51. శ్లోకం
శివే శృంగారార్ద్రా తదితరజనే కుత్సనపరా
సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీ ।
హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజయినీ
సఖీషు స్మేరా తే మయి జననీ దృష్టిః సకరుణా ॥ 51 ॥
తాత్పర్యం:
తల్లీ! జగజ్జననీ! నీ యొక్క చూపు –
నీ పతి అయిన శివునియందు శృంగార రసమును,
శివేతర జనులయందు అయిష్ట, పరాణ్ముఖత్వములతో బీభత్సరసమును,
గంగ యెడల రోషముతో రౌద్రరసమును,
శివుని చరిత్రను వినుచున్నపుడు గాని, శివుని మూడవ నేత్ర వైశిష్టమును చూచునపుడు గాని అద్భుతరసమును,
శివుడు ధరించెడి సర్పముల యెడ భయానకరసమును,
ఎర్ర తామర వర్ణ ప్రకాశముల యెడ జయించిన భావము పొడ సూపు వీరరసమును,
నీ సఖురాండ్ర యెడల హాస్యరసమును,
నా యెడల కరుణ రసమును,
మామూలుగానున్నప్పుడు శాంతరసమును పొందుచు నవరసాత్మకముగా నుండును.
52. శ్లోకం
గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాణి దధతీ
పురాం భేత్తుశ్చిత్త ప్రశమ రస విద్రావణఫలే ।
ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం సకలికే
తవాకర్ణాకృష్ట స్మర శరవిలాసం కలయతః ॥ 52 ॥
తాత్పర్యం:
భూమిని ధరించు పర్వత రాజైన హిమవంతుని వంశమునకు సిగను ధరించు పూమొగ్గ అయిన ఓ పార్వతీ ! చెవుల వరకూ సాగు నీ కనురెప్పల తీరు చూచుచున్నపుడు, నా మనస్సునకు ఈ విధముగా అనిపిస్తున్నది. బాణములకిరు ప్రక్కల కట్టు గ్రద్ద ఈకలవలె నుండు తెప్ప వెంట్రుకలతో- చెవుల వరకు సాగు నీ నేత్రములలో – త్రిపుర హరుని మనస్సునకు ప్రాప్తించిన శాంతమైన నిస్పృహను పోగొట్టి, మోహమును కలిగించుటయే ప్రయోజనముగా గలవియై, ఆకర్ణాంతము లాగబడిన – మన్మథుని బాణముల సౌందర్యము గోచరించుతున్నది.
53. శ్లోకం
విభక్తత్రైవర్ణ్యం వ్యతికరితలీలాంజనతయా
విభాతి త్వన్నేత్ర త్రితయ మిదమీశానదయితే ।
పునః స్రష్టుం దేవాన్ ద్రుహిణ హరిరుద్రాను పరతాన్
రజః సత్త్వం బిభ్రత్తమ ఇతి గుణానాం త్రయమివ ॥ 53 ॥
తాత్పర్యం:
ఓ సదాశివుని ప్రియురాలా! నీ మూడు కన్నులు అర్థవలయాకారముగా తీర్చినవై; లీలా విలాసార్ధము ధరించిన కాటుక కలిగినదగుట చేత, ఒక దానితో ఒకటి కలసికొనని తెలుపు, నలుపు, ఎరుపు అను మూడు రంగులు కలదై; గత ప్రళయమునందు తన యందు లీనమైన బ్రహ్మ, విష్ణు, రుద్రులు అను త్రిమూర్తులను మరల మరల విశ్వ సృష్టికొరకు – సత్త్వము, రజస్సు, తమస్సు అను మూడు గుణములను ధరించు దాని వలె ప్రకాశించుచున్నది.
54. శ్లోకం
పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీనహృదయే
దయామిత్రైర్నేత్రైరరుణధవల శ్యామ రుచిభిః ।
నదః శోణో గంగా తపనతనయేతి ధ్రువమముం
త్రయాణాం తీర్థానాముపనయసి సంభేద మనఘమ్ ॥ 54 ॥
తాత్పర్యం:
శివాధీనమైన చిత్తము గల ఓ పార్వతీ! కరుణరసార్ద్రత వలన మృదుత్వమును, ఎరుపు, తెలువు, నలుపు అను మూడు వన్నెల వికాసమునుగల నీ నేత్రత్రయము చేత ఎరుపురంగు నీటితో ప్రవహించు ‘శోణ’యను నదము, తెల్లని నీటితో ప్రవహించు గంగానది, నల్లని నీటితో ప్రవహించు సూర్యపుత్రిక అయిన యమునానది – ఈ మూడు పుణ్య తీర్ధములతో పాపములను పోగొట్టి అపవిత్రులను పావనలుగా చేయుటకు – వాటిని త్రివేణీ సంగమ స్థానముగా ఒక చోటకు చేర్చుచున్నావు.
55. శ్లోకం
నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతీ
తవేత్యాహుః సంతో ధరణిధర రాజన్య తనయే ।
త్వదున్మేషాజ్జాతం జగదిద మశేషం ప్రలయతః
పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశః ॥ 55 ॥
తాత్పర్యం:
పర్వతరాజపుత్రికా, ఓ పార్వతీ ! నీ కనురెప్పలు మూసుకొనుట చేత జగత్తుకు ప్రళయమును, రెప్పలు తెరుచుకొనుట చేత జగత్తుకు సృష్టియు ఉద్భవించునని సత్పురుషులు చెప్పుదురు. అందువలన నీ కనురెప్పలు తెరుచుట వలన ఉద్భవించిన యావజ్ఞగత్తును ప్రళయము నుండి రక్షించుట కొరకు, నీ కన్నులు రెప్పపాటు లేక ఎప్పుడూ తెరుచుకుని ఉన్న స్థితిలోనే వున్నవని తలంచుచున్నాను.
56. శ్లోకం
తవాపర్ణే కర్ణే జపనయన పైశున్య చకితా
నిలీయంతే తోయే నియత మనిమేషాః శఫరికాః ।
ఇయం చ శ్రీర్బద్ధచ్ఛద పుటకవాటం కువలయం
జహాతి ప్రత్యూషే నిశి చ విఘటయ్య ప్రవిశతి ॥ 56 ॥
తాత్పర్యం:
ఓ తల్లీ అపర్ణాదేవీ! తాము చూసిన ఏదో రహస్యమును చెప్పుటకై, ఎప్పుడూ నీ చెవుల వద్దనే నివసించు అందమైన నీ రెండు కన్నుల తీరును చూచి, భయపడిన ఆడ చేపలు కంటికి రెప్పపాటు లేక నీటిలో దాగుకొనుచున్నవి. నీ నేత్ర సౌందర్యలక్ష్మిని చూచిన నల్ల కలువలు, పగలు బిడియముతో తమ అందమును రేకులలో ముకుళింపచేసుకుని దాచుచూ, నీవు నిద్రపోవు రాత్రివరకు అట్లే వేచియుండి, అటుపైన మాత్రమే తన రేకుల తలుపులను తెరచి, తమ అందమును బయటపెట్టుటకు సాహసించుచున్నవి.
57. శ్లోకం
దృశా ద్రాఘీయస్యా దరదలిత నీలోత్పల రుచా
దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే ।
అనేనాయం ధన్యో భవతి న చ తే హానిరియతా
వనే వా హర్మ్యే వా సమకరనిపాతో హిమకరః ॥ 57 ॥
తాత్పర్యం:
తల్లీ! పార్వతీ! బాగా పొడవుగా సాగినట్లుగా, విశాలముగా, కొంచెము వికసించిన నల్లకలువ కాంతివంటి కాంతికలది అయిన నీ గడకంటి చూపుచే – చాలా దూరములో, దీనావస్థలోనున్న నన్ను సైతము తడుపుము. ఈ మాత్రము సహాయముచేత ఈ దీనుడు ధన్యుడగును. నీకు వచ్చిన నష్టము గాని, ద్రవ్యనాశము గాని లేదు. ఇది విపరీతమేమీ కాదు. ఎందువలన అనగా నీ ఎడమ కన్నైన చంద్రుడు అరణ్యములలోను, సౌధములపైనను గూడా సమానముగానే తన కిరణములను ప్రసరింపచేయుచున్నాడు గదా!
58. శ్లోకం
అరాలం తే పాలీయుగలమగ రాజన్యతనయే
న కేషామాధత్తే కుసుమశర కోదండ కుతుకమ్ ।
తిరశ్చీనో యత్ర శ్రవణ పథముల్లంఘ్య విలస-
న్నపాంగవ్యాసంగో దిశతి శరసంధాన ధిషణామ్ ॥ 58 ॥
తాత్పర్యం:
ఓ పర్వతరాజుపుత్రీ ! పార్వతీ ! అందమైన వంపులతో సొంపుగానున్న నీ కణతల జంట ప్రదేశమును చూచుట తోడనే అది – “పుష్పబాణమును ఎక్కుపెట్టిన మన్మథుని వింటి సొగసు అయి ఉండునేమో” అని అనిపించకుండా నుండునా? కారణమేమనగా – వంగిన విల్లువలె ఉండి, వంపుసొంపుల కణతల గుండా నీ కృపావీక్షణ ప్రకాశము, బాణము వలె నీ చెవులను చేరుటయే గాక, వాటిని దాటుచూ ఉన్నది గదా!
59. శ్లోకం
స్ఫురద్గండా భోగ ప్రతిఫలిత తాటంక యుగలం
చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథమ్ ।
యమారుహ్య ద్రుహ్యత్యవ నిరథమర్కేందు చరణం
మహావీరో మారః ప్రమథ పతయే సజ్జితవతే ॥ 59 ॥
తాత్పర్యం:
తల్లీ! జగజ్జననీ! స్వచ్చమైన ప్రకాశ లక్షణముతో అద్దమువలె మెరయుచున్న నీ చెక్కిళ్ళు, నీ చెవుల తాటంకముల జత యొక్క ప్రతిఫలించిన చక్రబింబములు కలిగిన నీ ముఖము – నాలుగు చక్రముల రథము వలె తోచుచున్నది. ఇట్టి నీ ముఖరథమును ఎక్కి మన్మథుడు మహావీరుని వలె భూమిని రథముగాను, సూర్యచంద్రులను దాని చక్రములు గాను ఏర్పాటు చేసుకుని, యుద్ధ సన్నద్దుడై దాని నెక్కి వచ్చిన ప్రమథగణ ప్రభువు, త్రిపురహరుడు అయిన శివుని ఎదుర్కొనగలుగుచున్నాడు.
60. శ్లోకం
సరస్వత్యాః సూక్తీరమృత లహరీ కౌశ లహరీః
పిబంత్యాః శర్వాణి శ్రవణ చులుకాభ్యామ విరలమ్ ।
చమత్కార శ్లాఘాచలిత శిరసః కుండలగణో
ఝణత్కారైస్తారైః ప్రతివచనమాచష్ట ఇవ తే ॥ 60 ॥
తాత్పర్యం:
తల్లీ శర్వాణీ! సరస్వతీ దేవి చేయు మధురగానామృత ప్రవాహపు పొంగును, ఎడతెగని విధముగా, చెవులు అను పుడిసిళ్ళ చేత గ్రోలుటలో పొందు, ఆశ్చర్య ఆనందములను శ్లాఘించుటకు, శిరస్సును చలింపచేయగా, నీ కర్ణాభరణములన్నియు ఒక్కసారిగా ఎక్కువ స్థాయిలో ఝణఝణత్కార ధ్వనుల చేత ఆమోదపు మాటలను, అనగా – “బాగున్నది – బాగున్నది” అని చెప్పే బదులు మాటలను వచించుచున్నట్లున్నది.
1 thought on “సౌందర్యలహరి 51-60 శ్లోకాలకు అర్థం ”