ణి వంశజులలో వాసుదేవుడను నేను. పాండవులలో ధనంజయుడను నేను. అనగా నీవే నేను. మునులలో వేదవ్యాసుడను నేను. కవులలో శుక్రాచార్యుడను నేనే. శిక్షించువారిలో దండమును అనగా దమనశక్తిని నేనే. జయేచ్చగలవారి నీతిని నేనే. గోప్యవిషయ రక్షణమున మౌనమును నేను. జ్ఞానులయొక్క తత్వజ్ఞానమును నేనే. సర్వప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే. నేను లేని చరాచరప్రాణి ఏదీ లేదు. నా దివ్య విభూతులకు అంతమే లేదు. నా విభూతుల విస్తృతిని గూర్చి నేను నీకు చాలా సంక్షిప్తముగా వివరించితిని. ఈ సంపూర్ణ జగత్తు- కేవలము నా యోగశక్తి యొక్క ఒక్క అంశతోనే ధరించుచున్నాను.