మరణం తరువాత ఆత్మ ఏం చేస్తుంది? Secrets of Garuda Puranam in Telugu | Life after death in hell |
గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి. ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత ఆయన వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు “గరుడ పురాణం” అని పేరు వచ్చింది. ఈ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి.
మహాపురాణం అని పిలిచే ఈ పురాణంలో మన జీవితానికి అవసరమైన అనేక అంశాలను చూడవచ్చు. పూర్వఖండంలో బ్రహ్మాదుల ఆవిర్భావం, రాజుల కథలు, వ్యాకరణం, ఛందస్సు, యుగధర్మాలు, విష్ణువు దశావతారాలు వంటివి ఉన్నాయి. ఉత్తర ఖండంలోని ప్రథమాధ్యాయంలో ప్రేతకల్పం అనే భాగం ఉంది.
ప్రేతకల్పంలో వివరించబడిన- మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు, దేహాన్ని వదిలిన అనంతరం ఆత్మ ప్రయాణం … జీవికి ఎదురయ్యే పరిస్థితులు, నరక లోక వర్ణన వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భూలోకంలో జన్మించినపుడు మరణం తప్పదు. మృత్యువే కాలం. ఆ సమయం రాగానే దేహం నుండీ, ప్రాణం నుండీ జీవాత్మ విడిపోతుంది. రావలసిన వేళకే మృత్యువు, ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తుంది. మరణం సంభవించే ముందు ఇంద్రియాలు పనిచేయవు. బలము, ఓజస్సు, వేగము శిథిలమైపోతాయి. కోటి తేళ్ళు ఒకేసారి కుట్టినంత బాధ కలుగుతుంది. మెల్లగా చైతన్యం తగ్గుతుంటే జడత్వం పెరుగుతుంటుంది. యమదూతలు మృతి చెందుతున్న వ్యక్తికే కనిపిస్తారు. వచ్చి పక్కనే నిలబడతారు. యమదూతలు లాటీ, సమ్మెట, ఇనుపగదలను ధరించి దర్శనమిస్తారు. వారు దుర్గంధాన్ని వెదజల్లుతూ, క్రోధాగ్నులను వెలిగ్రక్కుతూ పరమభయంకరంగా వుంటారు. కొందరు నల్లగా కొందరు పచ్చగా వుంటారు. వారిని చూడగానే మూర్ఫ వచ్చినట్లయి, విపరీతమైన భయం వేసి, ఒళ్ళంతా వణకిపోతుండగా, తల్లిదండ్రులనో, పుత్రులనో తమని రక్షించమని పిలుస్తారు. కాని ఎంత గింజుకున్నా గొంతు పెగలదు, శబ్దం రాదు.
శరీరంలో ప్రాణం ఎక్కడ దాక్కుందో వారికి సులువుగా తెలిసిపోతుంది. వారు దానిని పాశంతో లాగడం మొదలెడతారు. అప్పుడు ప్రాణం, అతిబలవంతం మీద కంఠం దాకా వచ్చి రానని మొరాయిస్తుంది. ఈ పెనుగులాటలో మనిషి ముఖం వికృతంగా తయారవుతుంది. తరువాత ప్రాణం హాహాకారం చేస్తూ, అహంకార, మమకారాల నింకా వదులుకోలేక చివరికి యమదూతల బలానికి లొంగి, బయటికి పోతుంది. పాపాత్ములను యమదూతలు పాశంతో కొడతారు. అప్పుడా పాశానికి ప్రాణం తగులుకుంటుంది.
పుణ్యాత్ముల విషయంలో ఇవేవీ జరుగవు. మృతుడు నిద్రిస్తున్నట్టే వుంటాడు. ముఖంలో ఒకరకమైన ప్రశాంతతా, వెలుగూ కనిపిస్తుంటాయి. ఆ ప్రాణి దృష్టికి యమదూతలు దేవదూతలలాగా, యమధర్మరాజు విష్ణురూపునిగానూ కనిపిస్తారు. మరణం తరువాత మానవశరీరం అంటరానిది అయిపోతుంది. పుణ్యాత్ముని శవం కూడా కొంతసేపటికి దుర్గంధయుక్తమై పోతుంది.
ఆత్మ శరీరాన్ని వీడిపోయాక జీవి శరీరంలోని పృథ్వీతత్వం పృథ్విలోనూ, జలతత్త్వం నీటిలోనూ, తేజ తత్త్వం తేజంలోనూ, వాయు తత్త్వం గాలిలోనూ, ఆకాశ తత్త్వం నింగిలోనూ, సర్వవ్యాపియైన మనస్సు చంద్రునిలోనూ విలీనమైపోతాయి. అప్పుడు మృతునికి దివ్యదృష్టి ప్రాప్తిస్తుంది. దాని ద్వారా అతడు ప్రపంచాన్నంతటినీ చూడ గలుగుతాడు. అలా పోతూ పోతూ కూడా తన ఇంటివైపు, తన ఆలుబిడ్డల వైపు ఆర్తిగా, కనుమరుగయ్యేదాకా మనసుతోనే చూస్తూ పోతుంది. అప్పుడు ఆ ఆత్మలకు వారి బంధువులు పెట్టిన పిండాలననుసరించి పిండమయ శరీరం తయారుచేసి దానిలో ఆత్మను ప్రవేశపెట్టి వారితో తీసుకెళ్తారు.
అదే భక్తజనులకూ, భోగాలపై ఆసక్తి లేనివారికీ, అబద్ధమాడని వారికీ, నమ్మకాన్ని వమ్ము చేయనివారికీ, ఆస్తికులకూ, సదాచారులుగా, సౌమ్యులుగా జీవించిన వారిని మృత్యువేమాత్రమూ బాధింపకుండా ప్రశాంతంగా, మృదువుగా సుఖంగా పైకి తీసుకెళ్తుంది.
పదమూడవ రోజు శ్రాద్ధ కర్మ, గరుడ పురాణ శ్రవణం తరువాత, ఆత్మ నరకయాత్ర ప్రారంభమవుతుంది. జీవుడు యమదూతల వెంట పాములవాడికి దొరికిన పాములాగ, గారడీవాడు పట్టుకొన్న కోతిలాగ, ఒంటరిగా విచారంగా బయల్దేరతాడు. ఆ ప్రయాణంలో ఆత్మ ఎలా హింసించబడుతుందో, ఎన్ని నగరాలను ఎలా విలపిస్తూ దాటుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
యమరాజును చేరు మార్గం
‘యమద్వారంవైపు వెళ్లే దారి అత్యంత దుర్గంధదాయకమై రక్తమాంసాలతో, చీము వంటి అసహ్యకర ద్రవ్యాలతో నిండి వుంటుంది. వెంట్రుకలు, ఎముకలు, క్రిములు, పురుగులు, రక్త మాంసాల గుట్టలు, శవాల దుర్గంధంతో, కాకుల అరుపులతో, అసహ్యకరంగా, చీకటిగా ఉంటుంది. యమదూతలు కటినమైన పాశాలతో కట్టేసి, అంకుశంతో పొడుస్తూ, కొట్టుకుంటూ దక్షిణ దిశలో ఉన్న తమ లోకంవైపు తీసుకెళ్తారు. దారిలో పిచ్చిమొక్కలు, తీగెలు, ముళ్లు, మేకులు, సూదిగా మొనదేలియున్న రాళ్ళు, అంతటా ఉండి, అడుగు కొక్కటిగా కాళ్ళకు కన్నాలు పెడుతుంటాయి. అక్కడక్కడ ఆ దారిలో అగ్ని జ్వలిస్తుంటుంది. నేల బీటలతో దాటడానికి వీలు లేకుండా వుంటుంది. యమదూతలనివేవీ బాధించవు. వారు ఈ పాపిని వీటన్నిటి మధ్య నుండి ఈడ్చుకుంటూ పోతునే వుంటారు. సూర్యుడు కిరణాలకు బదులు వీరిపై నిప్పులు కురిపిస్తున్నట్లు మండుతుంటాడు. ఇంత వేడిలో కూడా ఈగలంతేసి దోమలు పాపి శరీరంపై సందు లేకుండా కుడుతుంటాయి. ఆ జీవుడు నక్క ఏడుస్తున్న శబ్దాలు చేస్తూ, బీభత్సంగా అరుస్తూ పోతాడు. ఒక పక్క శరీరం కాలి బొబ్బలెక్కి పోతుంటే, వేరొకవైపు అరికాళ్ళలో దిగిన ముళ్ళూ, మేకులూ, గునపాలూ తొడల దాకా దూసుకుపోతుంటే కనీసం ఆగి, తనశరీరానికే మేరకు నష్టం వాటిల్లిందో చూసుకొనే సమయం కూడా ఈయకుండా యమదూత లీడ్చుకుపోతుంటే ఆ పాపి గోల అక్షరాలా అరణ్యరోదనే అవుతుంది. ఘోరమైన పాపాలను చేసిన వాని శరీరాన్ని తోడేళ్ళు అక్కడక్కడ రుచి చూస్తుంటాయి. అయినా శరీరం తగ్గదు. తెలివి తప్పదు, ప్రాణమెలాగూ పోదు.
ముందుగా అసలు మీ అందరికీ ఒక సందేహం రావచ్చు. మనిషి శరీరాన్ని ఇక్కడే భూలోకంలోనే విడిచిపెట్టి, ఆత్మ మాత్రమే నరకానికి వెళ్తుంది కదా. ఆత్మకి చావు లేదు, నీటిలో నానదు, నిప్పులో కాలదు అని భగవద్గీత చెప్తుంది కదా. మరి శరీరం లేకుండా నరకంలో శిక్షలను ఎవరికి, ఎలా విధిస్తారు అని. ఆ విషయానికి సమాధానం ఈ వీడియొ లోనే ఉంది. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి.
యమలోకానికెళ్ళే దారిలో జీవుడు ఎన్నో నగరాలను దాటాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ నగరాల పేర్లు
1. యామ్య
2. సౌరిపురి,
3. నగేంద్రభవన,
4. గంధర్వపుర,
5. శైలాగమ,
6. క్రౌంచ,
7. క్రూరపుర,
8. విచిత్ర నగరం,
9. బహ్వపద,
10. దుఃఖద,
11. నానాక్రందపుర,
12. సుతప్తభవన,
13. రౌద్ర,
14. పయోవర్షణ,
15. శీతాధ్య,
16. బహుభీతి. ఇవన్నీ పరమ భయంకరంగా, దాటడానికి వీలు లేకుండా వుంటాయి.
1. యామ్యపురం: ఈ మార్గంలో జీవి “పుత్రా, నాయనా, నన్ను రక్షించు” అని ఆక్రందిస్తూ తాను చేసిన పాపాలను మరీ మరీ తలచుకొని ఏడుస్తూ, 18 వ రోజున యామ్యపురిని చేరుకుంటాడు. అక్కడ అందమైన మజ్జిచెట్లుంటాయి. జీవికి వాటి క్రింద కూర్చోవాలనుంటుంది. కాని యమదూతలంగీకరించరు. ఒక్క అవకాశం మాత్రం ఇస్తారు. ప్రాణికి పుత్రుల ద్వారా, బంధువుల ద్వారా, ఇతరుల ద్వారా భూలోకంలో చేసిన పిండదానాలు అంది వుంటే వాటిని తిననిస్తారు.
2. సౌరిపురి: సౌరిపురి చేరేదాకా పాపిని యమదూతలు పాశాలతో కొడుతూనే వుంటారు. ఆ దెబ్బలు తింటూ పాపి ఇలా విలపిస్తాడు. “మనుష్యులను గాని జంతువులను గాని ఏనాడూ తృప్తి పరచలేదు. ఒక చెరువునైనా తవ్వించి, కొందరి దాహార్తిని తీర్చినా, నాకీ బాధ వుండేది కాదు. గోవుల ఆకలి తీర్చినా, ఈ బాధ తప్పేది అనుకుంటూ శౌరిపురి చేరుతాడు. ఆ సౌరిపుర రాజుని చూస్తేనే జీవికి భయంతో ఒళ్ళంతా వణకుతుంది. అంతా భయంకరంగా ఉంటాడు. అయినా ఎలాగో గుండె చిక్కబట్టుకొని భూలోకం నుండి వచ్చిన పిండాన్ని తిని, జలాన్ని తాగి బయల్దేరతారు. అక్కడి నుండి వెళ్ళే దారి పొడవునా యమదూతలు వారిని కత్తులతో కొంచెంగా నరుకుతూ, లోతుగాకుండా పొడుస్తూ హింసిస్తూంటారు.
3. నగేంద్రనగరం. అక్కడ జీవికి తన బంధువులు రెండవ మాసంలో పెట్టిన ఆహారం లభిస్తుంది. మరల బయలు దేరిన పాపులను యమదూతలు కత్తిపిడులతో పొడుస్తూ, తోలుకుపోతుంటారు. ఆ సమయంలో జీవి ఇలా అనుకుంటూ ఏడుస్తాడు. “ఎన్నో జన్మల పుణ్యాల ఫలం మానవజన్మ. ఆ జన్మలో కూడా పుణ్యాలు చేసినా, కనీసం పాపాలు చేయకపోయినా, ఈ ప్రయాణం ఇంత దారుణంగా వుండేది కాదు కదా” అని విలపిస్తూ మూడవ నెల పూర్తయ్యేసరికి గంధర్వ నగరాన్ని చేరుకుంటాడు.
4. గంధర్వ నగరం. అక్కడ తన వారు పెట్టిన మూడవ మాసిక పిండాన్ని తిని, మరల బయల్దేరతాడు. మార్గంలో యమ దూతలీ పాపులను కత్తి మొనలతో పొడుస్తూ తోలుకెలతారు. నాకీ బాధలు తగ్గడం లేదంటే నేనేనాడూ ఎవరికీ ఏ దానమూ చేయలేదు. ఏ హిమాలయ గుహలలోకో పోయి తపప్పైనా చేయలేదు. కనీసం గంగా జలన్నైనా తాగలేదు అనుకుంటాడు.
5. శైలాగమ పురం: ఆరవమాసంలో అక్కడి నుండి శైలాగమ నగరం మీదుగా క్రౌంచపురాన్ని చేరుకుంటాడు.
6. క్రౌంచపురం: మృతి చెందాక అయిదవ మాసానికి కొద్ది రోజుల ముందు ఆత్మ క్రౌంచపురం చేరుకొని అక్కడ తన పుత్రాదులచే భూలోకంలో పెట్టబడిన 6 వ నెల పిండాన్ని తిని నీటిని తాగుతుంది. జీవున్ని క్రూరపురి వైపు తీసుకువెళ్తారు.
7. క్రూరపురం: ఈ మార్గంలో యమదూతలు మేకులు ఉన్న పాశాలతో కొట్టి తోలుతుంటే “తల్లి తండ్రులారా! బంధువులారా! మంచి పనులే చేయాలని మీరు నాకెందుకు చెప్పలేదు? మీరు చెప్పి, నేను చేయక్పోయినత్త్లైతే నా చేత నయానో భయానో దానాది పుణ్యకార్యాలను చేయించినా, నాకిప్పుడీ దురవస్థ తప్పేది కదా!” అని బాధపడుతూ, అరుస్తూ, ఎదుస్తాడు. వారిని అదిలిస్తూ, శూలాలతో పొడుస్తూ “విచిత్ర నగరం’ వైపు తీసుకెళ్తారు.
8. “విచిత్ర నగరం’. అక్కడ విచిత్రుడను పేరు గల రాజుంటాడు. దారిలో యమదూతల చేతి దెబ్బలను తింటూ,ఆ రాజుకి విపరీతంగా భయపడి పోయి అతి కష్టం మీద ముందుకి పోతూ “అమ్మనాన్నలారా, అన్నదమ్ములారా, పుత్రులారా నన్నీ దుఃఖసాగరం నుండి ఎవరూ కాపాడలేరా” అని ఏడుస్తూ ఆ జీవి అలా సాగుతునే వుంటుంది.
ఈ నగరంలోనే ‘వైతరణి’ అనుపేరు గల నది ఉంటుంది.
వైతరణి వర్ణన అది పాపులకు మహాభయ భీతికరంగా వుంటుంది. అందులో నీటికి బదులుగా, ఈ పాపులకు చీమూ నెత్తరూ కనిపిస్తాయి. అది నిముషానికొక భయంకరాకారాన్ని ధరించి పాపుల గుండెల్లో గుబులు రేపుతుంటుంది. పాత్ర మధ్యలో నెయ్యి మరుగుతున్నట్లు, ఈ నది అక్కడక్కడ సలసలకాగుతున్నట్లు కనిపిస్తుంది. దానిని దాటుకొని మనం వెళ్లాలి అనే విషయం స్ఫురణకు రాగానే పాపుల గుండెలవిసిపోతాయి. ఆ నీటిలో విషపు కాటు వేయడానికి సిద్ధంగా వున్న కీటకాలు తేలుకొండి వంటి వజ్రసదృశమైన తొండాలతో ఈ పాపుల వైపు చూస్తుంటాయి. మొసళ్ళవంటి పరమహింసాత్మక జలజంతువులా వైతరణి నిండా వుంటాయి. ఇందులో విసర్జన, చనిపోయిన కీటకాలు, పాములు, మాంసం మరియు అగ్ని జ్వాలలు ఉంటాయి. ఈ నదీ ప్రవాహంలో మాలా మూత్రాలు, చీము, నెత్తురు, వెంట్రుకలు, గోళ్ళు, ఎముకలు, కొవ్వు, మాంసం, లాలాజలం, కఫం కలిసి ఉంటాయి. ఈ నది రంగు ఎరుపు. జీవితంలో చాలా పాపాలు చేసిన వారి ఆత్మలు ఈ నది గుండా వెళ్ళాలి. వైతరణి గోవుని దానం చేసినవారు సామాన్య జలాలలో పడ్డట్టే వుంటారు, వారికోసం నావ కూడా వస్తుంది. ఇతరులు మాత్రం ఆ చీము నెత్తుటేరులో మునుగుతూ తేలుతూ కర్మఫలం తీరేదాకా అందులోనే వుంటారు. దాని వెడల్పు నూరు యోజనాలు. ఈ వైతరణీ నది ప్రయాణాన్ని తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. వీరక్కడికి చేరగానే అక్కడి నౌకాధిపతియైన నావికుడు ప్రతి జీవినీ నీవు వైతరణీ అనే పేరు గల గోవును దానం చేశావా? అలాగైతే వచ్చి కూర్చో. నావలో ఆసీనుడవై సుఖంగా ఈ నదిని దాటి పోదువుగాని” అని అడిగి ఎక్కించుకుంటాడు. ఆ దానం చేయనివారిని పడవెక్కనివ్వడు. అలాగని తీరానా వుండనివ్వడు. వారి చేతులను పట్టుకొని తాను నావలో నుండే ఈడ్చుకుపోతాడు. ఆ నదిలో ఈడ్వబడుతున్న వారిని సూది ముక్కులున్న పరమ బలిష్టములైన కాకులూ, కొంగలూ అందిన చోటల్లా పొడుచుకు తింటూంటాయి. గుడ్లగూబలు కూడా అందిన కాడికి నమలుతుంటాయి. అన్ని బాధల నడుమా ఆ జీవి పాపిష్టి ప్రయాణం అలా కొనసాగుతునే వుంటుంది. ఇక వైతరణి గోవును దానం చేసి తత్ఫలితంగా పడవనెక్కినవారికి నరకానికెళ్ళే బాధ తప్పుతుంది. విష్ణు దూతలు నావలోకే వచ్చి వారిని విమానమెక్కించి తమ లోకానికి తీసుకెళ్తారు.
9. బహ్వాపద: ఏడవ నెలవచ్చేసరికి జీవి ‘బహ్వాపద’ అనే పురంలో ప్రవేశిస్తాడు. భూలోకంలో పెట్టబడే సప్తమాసిక పిండాన్నీ, నీటినీ సేవించి మరల బయలుదేరతాడు. యమదూతలు పెద్ద పెద్ద పరిఘలను పెట్టి కొడుతూ తోలుకుపోతుంటే “నేనేనాడూ దానం, తపం, తీర్థ స్నానం, పరోపకారాలలో ఏ ఒకటీ చేయకుండా మూర్థుని లాగా బతికాను. ఇప్పుడనుభవిస్తున్నాను” అంటూ ఏడుస్తారు. తరువాత ఆ జీవి 8 వ నెలలో దుఃఖదపురాన్ని చేరుకుంటాడు.
10. దుఃఖదపురం: ఇక్కడ తన వారు పెట్టిన అష్టమాసిక పిండజలాలను పుచ్చుకొని ‘నానాక్రంద’మనే పురానికి బయల్దేరతాడు.
11. ‘నానాక్రందం: ఈ మార్గంలో యమదూతల హింస తట్టుకోలేక “ఒకప్పుడూ చక్కని మాటలాడుతూ నా భార్య పెట్టే భోజనాన్ని తినేవాడిని. ఇప్పుడు యమదూతలు కటువైన మాటలాడుతూ పెట్టే బల్లెపు పోటులను తింటున్నాను” అని విలపిస్తాడు. ఇలా విలపిస్తూనే జీవి తొమ్మిదవ నెలలో ‘నానాక్రందపురా’న్ని చేరుకుంటాడు. తరువాత పుత్రుని ద్వారా పెట్టబడిన మాసిక పిండాన్ని తిని ‘సుప్తభవన’మనే చోటికి 10వ నెలలో చేరుకుంటాడు.
12. ‘సుప్తభవన’మనే: అక్కడి దెబ్బలకు ఏడుస్తూ “పుత్రులు తమ చేతులతో మృదువుగా నా కాళ్ళు పడుతుంటే అలసటను మరచి నిద్రలోకి జారుకొనేవాణ్ణి. ఇక్కడ వజ్రకఠినములైన చేతులతో నన్ను లాక్కుపోతున్నారు” అనుకుంటాడు. పదవ నెలలో అక్కడే పిండజలాలను సేవించి ప్రయాణిస్తూ పదకొండవనెలలో జీవి ‘రౌద్రపురా’న్ని చేరుకుంటాడు.
13. ‘రౌద్రపురం: ఇక్కడ యమదూతలు విసుగూ విరామం లేకుండా వీపుపై బాదుతునే వుంటారు. అప్పుడిలా ఏడుస్తూ పెడబొబ్బలు పెడతాడు. “ఒకనాడు పట్టు పరుపుల మీద అత్యంత కోమలమైన పాన్పుపై పడుకొని ఆనందించేవాడిని. ఈనాడు ఈ దెబ్బలు పడలేక బాధపడవవలసి వస్తోంది. అయ్యో ఆ బత్తుకెక్కడ? ఈ చావెక్కడ? అనుకుంటాడు. తరువాత జీవిని మరల పిండోదకాలు పుచ్చుకోనిచ్చి యమదూతలు ‘పయోవర్షణ’మను నగరి వైపు ఈడ్చుకుపోతారు.
14. పయోవర్షణం: ఆ దారిలో పాపిని చిన్న చిన్న గొడ్డక్ళతో నెత్తిపై మోదుతుంటారు. ఈ నగరం నుండి, పిండాలు తిన్నాక, ఏడాది గడుస్తున్నదనగా, మృతులను శీతాధ్య అనే నగరి వైపుకి ఈడ్చుకెళ్తారు.
15. శీతాధ్య’ దారిలో యమదూతలు పాపాత్ముని నాలుకను కత్తులతో కొద్ది కొద్దిగా నరుకుతుంటారు. తరువాత అదే నగరంలో ఆ ఆత్మలు వార్షిక పిండోదకాలనూ సేవించి, “బహుభీతి” అనే నగరాన్ని చేరుకుంటారు. అక్కడ వారి వారి పాపాలను అనుసరించి యాతనా శరీరాలను తయారుచేస్తారు. యాతనా శరీరం అంటే నరకంలో శిక్షలు అనుభవించడానికి ఇచ్చే శరీరం. ఈ శరీరంలోకి ఆత్మను ప్రవేశపెడతారు. ఆ శరీరానికే శిక్షలను విధిస్తారు. ఈ శరీరం నిప్పులో కలుతుంది.చురుకుతుంది. అన్నీ నొప్పులనూ అనుభవిస్తుంది. కానీ చావదు. యమదూతలు నరకడం వల్ల, కత్తులతో చెక్కడం వల్ల, పక్షులు ముక్కులతో పొడవడం వల్ల శరీరం ముక్కలైన మళ్ళీ శిక్షలు అనుభవించడానికి శరీరం తిరిగి అతుక్కుపోతూ ఉంటుంది.
16. బహుభీతి: ఈ మార్గంలో పాపి తన పాపాలన్నీ గుర్తుకు రాగా, తనను తానే నిందించుకుంటాడు. కొద్దికాలంలోనే యమపురిని చేరుకుంటాడు.
ఆ లోకంలోకి చేరుకుని యమరాజును దర్శిస్తారు. ఆ తరువాత ఆయనతో కలసి చిత్రగుప్తపురీ చేరుకుంటారు.
యమ ధర్మరాజువర్ణన:
పాపులు కొండంత ఆకారంతో, అలవిమాలిన క్రోధం వల్ల ఎర్రబడ్డ కళ్ళతో భయంకరంగా ఉన్న యమధర్మరాజును దర్శిస్తారు. ఆయన ముఖం విశాలమైన దంతాలతో భయంకరంగా వుంటుంది. ఆయన దట్టమైన కనుబొమ్మలు దడుసుకొనేలా ఉంటాయి. ఆయనను నలువైపులా ఉండి, ఆయనను సేవిస్తూ వికృత ముఖాలతో రూపం పొందిన వేలాది వ్యాధులుంటాయి. యమధర్మరాజు ఒక చేత దండాన్నీ, మరొక చేత పాశాన్నీ ధరించి వుంటాడు. యమధర్మరాజు పాపులకొకలాగా కనిపిస్తే, పుణ్యులకు మరొక విధంగా దర్శనమిస్తాడు.
యమధర్మరాజు నగర వర్ణన
యమమార్గం చివర, దక్షిణ నైర్భత దిశలో వివస్వత పుత్రుడైన యమరాజు పురి వుంటుంది. ఈ దివ్య నగరం సంపూర్ణ వజ్రమయం. దేవతలూ, అసురులూ ఎవరూ ఆయన ఆజ్ఞ లేనిదే ప్రవేశించలేరు. చతురప్రాకారంలో నున్న ఆ నగరికి నాలుగు ద్వారాలూ, ఏడు ప్రాకారాలూ, తోరణాలూ ఉంటాయి. యమధర్మరాజు స్వయంగా తన దూతలతో అందులోనే నివసిస్తాడు. ఈ నగర విస్తారమొక వెయ్యి యోజనాలు. అన్ని ప్రాకారాలు రత్నాలతో, నిత్యం మెరుస్తుండే కాంచన కాంతులతో సూర్యసమాన కాంతులను వెదజల్లే ఆ నగరంలో యమధర్మరాజు భవనం, బంగారు కాంతులతో మెరిసిపోతుంటుంది. అదొక 500 యోజనాల్లో వ్యాపించి వుంది.
వెయ్యి స్తంభాలపై నిలబెట్టబడిన ఆయన కొలువు వజ్రఖచిత, వైఢూర్య సహితమైన ఆసనాలతో అలంకరింపబడి ఉంటుంది. ఆ ఆసనమంతా ముత్యాల తాపడంతో అలరారుతుంటుంది. వందలకొద్దీ పతాకలు రెపరెపలాడుతూ వుంటాయి. వందల కొద్దీ ఘంటలధ్వనులు ఎప్పుడూ వినబడుతుంటాయి. తోరణ ద్వారాలు లెక్కకు మిక్కిలిగా వున్నాయి. ఇంతేకాక అనేక అద్భుతమైన భూషణాలతో ఆ నగరం విలసిల్లుతుంటుంది. అందులో పది యోజనాల మేర శోభా సంపన్పమైన ఆసనంపై భగవంతుడైన యమధర్మరాజు కూర్చుని వుంటాడు. ఆయన ధర్మజ్ఞుడు, ధర్మశీలి, లోకకల్యాణకారి. ఆయన రూపము పాపులకు మాత్రమే భయంకరంగా వుంటుంది కాని ధర్మపరులకూ, అక్కడి ఇతర జనులకూ చల్లగా, అందంగా, సుఖకరంగా వుంటుంది. అక్కడ శీతల మందవాయువు హాయిగా ప్రవహిస్తుంటుంది.
అనేక రకాల ఉత్సవాలు, వేడుకలు జరుగుతుంటాయి. ధర్మసూక్ష్మాలకి సంబంధించి వ్యాఖ్యానాలు వినబడుతూ ఉంటాయి. మంగళకరంగా గంటలు మోగుతుంటాయి. ఇంతటి దివ్యమైన వాతావరణంలో, నిత్యం ప్రాణుల మేలునే కోరుకొంటూ యమధర్మరాజు కొలువు దీరి వుంటాడు.
చిత్రగుప్తుని భవనo
యమనగరి మధ్యలో 50 యోజనాల విస్తీర్ణంలో చిత్రగుప్తుని భవనముంటుది. దాని యెత్తు 10 యోజనాలు. దాని చుట్టూ ఇనుప గోడలు నాలుగు వైపులా ఉంటాయి. దాని మధ్య గొప్ప దివ్యభవనం ఆయన నివాసం. ఈ భవనానికి వందల సంఖ్యలో దారులున్నాయి. అవన్నీ పతాకలతో సుశోభితాలై వుంటాయి. చిత్రగుప్తుని భవనంలో కొన్ని వేల దీపాలు నిత్యం వెలుగుతుంటాయి. అక్కడ నిత్యం గీతాల ఆలాపనలూ, వాద్యయంత్రాల ధ్వనులూ వినిపిస్తుంటాయి. ఈయన భవనంలో బ్రహ్మాండమైన అతిలోక సౌందర్యంతో విలసిల్లే చిత్రపటాలూ, కుడ్యచిత్రాలూ వుంటాయి. వీటి మధ్య ముత్యాలచే నిర్మితమై పరమ విస్మయకరమైన పనితనంతో చేయబడిన సింహాసనంపై ఆసీనుడై లోకబాంధవుడైన చిత్రగుప్తుడు మనుష్యుల, అన్య ప్రాణుల ఆయు గణన చేస్తుంటాడు. ఆయనకు పుణ్యులపై మోహం కాని, పాపులపై కోపం గాని వుండవు.
తీర్పు తర్వాత
యమలోకానికి చేరుకున్న ప్రతి జీవీ యముని ద్వారా ఆదేశింపబడిన శిక్షలను అనుభవించడం లేదా స్వర్గానికి పోవడం వుంటుంది. స్వర్గానికి వెళ్లాలన్నా, నరకానికి వెళ్లాలన్నా ఇక్కడికి రావాల్సిందే. కాకపోతే పుణ్యాత్ములకు మాత్రం ఇక్కడకు వచ్చే దారి వేరుగా ఉంటుంది. దానం వల్ల ధర్మం లభిస్తుంది. ధర్మం వల్ల నరకానికి పోయే దారి కూడా సుఖప్రదంగా ఉంటుంది. యముని తీర్పు వెలువడగానే అక్కడి నుండి పంపిస్తారు. వెంటనే యముని ఆకృతి మారిపోతుంది. దానాలు, పుణ్యాలు చేసిన వారిని ఆ యమధర్మరాజే లేచి నిలబడి గౌరవిస్తాడు. పుణ్యాత్ములు ఆయన అనుమతితో ఆ లోకం నుంచి స్వర్గానికి వెళతారు. పాపాత్ములు మాత్రం వారికి విధించబడిన శిక్షను అనుభవించడానికి వెళ్తారు.
ప్రజలను ధర్మం వైపు నడిపించడమే ఈ గరుడపురాణం ఉద్దేశం. ఈ శిక్షలన్నే నేరుగా చూసి, అనుభవించి చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. వ్యాస మహర్షి రచించిన మహా భారతం, వివిధ పురాణాలలోని సాహిత్యాన్ని అనుసరించి చెప్పినవే. ఆ నరకాలు, శిక్షల గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడుచేసుకోకండి. నీతిగా, న్యాయంగా, మన వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకుండా, ఇంకొకరికి నష్టం కలగకుండా, చేతనైనంతలో ఇతరులకు సహాయం చేస్తూ ఆనందం గా జీవించడమే మనం చేయవలసింది. అంతే. నమస్తే.
ఈ వీడియొని అద్భుతమైన వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ వీడియొ చూడండి.
వీడియొ లింక్