పండుగలు (Festivals) » శ్రీ కాత్యాయనీ దేవి – మహిషాసుర మర్దిని
కాత్యాయని దేవి – నవదుర్గలలో ఆరవ రూపం సింహవాహనంపై

శ్రీ కాత్యాయనీ దేవి – మహిషాసుర మర్దిని

దుర్గామాత యొక్క ఆరవ స్వరూపమే కాత్యాయనీ అమ్మవారు. నవరాత్రుల్లో ఆరవ రోజున ఈ అమ్మవారిని పూజిస్తారు.

పూర్వకాలంలో కాత్యాయన మహర్షి అనే గొప్ప ఋషి ఉండేవారు. ఆయన అమ్మవారికి గొప్ప భక్తుడు. దుర్గాదేవిని తన కుమార్తెగా పొందాలని కోరుకుంటూ కఠినమైన తపస్సు చేశారు. ఆయన తపస్సుకు ప్రసన్నమైన అమ్మవారు, ఆయన కోరికను నెరవేర్చడానికి కాత్యాయన మహర్షి ఇంట కుమార్తెగా జన్మించారు. అందుకే ఆమెకు కాత్యాయనీ అనే పేరు వచ్చింది.

కాత్యాయని అమ్మవారు బంగారు వర్ణములో, నాలుగు భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది. ఈమె కుడిచేతిలో ఒకదానిలో అభయ ముద్రను, ఇంకొక దానిలో వరదముద్రను కలిగి ఉంటుంది. ఎడమచేతిలో ఒకదానిలో ఖడ్గము, వేరొక దానిలో పద్మము శోభిల్లుతూ, సింహవాహనగా దర్శనమిస్తుంది.

ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథులలో కాత్యాయన మహర్షి చేత పూజలందుకొని, విజయదశమినాడు మహిషాసురుని వధించింది. కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. శ్రీకృష్ణుడిని భర్తగా పొందాలని కోరుకున్న గోపికలు కూడా కాత్యాయనీ దేవిని పూజించినట్లు భాగవతంలో చెప్పబడింది. మార్గశిర మాసంలో గోపికలు యమునా నదికి వెళ్లి కాత్యాయనీ దేవిని పూజించి, కృష్ణుడిని తమ భర్తగా పొందాలని ప్రార్థించారు.

ఈ అమ్మవారిని శక్తి, దుర్గ, భద్రకాళి, చండికల అపర అవతారంగా భావిస్తారు. మార్కండేయ పురాణం, దేవి భాగవతాలలో ఈ అమ్మవారి గురించి ప్రస్తావన చూడవచ్చు. హిందూ శాస్త్రాలు, యోగ, తంత్ర విద్యల ప్రకారం కాత్యాయనీ దేవి అజ్ఞా చక్రానికి అధిష్ఠాన దేవత.

ఈ అమ్మవారిని ధ్యానించడం వల్ల ఏకాగ్రత బాగా ఉంటుందని విశ్వాసం.కాత్యాయనీ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే భయం, బాధలు, కష్టాలు తొలగి, మనసుకు ధైర్యం మరియు ప్రశాంతత కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఆమె అనుగ్రహంతో మంచి ఆరోగ్యం, సుఖసంతోషాలు, శుభఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. నవరాత్రుల్లో ఆరవ రోజున ఆమెను భక్తితో పూజించి, మన కష్టాలను తొలగించి, మన జీవితంలో శుభాలను ప్రసాదించాలని ప్రార్థిస్తాము.

ధ్యాన శ్లోకం:

చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ || 6 ||

అర్థం:

చంద్రహాస అనే ఖడ్గంతో ప్రకాశించే చేతులు కలిగి, సింహాన్ని వాహనంగా కలిగి, దానవులను సంహరించే కాత్యాయనీ దేవి నాకు ఎల్లప్పుడూ శుభాలను ప్రసాదించాలి.

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top