శ్రీ శైలపుత్రి దేవి – నవదుర్గల మొదటి రూపం
“శైలపుత్రీ నుంచి సిద్ధిదాత్రి వరకు…
దుర్గామాత ఈ తొమ్మిది రూపాల్లో ఎందుకు పూజించబడుతుంది?
ప్రతి రూపం వెనుక ఉన్న విశేషం ఏమిటి?
హిందువుల ప్రధాన పండుగలలో విజయ దశమి ఒకటి. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శక్తి స్వరూపిణి అయిన పార్వతీ దేవి అవతారాల్లో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివుడి అంశలతో మహా సరస్వతి, మహా లక్ష్మీ, మహాకాళీగా అవతరించిందని చెబుతారు. ఈ మూడు అవతారాల నుంచి మరో రెండు రూపాలు వెలువడ్డాయి. ఇలా తొమ్మిది స్వరూపిణులుగా అంటే నవదుర్గలుగా అమ్మవారిని పూజిస్తారు. వారణాశిలో నవదుర్గలకు వేర్వేరుగా దేవాలయాలు ఉంటాయి. వరాహపురాణం ప్రకారం, దుర్గాదేవి గురించి మార్కండేయ మహర్షి బ్రహ్మగారిని అడిగితే ఈ విధంగా వర్ణించారు.
ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ||
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతిచాష్టమమ్ ||
నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||
ఇలా దుర్గాదేవి తొమ్మిది రూపాలతో విరాజిల్లుతుంది
శైలపుత్రి
నవరాత్రుల మొదటి రోజు అయిన ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. తలపై చంద్రవంక, కుడిచేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం. పేరులోనే కాక వాహనం, ఆయుధంతో సహా సాక్షాత్తూ పార్వతీ దేవి అవతారమే శైలపుత్రీ దుర్గా. మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటిరోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది.
పూర్వజన్మలో శైలపుత్రి అమ్మవారు దక్షప్రజాపతికి సతీదేవిగా జన్మించింది. పరమశివుడిని వివాహం చేసుకుంది. ఒకసారి దక్షప్రజాపతి ఒక పెద్ద యజ్ఞాన్ని నిర్వహించాడు. ఆ యజ్ఞానికి దేవతలందరినీ ఆహ్వానించాడు. కానీ తన అల్లుడైన పరమశివుడిని మాత్రం ఆహ్వానించలేదు. ఈ విషయం సతీదేవికి తెలిసింది. అక్కడికి వెళ్లి తల్లిదండ్రులను, తోబుట్టువులను చూడాలనుకుని పరమశివుడుతో, “తండ్రిగారి ఇంట్లో యజ్ఞం జరుగుతోంది. అందరూ అక్కడికి వెళ్తున్నారు. నేను కూడా అక్కడికి వెళ్లి అమ్మానాన్నలను చూసి వస్తాను” అన్నది. అప్పుడు పరమశివుడు, “సతీ! దక్షుడు మనలను యజ్ఞానికి పిలవలేదు. మనపై అతనికి కోపం ఉంది. అలాంటప్పుడు నువ్వు అక్కడికి వెళ్లడం మంచిది కాదు” అని చెప్పాడు.
కానీ సతీదేవికి తన తల్లిదండ్రులను చూడాలనే కోరిక చాలా ఎక్కువగా ఉండడంతో, ఆమె తన తండ్రి ఇంటికి వెళ్లాలని పట్టుబట్టింది. చివరికి పరమశివుడు ఆమెను వెళ్లడానికి అనుమతించాడు. సతీదేవి యజ్ఞస్థలానికి వెళ్లింది. కానీ అక్కడ ఆమెకు అనుకున్నంత గౌరవం లభించలేదు. తండ్రి దక్షుడు ఆమెతో సరిగ్గా మాట్లాడలేదు. పరమశివుడిని కూడా దక్షుడు అవమానించాడు. తన భర్తను తన తండ్రి అవమానించడం సతీదేవికి చాలా బాధ కలిగించింది. “శివనింద వినడం వల్ల కలిగిన ఆ బాధతో, అవమానంతో సతీదేవి యోగాగ్నిలో తన శరీరాన్ని త్యాగం చేసింది.
ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు తీవ్రంగా కోపించాడు. తన గణాలను పంపి దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేయించాడు. తర్వాత సతీదేవి మరుజన్మలో హిమవంతుని కుమార్తెగా జన్మించింది. అందుకే ఆమెకు శైలపుత్రి అనే పేరు వచ్చింది. ఈ జన్మలో ఆమెను పార్వతి, హైమవతి అనే పేర్లతో కూడా పిలుస్తారు.
పార్వతీదేవి మళ్లీ పరమశివుడినే వివాహం చేసుకుంది. శైలపుత్రి అమ్మవారి రూపం మనకు శక్తి, భక్తి, ధైర్యం, పట్టుదలను గుర్తుచేస్తుంది. రుతుచక్రానికి, మూలాధార శక్తికి అధిష్టాన దేవత శైలపుత్రీదేవి. ఈ అమ్మవారి ఉపాసన మూలాధార చక్రాన్ని జాగృతం చేయడం వలన ఈ అమ్మవారిని ఉపాసించేవారు, మూలాధార చక్రంపై దృష్టి కేంద్రీకరించి ధ్యానిస్తారు. శైలపుత్రి అమ్మవారిని భక్తితో పూజిస్తే మనసుకు ప్రశాంతత, ధైర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం.
శైలపుత్రీ దుర్గా ధ్యాన శ్లోకం:
వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరామ్ |
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ || 1 ||
అర్థం:
నా కోరికలను నెరవేర్చే శైలపుత్రీ అమ్మవారికి నేను నమస్కరిస్తున్నాను. తలపై చంద్రవంకను ధరించిన అమ్మవారు, వృషభంపై (ఎద్దుపై) కూర్చుని, చేతిలో త్రిశూలాన్ని ధరించి, దివ్యమైన కీర్తితో వెలుగొందుతూ ఉంటుంది.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏








